• facebook
  • twitter
  • whatsapp
  • telegram

సామర్థ్యాలపై సరైన అంచనా అవసరం

ప్రభుత్వ ఉద్యోగ పోటీ పరీక్షల సన్నద్ధత మెలకువలు

ఏ విద్యార్థులైనా ఉన్నతమైన కెరియర్‌నే ఆశిస్తారు. ఉన్నతాధికారులుగా మంచి హోదాను అందుకోవాలని కలలు కంటారు. దీనికోసం జాతీయస్థాయి పరీక్షల్లో పోటీ పడటానికి సిద్ధమవుతారు. సివిల్‌ సర్వీస్‌ అయినా, రక్షణ రంగమైనా.. వాటికి తగ్గ అభిరుచి, కనీస సామర్థ్యాలు తమలో ఉన్నాయో లేవో బేరీజు వేసుకుని ముందుకు సాగాలి. ఆపై తపనతో, దీక్షతో అవిరళ కృషి చేస్తే ఫలితం సిద్ధిస్తుంది. 

‘సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షకు గట్టిగా ప్రిపేరయితే దేశంలో అత్యున్నత ఉద్యోగాల్లో చేరే అద్భుత అవకాశం లభిస్తుంది. ఎంపిక కాకపోయినా, దిగువస్థాయి సర్వీసులు వచ్చినా గ్రూప్‌-1 లాంటి ఉద్యోగాలు రాసి కచ్చితమైన విజయాన్ని సాధించవచ్చు. తద్వారా రాష్ట్ర స్థాయిలో ఉన్నత ఉద్యోగాలు పొందవచ్చు’-  చాలామంది తల్లిదండ్రులతో పాటు ఇంటర్మీడియట్‌ స్థాయి నుంచే విద్యార్థుల్లో కలుగుతున్న ఆలోచన. చిన్న వయసులోనే సివిల్స్‌పై అవగాహన ఏర్పరుచుకుంటే ఆ పరీక్షకు కావలసిన దృక్పథాన్ని ఏర్పరచుకోవచ్చనేది నిజమే. 

‘గ్రాడ్యుయేషన్‌ తర్వాత 1, 2 సంవత్సరాల కృషితో ఒకటి రెండు ప్రయత్నాల్లో అనుకున్న సర్వీస్‌ సాధించవచ్చు’ అనే ఆశావహమైన ఉద్దేశం ఉండటం తప్పేమీ కాదు. అయితే తగిన జాగ్రత్తలు పాటించినప్పుడు మాత్రమే ఇది ఆచరణయోగ్యం అవుతుంది. లేకపోతే సత్ఫలితాలను ఇవ్వదు.  

సాంకేతిక విద్య సంగతి....

ఇటీవలి కాలంలో బీటెక్‌/ బీఈ పట్టాతో ఎక్కువమంది గ్రాడ్యుయేట్లు కళాశాలల నుంచి బయటకు వస్తున్నారు. సాఫ్ట్‌వేర్‌ రంగం పుణ్యమా అని గుర్తించదగిన స్థాయిలో ఉద్యోగాలు పొందుతున్నారు. ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్లు సివిల్స్‌ వైపు మొగ్గు చూపుతుండటం ఇటీవలి పరిణామంగా చెప్పవచ్చు. ఒకవేళ సివిల్స్‌లో విజయవంతం కాకపోయినా తమ డిగ్రీ మూలంగా ఉపాధికి ఢోకా ఉండకపోవటం వీరి విషయంలో అనుకూలాంశం. 

అయితే.. ఇప్పటికీ మన సాంకేతిక కళాశాలల్లో జ్ఞాన సంబంధమైన విషయ బోధనకే ప్రాధాన్యం లభిస్తోంది. అంతేకానీ ఇంటర్న్‌షిప్స్, అసైన్‌మెంట్స్, ప్రాక్టికల్‌ బోధన, ఇండస్ట్రీ అనుసంధానం విషయంలో సాంకేతిక విద్యను అభ్యసిస్తున్న అభ్యర్థుల్లో వెనుకబాటుతనం అధికంగా ఉంది. అందువల్ల ఇతర దేశాల్లో ఉద్యోగం చేస్తున్న సాంకేతిక నిపుణుల్లో చాలామంది దిగువ అంచె ఉద్యోగాలనే చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో సాంకేతిక విద్యను అభ్యసిస్తున్న అభ్యర్థులను కూడా సివిల్స్‌ వైపు పయనింపచేసేలా కొన్ని కళాశాలల్లో కోర్సులను తయారుచేస్తున్నారు. బీటెక్‌ కోర్సుల్లో సివిల్‌ సబ్జెక్టుల అనుసంధానం మూలంగా ప్రతిభావంతులైన విద్యార్థులు రాణించగలరు. కానీ మిగతా అభ్యర్థులు అటు శాస్త్ర సాంకేతిక విషయాలపై పట్టు సాధించలేరు. ఇటు సివిల్స్‌ సన్నద్ధతపైనా దృష్టి పెట్టలేకపోతున్నారు. 

ప్రత్యామ్నాయం తప్పనిసరి

సివిల్స్‌ పరీక్షలకు దరఖాస్తు చేసినవారిలో 1 కంటే తక్కువ శాతం మంది మాత్రమే అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతున్నారు. ఈ తరహా పరీక్షలకు సమయం వెచ్చించేటపుడు ప్రత్యామ్నాయం (ప్లాన్‌-బి) తప్పనిసరిగా చూసుకోవాలనేది నిపుణుల సలహా.   

ముఖ్యంగా పేద, బలహీన వర్గాల వారు, దిగువ మధ్యతరగతి వర్గాల వారు గ్రాడ్యుయేషన్‌ పూర్తయిన వెంటనే సంపాదన సాధ్యమయ్యే పరిస్థితి ఉంటేనే జీవితంలో నిలబడగలరు. గ్రాడ్యుయేషన్‌ ముగిసిన తరువాత కనీసం రెండు ప్రయత్నాలు లేకుండా ఉద్యోగాలు సాధించినవారి సంఖ్య తక్కువ. 2021లో సివిల్స్‌లో విజేతలైనవారిలో అత్యధికులు రెండు లేదా మూడు ప్రయత్నాల ద్వారా మాత్రమే సివిల్స్‌ ఉద్యోగం సాధించారు. అంటే గ్రాడ్యుయేషన్‌ పూర్తయిన తరువాత కనీసం రెండు మూడు సంవత్సరాలు ప్రిపేర్‌ అయ్యేందుకు కావలసిన ఆర్థిక బలం ఉన్నప్పుడే ఈ తరహా ప్రిపరేషన్‌ విజయవంతం అవుతుంది. అందుకే..అన్ని విద్యాసంస్థలూ తమ కోర్సుల్లో వృత్తివిద్యను ఏకీకృతం చేయాల్సిన అవసరం ఉందని జాతీయ విద్యావిధానం- 2020 సూచించింది.

కనీస సామర్థ్యాల అంచనా

కొంతమంది తల్లిదండ్రులు తమ బిడ్డల గ్రహణ సామర్థ్యం, విశ్లేషణ శక్తి, సామాజిక అనుభవం (ssocial exposure), జ్ఞాపకశక్తి సామర్థ్యం, విషయ సమర్పణ (content presentation) లాంటి కనీస సామర్థ్యాలను అంచనా వేయకుండా సివిల్స్‌ పరీక్షకు వారిని ప్రేరేపించి ఇంటర్, డిగ్రీ స్థాయి నుంచే కోచింగ్‌ను ప్రారంభిస్తున్నారు. దాంతో వారిపై విపరీతమైన ఒత్తిడి ఉంటోంది. ఆచరణకు సాధ్యమయ్యే లక్ష్యాలను ఏర్పరచుకుంటేనే సత్ఫలితాలు లభిస్తాయి. సివిల్స్‌ పరీక్షలో విజయం సాధించాలంటే అభ్యర్థుల్లో విషయ పరిజ్ఞానంతో పాటు విషయాన్ని సమర్పించే నిపుణత అనేది కీలక పాత్ర పోషిస్తుందని గ్రహించాలి. 

విద్యార్థుల అభిరుచి, ఆసక్తులతో సంబంధం లేకుండా ఇంటర్, డిగ్రీల్లో ఆర్ట్‌ సబ్జెక్టులు చదివించినా, సైన్స్‌ సబ్జెక్టులు చదివించినా రాణించలేరు. అరకొర పరిజ్ఞానం సాధించటం వల్ల కెరియర్‌కు ప్రయోజనం ఉండదు. ఆర్ట్స్‌.. సైన్స్‌- ఏ నేపథ్యం ఉన్నవారైనా సివిల్స్‌ను లక్ష్యం చేసుకుని, తగిన కృషి చేస్తే విజయం సాధించవచ్చు. అదే సమయంలో వీరు తాము చదివే డిగ్రీని నిర్లక్ష్యం చేయకూడదనే విషయం విస్మరించకూడదు.

ఇంటర్‌ స్థాయి నుంచే... 

సివిల్స్‌ పరీక్షలో ఆర్ట్స్‌ విభాగానికి చెందిన చరిత్ర, భౌగోళిక వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ, రాజ్యాంగ, రాజకీయ వ్యవస్థ, సామాజిక అంశాలు, సాంస్కృతిక అంశాలు, నైతిక విలువలు, న్యాయ శాస్త్ర అంశాలకు అధిక ప్రాధాన్యం ఉంది. అదే రీతిలో సైన్స్‌ విభాగానికి చెందిన శాస్త్ర సాంకేతిక విషయాలు, పర్యావరణం, అంక గణిత సామర్థ్యాలు, డేటా విశ్లేషణ..ఇతర అంశాలకు కూడా ప్రాధాన్యం పెరిగింది. అందువల్ల ఈ అన్ని విషయాలపై పట్టు పెంచుకుంటే విజయావకాశాలు పెరుగుతాయి. సివిల్స్‌ను లక్ష్యంగా చేసుకోదలచినవారు వీటిని గమనించటం చాలా అవసరం.   

కొందరు విద్యార్థులకు గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ లాంటి సబ్జెక్టులపై ఎంతో ఆసక్తి ఉంటుంది. వాటిని పట్టించుకోకుండా సివిల్స్‌ దృష్టితో ఆర్ట్స్‌ సబ్జెక్టుల అధ్యయనానికి ఇంటర్‌ స్థాయి నుంచే బలవంతంగా నెడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఫలితంగా వారు ఆర్ట్స్‌ సబ్జెక్టులపై ఆసక్తి పెంచుకోలేక, పట్టు సాధించుకోలేక సతమతమవుతూ అదే చట్రంలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేస్తున్నారు. ఇలాంటివారు అంతిమంగా సివిల్స్‌ పరీక్షలో రాణించటం కష్టం. ఈ విద్యార్థులు తమకిష్టమైన సబ్జెక్టులను ఇంటర్మీడియట్, డిగ్రీల్లో ఎంచుకున్నట్లయితే వారు ఏదో రకమైన వృత్తిపర నైపుణ్యం పొందే అవకాశం ఉంటుంది. ఒకవేళ సివిల్స్‌ పరీక్షలో రాణించలేకపోయినా తప్పనిసరిగా జీవితంలో మెరుగైన రీతిలో స్థిరపడతారు. 

మనదేశంలో ఆర్ట్స్‌ ఆధారిత సబ్జెక్టుల అధ్యయనం వల్ల ఉద్యోగాలు పొందే అవకాశాలు తక్కువ. అందులోనూ సాధారణ గ్రాడ్యుయేషన్‌ చేస్తే కనీస జీతాలు ఇచ్చే ఉద్యోగాలు పొందడం కూడా కష్టం. ఇలాంటి పరిస్థితుల్లో ఆసక్తి లేని విద్యార్థుల చేత ఆర్ట్స్‌ సబ్జెక్టులతో ఇంటర్, డిగ్రీలు చదివించి సివిల్స్‌ పరీక్ష రాయించటం వల్ల అనుకూల ఫలితాలకు ఆస్కారం ఉండటం లేదు. విఫలమైన సందర్భాల్లో ఆయా అభ్యర్థుల భవిష్యత్తు గందరగోళంగా మారే అవకాశాలు ఉన్నాయి.  

గమనించదగ్గ విషయాలు 

విద్యార్థుల సహజ సామర్థ్యాలను ముందుగా గుర్తించాలి. అందుకోసం అవసరమైతే నిపుణులను సంప్రదించాలి. విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణమైన కోర్సులను ఇంటర్‌లో, డిగ్రీలో ఎంపిక చేయటం సముచితం. .

విద్యార్థుల జ్ఞాపకశక్తి, విషయ సమర్పణ, గ్రహణ సామర్థ్యం మొదలైన సామర్థ్యాలను శాస్త్రీయంగా అంచనా వేయించాలి.

విద్యార్థుల అభిరుచులను స్పష్టంగా గుర్తించి ప్రోత్సహించాలి…. ఇతర విద్యార్థులు సాధించారన్న కారణంతోనో, తమ ఆశయమన్న పేరుతోనో తల్లిదండ్రులు విద్యార్థులకు ఆసక్తి లేని కోర్సుల్లో చేర్పించటం సరికాదు. 

సివిల్స్‌లో గానీ, అలాంటి మరో పరీక్షలో గానీ నెగ్గలేకపోతే ప్రత్యామ్నాయ భవిష్యత్‌ జీవితం ఎలా ఉంటుంది? ఈ కోణంలోనూ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.

బలపడుతున్న ప్రైవేటు రంగంలో కూడా ఆకర్షణీయమైన ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయనేది ఓ వాస్తవం.  

వృత్తిపరమైన నైపుణ్యాలు పెంచే కోర్సులు ఇంటర్, డిగ్రీలో ఎంపిక చేసుకునేలా చేసి ఆపై అభిరుచుల మేరకు సివిల్స్‌ పరీక్ష రాసే ప్రణాళికను అనుసరించటం ఆచరణీయం.

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఎస్‌ఓపీ ఎలా రాయాలి?

‣ ఆధునిక వసతులు అత్యుత్తమ బోధన!

‣ విద్యార్థినులకు డీఆర్‌డీఓ ఆర్థిక చేయూత

‣ ఐటీ సంస్థల్లో ఆఫ్‌ క్యాంపస్‌ నియామకాల జోరు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 28-02-2022 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌