• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఉద్యోగ సాధనకు ఇవీ తీర్మానాలు! 

కొత్త సంవత్సరంలో ఏ నిర్ణయాలు తీసుకొని, ఎలా కృషి చేయాలి?

నూతన సంవత్సరం.. భవితకు మేలు చేసే తీర్మానాల అమలుకు ప్రయత్నాలను కొనసాగించే సందర్భం! మరి ఉద్యోగార్థులు తమ లక్ష్య సాధనకు ఏ తీర్మానాలు చేసుకుని ఎలాంటి కృషి చేయొచ్చో తెలుసుకుందామా? 

ఉద్యోగాన్వేషణలో భాగంగా..కనిపించిన ప్రతి ఖాళీకీ దరఖాస్తు చేస్తూ వెళుతుంటారు కొంతమంది. ఇది అంత మంచి పద్ధతి కాదు. ఇష్టమైన రంగాన్ని ఎంచుకుని సంబంధిత పోస్టులకు మాత్రమే దరఖాస్తు చేయాలి. పోస్టును బట్టి రెజ్యూమె, కవరింగ్‌ లెటర్‌ ప్రత్యేకంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇష్టమైన కొన్ని కంపెనీల జాబితా తయారుచేసుకుని లింక్డ్‌ఇన్‌ లాంటి వేదికల ద్వారా దరఖాస్తు చేయొచ్చు. దీంట్లోకి వెళ్లిన తర్వాత అలాంటివే మరికొన్ని కంపెనీలు అక్కడ కనిపించొచ్చు. అలాంటప్పుడు వాటికి కూడా దరఖాస్తు చేయొచ్చు. 

నెట్‌వర్క్‌ విస్తరణ: ఆసక్తి చూపించే రంగానికి చెందిన సమావేశాలూ, కార్యక్రమాలకు హాజరవుతుండాలి. కొత్త సంవత్సరంలో అలాంటివి ఎప్పుడు, ఎక్కడ జరుగుతాయనే సమాచారం కనుక్కుంటూ ఉండాలి. దీంతో తాజా పరిణామాలు, మార్పుల గురించి వివరంగా తెలుసుకునే అవకాశం కలుగుతుంది. ఏమైనా సందేహాలున్నా నివృత్తి చేసుకునే వీలుటుంది. ఒక పరిధిని గీసుకుని దానికే పరిమితం కాకూడదు. పరిచయాలను పెంచుకోవడానికి ప్రయత్నించాలి. ఎంచుకున్న రంగానికి సంబంధించిన కొత్త వ్యక్తులను కలవడానికి ప్రయత్నించాలి. వారానికి ఇద్దరు కొత్త వ్యక్తులను కలవాలని నియమం పెట్టుకున్నా.. పరిధి విస్తరించే అవకాశం ఉంది. ఉద్యోగావకాశాలకు సంబంధించిన సమాచారాన్ని విస్తృతంగా  తెలుసుకోవచ్చు. 

కొత్త పరిచయాలు: ఉద్యోగాన్వేషణలో భాగంగా ఎప్పుడూ బిజీగా ఉండటానికి ప్రయత్నించాలి. ఇంటర్వ్యూ సమయంలో కొత్త వ్యక్తులు పరిచయం అవుతుంటారు కదా. అలాంటప్పుడు వారితో స్నేహం పెంచుకుని ఉద్యోగ ప్రయత్నాలను కొనసాగించవచ్చు. సామాజిక సేవ చేయాలనే అభిలాష ఉంటే... నెలకోసారైనా ఏదైనా స్వచ్ఛంద సేవా సంస్థలతో కలిసి పనిచేయొచ్చు. ఇలా చేయడం వల్ల వృత్తిగత ప్రయత్నాలతోపాటు సామాజిక సేవ చేయాలనే కోరికా నెరవేరుతుంది. దీనివల్ల అంతులేని ఆత్మసంతృప్తితోపాటుగా కొత్త పరిచయాలతో పరిధీ విస్తరిస్తుంది. 

నైపుణ్యాల సాధన: కాలేజీలో చదువుతూనో, ఆ తర్వాతనో నేర్చుకున్న నైపుణ్యాలు కొంతకాలానికి పాతబడొచ్చు. ఎందుకంటే ప్రతి రంగంలోనూ ఎప్పటికప్పుడు మార్పులు వస్తుంటాయి. మార్పు మాత్రమే శాశ్వతమనేది గుర్తుంచుకోవాలి. విద్యార్హతలు, నైపుణ్యాలు, అనుభవాలకు ఉన్న ప్రాధాన్యమూ మారిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఉద్యోగాన్వేషణకు పదును పెట్టడానికి కొత్త నైపుణ్యాలను నేర్చుకోవాల్సిందే. సామర్థ్యాలను పెంచుకునే క్రమంలో ఏ చిన్న అవకాశం వచ్చినా జారవిడుచుకోకుండా అందిపుచ్చుకోవాలి. అందుకోసం అనుకూలంగా ఉండే సమయాలను ఎంచుకుని కొత్త కోర్సుల్లో చేరొచ్చు. ఆన్‌లైన్‌ క్లాసుల ద్వారానూ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవచ్చు. 

ఇంటర్వ్యూహం: ఇంటర్వ్యూలను ఎదుర్కొనే క్రమంలో ఒత్తిడీ…, ఆందోళనలకు గురవకుండా మాక్‌ ఇంటర్వ్యూలకు హాజరుకావడం మంచి పద్ధతి. ఇలా చేస్తే సహజంగా ఉండే బెరుకూ, భయాలను పోగొట్టుకోవచ్చు. ఈ అనుభవంతో ఇంటర్వ్యూ సమయంలో ఎలాంటి ఒత్తిడికీ గురికాకుండా ఆత్మవిశ్వాసంతో నెగ్గుకురావచ్చు. ఇలాంటి అవకాశం లేనప్పుడు మాక్‌ ఇంటర్వ్యూ వీడియోలను చూసినా కొంత అవగాహన వస్తుంది. సీనియర్ల, స్నేహితుల సలహాలు, సూచనలూ ఉపయోగకరమే. ఇంటర్వ్యూ అంటే ఉండే భయాన్ని పోగొట్టుకోవడానికి మరో మార్గం.. అద్దం ముందు నిలబడి సాధన చేయడం. దీనివల్ల కూడా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. 

ఆరోగ్య రక్షణ: లక్ష్యసాధన దిశగా దూసుకుపోవాలంటే ఆరోగ్యంగా ఉండటం ఎంతో అవసరం. అందుకోసం పోషకాహారం తీసుకుంటూ రోజూ వ్యాయామాలు చేస్తుండాలి. లేకుంటే గంటసేపు ఇష్టమైన ఆట ఆడుకోవచ్చు. నాట్యాన్నీ ఎంచుకోవచ్చు. ఇలా మనసుకు నచ్చిన దాన్నే వ్యాయామంగా ఎంచుకోవడం వల్ల ఆనందంగానూ ఉండగలుగుతాం. ఉద్యోగాన్వేషణ ఒత్తిడి నుంచి బయటపడటానికి యోగా, ధ్యానం ఉపయోగపడతాయి. 

పుస్తకాల మేలు: వ్యక్తిత్వ వికాసానికి పుస్తక పఠనం ఎంతగానో తోడ్పడుతుంది. సానుకూల దృక్పథంతో ఉండే స్ఫూర్తిదాయక పుస్తకాలను చదవడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చిన్నతనం నుంచీ మొహమాటం, నలుగురితో కలవడానికి ఇబ్బంది పడటం, బృందంలో ధైర్యంగా మాట్లాడలేకపోవడం లాంటి... బలహీనతలు చాలామందిలో ఉంటాయి. వీటిని జయించడానికి సంబంధిత పుస్తకాలు చదవొచ్చు. నెలకో కొత్త పుస్తకమైనా చదవాలనే నిబంధన పెట్టుకుంటే పుస్తకం పఠనం ద్వారా ఎన్నో ప్రయోజనాలను పొందొచ్చు. అభిరుచిని బట్టి పుస్తకాలను ఎంపిక చేసుకోవచ్చు. కొన్ని అంతులేని ఆత్మసంతృప్తిని కలిగిస్తే, మరికొన్ని సామర్థ్యాలకు మెరుగులు దిద్ది ఆత్మవిశ్వాసాన్ని నింపొచ్చు. విజయ శిఖరాలను అధిరోహించిన ఎంతోమందికి పుస్తకాలు చదివే అలవాటు ఉండటం యాదృచ్ఛికం కాదు. 
 

*************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ సరైన శరీర భాషతో ఉద్యోగ విజయం!

‣ తీరదళంలో నావిక్‌....యాంత్రిక్‌!

‣ ఏకాగ్రతతో ప్రిపరేషన్‌కు కొన్ని మెలకువలు

‣ ఇంజినీరింగ్‌ పూర్తయితే ఇదిగో ఆర్మీ ఉద్యోగం!

Posted Date : 30-12-2021 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌