• facebook
  • twitter
  • whatsapp
  • telegram

మెటా.. ఇక దీనిదే ఆట

వెబ్‌ 1.0లో కేవలం సమాచారం అందుబాటులో ఉండేది. దాన్ని చూడటానికి తప్ప, ఎటువంటి మార్పులూ చేయలేం. వెబ్‌ 2.0 అనేది కమ్యూనిటీ మీద ఆధారపడి ఉండేది.

ప్రముఖ సంస్థలన్నీ ఇప్పటికే ‘మెటావర్స్‌’లో మిలియన్‌ డాలర్ల చొప్పున భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. ఇందులో విద్య, ఆరోగ్య, వ్యాపార, మిలిటరీ తదితర రంగాల్లో ఉద్యోగావకాశాలకు కొదవేలేదు. కాబట్టి మెటావర్స్‌ అనుసంధానిత ఏఐ (ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌) టెక్నాలజీ గురించి మనం  మరింత అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది.

‘మెటా’ అంటే గ్రీకులో ‘బియాండ్‌-మించినది’, ‘వర్స్‌’ అంటే ‘యూనివర్స్‌’ అని అర్థం. ఇప్పుడున్న విజ్ఞానంకన్నా మించినదని దీనర్థం. ఇది బ్లాక్‌చెయిన్, వెబ్‌ 3.0, వర్చువల్‌ రియాల్టీ అనే మూడు టెక్నాలజీల కలయిక. ప్రస్తుతం మనం వాడుతున్న టెక్నాలజీ 2డీ. ఈ మెటావర్స్‌ 3డీ రకానికి చెందినది. వెబ్‌ 3.0 అనేది 2.0కి మరొక వర్షన్‌గా చెప్పొచ్చు. 

సామాజిక మాధ్యమాన్ని వేదికగా చేసుకుని రకరకాల బ్లాగులను, వీడియోల రూపంలో కంటెంట్‌ను సృష్టించవచ్చు. దీన్ని మార్చే అవకాశమూ ఉంది. 3.0 వికేంద్రీకరణ (డీసెంట్రలైజేషన్‌) మీద ఆధారపడి ఉంటుంది. 

మెటావర్స్‌లో మనం సృష్టించిన కంటెంట్‌ను ఎంచక్కా అమ్మేయొచ్చు. ఎవరూ కాపీ చేయలేరు కూడా. బ్లాక్‌చెయిన్‌ ఆధారంగా పనిచేసే ఈ విధానంలో డేటాను ఎన్‌ఎఫ్‌టీల రూపంలో అమ్మడం లేదంటే కొనడం చేయొచ్చు.

మెటావర్స్‌... ఈతరానికి వర్చువల్‌ ప్రపంచపు సరికొత్త వాస్తవ అనుభూతిని అందించబోతోంది. ఇన్నాళ్లూ ఊహా ప్రపంచంలో తేలియాడిన మనం... ఇకపై కలలో కూడా చూడని వింతల్ని, ప్రాంతాల్ని, మనుషుల్ని వర్చువల్‌ ప్రపంచంలో ఇట్టే చూసేయబోతున్నాం!

పెద్ద కంపెనీల పోటాపోటీ

డిజిటల్‌ కరెన్సీ కంపెనీ ‘గ్రేస్కేల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌’ అంచనా ప్రకారం మెటావర్స్‌లోని వస్తుసేవల వినిమయం విలువ 2030 నాటికి ట్రిలియన్‌ డాలర్లకు చేరుకుంటుంది. ఈ కంపెనీలన్నీ మెటావర్స్‌లో అవసరమయ్యే వస్తువుల్ని కొనడం, అమ్మడం, యాడ్స్‌ ద్వారా డబ్బు సంపాదిస్తున్నాయి. దీనికోసం ఫేస్‌బుక్‌ ఒక్కటే కాదు.. పెద్దపెద్ద టెక్‌ కంపెనీలు పోటీ పడుతున్నాయి. మైక్రోసాఫ్ట్‌ ‘మైక్రోసాఫ్ట్‌ మెస్‌’ పేరుతో ఇందులో అడుగుపెట్టింది. యాపిల్, రోబ్‌లోక్స్‌ వంటి సంస్థలు బిలియన్‌ డాలర్లు ఖర్చు చేస్తున్నాయి. ఇవన్నీ కూడా మెటావర్స్‌ తరహాలో గేమ్స్‌ను రూపొందించడంపైనే దృష్టి సారించాయి. 

ఫేస్‌బుక్‌ పేరును కాస్తా ‘మెటా’గా మార్చడమే దీని ప్రాముఖ్యానికి నిదర్శనం. రానున్న ఐదేళ్లలో ఫేస్‌బుక్‌ సోషల్‌ మీడియా కంపెనీ నుంచి మెటావర్స్‌ కంపెనీగా మారనుంది.

అనుకూలతలు..

వీడియో కాన్ఫరెన్సులు, మీటింగ్‌లను ఎక్కువమంది ఒకేచోట కలిసి నిర్వహించే వీలుంటుంది. సందేశాలు, వీడియో కాల్స్‌ మాత్రమే కాకుండా ప్రత్యక్షంగా వెళ్లి మాట్లాడిన అనుభూతిని పొందొచ్చు. నేరుగా వెళ్లలేని అతిముఖ్యమైన కార్యక్రమాలకు, సమావేశాలకు ఈ మెటావర్స్‌ ద్వారా వెళ్లి హాజరవ్వొచ్చు. వర్చువల్‌ ఇన్‌స్ట్రక్టర్‌ ద్వారా మనం ఉన్న చోటే యోగా, వర్కవుట్స్‌ చేసుకోవచ్చు.

ప్రతికూలతలు..

ఈ అనుభూతితో చాలామంది నిజజీవితం వదిలి, ఇందులోనే ఎక్కువ సమయం గడిపే ప్రమాదముంది. భద్రత విషయంలో ఒక వ్యక్తికి సంబంధించిన వ్యక్తిగత సమాచారం ఎంతవరకు గోప్యంగా ఉంటుందనే విషయంపై స్పష్టత లేదు. అందుకు సంబంధించిన నియమ నిబంధనలు ఎలా ఉంటాయనేది ఆలోచించాల్సిందే!

ఊహాప్రపంచంలోకి..

నిరుడు కరోనా సృష్టించిన గందరగోళం వల్ల చాలామంది ఇళ్లకే పరిమితమవ్వాల్సి వచ్చింది. అయినవాళ్లను చేరుకోలేక వీడియో కాల్స్‌ లాంటి ప్రత్యామ్నాయాలతో సరిపెట్టుకోవాల్సిన దుస్థితి. అంతేనా.. ఆన్‌లైన్‌ క్లాసులు, వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌లు, జూమ్‌ మీటింగ్‌లంటూ రోజంతా ఇంటర్నెట్‌లోనే గడిపాం. ఇటువంటి అవసరాల్ని ముందే గ్రహించిన పెద్ద టెక్‌ కంపెనీలన్నీ ఈ మెటావర్స్‌లోకి త్వరితగతిన అడుగులు వేస్తున్నాయి. భారీ పెట్టుబడులతో మెటావర్స్‌లోని భూభాగాల్ని కొనుగోలు చేశాయి.

వర్చువల్‌ ఇంటర్నెట్‌లో భూభాగాలేంటని ఆశ్చర్య పోతున్నారా? దాని ఉనికే లేకుండా ఎవరు కొంటారనుకోవద్దు. తాజాగా రిపబ్లిక్‌ రిలేమ్‌ 4.3 మిలియన్‌ డాలర్లకు (దాదాపు 32 కోట్లకు..) లాండ్‌ను కొని, రియల్‌ ఎస్టేట్‌ చేసింది.

ఒక్కొక్కరికీ ఒక్కో ‘అవతార్‌’..

ఈ వర్చువల్‌ ప్రపంచంలోకి వెళ్తే, మనకంటూ ఒక రూపం ఉంటుంది. దీనినే ‘అవతార్‌’ అంటారు. ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ లాంటి సామాజిక మాధ్యమాల్లో మన ప్రొఫైల్‌ ఫొటోలను ఎలాగైతే ఉంచుతామో, అలానే ‘అవతార్‌’ అన్నమాట. మనకు నచ్చిన విధంగా ఆ అవతార్‌ను తయారు చేయొచ్చు. కావాల్సిన వస్తువులు, దుస్తులను కొనుక్కోవొచ్చు. అందుకు అవసరమయ్యే స్టోర్‌లను పలు సంస్థలు పోటీపడి మరీ తెరుస్తున్నాయి. మనం ఏ విధంగా కదులుతామో, ఎలా అయితే చేస్తామో, చూస్తామో అచ్చం అలానే మన అవతార్‌ చేస్తుంది. దీనికోసం మనం వీఆర్‌ హెడ్‌సెట్‌ ధరించాల్సి ఉంటుంది. ఇది చుట్టూ ఉన్న ప్రపంచాన్ని త్రీడీలో చూపిస్తుంది. అలాగే ఒక ఆప్టిక్‌ సూట్‌ ఉంటుంది. ఇది పరిసరాల్ని అనుభూతి చెందేలా చేస్తుంది.

వీడియోగేమ్‌ లాగానే...

వీడియోగేమ్స్‌లో ఫీచర్స్‌ ఎలా ఉంటాయో ఈ మెటావర్స్‌లోనూ అలానే ఉంటాయి. ఇందులోకి వెళ్లినవారి నుంచి కొంత రుసుము వసూలు చేస్తారు. కొన్ని ఫ్యాషన్‌ బ్రాండ్లైతే తమ మెటా స్టోర్లను ఈపాటికే తెరిచేశాయి. బయటి ప్రపంచంలోలాగానే ఇందులోనూ ఎక్కడెక్కడి స్నేహితుల్నీ, బంధువుల్నీ కలవగలం, వారితో కలిసి పనిచేయొచ్చు, ఆడుకోవచ్చు. ఇవన్నీ చేయాలంటే అందుకు తగ్గ స్థలం కావాలి కదా! ఇప్పటికే చాలా కంపెనీలు మెటావర్స్‌లో స్థలాల్ని అమ్మడం మొదలుపెట్టాయి. విచిత్రంగా ఉంది కదూ! 

ఉదాహరణకు ఊహాజనిత ప్రపంచంలో వర్షం కురిసిందనుకుంటే... ఆ వర్షపు చినుకులు మన మీద పడిన భావన కలుగుతుందన్నమాట.
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ గణిత బోధనలో ఘనమైన సంస్థ!

‣ బయో టెక్నాలజీలో పీజీ

‣ ఫీజులు తక్కువ నాణ్యత ఎక్కువ!

‣ టెన్త్‌తో సెంట్రల్‌ గవర్నమెంట్‌ ఉద్యోగం

‣ నకిలీ ఉద్యోగ ప్రకటనలను గుర్తించడం ఎలా?

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 30-03-2022 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌