• facebook
  • whatsapp
  • telegram

ఇంటర్‌ విద్యార్థులకు ఐఐఎస్‌సీ ఆహ్వానం

బీఎస్సీ రిసెర్చ్‌ కోర్సుల ప్రవేశాలు ప్రారంభం

ఇంటర్మీడియట్‌ పూర్తయిన వెంటనే పరిశోధనల దిశగా అడుగులేసే అవకాశం ఉంది. వీటిపై ఆసక్తి ఉన్న ఇంటర్మీడియట్‌ ఎంపీసీ విద్యార్థులను ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఐఐఎస్‌సీ) ఆహ్వానిస్తోంది. ఈ సంస్థ నాలుగేళ్ల వ్యవధి ఉన్న బ్యాచిలర్‌ ఆఫ్‌ సైన్స్‌ (రిసెర్చ్‌) కోర్సులు అందిస్తోంది. వీటిలో ప్రవేశాలకు ప్రకటన వెలువడింది! 

మ్యాథ్స్, సైన్స్, పరిశోధన కోర్సుల్లో దేశంలో ప్రఖ్యాత సంస్థ ఐఐఎస్‌సీ. అంతర్జాతీయ స్థాయిలోనూ దీనికి గుర్తింపు ఉంది. నిపుణులూ, శాస్త్రవేత్తల బోధన, అధునాతన ప్రయోగశాలలు, గ్రంథాలయాలు, ఉన్నత ప్రమాణాలకు ఈ సంస్థ చిరునామాగా నిలుస్తోంది. ఇక్కడ నాలుగేళ్ల బీఎస్‌సీ రిసెర్చ్‌ కోర్సు పూర్తిచేసుకున్నవారు ప్రపంచస్థాయిలో పేరున్న సంస్థల్లో అవకాశాలను సొంతం చేసుకోవచ్చు. ఐఐఎస్‌సీలోనే మరో ఏడాది చదువు పూర్తిచేసుకుని పీజీ పట్టా అందుకోవచ్చు. ఆ తర్వాత పీహెచ్‌డీ దిశగా అడుగులేయవచ్చు. 

ఇవీ స్పెషలైజేషన్లు

ఇక్కడ బీఎస్‌సీ రిసెర్చ్‌ కోర్సు వ్యవధి నాలుగేళ్లు. మొత్తం ఎనిమిది సెమిస్టర్లు ఉంటాయి. మొదటి మూడు అందరికీ ఉమ్మడిగా కొనసాగుతాయి. ఆ తర్వాత మూడు సెమిస్టర్లలో స్పెషలైజేషన్‌లో అధ్యయనం ఉంటుంది. నాలుగో ఏట పరిశోధన దిశగా ఫ్యాకల్టీ పర్యవేక్షణలో ప్రాజెక్టులో లీనమవుతారు. కోర్సులో చేరినవాళ్లు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, బయాలజీ, మెటీరియల్స్, ఎర్త్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ సైన్సెస్‌ వీటిలో ఏ సబ్జెక్టునైనా స్పెషలైజేషన్‌గా తీసుకోవచ్చు. అలాగే ఆసక్తి ప్రకారం కాంబినేషన్‌ కోర్సులు ఎంచుకోవచ్చు. అయితే అభ్యర్థి అభిరుచితోపాటు మొదటి మూడు సెమిస్టర్లలో చూపిన ప్రతిభ ప్రకారం సంబంధిత స్పెషలైజేషన్‌ను కేటాయిస్తారు. నాలుగు కోర్సులను మేజర్, మైనర్‌ డిసిప్లిన్లుగా ఎంచుకోవాలి. ఇంజినీరింగ్‌ నుంచి ఒక ఎలెక్టివ్‌ కోర్సు, హ్యుమానిటీస్‌లో ఒక సెమినార్‌ కోర్సు తీసుకోవడం తప్పనిసరి. కోర్సు పూర్తయిన తర్వాత డిగ్రీలను అభ్యర్థులు తీసుకున్న మేజర్‌ డిసిప్లిన్‌ పేరుతో ప్రదానం చేస్తారు. 

కోర్సులోకి మొత్తం 137 మంది విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తారు. తక్కువ ధరకు వసతి, భోజన సౌకర్యాలు కల్పిస్తారు. ట్యూషన్‌ ఫీజు కూడా నామమాత్రమే. ఎస్సీ, ఎస్టీలు చెల్లించనవసరం లేదు. మిగిలినవారికి ఏడాదికి రూ.పదివేలు. అలాగే స్కాలర్‌షిప్పులూ అందిస్తారు. 

అర్హత

ఎంపీసీ గ్రూప్‌తో 2021లో ఇంటర్‌ పూర్తిచేసినవాళ్లు, 2022లో ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాస్తున్నవారు అర్హులు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌లు తప్పనిసరిగా చదివుండాలి. ప్రథమశ్రేణి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. ఎస్సీ, ఎస్టీలు పాసైతే సరిపోతుంది. 

ప్రవేశం ఇలా..  

ప్రత్యేకంగా పరీక్షలేమీ నిర్వహించరు. కేవీపీవై, జేఈఈ మెయిన్స్, జేఈఈ అడ్వాన్స్‌డ్, నీట్‌ యూజీ వీటిలో ఎందులోనైనా చూపిన ప్రతిభ ద్వారా సీట్లు కేటాయిస్తారు. సంబంధిత స్కోర్‌తో ఐఐఎస్‌సీకి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఫలితాలు వెలువడనివాళ్లు హాల్‌టికెట్‌ వివరాలు ఇస్తే సరిపోతుంది. జేఈఈ మెయిన్‌ లేదా అడ్వాన్స్‌డ్‌ లేదా నీట్‌ యూజీ స్కోర్‌తో జనరల్, ఓబీసీ నాన్‌ క్రీమీ లేయర్, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు ఇలా ఆయా విభాగాలవారీ నిర్దేశిత స్కోరు సాధించిన అభ్యర్థుల జాబితా నుంచి మెరిట్, రిజర్వేషన్ల ప్రకారం ఎంపిక చేస్తారు. మహిళలకు పది శాతం సూపర్‌ న్యూమరరీ సీట్లు కేటాయించారు. ఆంగ్ల మాధ్యమంలో బోధన ఉంటుంది. 

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: మే 31.

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈబీసీలకు రూ.500; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.250.

వెబ్‌సైట్‌: https://iisc.ac.in/ug
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ గురుకులాల్లో ఇంటర్, డిగ్రీ

‣ ఉద్యోగం సాధించాలనే త‌ప‌న మీలో ఉందా?

‣ ఎస్‌ఐ ప్రిలిమ్స్‌కు సన్నద్ధత ఇలా!

‣ కళ్లకు కట్టినట్టు.. కళతో కనికట్టు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 11-05-2022


 

ప్ర‌ఖ్యాత సంస్థ‌లు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌