• facebook
  • twitter
  • whatsapp
  • telegram

కొలువుల కారిడార్

డీఎఫ్‌సీసీఐఎల్‌లో  1074 ఖాళీలు

భారతప్రభుత్వ ఎంటర్‌ప్రైజ్‌ విభాగానికి చెందిన డెడికేటెడ్‌ ఫ్రైట్‌ కారిడార్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (డీఎఫ్‌సీసీఐఎల్‌) జూనియర్‌ మేనేజర్, ఎగ్జిక్యూటివ్, జూనియర్‌  ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు భర్తీ చేయబోతోంది. వెలువడిన ప్రకటన ప్రకారం అన్ని విభాగాల్లోనూ కలిపి 1074 ఖాళీలున్నాయి. ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ అర్హతలతో వీటికి పోటీ పడవచ్చు.  రాత పరీక్షలో చూపిన ప్రతిభతో నియామకాలు చేపడతారు.ఎంపికైనవారికి ఆకర్షణీయ వేతనాలు అందుతాయి!

రైల్వే కారిడార్‌ పనులు వీలైనంత వేగంగా పూర్తిచేయాలనే లక్ష్యంతో డీఎఫ్‌సీసీఐఎల్‌ పనిచేస్తోంది. మల్టీ మోడల్‌ లాజిస్టిక్‌ పార్కుల నిర్మాణం, రైలు వంతెనలు, అండర్‌ బ్రిడ్జ్‌లు, ట్రాక్‌ నిర్మాణం, రవాణా విస్తరణ...తదితర కార్యక్రమాల్లో ఈ సంస్థ తన సేవలు అందిస్తోంది. ఇందుకు నిపుణులైన మానవవనరుల సేవల నిమిత్తం తాజా ప్రకటన వెలువరించారు. ఇది రైల్వే మంత్రిత్వశాఖకు ఎంటర్‌ప్రైజ్‌ సంస్థగా కొనసాగుతోంది. అయితే వీటికి ఎంపికైనవారిని రైల్వే ఉద్యోగులుగా పరిగణించరు. 

జూనియర్‌ మేనేజర్‌

సివిల్‌: ఈ విభాగంలో 31 ఖాళీలు ఉన్నాయి. సివిల్‌ ఇంజినీరింగ్‌లో 60 శాతం మార్కులతో బీటెక్‌ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆపరేషన్స్‌ అండ్‌ బిజినెస్‌ డెవలప్‌మెంట్‌: మొత్తం 77 ఖాళీలున్నాయి. వీటికి రెండేళ్ల ఎంబీఏ/ పీజీడీబీఏ/ పీజీడీబీఎం/ పీజీడీఎం కోర్సులను మార్కెటింగ్‌/ బిజినెస్‌ ఆపరేషన్‌/ కస్టమర్‌ రిలేషన్‌/ ఫైనాన్స్‌ విభాగంలో 60 శాతం మార్కులతో పూర్తిచేసుకున్నవారు అర్హులు. 

మెకానికల్‌: ఇందులో 3 ఖాళీలున్నాయి. వీటికోసం బీటెక్‌ మెకానికల్‌/ ఎలక్ట్రికల్‌/ మెకట్రానిక్స్‌/ ఇండస్ట్రియల్‌/ ప్రొడక్షన్‌/ ఆటోమొబైల్‌/ మాన్యుఫ్యాక్చరింగ్‌/ ఇన్‌స్ట్రుమెంటేషన్‌/ ఈసీఈ/ ఈఈఈ విభాగాల్లో 60 శాతంతో ఉత్తీర్ణత సాధించినవారు పోటీపడవచ్చు.

ఎగ్జిక్యూటివ్‌

సివిల్‌: ఇందులో 73 ఖాళీలున్నాయి. మూడేళ్ల డిప్లొమా సివిల్‌ ఇంజినీరింగ్‌లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులు వీటికి అర్హులు. 

ఎలక్ట్రికల్‌: మొత్తం 42 ఖాళీలు. డిప్లొమాలో ఎలక్ట్రికల్‌/ ఎలక్ట్రానిక్స్‌/ పవర్‌ సప్లై/ ఇన్‌స్ట్రుమెంటేషన్‌/ ఇండస్ట్రియల్‌/ ఎలక్ట్రానిక్స్‌ అనుబంధ విభాగాల్లో ఎందులోనైనా 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. 

సిగ్నల్‌ అండ్‌ టెలి కమ్యూనికేషన్‌: ఇందులో 87 ఖాళీలు ఉన్నాయి. ఎలక్ట్రికల్‌/ ఎలక్ట్రానిక్స్‌/ కమ్యూనికేషన్‌/ ఇండస్ట్రియల్‌/ కంప్యూటర్‌ సైన్స్‌ తదితర విభాగాల్లో ఎందులోనైనా 60 శాతం మార్కులతో మూడేళ్ల డిప్లొమా ఉత్తీర్ణత. 

ఆపరేషన్స్‌ అండ్‌ బిజినెస్‌ డెవలప్‌మెంట్‌: ఈ విభాగంలో 237 ఖాళీలు. వీటికి 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులు పోటీపడవచ్చు.

మెకానికల్‌: 3 ఖాళీలున్నాయి. మెకానికల్‌/ ఎలక్ట్రికల్‌/ ఎలక్ట్రానిక్స్‌/ మాన్యుఫ్యాక్చరింగ్‌/ మెకట్రానిక్స్‌/ ప్రొడక్షన్‌/ ఆటోమొబైల్‌/ ఇన్‌స్ట్రుమెంటేషన్‌..విభాగాల్లో 60 శాతం మార్కులతో మూడేళ్ల డిప్లొమా పూర్తిచేసుకున్నవారు అర్హులు.

జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌

ఎలక్ట్రికల్‌: 135 ఖాళీలు. వీటికి పదోతరగతిలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణతతోపాటు ఎలక్ట్రికల్‌/ ఎలక్ట్రీషియన్‌/ వైర్‌మెన్‌/ ఎలక్ట్రానిక్స్‌ విభాగాల్లో ఎందులోనైనా రెండేళ్ల ఐటీఐ కోర్సు 60 శాతం మార్కులతో పూర్తిచేసుకున్నవారు పోటీపడవచ్చు. 

సిగ్నల్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్‌: 147 ఖాళీలున్నాయి. పదో తరగతిలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణతతో పాటు ఎలక్ట్రానిక్స్‌/ కమ్యూనికేషన్‌/ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ/ టీవీ అండ్‌ రేడియో/ ఎలక్ట్రానిక్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌/ ఎలక్ట్రానిక్స్‌ అనుబంధ విభాగాలు/ కంప్యూటర్‌ నెట్‌వర్కింగ్‌/ డేటా నెట్‌వర్కింగ్‌- వీటిలో ఎందులోనైనా 60 శాతం మార్కులతో రెండేళ్ల ఐటీఐ కోర్సు పూర్తిచేసుకున్నవారు అర్హులు. 

ఆపరేషన్స్‌ అండ్‌ బిజినెస్‌ డెవలప్‌మెంట్‌: 225 ఖాళీలు. పదోతరగతిలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణతతోపాటు ఏదైనా రెండేళ్ల ఐటీఐ కోర్సుని 60 శాతం మార్కులతో పూర్తిచేసుకున్నవారు లేదా గ్రాడ్యుయేట్లు అర్హులు.

మెకానికల్‌: 14 ఖాళీలున్నాయి. వీటికి పదోతరగతిలో 60 శాతం మార్కులతోపాటు ఫిట్టర్‌/ ఎలక్ట్రీషియన్‌/ మోటార్‌ మెకానిక్‌/ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ విభాగాల్లో ఎందులోనైనా 60 శాతం మార్కులతో రెండేళ్ల ఐటీఐ కోర్సులు పూర్తిచేసుకున్నవారు పోటీ పడవచ్చు. 

రాత పరీక్ష ఇలా

జూనియర్‌ మేనేజర్, ఎగ్జిక్యూటివ్, జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ అన్ని పోస్టులకూ కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్టు (సీబీటీ)ని రెండు గంటల వ్యవధితో నిర్వహిస్తారు. ఇందులో 120 మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు వస్తాయి. 

జూనియర్‌ మేనేజర్, ఎగ్జిక్యూటివ్‌ పోస్టులకు జనరల్‌ నాలెడ్జ్, ఆప్టిట్యూడ్‌/ రీజనింగ్‌ విభాగాల నుంచి 24, సంబంధిత సబ్జెక్టు నుంచి 96 ప్రశ్నలు ఉంటాయి. జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులకు జనరల్‌ నాలెడ్జ్, న్యూమరికల్‌ ఎబిలిటీ, ఆప్టిట్యూడ్‌/ రీజనింగ్, సైన్స్‌ల నుంచి 60, సంబంధిత విభాగం నుంచి 60 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. తప్పుగా గుర్తించిన ప్రతి జవాబుకూ పావు మార్కు చొప్పున తగ్గిస్తారు. ప్రశ్నల స్థాయి ఆ పోస్టుకు కేటాయించిన విద్యార్హత ప్రకారం ఉంటుంది. విభాగాలు, పోస్టుల వారీ సిలబస్‌ వివరాలు ప్రకటనలో పేర్కొన్నారు. 

ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో ఉంటుంది. పరీక్షలో అర్హత సాధించడానికి జనరల్‌ అభ్యర్థులు 40, ఎస్సీ, ఓబీసీలు 30, ఎస్టీలైతే 25 శాతం మార్కులు పొందాలి. ఎగ్జిక్యూటివ్‌ (ఆపరేషన్స్‌ అండ్‌ బిజినెస్‌ డెవలప్‌మెంట్‌) పోస్టులకు తర్వాతి దశ పరీక్ష ఉంటుంది. ఇందుకోసం సీబీటీలో అర్హత పొందినవారిని మెరిట్, రిజర్వేషన్ల ప్రకారం మొత్తం ఖాళీలకు 8 రెట్ల సంఖ్యలో కంప్యూటర్‌ బేస్డ్‌ ఆప్టిట్యూడ్‌ టెస్టు (సీబీఏటీ) నిర్వహిస్తారు. ఇందులో ప్రతి విభాగంలోనూ కనీసం 42 మార్కులు సాధించడం తప్పనిసరి. మినహాయింపులు వర్తించవు. అలాగే రుణాత్మక మార్కులు లేవు. 

తుది నియామకాల్లో సీబీటీకి 70 శాతం, సీబీఏటీకి 30 శాతం వెయిటేజీ వర్తిస్తుంది. జూనియర్‌ మేనేజర్‌ పోస్టులకు ఇంటర్వ్యూలు ఉంటాయి. ఇందుకోసం సీబీటీలో చూపిన ప్రతిభ ప్రకారం మెరిట్, రిజర్వేషన్లు అనుసరించి ఖాళీలకు మూడు రెట్ల సంఖ్యలో అభ్యర్థులను ఆహ్వానిస్తారు. తుది నియామకాల్లో సీబీటీకి 85 శాతం, ఇంటర్వ్యూకు 15 శాతం వెయిటేజీ ఉంటుంది. ఎగ్జిక్యూటివ్, జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులకు మాత్రం సీబీటీలో చూపిన ప్రతిభతోనే మెరిట్, రిజర్వేషన్ల ప్రకారం తుది నియామకాలు చేపడతారు. 

వేతనాలు

జూనియర్‌ మేనేజర్లకు రూ.50 వేలు, ఎగ్జిక్యూటివ్‌లకు రూ.30 వేలు, జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌లకు రూ.25 వేలు మూలవేతనం ఉంటుంది. అదనంగా డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇతర అలవెన్సులు అందుతాయి.  

వయసు

జనవరి 1, 2021 నాటికి జూనియర్‌ మేనేజర్‌ పోస్టులకు గరిష్ఠంగా 27 ఏళ్లలోపు, జూనియర్‌ ఎగ్జిక్యూటివ్, ఎగ్జిక్యూటివ్‌ పోస్టులకు గరిష్ఠంగా 30 ఏళ్లలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు అయిదు, ఓబీసీలకు మూడు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయసులో మినహాయింపు వర్తిస్తుంది. 

ఇవి గమనించండి!

ఆన్‌లైన్‌ దరఖాస్తుల గడువు: జులై 23  

ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయించారు. మిగిలినవారు జూనియర్‌ మేనేజర్‌ పోస్టులకు రూ.1000, ఎగ్జిక్యూటివ్‌ విభాగానికి    రూ.900, జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులకు రూ.700 చెల్లించాలి.  

రాత పరీక్ష:  సెప్టెంబర్‌ లేదా అక్టోబరులో నిర్వహించవచ్చు. 

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విశాఖపట్నం

వెబ్‌సైట్‌: https://dfccil.com/
 

Posted Date : 27-05-2021 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌