• facebook
  • twitter
  • whatsapp
  • telegram

గ్రూప్‌-2 ప్రిప‌రేష‌న్ ప్రారంభించారా?

పోటీలో నిలబడాలంటే ఇప్పుడే చదవడం మొదలు పెట్టాలి!
స‌మ‌యాన్ని స‌ద్వినియోగం చేసుకోండి

ప్ర‌భుత్వ ఉద్యోగం అంటే ఈ రోజుల్లో ఆషామాషీ కాదు. పోటీ తీవ్రంగా ఉంటుంది. ఒక్కో పోస్టుకు వంద‌ల్లో, వేల‌ల్లో పోటీ ప‌డుతున్నారు. మొక్కుబ‌డిగా చ‌దివితే ఎప్ప‌టికీ రాణించ‌లేరు. నోటిఫికేష‌న్ విడుద‌లైన త‌ర్వాత ప్రిప‌రేష‌న్ మొద‌లు పెడ‌దామ‌నుకుంటే స‌మ‌యం వృథా త‌ప్పితే ఇంకేం ఉండ‌దు. ప‌ట్టుద‌ల‌, ఆత్మ‌విశ్వాసం, న‌మ్మ‌కం, ఆలోచ‌న, ఏకాగ్ర‌త‌‌తో స‌న్న‌ద్ధ‌మ‌యితేనే అనుకున్న ల‌క్ష్యాన్ని చేరుకోగ‌లుగుతారు. ఈ విష‌యాల‌ను ప్ర‌భుత్వ ఉద్యోగం సాధించాల‌నుకునే ప్ర‌తిఒక్క‌రూ గుర్తుంచుకొని బ‌రిలోకి దిగితేనే శ్ర‌మ‌కు త‌గిన ఫ‌లితం ద‌క్కుతుంది.    

ఈ ఏడాది రెం‌డు తెలుగు రాష్ట్రాల్లోని ప్ర‌భుత్వాలు వివిధ శాఖ‌ల్లో కొలువులు భ‌ర్తీ చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే ఆయా శాఖ‌ల్లో ఉన్న ఖాళీల స‌మాచారాన్ని సేక‌రించాయి. అతి త్వ‌ర‌లోనే ఈ ఖాళీల్లోని కొన్నింటికి నోటిఫికేష‌న్ వెలువ‌డే సంకేతాలు క‌నిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఉద్యోగాల భ‌ర్తీ చేప‌ట్టేందుకు స్టేట్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ లు నిర్వ‌హించే ప‌రీక్ష‌ల్లో గ్రూపు-1 ప్ర‌ధాన‌మైన‌ది. ఆ త‌ర్వాత స్థానం గ్రూపు-2ది. ఈ ప‌రీక్ష‌కి పోటీ తీవ్రంగా ఉంటుంది. ఎందుకంటే ఈ ప‌రీక్ష‌లో అన్ని మ‌ల్టిపుల్ చాయిస్ ప్ర‌శ్న‌లే ఉంటాయి. రుణాత్మ‌క మార్కులు ఉండ‌వు. ఇది అభ్య‌ర్థుల‌కు క‌లిసి వ‌చ్చే అవ‌కాశం. ఈ నేప‌థ్యంలో అభ్య‌ర్థులు ఎప్పుడు నోటిఫికేష‌న్ విడుద‌లైనా విజ‌యం సాధించేందుకు సిద్ధంగా ఉండాలి. 

రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రూపు-2 ప‌రీక్ష విధానం వేర్వేరుగా ఉంది. అభ్య‌ర్థులు సిల‌బ‌స్ ప్ర‌కారం ఒక్కో పేప‌ర్‌పై ప‌ట్టు సాధించాలి. గ‌తంలోని ప్ర‌శ్న‌ప‌త్రాలు, మాదిరి ప్ర‌శ్న‌ప‌త్రాలను క్షుణ్ణంగా ప‌రిశీలించాలి. కొత్త‌గా ప‌రీక్ష‌ల‌కు సిద్ధ‌మ‌య్యే అభ్య‌ర్థులు తొంద‌ర‌ప‌డి మార్కెట్‌లోకి కొత్త‌గా ఏ పుస్త‌కం వ‌స్తే అది తీసుకోకూడ‌దు. సీనియ‌ర్ల ద‌గ్గ‌ర స‌ల‌హాలు, సూచ‌న‌లు తీసుకోవాలి. పేరొందిన ర‌చ‌యిత‌లు రాసిన పుస్త‌కాలు మాత్ర‌మే తీసుకొని వాటిని సిల‌బ‌స్ ప్ర‌కారం ఒక‌టికి రెండుసార్లు చ‌ద‌వాలి. ఎక్కువ స్మార్ట్ వ‌ర్క్ చేయాలి. అన‌వ‌స‌రంగా మార్కెట్‌లో దొరికే ప్ర‌తి పుస్త‌కం చ‌దివి స‌మ‌యం వృథా చేసుకోకూడ‌దు. ముఖ్యంగా ఏ అంశాల‌పై ప్ర‌శ్న‌లు వ‌స్తాయో వాటిపైనే ఎక్కువ దృష్టి పెట్టాలి. చాలా ఏళ్ల నుంచి ప్రిపేర‌య్యే అభ్య‌ర్థులు, గత ప‌రీక్ష‌లో విజ‌యానికి దూర‌మైన‌ వారు త‌మ త‌ప్పొప్పులు గ్ర‌హించాలి. వ‌చ్చే ప‌రీక్ష‌ల్లో మ‌ళ్లీ అలాంటివి జ‌ర‌గ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకుంటే మంచిది. ప్రిప‌రేష‌న్ స‌మ‌యంలో అన‌వ‌స‌ర విష‌యాల‌ను ప‌ట్టించుకోవ‌ద్దు. పాజిటివ్ దృక్ప‌థంతో ముందుకు వెళ్లాలి. స‌మ‌యం దొరిక‌న‌ప్పుడు స‌బ్జెక్టుల ‌గురించి స్నేహితుల‌తో డిస్క‌ష‌న్ చేసుకోవాలి. 


తెలంగాణ విద్యార్థుల కోసం..
రాష్ట్రాల విభ‌జ‌న జ‌రిగిన త‌ర్వాత తెలంగాణ ప్ర‌భుత్వం 2016 సంవ‌త్స‌రంలో 1032 గ్రూపు-2 పోస్టుల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. టీఎస్‌పీఎస్సీ ఈ పోస్టుల‌కు ప‌రీక్ష నిర్వ‌హించింది. కొత్త‌రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత మొద‌టిసారి ఈ ప‌రీక్ష నిర్వ‌హిస్తుండ‌టంతో అప్పుడు సిల‌బ‌స్ విష‌యంలో సందిగ్ధం నెల‌కొంది. నోటిఫికేష‌న్ వ‌చ్చే వ‌ర‌కు ప‌రీక్ష విధానం, సిల‌బ‌స్‌పై స్ప‌ష్ట‌త లేదు. దీంతో అభ్య‌ర్థులు గంద‌ర‌గోళానికి గుర‌య్యారు. ఇప్పుడు అలాంటి స‌మ‌స్యలు ఏం లేవు కాబ‌ట్టి అభ్య‌ర్థులు ధైర్యంగా ప‌రీక్ష‌ల‌కు స‌న్న‌ద్ధం కావ‌చ్చు. క‌రోనా కారణంగా ఇన్‌స్టిట్యూట్‌లు ఇంకా తెరుచుకోలేదు. అభ్య‌ర్థులు వాటిపైనే న‌మ్మ‌కం పెట్టుకోకుండా ఇప్ప‌టి నుంచే ప్ర‌ణాళిక సిద్ధం చేసుకుని ప్రిప‌రేష‌న్ మొద‌లు పెట్టుకోవాలి. తెలంగాణ‌లో గ్రూపు-2 ప‌రీక్ష‌లో నాలుగు పేపర్లు, ఇంట‌ర్వ్యూ ఉంటాయి. ‌పేప‌ర్‌-1 జ‌న‌ర‌ల్ నాలెడ్జ్‌, పేప‌ర్‌-2 దేశ‌, రాష్ట్ర చ‌రిత్ర‌, పాలిటీ & సొసైటీ, పేప‌ర్‌-3 ఎకాన‌మీ & డెవ‌ల‌ప్‌మెంట్‌, పేప‌ర్‌-4 తెలంగాణ ఉద్య‌మం & రాష్ట్ర ఏర్పాటు. వీటిలో పేప‌ర్-1 మిన‌హా మిగ‌తా పేప‌ర్ల సిల‌బ‌స్‌లో ఎలాంటి మార్పు ఉండదు. మొద‌ట ఈ మూడు పేప‌ర్ల‌పై ప‌ట్టు సాధించ‌డానికి ప్ర‌య‌త్నించాలి. పేప‌ర్‌-4లో ఎక్కువ మార్కులు సాధించ‌డానికి అస్కారం ఉంటుంది. రోజూ ఏకాగ్ర‌త‌తో దిన‌ప‌త్రిక‌లు, నెల‌వారీ మాగ‌జైన్‌లు చ‌దివి వ‌ర్త‌మానాంశాల‌పై అవ‌గాహ‌న పెంచుకుంటే పేప‌ర్‌-1లో మార్కులు సాధించ‌డం సులువ‌వుతుంది. 

ఏపీలో..
ఏపీపీఎస్సీ 2016, 2018లో గ్రూపు-2 నోటిఫికేష‌న్ విడుద‌ల చేసి సుమారు 1500 ఉద్యోగాలు భ‌ర్తీ చేసింది. ఆ సమ‌యంలో ఒక్కో పోస్టుకు ఎంత మంది పోటీ ప‌డ్డారో మ‌న‌కు తెలిసిందే. రోజురోజుకు ఈ పోటీ తీవ్ర‌మ‌వుతోంది. ప్ర‌భుత్వ ఉద్యోగాల‌పై యువ‌తకు పెరుగుతున్న‌ఆస‌క్తి, ఏటా డిగ్రీ పూర్తి చేసుకుంటున్న విద్యార్థుల సంఖ్య పెరుగుతుండ‌టం వంటివి త‌దిత‌ర కార‌ణాలుగా చెప్పుకోవ‌చ్చు. ఏపీలో గ్రూపు-2 ప‌రీక్షలో ప్రిలిమ్స్‌, మెయిన్స్ ఉంటాయి. ప్రిలిమ్స్ ప‌రీక్ష 150 మార్కుల‌కు ఉంటుంది. ఇందులో ఉత్తీర్ణ‌త సాధిస్తేనే మెయిన్స్ ప‌రీక్ష‌కు అర్హ‌త ల‌భిస్తుంది. మెయిన్స్‌లో పేప‌ర్‌-1లో జ‌న‌ర‌ల్ స్ట‌డీస్‌, పేప‌ర్‌-2లో సెక్ష‌న్‌-1 ఆంధ్ర‌ప్ర‌దేశ్ సామాజిక‌, సంస్కృతిక చ‌రిత్ర‌, సెక్ష‌న్‌-2 భార‌త రాజ్యాంగం, పేప‌ర్‌-3లో సెక్ష‌న్‌-1 భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌, ప్ర‌ణాళిక‌, సెక్ష‌న్‌-2 ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో స‌మ‌కాలీన స‌మ‌స్య‌లు, గ్రామీణాభివృద్ధికి ప్ర‌త్యేక సూచ‌న‌లపై ప్ర‌శ్న‌లు ఉంటాయి. ప్రిలిమ్స్‌లోనూ ఈ అంశాల‌కు సంబంధించిన ప్ర‌శ్న‌లే ఉంటాయి. ప్రిలిమ్స్‌కు ప్రిపేరైతే మెయిన్స్‌కూ ప్రిపేర‌యిన‌ట్టే. పేప‌ర్‌-2లో సెక్ష‌న్‌-1, పేప‌ర్‌-3లోని సెక్ష‌న్‌-2లో రాష్ట్రానికి సంబంధించిన అంశాలే ఉన్నాయి. వీటిపై ఇప్ప‌టి నుంచే ప‌ట్టు సాధిస్తే ఎక్కువ మార్కులు తెచ్చుకోవ‌చ్చు. మిగిలిన అంశాలు ప్ర‌భుత్వ ప‌రీక్ష‌కు స‌న్న‌ద్ధ‌మ‌య్యే ప్ర‌తి ఒక్క‌రూ చ‌ద‌వాల్సిన‌వే ఉన్నాయి. గ‌త ప‌రీక్ష‌లో ప్రిలిమ్స్‌, మెయిన్స్‌లో త‌ప్పు స‌మాధానికి 1/3 మార్కులు కోత విధించారు. అభ్య‌ర్థులు తెలిసిన ప్ర‌శ్న‌ల‌కు మాత్ర‌మే స‌మాధానాలు రాస్తే మంచిది. ఒక‌సారి చేసిన త‌ప్పులు మ‌ళ్లీ చేయ‌కుండా చూసుకోవ‌డం ముఖ్యం.

Posted Date : 18-01-2021 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌