• facebook
  • twitter
  • whatsapp
  • telegram

5 వేల‌కుపైగా సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ ఉద్యోగాలు

ప్రిప‌రేష‌న్ విధానం 

 ఎస్ఎస్‌సీ నోటిఫికేష‌న్‌

కేంద్రంలోని వివిధ శాఖలు, విభాగాల్లో పలు పోస్టుల నియామకానికి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) ప్రకటన వెలువరించింది. ఆన్‌లైన్‌ పరీక్షలో చూపే ప్రతిభతో ఉద్యోగాల్లోకి తీసుకుంటారు. కొన్ని పోస్టులకు అదనంగా స్కిల్‌ టెస్టు ఉంటుంది. పది, ఇంటర్, డిగ్రీ విద్యార్హతలతో వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు! 


కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని రాజధానులు, నగరాలు, ముఖ్య పట్టణాల్లో ఎన్నో శాఖలు ఉన్నాయి. ఇవన్నీ వేటికవే ప్రత్యేకమైనవి. అందువల్ల వీటిలో సేవలందించడానికి భిన్న విద్యార్హతలు, నైపుణ్యాలు అవసరం. ఇందుకోసం అవసరమైన మానవవనరులను ఎంపిక చేయడానికి ఎస్‌ఎస్‌సీ ఏటా సెలక్షన్‌ టెస్టు నిర్వహిస్తోంది. పది, ఇంటర్, డిగ్రీ, ఫార్మసీ, నర్సింగ్, టైపింగ్, స్టెనో... ఇలా భిన్న విద్యార్హతలు, నైపుణ్యాలు ఈ పోస్టులకు అవసరం. 


పదో తరగతి విద్యార్హతతో.. స్టోర్‌ అటెండెంట్, వర్క్‌షాప్‌ అటెండెంట్, లైబ్రరీ అటెండెంట్, ఎస్‌వైసీఈ, లేబొరేటరీ అటెండెంట్, లష్కర్, ఫైర్‌ మ్యాన్, మెడికల్‌ అటెండెంట్, టోపాస్‌ పోస్టులు భర్తీ చేస్తారు. వీటికి పరీక్షతో నియామకాలుంటాయి. ఎంపికైతే లెవెల్‌-1 వేతనం దక్కుతుంది. వీరు సుమారు రూ.30వేలు పొందవచ్చు. 


ఇంటర్మీడియట్‌/ గ్రాడ్యుయేషన్‌/ సంబంధిత విభాగాల్లో విద్యతో.. స్టోర్‌ క్లర్క్, స్టెనో గ్రాఫర్‌ గ్రేడ్‌-2, లేబొరేటరీ అసిస్టెంట్, డార్క్‌ రూమ్‌ అసిస్టెంట్, అకౌంటెంట్, సీనియర్‌ లేబొరేటరీ అసిస్టెంట్, కోర్టు మాస్టర్, టెక్నికల్‌ సూపర్‌వైజర్, మెకానిక్, ఫార్మసిస్ట్, నర్సింగ్‌ ఆఫీసర్, ఆయుర్వేదిక్‌ ఫార్మసిస్ట్, సీనియర్‌ సైంటిఫిక్‌ అసిస్టెంట్, ఫార్మ్‌ అసిస్టెంట్, టెక్నికల్‌ సూపరింటెండెంట్, ఇన్‌స్ట్రక్టర్, టెక్నికల్‌ ఆపరేటర్, సీనియర్‌ సైంటిఫిక్‌ అసిస్టెంట్, ఇంజిన్‌ డ్రైవర్, లైబ్రరీ అసిస్టెంట్, జూనియర్‌ కెమిస్ట్, కన్జర్వేషన్‌ అసిస్టెంట్, ఏఎన్‌ఎం, ఎంఎల్‌టీ, అసిస్టెంట్‌ ఫొటోగ్రాఫర్, అసిస్టెంట్, స్టోర్‌ కీపర్‌...తదితర పోస్టులను భర్తీ చేస్తారు. 


అన్ని పోస్టులకూ పరీక్షలో ఉత్తీర్ణత తప్పనిసరి. కొన్ని పోస్టులకు పరీక్షతోపాటు టైపింగ్, డేటా ఎంట్రీ, కంప్యూటర్‌ లిటరసీల్లో ఎందులోనైనా స్కిల్‌ టెస్టు ఉండవచ్చు.  

పరీక్ష ఇలా 
పరీక్ష ఆన్‌లైన్‌లో ఆబ్జెక్టివ్‌ విధానంలో నిర్వహిస్తారు. ప్రశ్నాంశాలు అందరికీ ఒకటే. పోస్టును బట్టి ప్రశ్నల కఠినత్వం, స్థాయిలో మార్పులు ఉంటాయి. పరీక్షలో జనరల్‌ ఇంటెలిజెన్స్, జనరల్‌ అవేర్‌నెస్, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ (బేసిక్‌ అరిథ్‌మెటిక్‌ స్కిల్‌), ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ (బేసిక్‌ నాలెడ్జ్‌) విభాగాల్లో 25 చొప్పున వంద ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు. మొత్తం ప్రశ్నపత్రం 200 మార్కులకు ఉంటుంది. తప్పు సమాధానానికి అర మార్కు తగ్గిస్తారు. పరీక్ష వ్యవధి గంట. పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఆ పైస్థాయి... ఇలా విద్యార్హతల ప్రకారం ప్రశ్నపత్రం రూపొందిస్తారు.  

విభాగాల వారీగా
జనరల్‌ ఇంటెలిజన్స్‌: వెర్బల్, నాన్‌ వెర్బల్‌ రెండు రకాల ప్రశ్నలూ వస్తాయి. పోలికలు భేదాలు, స్పేస్‌ విజువలైజేషన్, ప్రాబ్లమ్‌ సాల్వింగ్, ఎనాలిసిస్, జడ్జిమెంట్, డెసిషన్‌ మేకింగ్, విజువల్‌ మెమరీ, రిలేషన్‌షిప్‌ కాన్సెప్ట్స్, ఫిగర్‌ క్లాసిఫికేషన్, అరిథ్‌మెటిక్‌ నంబర్‌ సిరీస్‌.. మొదలైన విభాగాల నుంచి వీటిని అడుగుతారు. సంఖ్యలు, అంకెలు, చిత్రాలు, గ్రాఫ్‌లపైనే ఎక్కువ ప్రశ్నలు వస్తాయి. గణితంలోని ప్రాథమికాంశాలు, సూత్రాలు, అనువర్తనంపై పట్టు సాధించడం ద్వారా వీటికి సమాధానాలు గుర్తించవచ్చు.  


జనరల్‌ అవేర్‌నెస్‌: పర్యావరణం, సమాజంపై ముడిపడి ఎక్కువ ప్రశ్నలు వస్తాయి. రోజువారీ సంఘటనలు/ వర్తమానాంశాలకూ ప్రాధాన్యం ఉంది. ఈ విభాగంలోని ప్రశ్నలకు ప్రత్యేక ప్రావీణ్యం అవసరం లేదు. సాధారణ పరిజ్ఞానంతోనే చాలావరకు ప్రశ్నలకు జవాబులు గుర్తించవచ్చు. ఎక్కువ ప్రశ్నలు దైనందిన జీవితం నుంచే ఉంటాయి. వీటితోపాటు భారత్‌- పొరుగు దేశాలు, క్రీడలు, చరిత్ర, సంస్కృతి, భూగోళం, ఆర్థిక వ్యవహారాలు, పాలిటీ, సైన్స్‌ అంశాల నుంచీ ప్రశ్నలు వస్తాయి. హైస్కూల్‌ సోషల్, సైన్స్‌ పాఠ్యపుస్తకాలు బాగా చదువుకుంటే సరిపోతుంది. వర్తమాన వ్యవహారాల ప్రశ్నలు ఎదుర్కోవడానికి పరీక్ష తేదీకి 9 నెలల వెనుక నుంచి ముఖ్యాంశాలను మననం చేసుకోవాలి.


క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌: నంబర్‌ సిస్టమ్, పూర్ణ సంఖ్యలు, భిన్నాలు, శాతాలు, అంకెల మధ్య సంబంధం, నిష్పత్తి, సరాసరి, లాభనష్టాలు, కాలం-పని, కాలం-దూరం, వయసు నిర్ణయించడం, రైళ్లు, పడవ వేగాలు, క.సా.గు., గ.సా.భా., వైశాల్యాలు, ఘనపరిమాణాలు మొదలైన అంశాల్లో ప్రశ్నలు వస్తాయి. వీటిలో దాదాపు అన్ని అంశాలూ హైస్కూల్‌ మ్యాథ్స్‌ పుస్తకాల్లోనివే. వాటిని బాగా చదువుకుని వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేస్తే సరిపోతుంది.


జనరల్‌ ఇంగ్లిష్‌: అభ్యర్థి ప్రాథమిక ఆంగ్ల పరిజ్ఞానాన్ని పరిశీలించేలా ప్రశ్నలు వస్తాయి. ఖాళీలు పూరించడం, వాక్యంలో తప్పును గుర్తించడం, సమానార్థాలు, వ్యతిరేక పదాలు, తప్పుగా ఉన్న పదాన్ని గుర్తించడం, జాతీయాలు, సామెతలు, ప్రత్యక్ష, పరోక్ష వాక్యాలుగా మార్చడం, వాక్యంలో పదాలను క్రమ పద్ధతిలో అమర్చడం, కాంప్రహెన్షన్‌..తదితర విభాగాల్లో ప్రశ్నలు వస్తాయి. హైస్కూల్‌ స్థాయి ఆంగ్ల పాఠ్యపుస్తకాల్లోని వ్యాకరణాంశాలు బాగా చదువుకుంటే ఎక్కువ మార్కులు సాధించడం కష్టమేమీ కాదు. 


పైన పేర్కొన్న అంశాలు పదో తరగతి విద్యార్హతతో నిర్వహించే పోస్టులకు సంబంధించినవి. అదే ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్‌ అర్హతలతో నిర్వహించే పరీక్షలకు ఇవే అంశాల్లో ప్రశ్నల స్థాయి కఠినంగా ఉంటుంది. అదనంగా మరికొన్ని అంశాలనూ చదవాలి. 


పరీక్షలో అర్హత సాధించాలంటే.. జనరల్‌ అభ్యర్థులు 30 శాతం, ఓబీసీ/ఈడబ్ల్యుఎస్‌లు 25 శాతం, ఇతర విభాగాల వారు 20 శాతం మార్కులు పొందాలి. తర్వాతి దశ పరీక్షకు ఎంపిక కావడానికి 5 కంటే తక్కువ ఖాళీలున్న పోస్టులైతే ఒక్కో దానికీ 30 మందిని, 5 కంటే ఎక్కువ ఖాళీలు ఉంటే 15 మందిన చొప్పున తీసుకుంటారు. 


 

గమనించండి! 

ఆన్‌లైన్‌ దరఖాస్తులు: మార్చి 27 వరకు స్వీకరిస్తారు.

దరఖాస్తు ఫీజు: రూ.వంద. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు చెల్లించనవసరం లేదు. 

పరీక్షలు: జూన్‌-జులైల్లో నిర్వహిస్తారు. 

కేంద్రాలు: తెలంగాణలో.. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్‌. ఏపీలో.. కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, చీరాల, కడప, గుంటూరు, కాకినాడ, నెల్లూరు, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయనగరం.

వయసు: జనవరి 1, 2023 నాటికి 18 ఏళ్లు నిండాలి. పోస్టును బట్టి 25/27/30 ఏళ్లలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు  మినహాయింపు లభిస్తుంది. 


పుస్తకాలు

అభ్యర్థులు తమకు సౌకర్యవంతమైన రచయిత, పబ్లిషర్ల పుస్తకాలను ఎంచుకోవచ్చు. ఒక్కో విభాగం నుంచి ఒక పుస్తకాన్నే వీలైనన్ని సార్లు చదివితే మేలు. ఆబ్జెక్టివ్‌ ఇంగ్లిష్‌ - టాటా మెక్‌ గ్రాహిల్స్‌ లేదా చాంద్‌ పబ్లికేషన్స్, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ ఫర్‌ కాంపిటీటివ్‌ ఎగ్జామ్స్‌- ఆర్‌.ఎస్‌.అగర్వాల్, జనరల్‌ నాలెడ్జ్‌ - లూసెంట్స్‌ తీసుకోవచ్చు. 


వంద ప్రశ్నలు. మొత్తం వ్యవధి 3600 సెకన్లు. అంటే ప్రతి ప్రశ్నకూ 36 సెకన్ల సమయమే అందుబాటులో ఉంటుంది. క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ ప్రశ్నలకు సమాధానం గుర్తించడానికి ఎక్కువ సమయం అవసరం. అలాగే దీని తర్వాత జనరల్‌ ఇంటెలిజెన్స్‌ ప్రశ్నలకు సమయం సరిపోదు. అందువల్ల జనరల్‌ అవేర్‌నెస్, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌లను వీలైనంత తక్కువ వ్యవధిలో పూర్తిచేసుకుని, అక్కడ మిగిల్చిన సమయాన్ని క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్, జనరల్‌ ఇంటెలిజెన్స్‌కు కేటాయించుకోవాలి. 


సన్నద్ధత 

1 సిలబస్‌ వివరాలు ప్రకటనలో పేర్కొన్నారు. వాటిని ప్రాధాన్యం అనుసరించి అధ్యయనం చేయాలి. 

2 తాజా అభ్యర్థులు ప్రాథమికాంశాల నుంచి సన్నద్ధత ప్రారంభించాలి. అనంతరం సంబంధిత అంశంలో వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధించాలి. 

3 పాత ప్రశ్నపత్రాలను పరిశీలించడం అధ్యయనంలో మార్గదర్శిగా భావించాలి. వీటిని గమనిస్తే.. ప్రతి విభాగంలోనూ అన్ని అంశాల నుంచీ ప్రశ్నలు వస్తున్నాయి. అందువల్ల అన్ని విభాగాలూ చదువుకుంటూ ఎక్కువ ప్రశ్నలు వస్తోన్న అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. పరీక్షలో వాటికి లభిస్తోన్న ప్రాధాన్యం గుర్తించి సమయం కేటాయించుకోవాలి. 

4 పాత ప్రశ్నపత్రాలను పరిశీలించినప్పుడు.. ప్రశ్నలు ఏ స్థాయిలో అడుగుతున్నారు, సన్నద్ధత ఎలా ఉంది, ఏ అంశాలను మరింత లోతుగా అధ్యయనం చేయాలి, వేటికి ఎంత సమయం కేటాయించాలి...మొదలైనవి తెలుసుకోవచ్చు.  

5 పరీక్షలకు నెల రోజుల ముందు నుంచి కనీసం రోజుకి ఒకటైనా మాక్‌ పరీక్షలు రాయాలి. జవాబులు సరిచూసుకుని తుది సన్నద్ధతను అందుకు అనుగుణంగా మలచుకోవాలి. కష్టంగా అనిపిస్తోన్న విభాగానికి అదనంగా సమయాన్ని కేటాయించుకోవాలి.   

6 క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ విభాగం ప్రశ్నలు సాధించడానికి ఎక్కువ సమయం అవసరమవుతుంది. పరీక్షకు ముందు వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధించడం ద్వారా వేగంగా గణించడం అలవడుతుంది. 

7 వర్తమాన వ్యవహారాలకు.. వివిధ రంగాల్లో జాతీయం, అంతర్జాతీయంగా జరుగుతోన్న ముఖ్య పరిణామాలను నోట్సు రాసుకోవాలి. ఈ విభాగంలో అవార్డులు, పురస్కారాలు, వార్తల్లో వ్యక్తులు, నియామకాలు, పుస్తకాలు-రచయితలు, తాజా పరిశోధనలు బాగా చదవాలి. ఇటీవల జరిగిన క్రీడలపై అధిక దృష్టి సారించాలి. 


వెబ్‌సైట్‌: https://ssc.nic.in/

మరింత సమాచారం... మీ కోసం!

‣ సీఎంఐ కోర్సుల‌తో పెద్ద ప్యాకేజీలు!

‣ అగ్నివీరుల‌కు ఆర్మీ ఆహ్వానం!

‣ ఫార్మసీలో పీజీకి జీప్యాట్‌!

‣ మహిళలకు యూనిఫామ్‌ సర్వీసెస్‌ కోర్సులు!

‣ ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలంటే ఏంచేయాలి?

Posted Date : 13-03-2023 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌