• facebook
  • twitter
  • whatsapp
  • telegram

భారత్‌లో పియర్సన్‌ తొలి అడుగు!

కొత్తగా  యూజీ ఎంట్రన్స్‌ 

పియర్సన్‌ వీయూఈ కంప్యూటర్‌ ప్రామాణిక పరీక్షల పరంగా అంతర్జాతీయంగా పేరున్న సంస్థ. ఈ సంస్థ మనదేశంలో మొదటిసారిగా ఉమ్మడి ప్రవేశ పరీక్షను నిర్వహించనుంది. ఈ ‘పియర్సన్‌ అండర్‌ గ్రాడ్యుయేట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌’ స్కోరుతో దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం పొందే వీలు కలుగుతుంది.

ఉమ్మడి ప్రవేశపరీక్ష ద్వారా ప్రవేశాలను కల్పించడం ఇప్పుడు ఎన్నో విద్యాసంస్థలు అనుసరిస్తున్న పద్ధతే. కానీ అంతర్జాతీయంగా పేరెన్నికగన్న పియర్సన్‌ వీయూఈ సంస్థ దేశీయంగా మొదటిసారిగా ఈ ప్రక్రియను ప్రారంభించింది. ఈ సంస్థ ఏటా వివిధ రంగాల్లో 16 మిలియన్లకుపైగా సర్టిఫికేషన్‌ సంబంధిత పరీక్షలను నిర్వహిస్తోంది. దీనికి 180 దేశాల్లో దాదాపుగా 20,000 పరీక్ష కేంద్రాలున్నాయి. తాజాగా పియర్సన్‌ భారత్‌లో తన సేవలను మొదలుపెట్టింది.

అందులో భాగంగా ‘పియర్సన్‌ అండర్‌గ్రాడ్యుయేట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌’ పేరిట ప్రవేశపరీక్షను ప్రవేశపెట్టింది. ఒక్కో విశ్వవిద్యాలయానికి ఒక్కోటి చొప్పున కాకుండా విద్యార్థులకు సులువుగా ఉండేలా దీనిని ప్రవేశపెట్టినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. పరీక్ష స్కోరు ఆధారంగా దేశవ్యాప్తంగా ఉన్న వివిధ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం కల్పిస్తారు. విద్యార్థుల ఆప్టిట్యూడ్, వారికి తగినదేదో పరిశీలించడం ద్వారా టాప్‌ విశ్వవిద్యాలయంలో ప్రవేశం పొందే వీలు కల్పిస్తారు. పరీక్షను పరీక్ష కేంద్రంలో లేదా ఇంటి దగ్గర్నుంచైనా రాసుకునే వీలుంది.

ప్రవేశపరీక్షలో సబ్జెక్టు ఆధారిత/ జనరల్‌నాలెడ్జ్‌ సంబంధిత అంశాలను పరీక్షించరు. క్వాంటిటేటివ్‌ రీజనింగ్, వెర్బల్‌ రీజనింగ్, అబ్‌స్ట్రాక్ట్‌ రీజనింగ్‌ అంశాలను పరిశీలిస్తారు. వరుసగా 34, 36, 38 ప్రశ్నల చొప్పున మొత్తంగా 108 బహుళైచ్ఛిక ప్రశ్నలతోపాటు ఒక ఎస్సేను రాయాల్సి ఉంటుంది. విభాగాలవారీగా సమయ విభజన ఉంటుంది. మొత్తం పరీక్ష కాలవ్యవధి 120 నిమిషాలు. కేవలం మన దేశ విద్యార్థులకే కాకుండా విదేశాల నుంచి ఇక్కడి విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం పొందాలనుకునేవారికీ దీని ద్వారా అవకాశం కల్పిస్తున్నారు.

సెక్షన్లవారీ స్కోరింగ్‌ ఉంటుంది. ప్రత్యేకంగా కటాఫ్‌ మార్కులంటూ ఏమీ నిర్ణయించలేదు. కానీ పాల్గొనే విశ్వవిద్యాలయాలు కటాఫ్‌ నిర్ణయించుకునే అవకాశముంది. స్కోరు ఆ ఏడాది ప్రవేశాలకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. జనవరి 11, 2021 నుంచి నమోదు ప్రక్రియ మొదలు అవుతుంది. ఆరు నెలల వ్యవధి గల టెస్టింగ్‌ అందుబాటులో ఉంది. అంటే పరీక్ష జనవరి 11, 2021 నుంచి జూన్‌ 30, 2021 వరకు అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతానికి కొన్ని విశ్వవిద్యాలయాలు మాత్రమే దీనిలో చేరాయి. ఆసక్తి ఉన్నవారు వాటిని గమనించుకుని దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు సంస్థ అధికారిక వెబ్‌సైట్‌ https://www.undergraduateexam.in/ ను సందర్శించవచ్చు.

Posted Date : 07-01-2021 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌