• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఐటీ ఉద్యోగాలకు కోడింగ్‌ అక్కర్లేదు!

ఆసక్తి, అనుభవం చాలు

సాఫ్ట్‌వేర్‌ కొలువంటేనే కోడింగ్‌తో కుస్తీ పట్టాలి... ప్రోగ్రామింగ్‌తో దోస్తీ చేయాలి... అనుకుంటాం. కానీ ఇవేవీ అక్కర్లేకుండానే ఐటీలో కొన్ని కొలువులు కొట్టేయొచ్చు. కోడింగ్‌ అవసరం లేని ఈ ఉద్యోగాల్లో ఏ స్ట్రీమ్‌ వారైనా ప్రతిభ చాటే అవకాశం ఉంది. కావాల్సిందల్లా ఆ విభాగంలో ఆసక్తి, అనుభవం మాత్రమే!

ప్రాజెక్ట్‌ మేనేజర్‌..

ఒక ప్రాజెక్టు తయారీలో వీరిది కీలక పాత్ర. బడ్జెట్‌ అంచనా వేయడం, గడువులో పని పూర్తయ్యేలా జాగ్రత్త పడటం, బృందాన్ని సమన్వయం చేయడం ప్రాజెక్ట్‌ మేనేజర్‌ ప్రధాన లక్ష్యాలు. వనరులను సమర్థంగా వినియోగించుకుంటూ ప్రాజెక్టును విజయవంతం చేయాల్సి ఉంటుంది. మిగతా మేనేజర్లు, సూపర్‌వైజర్లతో అనుసంధానమై పనిచేయాలి. నేరుగా ప్రోగ్రామింగ్‌ చేయాల్సిన పని లేకపోయినా టెక్నికల్‌గా ఏం జరుగుతుందో అర్థం చేసుకోవడం కోసం కొంత అవగాహన తప్పనిసరి. సాంకేతిక అంశాలను క్లయింట్‌కు వివరించేపాటి నైపుణ్యాలు అవసరం. 

ఇందుకోసం మేనేజ్‌మెంట్, బిజినెస్‌లో డిగ్రీ లేదా పీజీ చేసి ఉండాలి. కొంత పని అనుభవంతోపాటు ప్రొఫెషనల్‌ సర్టిఫికేషన్‌ కావాలి.

ఎస్‌ఈవో స్పెషలిస్ట్‌

ఒక సంస్థకు సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌లో కావాల్సిన వ్యూహాలను రూపొందించే వ్యక్తే ఎస్‌ఈవో స్పెషలిస్ట్‌. సెర్చ్‌ ఫ్లాట్‌ఫామ్స్‌లో సరైన కీవర్డ్స్, ట్యాగ్స్‌ వినియోగం జరుగుతుందా లేదా అనేది చెక్‌ చేస్తారు. ఇమేజ్, వీడియో, అకడమిక్‌ సెర్చ్‌ విభాగాల్లో ఫోకస్‌ ఉండాలి. వెబ్‌ డిజైనర్స్, డెవలపర్స్‌తో కలిసి పనిచేస్తారు. వీరికి కోడింగ్‌ సామర్థ్యం అవసరం లేదు కానీ, హెచ్‌టీఎంఎల్, సీఎస్‌ఎస్‌ గురించి కొంత అవగాహన ఉండాలి. 

బిజినెస్, మార్కెటింగ్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, కమ్యూనికేషన్స్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ ఉండాలి.

డేటా అనలిస్ట్‌

అనంతమైన సమాచారాన్ని అధ్యయనం చేయడంలో ఆసక్తి ఉన్న వారికి ఇది మంచి ఎంపిక. సమాచారం క్రోడీకరించడం, ట్రెండ్స్‌ను గుర్తించడం వంటివి ఇందులో ప్రధాన అంశాలు. మ్యాథమేటిక్స్, స్టాటిస్టిక్స్‌పై పట్టుండాలి. విశ్లేషణ సామర్థ్యాలు అవసరం. పెద్ద మొత్తంలో సమాచారాన్ని సేకరించడం, అవసరమైన దాన్ని గుర్తించడం, కంపెనీ నిర్ణయ స్వీకరణలో సాయపడటం వంటి పనులుంటాయి. గ్రాఫ్స్, ఛార్ట్స్, జాబితాలు, నివేదికలుగా డేటాను సమర్పించాల్సి ఉంటుంది. 

మ్యాథమేటిక్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్‌ సైన్స్‌లో డిగ్రీ చేసి ఉండాలి. డేటా అనలిటిక్స్‌లో పీజీ చేసిన వారికి ప్రాముఖ్యం ఉంటుంది.

సాఫ్ట్‌వేర్‌ క్వాలిటీ టెస్టర్‌

ఒక సాఫ్ట్‌వేర్‌ను డెవలప్‌ చేసిన తర్వాత దాని నాణ్యత ఎలా ఉందో చెక్‌ చేసే ఉద్యోగమిది. ఇది క్వాలిటీ  ఎస్యూరెన్స్‌కు సంబంధించే అయినా అందులో భాగం కాదు. వీరు సాఫ్ట్‌వేర్‌ను వివిధ స్థాయిల్లో పరిశీలించి లోపాలను గుర్తించాల్సి ఉంటుంది. 

బీటెక్, బీఈ, ఎంసీఏ, బీసీఏ, బీఎస్సీ - కంప్యూటర్స్‌ చేసిన వారు ఇందులో రాణించగలరు. ఈ డిగ్రీలు లేనివారు సర్టిఫికేషన్‌ ప్రోగ్రామ్స్‌ పూర్తిచేసి ప్రవేశించవచ్చు.

యూఎక్స్‌/యూఐ డిజైనర్‌

యూఎక్స్‌ అంటే యూజర్‌ ఎక్స్‌పీరియన్స్‌కు సంక్షిప్త రూపం. యూజర్‌ కళ్లతో ప్రొడక్ట్‌ను చూడటం. వినియోగదారుడు టెక్నాలజీను ఉపయోగించడంలో (యూజర్‌ ఇంటర్‌ఫేస్‌) అతనికి సౌకర్యంగా ఉండేలా చూసేవారే యూఎక్స్‌ డిజైనర్‌. కస్టమర్‌ అవసరాలకు, అభిరుచులకు తగ్గట్టుగా ప్రొడక్ట్‌ను తీర్చిదిద్దేలా చూడాలి. ముందు క్లయింట్‌ అవసరాలను పూర్తిగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత డేటా అనాలిసిస్‌ ఆధారంగా మార్పులు, చేర్పులు సూచించాలి. యూజర్‌ సౌకర్యవంతంగా అనుభూతి చెందేలా ప్రొడక్ట్‌ను డిజైన్‌ చేయడంలో వీరి పాత్ర కీలకం. వీరికి కూడా హెచ్‌టీఎంఎల్, సీఎస్‌ఎస్‌లో ప్రవేశం ఉండటం ఉపకరిస్తుంది. 

డిగ్రీ పూర్తి చేసినవారెవరైనా ఇందులో రాణించవచ్చు. డిజైన్, టూల్స్‌లో ప్రాథమిక అంశాలపై పట్టు సాధించడం ద్వారా డిజైనర్‌గా ప్రయాణం మొదలుపెట్టొచ్చు.

గ్రోత్‌ హ్యాకర్‌

వీళ్లనే యూజర్‌ ఎక్విజిషన్‌ స్పెషలిస్ట్‌ అని కూడా అంటారు. మార్కెటింగ్‌లో ఇదీ ఒక భాగం. సాధారణంగా స్టార్టప్స్‌లో వీరి అవసరం ఎక్కువగా ఉంటుంది. మార్కెటింగ్, టెక్నాలజీ, బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ను అనుసంధానిస్తూ వినియోగదారునికి మెరుగైన సేవలు అందించి కంపెనీ పురోగతికి తోడ్పడాలి. కొత్త కొత్త విధానాలు ప్రతిపాదించడం, పరిశోధనాత్మకంగా ఆలోచించడం, వ్యూహాలను సమర్థంగా అమలు చేయడం అవసరం. 

డిగ్రీ చదివిన అభ్యర్థులకు కొన్ని సంస్థలు గ్రోత్‌ హ్యాకింగ్‌ కోర్సులను అందిస్తున్నాయి. వీటిని నేర్చుకుని ఉద్యోగంలో చేరొచ్చు.

వీటిలో ఎస్‌ఈఓ స్పెషలిస్ట్, క్వాలిటీ టెస్టర్‌ ఎంట్రీ స్థాయివి. జీరో కోడ్‌/ లెస్‌ కోడ్‌ ప్లాట్‌ఫామ్స్‌ ఉపయోగించి కోడింగ్‌ అవసరం లేకుండా ఐటీ అప్లికేషన్స్‌ వృద్ధి చేయొచ్చు. ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ నైపుణ్యం ఐటీలో ఏ హోదాకైనా అవసరమని గుర్తించాలి! 
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ బోధన, పరిశోధనలకు అధికారిక అర్హత

‣ మెరుగైన ర్యాంకుకు మెలకువలు ఇవిగో!

‣ విద్యార్థులూ... కళ్లను నిర్లక్ష్యం చేయకండి!

‣ మార్కులు తెచ్చే విపత్తు నిర్వహణ

‣ విద్యార్థులకు విప్రో ఉద్యోగాలు సిద్ధం!

‣ ఇంటర్‌ విద్యార్థులకు ఐఐఎస్‌సీ ఆహ్వానం

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 11-05-2022 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌