• facebook
  • twitter
  • whatsapp
  • telegram

భావోద్వేగాల‌పై ప‌ట్టు పెంచుకోండి! 

విద్యార్థులందరి ఆలోచనా విధానం, ప్రవర్తనా ఒకే విధంగా ఉండవు. ముఖ్యంగా తరగతిలో ఏదైనా జరిగినప్పుడు వాళ్లు స్పందించే తీరులోనూ తేడా ఉంటుంది. కొందరు విపరీతమైన భావోద్వేగాలకు గురైతే.. మరికొందరు మాత్రం ఏమీ పట్టనట్టుగా స్తబ్ధుగా ఉండిపోతుంటారు. 


తోటి విద్యార్థులు సరదాగా ఆటపట్టించడం.. మార్కుల విషయంలో ఉపాధ్యాయులు మందలించడం లాంటివి అప్పుడప్పుడూ జరుగుతూనే ఉంటాయి. ఫలితంగా కొందరు తీవ్రమైన భావోద్వేగాలకు గురవుతుంటారు. వాటిని నియంత్రించుకోలేక కొందరు కాలేజీకి వెళ్లడం కూడా మానేస్తుంటారు. మరికొందరేమో మరో అడుగు ముందుకువేసి తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవడం లాంటివీ చేస్తుంటారు. వీటన్నింటికీ కారణం భావోద్వేగాలపైన నియంత్రణ లేకపోవడమే. విద్యార్థులకు ఎంతో ముఖ్యమైన ఈ నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవాలంటే...


గుర్తుచేసుకోవాలి: మిమ్మల్ని భావోద్వేగాలకు గురిచేసిన సంఘటన నాటి పరిస్థితులను మరోసారి గుర్తుచేసుకోవాలి. ఆ సందర్భంలో ఎదుటివ్యక్తి ఏం మాట్లాడితే మీరు ఆవేశంగా స్పందించారో తెలుసుకోవాలి. ఇలా మరోసారి గుర్తుచేసుకుని, సమీక్షించుకోవడం వల్ల మీరు స్పందించే తీరులోనూ మార్పు వస్తుంది. 


హేతుబద్ధత: సాధారణంగా ఎవరికి వాళ్లు హేతుబద్ధంగా ఆలోచిస్తున్నామనే అనుకుంటారు. కానీ ఎదుటివారి ప్రవర్తన వెనుకా ప్రత్యేకమైన కారణం ఉంటుందనే విషయాన్ని మర్చిపోతుంటారు. కాబట్టి కాస్త హేతుబద్ధంగా ఆలోచించి వారి ప్రవర్తన వెనుక ఉండే కారణాన్ని అర్థంచేసుకోవడానికి ప్రయత్నించాలి. అలా చేయడం వల్ల కూడా మీ భావోద్వేగాలను నియంత్రించుకోవచ్చు. 


ఒప్పుకోగలగాలి: జరిగిన దాంట్లో మీ పొరపాటు కూడా ఉండి ఉండొచ్చు. అలాంటప్పుడు దాన్ని నిజాయతీగా ఒప్పుకోగలగాలి. ఉదాహరణకు మీరు ఎదుటివారిని విమర్శించడం వల్ల అసలు గొడవ మొదలైందా? లేదా ఇతరుల వల్లా.. అనేది ముందుగా తెలుసుకోవాలి. 


దృష్టి మళ్లించడం: మీ దృష్టిని ఇతర విషయాల మీదకు మళ్లించడం ద్వారానూ కోపావేశాలను నియంత్రించుకోవచ్చు. ఉదాహరణకు బాగా కోపంగా, చిరాగ్గా ఉన్నప్పుడు మంచినీళ్లు తాగడం ఇలాంటిదే. దీంతో ఆందోళన తగ్గి ప్రశాంతంగా ఆలోచించగలుగుతారు. 


ప్రశంసలూ పనిచేస్తాయి: మిమ్మల్ని మీరు అభినందించుకోవడం వల్ల ప్రతికూల ఆలోచనల నుంచి కొంతవరకూ బయటపడగలుగుతారు. తీవ్ర భావోద్వేగాలకు చాలావరకూ ప్రతికూల ఆలోచనలే కారణమవుతాయి. ఇలా సానుకూలంగానూ ఆలోచించడం మొదలుపెడితే ప్రశాంతంగా, నిలకడగా ఉండగలుగుతారు. 


క్కడ మీరే ఉంటే: ఎదుటివారి స్థానంలో మిమ్మల్ని ఒకసారి ఊహించుకోవాలి. అక్కడ మీరే ఉండి ఉంటే ఎలా ప్రవర్తించేవారో ఆలోచించాలి. ఇలా చేయడం వల్ల మీ ప్రతిస్పందనలు తీవ్రంగా ఉండవు. ఎదుటివారి ప్రవర్తన వెనకున్న ఉద్దేశాలనూ అర్థం చేసుకోగలుగుతారు. 


వ్యాయామంతో ఫలితం: విసుగ్గా, చిరాగ్గా ఉన్నప్పుడు స్పందించే విధానంలోనూ తేడా ఉంటుంది. చిన్న విషయానికే అతిగా, ప్రతికూలంగా స్పందిస్తారు కూడా. రోజూ వ్యాయామం చేయడం వల్ల శారరీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండగలుగుతారు. ఈ ప్రభావం ప్రవర్తన మీద కూడా పడుతుంది. వ్యాయామం చేయడానికి విసుగ్గా ఉంటే ఇష్టమైన ఆటలూ ఆడుకోవచ్చు. ధ్యానం చేయడం వల్ల కూడా ప్రశాంతతను పొందగలుగుతారు.    మార్గదర్శీ ముఖ్యమే: ప్రాధాన్యంలేని విషయాలకే అతిగా స్పందించడం, భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోవడం ఆరోగ్యానికీ మంచిదికాదు. ఒత్తిడీ, అధిక రక్తపోటూ లాంటి అనేక అనారోగ్య సమస్యల బారినపడే ప్రమాదమూ ఉంటుంది. కాబట్టి స్నేహితుల, కుటుంబసభ్యుల సలహాలు, సూచనలు తీసుకుని ఈ సమస్యను అధిగమించడానికి ప్రయత్నించాలి. 

మరింత సమాచారం... మీ కోసం!

‣ బాగా రాసేవాళ్ల‌కు బోలేడు ఉద్యోగాలు!

‣ ఎల్ఐసీలో ఏఏఓ కొలువులు

‣ బోధన, పరిశోధన రంగాల్లోకి రహదారి!

‣ నవతరం బాలలకు నవోదయ స్వాగతం

‣ ఇష్టపడి చదివితే చాలు!

‣ మళ్లీ మళ్లీ చదవండి!

Posted Date : 20-01-2023 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.