• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఉద్యోగం సాధించాలనే త‌ప‌న మీలో ఉందా?

 

 

ప్రవేశపరీక్షల్లో మెరుగైన ర్యాంకు, పోటీ పరీక్షల్లో ఉద్యోగ సాధన.. లక్ష్యం ఏదైనా దాన్ని సాధించాలంటే.. పట్టుదల, ఆత్మవిశ్వాసాలతో పాటు నిరంతరం జ్వలించే తపన ఉండాలి. లక్ష్యం ఉన్నవారందరికీ జ్వలించే తపన ఉండాలన్న నిబంధన లేదు. ఇది కొందరిలో సహజ లక్షణంగా ఉంటే మరికొందరిలో శిక్షణతో పెంపొందుతుంది!  

 

నియామక సంస్థలు నిపుణులైన విద్యావంతుల కోసం ప్రాంగణ ఎంపికలు చేపడుతుంటాయి. మార్కెట్‌లో పోటీని ఎదుర్కొని మనుగడ సాధించాలంటే ఉద్యోగుల్లో సాధారణ సామర్థ్యాలతో పాటు అదనంగా జ్వలించే తపన ఉండాలి. ప్రాంగణ నియామకాల్లో  నిర్వహించే పరీక్షలలో నెగ్గినవారిలో ఈ లక్షణం ఉన్నవారికే యాజమాన్యాలు ప్రాధాన్యమిస్తాయి. 

 

ఉద్యోగం సంపాదించడమే లక్ష్యంగా జ్వలించే తపన ఉంటే సరిపోదు, దీన్ని సంస్థ ఉన్నతికి ఉపయోగించగలాలి. ఇలాంటివారికే కార్పొరేట్‌ సంస్థల్లో ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువ. 

 

స్పష్టమైన లక్ష్యం... ప్రణాళిక  

ప్రపంచ స్థాయి సంస్థల్లో ఎంపికై మంచి ఉద్యోగం సంపాదించడమే లక్ష్యంగా ఎక్కువ శాతం విద్యార్థులు భావిస్తుంటారు. కొంతమంది మాత్రం తమ వృత్తి ఉద్యోగాల్లో ఏ స్థాయికి ఎదగాలనుకుంటున్నారో నిర్ణయించుకుని ఆ దిశగా ప్రయత్నిస్తారు. చాలా తక్కువ శాతం విద్యార్థుల్లో ఈ లక్షణం గమనించవచ్చు. మీ వ్యక్తిగత అభివృద్ధితో పాటు సంస్థ అభివృద్ధిపథంలో నడిచేందుకు కృషిచేయగలరన్న విషయం మీరు తెలియజెప్పాలి. వృత్తికి సంబంధించిన లక్ష్యాలను సంస్థ లక్ష్యాలకు అనుసంధానించగలగాలి. ఇంటర్వ్యూల్లో సెలక్టర్లకు నమ్మకం కలిగించగలగాలి.  

 

నిరంతర సృజన

సృజనాత్మక ఆలోచనలు నూతన ద్వారాలను తెరుస్తాయి. ప్రతి విద్యార్థికీ రెండు లక్ష్యాలుంటాయి. మొదటిది- అకడమిక్‌ చదువులు, పుస్తక పరిజ్ఞానం, సిలబస్‌ పూర్తిచేసి అధిక శాతం మార్కులు సాధించడం. ఇవి ఆలోచనలను క్రమబద్ధీకరించి వ్యక్తిని పరిధి దాటనివ్వవు. అకడమిక్‌ లక్ష్యాన్ని సాధించడానికే పరిమితమైన విద్యార్థి అత్యధిక మార్కుల శాతం పొందినా సృజనాత్మకత లోపిస్తే నిజ జీవితంలోనూ, వృత్తి ఉద్యోగాల్లోనూ రాణించలేడు. అందుకే విద్యార్థి దశలోనే అకడమిక్‌ చదువులతో పాటు, మార్కులకు అతీతంగా సమస్యల పరిష్కారాలకు నూతన మార్గాలు అన్వేషించగలిగిన సామర్థ్యం పెంచుకోవాలి. రెండోది- అదనంగా సామర్థ్యాలను పెంచుకోవడం. ఈ లక్షణం వ్యక్తిని అభివృద్ధి వైపు నడిపిస్తుంది. 

 

ఉల్లాసంగా. ఉత్సాహంగా

విద్యార్థిగా మీరు నిరంతరం ఉత్సాహపూరిత వాతావరణంలోనే ఉంటారు. అకడమిక్‌ చదువు మీ తొలి ప్రాధాన్యంగా ఉంటుంది. మీ దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్ద్దేశించుకుని అవి మీకు నిరంతరం కనిపించేలా చూడండి - ఉదాహరణకు మీరొక స్టేట్‌మెంట్‌ తయారుచేసుకుని, దాన్ని పుస్తకాల దగ్గర మీ గదిలో, మొబైల్‌ లేదా బైక్‌- ఇలా ప్రతిచోటా పేపర్‌పై రాసి అతికించుకుంటే మీ లక్ష్యం మీకు కనిపిస్తూ నిరంతరం మీ ముందు మెదలాడుతుంటుంది. ఈ చర్య మీ తపననూ, లక్ష్యాన్నీ తాజాగా ఉంచుతుంది. ఉదాహరణకు ఒక కంపెనీలో సి.ఇ.ఒ. స్థాయికి ఎదగాలన్న తపన మీలో ఉంటే, ‘నేను పది సంవత్సరాల్లో ఫలానా కంపెనీలో సీఈఓ కావాలనుకుంటున్నాను’ అని ఒక స్టేట్‌మెంట్‌ రాసుకోండి. అంటే ఈ దీర్ఘకాలిక లక్ష్యాన్ని చేరుకోవాలంటే చిన్న చిన్న లక్ష్యాలను సాధించాల్సి ఉంటుంది. అంటే మీరు ప్రాంగణ నియామకాల్లో ఎంపికవడం మొదలు సీఈఓ స్థాయికి చేరుకునేవరకు ఎదిగేందుకు ఉన్న అన్ని లక్ష్యాలూ ఇందులో ఇమిడి ఉంటాయి.

 

సృజనాత్మకంగా ఉండాలంటే మేధావులై ఉండనవసరం లేదు.  

వీలైనన్ని ఎక్కువ ఆలోచనలు వృద్ధి చేసి, అందులో ఎదురయ్యే సమస్యలను పరిశీలించి వాటికి పరిష్కార మార్గాలను అన్వేషించండి. 

ప్రతి పనినీ ప్రయోగాత్మకంగా చేయటానికి ప్రయత్నించండి.

 

సాధికార సమాచారం

నిరంతరం స్ఫూర్తిదాయకంగా ఉన్నప్పుడే మన తపన సజీవంగా ఉంటుంది. లక్ష్యం పలచబడకుండా ఉండాలంటే నిరంతరం ప్రేరణ ఉండాలి. ఆశావాద దృక్పథం ఉన్నవారితో సహవాసం చేయడం, నిరాశావాదులకు దూరంగా ఉండడం, స్ఫూర్తిదాయకమైన పుస్తకాలు, సాహిత్యం చదవడం, ప్రయోజనకరమైన కార్యక్రమాల్లో పాల్గొనడం, ఆడియోలు వినడం లాంటివి చేస్తే తప్పకుండా మీ రంగంలో విజయం సాధించే అవకాశాలున్నాయి. 
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఎస్‌ఐ ప్రిలిమ్స్‌కు సన్నద్ధత ఇలా!

‣ కళ్లకు కట్టినట్టు.. కళతో కనికట్టు!

‣ పరిశోధనలకు పునాది

‣ సాంకేతికతపై పట్టు.. మార్కులు సాధించిపెట్టు!

‣ ఉన్నత సంస్థల్లో ఉపాధ్యాయ విద్య!

‣ పోటీ కోణంలో జీవశాస్త్రం

 

 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 11-05-2022 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌