• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఎలా ఎంచుకోవాలి.. సరైన కెరియర్‌?   

ఏయే మెలకువలు పాటించాలి? 

ఏదో ఒక కెరియర్‌ను ఎంచుకోవటం ఎవరైనా చేస్తారు. కానీ సరైన కెరియర్‌ను ఎంచుకోవడంలోనే మన ప్రత్యేకత దాగి ఉంటుంది. భవిష్యత్‌ జీవితానికి ఎంతో ముఖ్యమైన కెరియర్‌ ఎంపిక నిజానికి ఎంతో కష్టం కూడా. ఇది సరిగ్గా ఉంటే ఏ దశలోనూ ఇక వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన పనే ఉండదు. మరి ఈ విషయంలో ఏయే మెలకువలు పాటించాలి? 

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ కావాలని సాగర్‌ కలలు కన్నాడు. కానీ స్నేహితులంతా హోటల్‌ రంగంలో ఉద్యోగావకాశాలు బాగుంటాయనడంతో అటువైపు వెళ్లిపోయాడు. ఆ తర్వాత మనసుకు నచ్చని ఉద్యోగం చేస్తూ, మధ్యలో వదులుకోలేక  ఇబ్బందులు పడుతున్నాడు. 

సంధ్య ప్రతి పనీ వినూత్నంగా చేయాలని ఆరాటపడుతుంది. కానీ కొందరు ఇచ్చిన సలహాలతో అవకాశాలు బాగుంటాయని ఇష్టంలేని రంగాన్ని ఎంచుకుంది. ఆ తర్వాత వైవిధ్యం లేని మూస విధులను నిర్వర్తించలేక.. ఉద్యోగాన్ని వదులుకోనూలేక  సతమతం అవుతోంది. 

కెరియర్‌ను ఎంచుకోవడంలో కొంతమంది ఇలాంటి పొరపాట్లే చేస్తుంటారు. వ్యక్తిగత ఇష్టాయిష్టాలను పక్కన పెట్టి ఇతర విషయాలకు ప్రాధాన్యమిస్తారు. ఆపై పశ్చాత్తాపపడుతుంటారు.

వ్యక్తులతో సంబంధం లేకుండా ‘రైట్‌’ జాబ్‌’..‘రాంగ్‌’ జాబ్‌ అనేవేమీ ఉండవు. నచ్చిన ఉద్యోగాన్ని ఎంచుకుంటే అద్భుతంగా ఉంటుంది. ఆసక్తి లేని రంగాన్ని ఎంచుకుంటే పనిచేయడం కష్టంగా ఉండొచ్చు. అందుకే మీ నైపుణ్యాలు, స్వభావ లక్షణాలు, ప్రాధాన్యాల ఆధారంగా ఉద్యోగాన్ని ఎంచుకుంటే చేసే ఉద్యోగం ఎప్పుడూ భారంగా ఉండదు. ప్రతి నిమిషాన్నీ ఆస్వాదిస్తూ పనిచేయగలుగుతారు. అందుకే కొలువును ఎంపికచేసుకునే ముందు కొన్ని విషయాల గురించి అవగాహన పెంచుకుంటే మంచిది.

స్వీయ విశ్లేషణ

కెరియర్‌ను ఎంచుకునే క్రమంలో స్వీయ విశ్లేషణ ఎంతో ముఖ్యం. ముందుగా మీ స్వభావం, నైపుణ్యాలు, లక్ష్యాలు ఏమిటనే విషయంలో మీకు పూర్తి స్పష్టత ఉండాలి. అంటే ముందుగా మిమ్మల్ని మీరే విశ్లేషించుకుని, అర్థం చేసుకోవాలి. కుటుంబ సభ్యులు, స్నేహితులు కొన్ని సలహాలు ఇవ్వగలుగుతారుగానీ మీకంటే బాగా మిమ్మల్ని ఎవరూ అర్థం చేసుకోలేరు. కాబట్టి మీ స్వభావానికీ, ఆసక్తులకూ తగ్గ కెరియర్‌ను ఎంచుకుంటే సంతోషంగా పనిచేయగలుగుతారు. ఉదాహరణకు కొందరు రోజూ ఒకేలాంటి పనులు చేయడానికి ఇష్టపడతారు. మరికొందరు సృజనాత్మకంగా ఆలోచిస్తూ, ప్రతిరోజూ సరికొత్త ప్రయోగాలు చేయాలనుకుంటారు. కాబట్టి వ్యక్తిగత అభిరుచులకు అనుగుణంగా కెరియర్‌ను ఎంచుకుంటే ముందడుగు వేయడం సులువవుతుంది.

నైపుణ్యాలు: ఉద్యోగాన్వేషణలో ఉన్నవాళ్లు ముందుగా తమకు విద్యార్హతల పరంగా ఉన్న పరిజ్ఞానం, నైపుణ్యాలను దృష్టిలో ఉంచుకుని కెరియర్‌ను ఎంచుకోవాలి. ఏ ఉద్యోగానికైనా కొన్ని నైపుణ్యాలు ఉండాల్సిందే. అందుకే మీ కలల కొలువును సాధించడానికి ఎలాంటి నైపుణ్యాలు అవసరమో తెలుసుకోవాలి. వాటిని నేర్చుకుంటే మీరు కోరుకున్న కొలువును సులువుగా సాధించవచ్చు. వర్క్‌షాప్‌లు, ఆన్‌లైన్‌ క్లాసులకు హాజరుకావడం ద్వారా నైపుణ్యాలకు మెరుగులు దిద్దుకోవచ్చు. 

స్వభావం: ఉద్యోగాన్వేషణలో ఉన్నవాళ్లు తమ స్వభావాన్నీ, ఆర్థిక అవసరాలనూ దృష్టిలో ఉంచుకుని అనువైన రంగాన్ని ఎంచుకోవాలి. మీ వ్యక్తిత్వానికి అనుగుణంగా ఉద్యోగాన్ని ఎంచుకుంటే భవిష్యత్తులో నిరుత్సాహానికి లోనయ్యే పరిస్థితి ఎదురు కాదు. ఉదాహరణకు.. స్వభావరీత్యా మీరు తక్కువగా మాట్లాడతారు.  కొత్తవాళ్లతో త్వరగా కలవలేరు అనుకుందాం... ఎదుగుదలకు ఎక్కువ అవకాశం ఉంటుందని సేల్స్‌ రంగాన్ని ఎంచుకుంటే మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. స్వభావానికి విరుద్ధంగా పనిచేయలేక, సేల్స్‌ పెంచలేక రోజూ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. 

ప్రాథమ్యాలు: కెరియర్‌ను ఎంచుకునే ముందు ప్రాథమ్యాలను గుర్తించగలగాలి. ఫలానా ఉద్యోగాన్ని ఎంచుకోవడం వల్ల ఎంత వేతనం పొందొచ్చు, భÅ¡విష్యత్తులో ఎదుగుదల అవకాశాలు ఎలా ఉంటాయి, స్వతంత్ర నిర్ణయాధికారం... లాంటి విషయాలను గమనించుకోవాలి. వీటి ఆధారంగా.. ఎన్నో కెరియర్‌ అవకాశాల నుంచి మీకు సరిపోయే కెరియర్‌ను గుర్తించి, ఎంచుకోవటం సులువు అవుతుంది. ఏమీ తెలియకుండా ఉద్యోగంలో చేరి ఆ తర్వాత పొరపాటు చేశామని నొచ్చుకుంటే ఫలితం ఉండదు. మీ విద్యార్హతలు రెండు, మూడు ఉద్యోగాలకు సరిపోయినా..భÅ¡విష్యత్తు పురోభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఉద్యోగాన్ని ఎంపికచేసుకోవచ్చు.

కెరియర్ల బేరీజు

మీరు ఏయే ఉద్యోగాలకు కచ్చితంగా సరిపోతారో అంచనా వేయటానికి స్వీయ విశ్లేషణ తోడ్పడుతుంది. ఆ తర్వాత మీరు ఎంచుకున్న కొద్ది ఉద్యోగాల్లో ప్రతిదాని గురించీ పరిశోధించాలి. ఏ ఉద్యోగానికి ఎంత వేతనం లభిస్తుంది, విధి నిర్వహణలో ఒత్తిడి ఏ స్థాయిలో ఉంటుంది, జీవితం ఎలా ఉండబోతుంది, అభివృద్ధి అవకాశాలు ఎలా ఉంటాయి... లాంటి విషయాలను బేరీజు వేసుకోవాలి. అలాగే ఏ ప్రదేశంలో విధులు ఉంటాయనే అంశానికీ ప్రాధాన్యం ఉంది. మాన్యుఫాక్చరింగ్‌ రంగం లాంటి ఉద్యోగమైతే అది ఉండే ప్రాంతం.. రోజు అక్కడికి చేరుకోవడానికి మీరు వెచ్చించాల్సిన సమయం... లాంటి విషయాలన్నీ పరిశీలించాలి. వాటన్నిటి ఫలితంగా మీ ఆసక్తులకు ఏ కెరియర్‌ అత్యుత్తమంగా సరిపోతుందో స్పష్టత వస్తుంది.  

మార్కెట్‌ అధ్యయనం

మీ ప్రాధాన్యం ఏ రంగానికో విశ్లేషించుకోవడానికి కాస్త సమయాన్ని కేటాయించాలి. పనిచేయాల్సిన రంగానికి ఎంచుకున్న తర్వాత.. అక్కడి పని వాతావరణం ఎలా ఉంటుందనే విషయంలోనూ ఒక అవగాహనకు రావాలి. ఆ తర్వాతే ఒక నిర్ణయం తీసుకోవాలి. ఈ క్రమంలో పరిశ్రమలోని పరిస్థితులు, పని వాతావరణాన్నీ అధ్యయనం చేయాలి. ఉద్యోగాన్ని సంపాదించడం, దాంట్లో ఒక్కో మెట్టూ ఎక్కడానికి కాస్త సమయం పడుతుంది. ఈలోగా ముందుగానే ఆ రంగంలో భవిష్యత్తు అవకాశాలు, కెరియర్‌కు ఉన్న పరిది లాంటివి గమనించాలి. 

నైపుణ్యాలకు మెరుగులు

మీ అభిరుచికి తగిన రంగాన్ని ఎంచుకున్న తర్వాత.. ఆ రంగంలో మీ కలల కొలువును సాధించడానికి ఎలాంటి అర్హతలు, నైపుణ్యాలు అవసరమవుతాయో తెలుసుకోవాలి. అవసరమైతే వర్క్‌షాప్‌లకు హాజరుకావచ్చు లేదా ఆన్‌లైన్‌ సర్టిఫికెట్‌ ప్రోగ్రాముల్లో చేరొచ్చు. ఆ తర్వాత పెరిగిన మీ నైపుణ్యాలతో రెజ్యుమె, కవర్‌ లెటర్లను కొత్తగా రూపొందించడం మర్చిపోకూడదు. కొంతమంది ఒక్కసారి రెజ్యుమెను రూపొందించి దాంతోనే వివిధ ఉద్యోగాలకు దరఖాస్తు చేస్తుంటారు. అలా చేయడం ఎంతమాత్రం సరికాదు. విద్యార్హతలు, అనుభవం, నైపుణ్యాల విషయంలో కొత్తగా వచ్చిన మార్పులను ఎప్పటికప్పుడు రెజ్యుమెలో చేరుస్తూ ఉండాలి. 

మీకెంతో ఇష్టమైన ఉద్యోగాన్ని అన్వేషించే క్రమంలో అర్హతలు, నైపుణ్యాలు, ఆకాంక్షల మధ్య సమతుల్యం దెబ్బతినకుండా చూసుకోవాలి. ఉద్యోగం విషయంలో నిర్ణయం తీసుకోవడానికి మీకున్న అనుభవం సరిపోకపోవచ్చు. అలాంటప్పుడు అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవచ్చు. తగినంత పరిశోధన, ఇతరుల సూచనలు, మీకున్న లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవచ్చు. అలాగే ఎన్నో జాగ్రత్తలు తీసుకుని ఉద్యోగాన్ని ఎంపిక చేసుకున్న తర్వాత.. ఏవైనా పొరపాట్లు జరిగినా కుంగిపోకూడదు. అవి పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ భవిష్యత్తును సమర్థంగా తీర్చిదిద్దుకోవడానికి ప్రయత్నించాలి.


 

Posted Date : 13-10-2021 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌