• facebook
  • whatsapp
  • telegram

ప్రఖ్యాత ఐఐఎస్సీలోకి అడుగుపెట్టాలంటే?

పరిశోధనలకు ప్రపంచ స్థాయిలో ప్రసిద్ధికెక్కిన‌‌ సంస్థ

భారీ ప్యాకేజీలతో ఉద్యోగాలు 

విద్యార్థులకు పలు స్కాలర్‌షిప్‌లు, ఫెలోషిప్‌లు

ప్రవేశాలకు ప్రకటన విడుదల 

ఏదైనా కొత్త ఆవిష్కరణ జరిగిందంటే దానికి మూలం సైన్స్. అలాగే దాని వెనక ఎంతోమంది శాస్త్రవేత్తల నిరంతర కృషి, పట్టుదల ఉంటుంది. మనదేశానికి చెందినఎంతోమంది శాస్త్రజ్ఞులు ప్రపంచస్థాయిలో చెరగని ముద్ర వేసుకున్నారు. రోజురోజుకు మనదేశం కొత్తతరం శాస్త్రవేత్తలను తయారు చేస్తూనే ఉంది. అలాంటి వారిని తయారుచేసే సంస్థల్లో బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) కూడా ఒకటి. దాదాపు 110 ఏళ్లచరిత్ర కలిగిన విశ్వవిద్యాలయం ఇది. ఇక్కడి నుంచి ఎంతోమంది గొప్ప శాస్త్రవేత్తలు పుట్టుకొచ్చారు. దీనికి ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త సర్ సి.వి.రామన్ మొట్టమొదటి డైరెక్టర్‌గా సేవలందించగా.. సతీష్ ధావన్, రొద్దం నరసింహ, జి.ఎన్ రామచంద్రన్ లాంటి ప్రముఖ శాస్త్రవేత్తలు ఇక్కడి పూర్వవిద్యార్థులే కావడం విశేషం. 

ఎన్నో ప్రత్యేకతలు

దేశంలో పరిశోధన రంగం, సైన్స్ విశ్వవిద్యాలయాల్లో ఐఐఎస్సీ అగ్రగామిగా కొనసాగుతోంది. సైన్స్ కోర్సుల్లో బోధన, పరిశోధనల్లో ఈ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా కీర్తి గడించింది. గతేడాది ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకుల్లో విశ్వవిద్యాలయాల కేటగిరీలో ఈ సంస్థ ప్రథమ స్థానంలో నిలిచింది. 2016 నుంచి 2020 వరకు వరుసగా అయిదో సారి ఈ ఘనత సాధించడం విశేషం. ఇది 1958లోనే డీమ్డ్ యూనివర్సిటీగా అర్హత పొందింది. టైమ్స్ హయర్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో దేశంలో మొదటి స్థానం దక్కించుకుంది. ఆసియాలో 27వ స్థానంలో కొనసాగుతోంది. అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కొనసాగే ఎంహెచ్ఆర్డీ ఇచ్చే వివిధ ర్యాంకింగ్స్‌లోనూ ఐఐఎస్సీ మొదటి స్థానాల్లో ఉండటం విశేషం. 2018లో దీనికి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ (ఐఓఈ) హోదా దక్కింది. ఉన్నత విద్య అందించే సంస్థలకు ఈ హోదానిస్తారు. ఇది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) ఆధ్వర్యంలో కొనసాగుతోంది. ఇక్కడి విద్యార్థుల ప్రతిభ, ఫ్యాకల్టీ నైపుణ్యాలు, ప్రయోగశాలలు, పరిశోధనలు, వసతులే సంస్థ పేరు పొందడానికి దోహదం చేశాయి.

ఇంతటి చరిత్ర కలిగిన ఐఐఎస్సీలో చేరాలని ఎంతోమంది విద్యార్థులు కలలు కంటుంటారు. తాము కూడా గొప్ప శాస్త్రవేత్తలుగా ఎదగాలనుకుంటారు. మరి ఈ ఇన్‌స్టిట్యూట్లో చేరాలంటే ఏం అర్హతలు కావాలి? ప్రవేశాలు ఎలా పొందాలి? ఇక్కడ ఎలాంటి కోర్సులు అందిస్తారు? అనే వివరాలను చూద్దాం.

అందించే కోర్సులు.. కావాల్సిన అర్హతలు

ఐఐఎస్సీ.. అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ రిసెర్చ్ ప్రోగ్రాముల్లో కోర్సులు అందిస్తోంది. బయాలాజికల్ సైన్స్; కెమికల్ సైన్స్; ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్(ఈఈసీఎస్); ఇంటర్ డిసిప్లినరీ సైన్స్; మెకానికల్ సైన్స్; ఫిజిక్స్ అండ్ మ్యాథమెటికల్ సైన్స్ వీటిలో ముఖ్యమైనవి. టెక్నాలజీకి సంబంధించిన కోర్సులను కూడా ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తోంది.

బ్యాచిలర్ ఆఫ్ సైన్స్(రిసెర్చ్)

ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులు ఈ కోర్సుల్లో చేరడానికి అర్హులు. తప్పనిసరిగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్టులు చదివిన వారై ఉండాలి. కోర్సులో చేరాలనుకుంటే బయాలజీ, కెమిస్ట్రీ, ఎర్త్ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్స్, మెటీరియల్ సైన్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ విభాగాల్లో ఒకదానిని ఎంచుకోవాల్సి ఉంటుంది. అందులో నాలుగేళ్ల (8 సెమిస్టర్లు) బ్యాచిలర్ ఆఫ్ సైన్స్(రిసెర్చ్) చేయాలి. కిశోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజన(కేవీపీవై), జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్డ్, నీట్ యూజీలో ప్రతిభ ఆధారంగా ఎంపికలుంటాయి. ఈ కోర్సులో చేరిన వారు అన్నీ కలిపి ఏడాదికి సుమారు రూ.30 వేలు చెల్లించాల్సి ఉంటుంది. ప్రవేశపరీక్షలో విద్యార్థులు చూపే ప్రతిభ ఆధారంగా వివిధ సంస్థలు అందించే స్కాలర్‌షిప్‌ల‌కు ఎంపికవుతారు. 

పీజీ కోర్సులు

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ పీజీ కోర్సుల్లో భాగంగా మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ(ఎంటెక్), మాస్టర్ ఆఫ్ డిజైన్(ఎండీఈఎస్), మాస్టర్ ఆఫ్ మేనేజ్‌మెంట్(ఎంఎంజీటీ) ప్రోగ్రాములను అందిస్తోంది. ఎంటెక్‌లో చేరాలనుకునే వారు బీఈ/బీటెక్ ఉత్తీర్ణతతోపాటు గేట్ ప్రవేశ పరీక్షలో మంచి ర్యాంకు సాధించాలి. ఎండీఈఎస్ ప్రవేశాలకు బీఈ/బీటెక్/బీడీఈఎస్/బీఆర్క్ ఉత్తీర్ణత ఉండాలి. అలాగే గేట్, సీఈఈడీలో ఉత్తమ ర్యాంకు పొందాలి.

పోస్ట్ గ్రాడ్యుయేట్ రిసెర్చ్ ప్రోగ్రాములు

ఇందులో భాగంగా ఇన్‌స్టిట్యూట్ ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ, రిసెర్చ్ ప్రోగ్రామ్ (ఎంటెక్(రిసెర్చ్)/పీహెచ్‌డీ), ఎక్స‌ట‌ర్నల్ రిజిస్ట్రేషన్ ప్రోగ్రామ్(ఈఆర్పీ) కోర్సులున్నాయి. పరిశోధనలపై అమితాసక్తి ఉండి, చేతిలో బ్యాచిలర్స్ డిగ్రీ పట్టా ఉన్న విద్యార్థులకు ఐఐఎస్సీ బయాలజికల్, కెమికల్, ఫిజికల్ అండ్ మ్యాథమేటికల్ సైన్స్‌లో ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీకి అవకాశం కల్పిస్తోంది. అర్హత పరీక్షలు జామ్, జస్ట్‌లో ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూలకు పిలుస్తారు. మరోవైపు బెంగళూరు క్యాంపస్లో అత్యధిక మంది విద్యార్థులు రిసెర్చ్ విభాగంలోనే ఉండటం విశేషం. పరిశోధనకు ఇక్కడ అంత ప్రాధాన్యం ఉంది. ఈమేరకు రిసెర్చ్ (పీహెచ్‌డీ/ఎంటెక్) విభాగాల్లో సంస్థ ఏటా ప్రవేశాలు కల్పిస్తోంది. ఏదైనా సైన్స్ బ్రాంచి కలిగిన మాస్టర్స్ డిగ్రీ లేదా మెడిసిన్/ఇంజినీరింగ్/టెక్నాలజీ/అగ్రికల్చర్/వెటర్నరీ సైన్స్/ఫార్మసీ లేదా నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ప్రోగ్రామ్ చేసిన వారు ఈ కోర్సుకు అర్హులు. అలాగే గేట్/నెట్ జేఆర్ఎఫ్/జీప్యాట్లో ర్యాంకు సాధించాలి. అనంతరం అభ్యర్థులను ఇంటర్వ్యూలకు పిలుస్తారు. పీహెచ్‌డీలో చేరే అభ్యర్థులు ఏడాదికి సుమారు రూ.35 వేలు, ఎంటెక్(రిసెర్చ్), ఇంటిగ్రేటెడ్ పీహెచీడీ, ఎంటెక్, ఎండీఈఎస్ అభ్యర్థులు రూ.30 వేలు, మాస్టర్ మేనేజ్‌మెంట్ కోర్సు కోసం రూ.లక్ష 66 వేలు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలకు ఆయా రుసుముల్లో రాయితీ ఉంటుంది. 

ప్రోత్సాహకాలతో చేయూత

దాదాపు ఇక్కడ చేరే దాదాపు అందరు విద్యార్థులకు స్కాలర్షిప్ లేదా ఫెలోషిప్లు అందుతుంటాయి. సీఎస్ఐఆర్, యూజీసీ, డీబీటీ, ఐసీఎంఆర్, ఏఐసీటీఈ, డీఏఈ, డీఎస్టీ వీటిని అందిస్తాయి. ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ప్రతిభ కనబరిచే విద్యార్థులకు చేయూతగా.. జీఈ, ఇన్ఫోసిస్, ఐబీఎం, హెచ్పీ, టాటా, ఫిలిప్స్, బెల్ ల్యాబ్, మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజ సంస్థలూ స్కాలర్షిప్లు, ఫెల్లోషిప్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంటాయి. ప్రస్తుతం ఈ క్యాంపస్లో 4600 మంది విద్యార్థులు వివిధ పరిశోధనల్లో నిమగ్నమై ఉన్నారు.

అధునాతన ప్రయోగశాలలు

ఐఐఎస్సీ బెంగళూరు క్యాంపస్ పరిశోధన విద్యార్థులకు పెట్టింది పేరు. ఇక్కడ అధునాతన ప్రయోగశాలలు అందుబాటులో ఉన్నాయి. అవి ఎన్నో పరిశోధనలు సాక్ష్యాలు. విద్యార్థులతో పరిశోధనలు చేయించేందుకు అనుభవజ్ఞులైన అధ్యాపకులు కొలువయ్యారు. అన్ని విభాగాల్లో కలిపి 500 పైచిలుకు ఫ్యాకల్టీ ఉండటం గమనార్హం. అన్నింటికంటే ముఖ్యంగా సుమారు అయిదు లక్షల పుస్తకాలు, పీరియాడికల్స్, టెక్నికల్ రిపోర్టులకు నెలవైన అత్యుత్తమమైన సైన్స్ అండ్ టెక్నాలజీతో జేఆర్డీ టాటా మెమొరియల్ లైబ్రరీ విద్యార్థులకు విజ్ఞాన భాండాగారంగా ఉంది. విద్యార్థులకు కావాల్సిన వైద్య సౌకర్యాలు, నివాస వసతులు ఇక్కడి ప్రత్యేకత.

కిశోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజన (కేవీపీవై)

సైన్స్పై మక్కువ ఉన్న విద్యార్థులకు ఫెలోషిప్ అందించేందుకు కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ జాతీయస్థాయిలో కిశోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజన(కేవీపీవై) కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. సైన్స్ పరిశోధనలపై ఆసక్తి ఉన్న విద్యార్థుల సామర్థ్యాన్ని గుర్తించి విద్యాపరంగా చేయూత అందించడంతోపాటు భవిష్యత్తులో వారు పరిశోధనను వృత్తిగా చేపట్టేలా ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. ఐఐఎస్సీలో ప్రవేశాలు పొందేందుకు ఇది కూడా ఒక మార్గం. దేశంలో పరిశోధన అభివృద్ధికి ఇది ఎంతో దోహదపడుతుందని ఐఐఎస్సీ భావిస్తోంది. ఈ ప్రోగ్రామ్‌కు నోటిఫికేషన్ ఏటా సెప్టెంబర్‌లో విడుదల చేస్తారు. అనంతరం సంబంధిత వెబ్‌సైట్లో ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. సైన్స్ సబ్జెక్టుగా చదివే ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థుల నుంచి బీఎస్సీ, బీఎస్, బీస్టాట్, బీమ్యాథ్స్, ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ, ఎమ్మెస్ ఇన్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ కోర్సులు చదివే వారు దీనికి అర్హులు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు కేవీపీవై సామర్థ్య పరీక్ష నిర్వహిస్తారు. అందులో ప్రతిభ కనబరిచిన వారిని షార్ట్‌లిస్ట్ చేసి ఇంటర్వ్యూలకు పిలుస్తారు. పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపికలు ఉంటాయి. ఎంపికై డిగ్రీలో చేరిన విద్యార్థులకు నెలకు రూ.5000, పీజీ చదివేవారికి రూ.7000 స్టైపెండ్ ఇస్తారు.

ఇంటర్న్‌షిప్‌లు.. ఉద్యోగావకాశాలు

ఇక్కడ విద్యనభ్యసిస్తూ పరిశోధనలు చేసే విద్యార్థులకు మంచి డిమాండ్ ఉంది. వీరిని ఉద్యోగాల్లో నియమించుకునేందుకు వివిధ సంస్థలు ఆసక్తి కనబరుస్తాయి. ఇంటర్న్‌షిప్‌లు అందిస్తున్నాయి. వీటికి ఎంపికయ్యే విద్యార్థులు చదువు కొనసాగిస్తూనే సంపాదిస్తున్నారు. పీహెచ్‌డీ, ఎంటెక్, ఎంటెక్ (రిసెర్చ్), ఎండిజైన్, బీఎస్(రిసెర్చ్), ఎమ్మెస్(రిసెర్చ్) విద్యార్థులకు అత్యధికంగా నెలకు రూ.1.15లక్షలు స్టైపెండ్ ఇస్తున్నాయి. ఇక క్యాంపస్ నియామకాల్లో భాగంగా ఆయా సంస్థల్లో ఎంపికయ్యే వారికి భారీగా ప్యాకేజీలు అందుతున్నాయి. అత్యధికంగా ఏడాదికి రూ.40 లక్షలు, అత్యల్పంగా రూ. 15 లక్షలు ఇస్తున్నారు. 

రిక్రూట్‌మెంట్లు నిర్వహించే సంస్థలు

ఐఐఎస్సీలో చదివిన విద్యార్థులను రిక్రూట్ చేసుకోడానికి వందల సంఖ్యలో సంస్థలు రిజిస్ట్రేషన్ చేసుకుంటాయి. అందులో ఐటీ, ఫార్మా తదితర రంగాల నుంచి బహుళస్థాయి సంస్థలు ఉన్నాయొ. నియామకాలు నిర్వహించే సంస్థల్లో ప్రధానంగా అమెజాన్, సిస్కో, డా.రెడ్డీస్, బజాజ్, సోనీ, టాటా మోటార్స్, టాటా స్టీల్, ఇన్ఫోసిస్, సామ్ సంగ్, బైజూస్, ఫ్లిప్ కార్ట్,  మెర్సిడెస్ బెంజ్, జేపీ మోర్గాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్, ఐబీఎం, రిలయన్స్, మహీంద్రా, హీరో, ఎమ్మార్ ఎఫ్ తదితర దిగ్గజ సంస్థలు ఉన్నాయి. 

విదేశీ విద్యార్థుల కోసం..

ఐఐఎస్సీ విదేశీ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా కోర్సులు నిర్వహిస్తోంది. అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాముల్లో ప్రవేశాలకు ప్రస్తుతం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఫిబ్రవరి 19 నుంచి ప్రక్రియ ప్రారంభం కాగా ఇది ఏప్రిల్ 30 వరకు కొనసాగుతుంది. ఎంటెక్, మాస్టర్ ఆఫ్ మేనేజ్‌మెంట్, ఎండీఈఎస్, ఎంటెక్(రిసెర్చ్), పీహెచ్‌డీ ప్రవేశాల దరఖాస్తు ప్రక్రియ త్వరలో మొదలవుతుంది. 

ప్రస్తుతం ప్రవేశాలు ఇలా..

ఐఐఎస్సీ 2021-22 విద్యాసంవత్సరానికి వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రస్తుతం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. రిసెర్చ్ ప్రోగ్రాములు (పీహెచ్‌డీ/ఎంటెక్ (రిసెర్చ్) కోర్సుల్లో ప్రవేశాలకు తాజాగా నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్, బయోకెమిస్ట్రీ, ఎకోలాజికల్ సైన్స్, ఎయిరోస్పేస్ ఇంజినీరింగ్, కెమికల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, మ్యాథమేటికల్ సైన్సెస్, నానో సైన్స్ అండ్ ఇంజినీరింగ్, క్లైమెట్ చేంజ్ తదితర విభాగాలు ఉన్నాయి. సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్, బీఫార్మసీ, మాస్టర్స్ డిగ్రీ, ఎంబీబీఎస్ ఉత్తీర్ణతతోపాటు వివిధ జాతీయ ప్రవేశపరీక్షల్లో తగిన స్కోర్ సాధించిన వారు అర్హులు. ఎంటెక్/ఎండిజైన్/ఎంఎంజీటీ, ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ ప్రోగ్రాముల్లో ప్రవేశాలు కల్పిస్తున్నారు. బయలాజికల్ సైన్సెస్, కెమికల్ సైన్సెస్, మ్యాథమేటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్ విభాగాలున్నాయి. బీఎస్సీ/ బీఈ/ బీటెక్ ఉత్తీర్ణతతోపాటు సంబంధిత సబ్జెక్టుల్లో జామ్ 2021/ జస్ట్ 2021 అర్హత సాధించినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. పీహెచ్‌డీ అండ్ ఎక్స్ టర్నల్ రిజిస్ట్రేషన్ ప్రోగ్రామ్, నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (రిసెర్చ్) ప్రోగ్రాముల్లో బయాలజీ, కెమిస్ట్రీ, ఎర్త్ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్స్, మెటీరియల్స్, మ్యాథమేటిక్స్, ఫిజిక్స్ విభాగాల్లో ప్రవేశాలున్నాయి. వీటి కోసం దరఖాస్తు చేయాలనుకుంటే 2020లో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులు, 2021లో ఇంటర్మీడియట్ పూర్తయ్యే విద్యార్థులు అర్హులు. ఇంటర్‌లో ఫిజిక్స్, మ్యాథమేటిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, స్టాటిస్టిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ తదితర సబ్జెక్టులు చదివి ఉండాలి. 

ద‌ర‌ఖాస్తు రుసుము, చివ‌రి తేదీ, అర్హ‌త‌ వంటి పూర్తి వివ‌రాల కోసం ఈ లింక్‌ల‌ను క్లిక్ చేయండి.

https://www.eenadupratibha.net/notifications/notification_article/admissions/iisc-bachelor-of-science-admission-notification/2-8-28-21070001653

https://www.eenadupratibha.net/notifications/notification_article/admissions/iisc-research-programmes-admission-notification/2-8-28-21070001665

ఐఐఎస్‌సీ అధికారిక‌ వెబ్‌సైట్: https://www.iisc.ac.in/
 

Posted Date: 05-03-2021


 

ప్ర‌ఖ్యాత సంస్థ‌లు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌