• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఆన్‌లైన్ త‌ర‌గ‌తులు అర్థ‌మ‌వుతున్నాయా?

మెల‌కువ‌లు పాటిస్తే మేలు!  చ‌దువు పేజీ


చదువులన్నీ ఆన్‌లైన్‌ మయమయ్యాయి. ప్రైమరీ స్కూలు నుంచి పీజీ వరకు ఎలక్ట్రానిక్‌ తెరలపై విద్యాభ్యాసం  కొనసాగుతోంది. ఇంటి దగ్గర్నుంచే ఎంచక్కా చదివేసుకోవచ్చు అని మొదట్లో అనుకున్నా తర్వాత అసలు సమస్యలు అనుభవంలోకి వచ్చాయి. రానురానూ విద్యార్థులు విసుగ్గా భావించడం మొదలుపెట్టారు. ఇది ఇంతవరకే పరిమితం కాలేదు. కనిపించని ఒత్తిడికీ కారణమవుతోందన్నది కొన్ని అధ్యయనాల సారాంశం. ఇంకా కొంతకాలం ఈ తరహా విద్యే తప్పనిసరి అయిన నేపథ్యంలో ఆ ఒత్తిడిని తప్పించుకునే మార్గాలపై దృష్టిపెట్టడం తప్పనిసరి!

సమయం అయిపోతుందంటూ తొందరపెట్టే తల్లిదండ్రులు, తరగతి గదిలోకి అడుగుపెట్టగానే స్నేహితులతో ముచ్చట్లు, హోం వర్క్‌లు, చిన్నచిన్న పోటీలు, ఖాళీ సమయాల్లో చేసే గోలకు టీచర్లు పెట్టే చివాట్లు, ప్రత్యేక రోజులు, చిన్న చిన్న వేడుకలు, అకస్మాత్‌ పరీక్షలు.. విద్యాలయాల్లో కనిపించే అంశాలే ఇవి. 

వీటన్నింటికీ ఈ విద్యాసంవత్సరంలో విద్యార్థులంతా దూరమయ్యారు. అప్పుడప్పుడూ డుమ్మా కొట్టడం, అందుకు సాకులు చెప్పడం, కొన్నిసార్లు దొరికిపోవడం వంటివి జరిగినా అవి తాత్కాలికమే. ఒక విద్యా సంవత్సరమంతా తరగతి గదికి దూరమైన పరిస్థితి ఇదే మొదటిసారి అని చెప్పొచ్చు. 

కొవిడ్‌ పరిణామాలు తీసుకొచ్చిన ప్రధాన మార్పు ఇది.

మొదట అనుకోకుండా వచ్చిన దీర్ఘకాల సెలవులు, తరువాత కొత్త కావడంతో ఆన్‌లైన్‌ తరగతులూ బాగానే అనిపించాయి. కానీ నెమ్మదిగా అది విద్యార్థులపై అననుకూల ప్రభావాన్ని చూపడం మొదలుపెట్టాయి. సహజమైన వాతావరణంలో, తోటి విద్యార్థులతో కలిసి చదువుకునే విధానంలో ఉండే సానుకూలత ఇక్కడ కొరవడింది. విద్యార్థుల్లో తెలియని ఒత్తిడి ఏర్పడింది. కళాశాల స్థాయితోపాటు చిన్న తరగతుల విద్యార్థులూ ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నారని తాజాగా కొన్ని నివేదికలు రుజువు చేస్తున్నాయి. 

ఇంకా పరిస్థితులు సద్దుమణిగి, పూర్వపు స్థితి రావడానికి ఇంకా కొంత సమయం పట్టేలా ఉంది. అప్పటివరకూ ఈ ఆన్‌లైన్‌ తరగతులే కొనసాగే వీలుంది. ఇవి తప్పనిసరి అవుతున్న తరుణంలో ఒత్తిడిని తగ్గించుకునే మార్గాలను అనుసరించడం శ్రేయస్కరం.

ప్రశాంతమైన ప్రదేశం
ఎవరికైనా ఇల్లు సౌకర్యవంతమైన ప్రదేశమే. కానీ అన్నివేళలా ఎలాంటి ఆటంకాలూ లేకుండటం సాధ్యం కాదు. విన్నది అర్థం చేసుకోవాలంటే ఏకాగ్రత ముఖ్యం. చిన్న చిన్న శబ్దాల్లాంటివి దాన్ని భగ్నం చేయొచ్చు. ఇదీ తరగతులపై ఒకరకమైన ప్రతికూల ప్రభావానికి కారణమవుతాయి. కాబట్టి, వీలైనంత వెలుతురుతోపాటు నిశ్శబ్దంగా ఉన్న ప్రదేశాన్ని ఎంచుకోవాలి.

అలాగే.. పాఠాలు, హోంవర్క్, చిన్నచిన్న టాస్క్‌లు.. వీటన్నింటితో తరగతి పూర్తవడమే పెద్ద హాయిగా అనిపిస్తుంటుంది. దీంతో ఎప్పుడెప్పుడు ఆ ప్రదేశాన్ని ఖాళీ చేద్దామా అన్న భావనా కలుగుతుంది. దీంతో పుస్తకాలన్నింటినీ హడావుడిగా సర్దేయడం, పక్కనపెట్టేయడం వంటివి చేస్తారు. కానీ మళ్లీ మరుసటి రోజుకు వాటిని చూసినపుడు చిరాకు, విసుగు అనిపిస్తాయి. కాబట్టి, తరగతులు పూర్తయ్యాక టేబుల్‌ మొత్తాన్ని శుభ్రం చేసుకోవడం, వస్తువులను చక్కగా అమర్చుకున్నాకే బయటికి రావడం అలవాటు చేసుకుంటే మరుసటి రోజు ఆహ్లాదంగా ప్రారంభించిన భావన కలుగుతుంది.

చిన్న విరామాలు 
సాధారణ పరిస్థితినే తీసుకోండి. తరగతికీ, తరగతికీ మధ్య మరీ ఎక్కువగా కాకపోయినా కొంత వ్యవధి ఉంటుంది. చిన్నపాటిదే అయినా ఒక విరామంలా ఉండేది. ఈ కొద్ది సమయంలో మరో సబ్జెక్టు/ పాఠానికి విద్యార్థులు మానసికంగా సన్నద్ధమయ్యేవారు. ఇదే విధానాన్ని ఆన్‌లైన్‌ తరగతుల విషయంలోనూ పాటించాలి. వీలైనంతవరకూ ఈ చిన్న చిన్న విరామాలను తీసుకోవడానికి ప్రయత్నించాలి. అవసరమైతే ఉపాధ్యాయులనే నేరుగా విరామాన్ని కోరొచ్చు. ఈ సమయాన్నీ గదిలోనే కూర్చోవడానికో, తిరిగి తెరలకే అతుక్కుపోవడానికో పరిమితం కావొద్దు. బయట కొద్దిసేపు నడవడమో, నచ్చిన పాట వినడమో, ఇంకా ఏదైనా నచ్చిన పనిని చేయడానికో వినియోగించాలి.

సాయం కోరొచ్చు

తరగతిలో ఏదైనా సందేహం వచ్చినపుడు వెంçనే లేదా పాఠం పూర్తయ్యాక అడిగే వీలుండేది. ఒక్కోసారి ఆ తరువాత ఎదురయ్యే సందేహాలను వ్యక్తిగతంగా వెళ్లి అడిగేవారు. ఆన్‌లైన్‌ తరగతులకు వచ్చేసరికి పరిస్థితి కొంత భిన్నంగా ఉంటోంది. మధ్యలో అడగడం సాధ్యపడకపోవచ్చు. లేదా అడగడానికి ఇబ్బందిగా భావించవచ్చు. ఆ అర్థం కాని పాఠ్యాంశం కూడా ఒక రకమైన ఒత్తిడీ, నిరాశలకు కారణం అవుతోంది. అందుకే... ఇక్కడ ఎవరో ఏదో అనుకుంటారని భావించొద్దు. మామూలు సమయంలో అర్థం కాని విషయాలకు ట్యూషన్‌ సదుపాయం లేదా సంబంధిత ఉపాధ్యాయుల సాయం ఎలా తీసుకుంటారో ఇప్పుడూ అదే విధానాన్ని అనుసరించొచ్చు. ఫోన్‌ కాల్‌/ వీడియో కాల్‌ సాయంలో సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. అవతలి వ్యక్తికి అభ్యంతరం లేకపోతే నేరుగా అయినా వెళ్లి సందేహ నివృత్తి చేసుకోవచ్చు. ఇంకా లేదంటే వేరే నిపుణుల సాయమూ తీసుకోవచ్చు. ఉపాధ్యాయులు ఎవరైనా అర్థం కాని విషయాన్ని మళ్లీ అడిగి తెలుసుకోవాలనుకునేవారికి సాయం చేయాలనే అనుకుంటారు. వారేదో అనుకుంటారనో, మిమ్మల్ని తక్కువగా అనుకుంటారో అన్న భావనను పక్కన పెట్టడం ఇక్కడ ప్రధానం.

తరగతిలో కొందరికి కొన్ని అంశాలు త్వరగా అర్థమవుతాయి. ఒక్కోసారి ఉపాధ్యాయుల కంటే వీరే సులువుగా అవతలి విద్యార్థి పరిస్థితిని అర్థం చేసుకుని, వివరంగా చెప్పగలుగుతారు. అలాంటివారితో బృందంగా ఏర్పడినా ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. ఒక్కోసారి వారు నేరుగా సాయం చేయలేకపోయినా.. అలాంటి సందర్భంలో వారు ఎక్కడి నుంచి సాయం పొందుతున్నారో తెలిపే సమాచారమైనా ఉపయోగమే కదా!

స్నేహితులతో కబుర్లు
సంప్రదాయ తరగతులతో పోలిస్తే ఆన్‌లైన్‌ చదువుల విషయానికొచ్చేసరికి శ్రమ కాస్త పెరిగిందనేది నిపుణుల మాట. పైగా ఎక్కువ సమయం పాఠాలు, ఆపై అసైన్‌మెంట్లు.. వీటితోనే సాగిపోతోంది. ఇక స్నేహితులతో సమయం గడిపే అవకాశం తక్కువవుతోంది. కానీ ఎంత సిలబస్‌తో ముందుకు సాగాలన్నా, ఎన్ని వినోద అవకాశాలున్నా.. ఒత్తిడిని దూరం చేయడంలో స్నేహితులది ప్రధాన పాత్ర. నేరుగా కుదరకపోయినా ఫోన్‌ కాల్‌ ద్వారా అయినా రోజూ కొంత సమయం వారితో ముచ్చటించడం మంచిది.

చిన్న పిల్లల విషయంలో..
మన దగ్గర ఆన్‌లైన్‌ తరగతులంటే డిగ్రీ, పీజీ స్థాయిగానే భావిస్తాం. కానీ ఈసారి ప్రైమరీ స్థాయి పిల్లలకూ తప్పనిసరి అయ్యింది. విద్యాపరమైన ఒత్తిడి అనగానే ఇదీ ఉన్నతవిద్యను అభ్యసించేవారికే అనే భ్రమా ఉంది. కానీ ప్రతి అయిదుగురిలో ఇద్దరు చిన్నారులు ఈ ఒత్తిడికి గురవుతున్నారనేది వివిధ నివేదికలు మన ముందు ఉంచిన వాస్తవం. తరగతులకు హాజరవ్వడానికి విముఖత చూపించడం, తప్పించుకోవడానికి వివిధ మార్గాలను వెతకడం, అకస్మాత్‌ కోపం, ఏడుపు వంటివి వీటికి చిహ్నాలుగా చెబుతున్నారు.

కాబట్టి, పాఠశాల స్థాయి పిల్లలకు తమ గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలనే అవగాహన ఉండదు. కాబట్టి, తల్లిదండ్రులే వారిని బయటకు నడిపిస్తూ తీసుకెళ్లడం, చిన్న చిన్న వ్యాయామాలు, ఇతర పిల్లలతో ఆడిపించడం, చిన్న చిన్న వ్యాపకాల అవకాశాలను కల్పించాలనేది నిపుణుల సూచన.

వ్యక్తిగత సంరక్షణ
గమనించారా? సామాజిక మాధ్యమాల్లో ‘లాక్‌డౌన్‌ ముందూ, ఆ తరువాతా’ అంటూ వైరల్‌ అయ్యింది. ఇదో సరదా అంశమే. కానీ, ఓసారి గమనిస్తే.. చాలామంది తమ వ్యక్తిగత శ్రద్ధను విస్మరించారన్నది వాస్తవం. భయమో, అనాసక్తో మరేదైనా ఇందుకు కారణం కావొచ్చు. కానీ.. వ్యక్తిగత శారీరక సంరక్షణ కోసం చేసే ప్రయత్నాలు మానసికంగా సానుకూల ప్రభావం చూపుతాయి. కాబట్టి, అంతకు ముందు ప్రయత్నించినవాటిని తిరిగి అనుసరించే ప్రయత్నం చేయండి. ఒకవేళ అలవాటు లేకపోతే కొత్తగా ప్రయత్నం చేయండి. కొద్దిపాటి నడక, చిన్నచిన్న వ్యాయామాలు, మెడిటేషన్, నచ్చిన ఆట.. ఇలా దేన్నైనా ఎంచుకోవచ్చు. శారీరకంతోపాటు మానసిక ఆరోగ్యమూ మెరుగుపడుతుంది.

Posted Date : 13-01-2021 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌