• facebook
  • whatsapp
  • telegram

సరైన శరీర భాషతో ఉద్యోగ విజయం!

బాడీ లాంగ్వేజ్‌, హావభావాల మెరుగుకు నిపుణుల సూచనలు

అకడెమిక్‌గా ఎంతో సామర్థ్యమున్న అభ్యర్దులు కూడా బాడీ లాంగ్వేజ్‌ సరిగా లేకపోతే ఇంటర్వ్యూలో మార్కులు తగ్గి కొలువులు చేజార్చుకోవాల్సివస్తుంది. ఏ స్థాయి ఉద్యోగాలకైనా ఇది వర్తిస్తుంది. ఇంత ముఖ్యమైన బాడీ లాంగ్వేజ్, హావభావాల్లో సహజత్వం పొందేందుకూ, వాటిని మెరుగుపరుచుకునేందుకూ విద్యార్థులూ, ఉద్యోగార్థులూ శ్రద్ధతో సాధన చేయాలి! 

క్యాంపస్‌ సెలెక్షన్స్‌లో ఆఖరి ప్రక్రియ అయిన ఇంటర్వ్యూ (మౌఖిక పరీక్ష)కు సిద్ధంగా ఉన్నాడు రమేష్‌. తనకీ ఇంటర్వ్యూ కేవలం లాంఛనమేనన్న ధీమాతో ఉన్నాడు. ఇతర అభ్యర్థులు, ఎవరి సన్నద్ధతలో వారున్నారు. ఎదురుచూసిన సమయం వచ్చింది. ఇంటర్వ్యూలు పూర్తయ్యాయి. ఫలితాలు ప్రకటించాక చూస్తే...రమేష్‌ ఎంపిక కాలేదు. అన్నింటా టాప్‌లో ఉన్న తాను సెలెక్ట్‌ కాకపోవడమేమిటో తెలియక రమేష్‌ ప్యానెల్‌లోని అధికారులను కలిశాడు. ఇంటర్వ్యూ హాల్‌లో అతడి బాడీ లాంగ్వేజ్‌ సరిగా లేకపోవడమే కారణమని వారు చెప్పటంతో ఆశ్చర్యపోయాడు. తన లోపం గ్రహించి నష్టనివారణ చర్యలకు సిద్ధపడ్డాడు.   

ఏమిటి ప్రాధాన్యం? 

సంస్థ ప్రతినిధులుగా కార్పొరేట్‌ ఉద్యోగులు ప్రభుత్వ అధికారులనూ, ఉన్నతాధికారులనూ, వినియోగదారులనూ సంప్రదించాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగులే సంస్థకు ప్రతినిధులు. వీరు ఎంతటి వృత్తి నిపుణులైనా బాడీ లాంగ్వేజ్‌తో ఆకట్టుకోవాలి. ఇది సంస్థ సంస్కృతికి ప్రతీకలాంటిది. అలాంటి బాడీ లాంగ్వేజ్‌ ఉన్నవారినే సంస్థలు ఉద్యోగులుగా ఎంపిక చేసుకుంటాయి.  

మంచి హావభావాలతో, ఆత్మవిశ్వాసంతో తనను తాను ప్రజెంట్‌ చేసుకునే అభ్యర్థులకే ఇంటర్వ్యూలో ఎంపికయ్యే అవకాశాలుంటాయి. సెలెక్టర్లు వీరికే అనుకూలంగా ఉంటారు. బాడీ లాంగ్వేజ్‌ అభ్యర్థి విశ్వసనీయత, ఆత్మవిశ్వాసాలను ప్రతిబింబిస్తుంది.  

మాటల ద్వారా చెప్పని ఎన్నో విషయాలను బాడీ లాంగ్వేజ్, హావభావాలు ఇంటర్వ్యూలోని సెలెక్టర్లకు తెలియజెప్పుతాయి. అభ్యర్థి ఆత్మవిశ్వాసంతో ఉన్నాడా, లక్ష్య సాధకుడా, వ్యవహారాలపై శ్రద్ధ చూపగలడా? లేక అభ్యర్థి అభద్రతా భావంతో ఉన్నాడా? అన్న విషయాలను బాడీ లాంగ్వేజ్‌ను గమనించి పసికట్టేస్తారు. ప్రతి జీవికీ ప్రయత్నపూర్వకంగానైనా, అప్రయత్నంగానైనా భావ వ్యక్తీకరణ నైపుణ్యం ఉండాలి. హావభావాల ద్వారానే  అత్యధిక శాతం కమ్యూనికేషన్‌ జరుగుతుంది. జీవితంలో బాడీ లాంగ్వేజ్‌ది ప్రధాన పాత్ర.  

తొలి ఇంటర్వ్యూ కాస్త ఒత్తిడితో కూడుకుని అభ్యర్థిని భయానికి గురి చేస్తుంది. ఇంటర్వ్యూకు ఎంత తయారైనా ఇంటర్వ్యూలో హావభావాల వ్యక్తీకరణ ఎంపికను నిర్ణయిస్తుంది. అసంకల్పితంగా నైనా బాడీ లాంగ్వేజ్‌ సెలెక్టర్ల దృష్టిలో పడుతుంది. 

కనుచూపు 

‘మాట్లాడేప్పుడు ఐ కాంటాక్ట్‌ మంచిది కదా’ అని అదేపనిగా కళ్ళలోకి చూస్తూ ఉండటం సరికాదు. ఐ కాంటాక్ట్‌లో సమతూకం అవసరం. అలా కాకుండా అదే పనిగా కళ్ళలోకి చూస్తూంటే అసహజంగా, ఎదుటి వారిని భయపెట్టినట్లు ఉంటుంది. 

ఒక మంచి ప్రవేశం

ఇంటర్వ్యూ గదిలోకి ప్రవేశించే పద్ధతిని సెలెక్టర్లు గమనిస్తుంటారు. ఆహార్యం, డ్రెస్‌ చేసుకునే విధానం, నడక..ఇవన్నీ వ్యక్తిత్వాన్ని తెలుపుతాయి. అందుకే నడకలో ఆత్మవిశ్వాసం ప్రదర్శించాలి. నర్వస్‌గా కనిపించకూడదు. ఇంటర్వ్యూ గదిలోకి చిరునవ్వుతో, ప్రశాంతంగా స్థిరంగా, ఠీవిగా, ఆత్మవిశ్వాసంతో నడవాలి. హడావిడిగా, ఆత్రంగా, అలసటగా ఇంటర్వ్యూ హాల్‌లోకి పరిగెడుతున్నట్లు వెళ్ళడం.. ఎంపికపై ప్రతికూల ప్రభావం చూపించవచ్చు. ఇంటర్వ్యూ హాల్‌కు తీసుకువెళ్ళేందుకు సంస్థ సహాయక సిబ్బంది వచ్చినపుడు వారిని అనుసరించాలి గానీ వారిని దాటి ముందుకు వెళ్ళకూడదు.

హావభావాలు

హావభావాలేవైనా అవి వ్యక్తి మనోభావాలకు అద్దం పడతాయి. వీటిని కప్పిపుచ్చడం సులభం కాదు. వాయిస్‌ మాడ్యులేషన్‌తో మేనేజ్‌ చేస్తూ చక్కగా మాట్లాడినా, అంతర్లీనంగా ఉన్న ఉద్దేశాలను హావభావాలు తెలియజేస్తాయి. ఆత్మవిశ్వాసంతో ఉన్నారా, బలహీనంగా ఉన్నారా అనేవి వెల్లడిస్తాయి. ఇంటర్వ్యూ పానెల్‌తో మాట్లాడేటపుడు పైకి చూస్తూనో, పక్కకో కిందకో చూస్తూనో మాట్లాడడం పెద్ద లోపం. ఎక్కువమంది సభ్యులు ప్యానెల్‌లో ఉంటే అందరినీ ఒక్కసారి పలకరిస్తున్నట్లు కళ్ళలోకి చూసి అటుపై ప్రశ్న అడిగిన అధికారి వైపు చూసి సమాధానమివ్వటం మేలు. ఎటో చూస్తూ ఇచ్చే సమాధానం ఆత్మన్యూనతకూ, అయిష్టతకూ గుర్తు. చూపులు ప్రశాంతంగా ఉంటూ, అందుకు తగిన భావవ్యక్తీకరణ జరిగేలా స్పందించాలి. కనుబొమ్మలు, పైకి కిందకూ కదిలించడం, నొసలు చిట్లించడం లాంటివి ఆశ్చర్యానికి గురౌతున్నారా, అపనమ్మకంతో ఉన్నారా అనేవి తెలియజేస్తాయి. 

శరీర భంగిమ  

ఇంటర్వ్యూ హాలులో మీరు కూర్చునే పద్ధతి, చేతులు, కాళ్ళు ఉంచే విధానం, ఇంటర్వ్యూ ముగిశాక బయటకు వెళ్ళేందుకు లేచి ఎలా నడుస్తున్నారన్నది ప్యానెల్‌ సభ్యులు గమనిస్తారు. వీలైనంతవరకు నిటారుగా కూర్చుని, కాస్త చిన్నగా ముందుకు వంగినట్లు కూర్చుంటే ఇతరులు చెప్పే విషయాలు శ్రద్ధగా, ఇష్టంగా వింటున్నారని అర్థమవుతుంది. హాలు నుంచి నిష్క్రమిస్తున్నపుడు చురుగ్గా, చకచకా, జాగ్రత్తగా నడవటం సరైనది.

సంజ్ఞలు  

ఇంటర్వ్యూలో ప్రశ్నలకు అతిగా స్పందించడం, చేతులు ఊపడం, తల ఊపడం చేయకూడదు. చేతులను నోటి దగ్గర పెట్టుకోవడం, అరచేతుల్ని రాచుకోవడం, పిడికిలి బిగించడం, మాట్లాడుతూనే నుదురు, తల సరిదిద్దుకోవడం ప్రతికూలమవుతుంది. సందర్భాన్ని బట్టి మాట్లాడే విషయానికి సంబంధించి కొన్ని హావభావాలు తప్పనిసరి. అవి తప్పకుండా చెయ్యాలి. వాటివల్ల అభ్యర్థిత్వానికి విలువ చేకూరుతుంది. ఆత్మవిశ్వాసాన్నీ ప్రతిబింబిస్తుంది. ఇతరులు చెప్పే విషయాలు వింటున్నప్పుడు శ్రద్ధగా తలపంకించడం, చిరునవ్వు నవ్వడం మంచి పద్ధతులు. ఈ చర్యలు అభ్యర్థి ఉత్సాహాన్నీ, శ్రద్ధనూ సెలక్టర్లకు తెలుపుతాయి. మాట్లాడే ప్రతిసారీ గొంతు సవరించుకోవడం, వేళ్ళతో టేబుల్‌పై చిన్నగా శబ్దం చెయ్యడం, కుర్చీలో అసహనంగా కదలడం నెగిటివ్‌ ప్రభావం చూపిస్తాయి.  

కరచాలనానికి సిద్ధంగా...

చేతిలో బ్రీఫ్‌ కేసో, ఫైలో ఉన్నప్పుడు వాటిని కుడి చేత్తో పట్టుకుంటే ఇంటర్వ్యూలో అధికారిని కలిసే సమయంలో చేతులు మార్చుకోవలసి ఉంటుంది. ఆ సమయంలో ఎదుటి వ్యక్తి ఆ కొద్దిసేపూ ఎదురుచూడాల్సివుంటుంది. ఇది సమర్థనీయం కాదు. కుడి చేతిని కరచాలనానికి సిద్ధంగా ఉంచటం మంచిది. 

చేతుల్ని గమనించాలి 

భావాలకు సంబంధించిన తొలి సంకేతాలు చేతుల ద్వారా తెలుస్తాయి. అభ్యర్థులు సౌకర్యంగా ఉన్నదీ లేనిదీ వారి ప్రమేయం లేకుండానే చేతులు తెలుపుతాయి. అందుకే కూర్చున్నప్పుడు చేతుల్ని తొడలపై పెట్టేసుకోవడం ఉత్తమం. ఒత్తిడి నుంచి బయటపడడానికి కొంతమంది అదే పనిగా చేతులు కదిలిస్తుంటారు. మాట్లాడేటప్పుడు చేతుల కదలిక కొంత అవసరమైనప్పటికీ స్నేహితులతో బంధువులతో మాట్లాడినట్టు ఇంటర్వ్యూ చేసే అధికారులతో మాట్లాడకూడదు. కొంత ఉత్సాహం ప్రదర్శిస్తే అది ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా ఉంటుంది.  

బాడీ లాంగ్వేజ్, మెరుగైన హావభావాలను కేవలం ఇంటర్వ్యూ కోసం సాధన చేస్తే అది అతికించినట్లుంటుంది. ఈ లక్షణాలు అభ్యర్థి వ్యక్తిత్వంలో భాగంగా, జీవన విధానంగా ఉండాలంటే కాలేజీలో చేరిన తొలినాళ్ళ నుంచే సాధన నిత్యకృత్యమవ్వాలి. అలాంటప్పుడే ఇంటర్వ్యూల్లోనూ, ఉద్యోగాల్లోనూ విజయం సాధించటం ఎంతో తేలిక!


 

*************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఏకాగ్రతతో ప్రిపరేషన్‌కు కొన్ని మెలకువలు

‣ ఇంజినీరింగ్‌ పూర్తయితే ఇదిగో ఆర్మీ ఉద్యోగం!

‣ భౌతికశాస్త్రంలో భళా!

Posted Date: 22-12-2021


 

ప్రజెంటేషన్‌

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 
 

విద్యా ఉద్యోగ సమాచారం