• facebook
  • whatsapp
  • telegram

సీఎంఐ కోర్సుల‌తో పెద్ద ప్యాకేజీలు!

బీఎస్సీ, ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ అడ్మిష‌న్లకు నోటిఫికేష‌న్‌

నిర్దిష్టంగా కొన్ని సబ్జెక్టుల కోసమే ప్రత్యేకంగా సంస్థలను ఏర్పాటు చేశారు. అలాంటివాటిలో చెన్నై మ్యాథమెటికల్‌ ఇన్‌స్టిట్యూట్‌ (సీఎంఐ) ఒకటి. ఇక్కడ మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్‌ సైన్స్‌ల్లో బీఎస్సీ, ఎమ్మెస్సీ, పీహెచ్‌డీలతోపాటు ఎమ్మెస్సీ డేటాసైన్స్‌నూ అందిస్తున్నారు. వీటిలో ప్రవేశానికి ప్రకటన వెలువడింది. పరీక్షలో చూపే ప్రతిభతో ప్రవేశం లభిస్తుంది. పేద విద్యార్థులకు ఫీజు మినహాయింపు, ప్రతిభావంతులకు స్టైపెండ్‌ అందిస్తున్నారు. 

మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కంప్యూటర్‌ సైన్స్, డేటా సైన్స్‌ కోర్సుల్లో చేరాలనుకున్నవారు, పరిశోధనల దిశగా అడుగులేయాలనుకున్నవారు సీఎంఐలో చేరడానికి అధిక  ప్రాధాన్యం ఇవ్వవచ్చు. ఇక్కడ బోధన ప్రమాణాలు, పరిశోధన వనరులు మెరుగ్గా ఉంటాయి. దేశంలో ప్రసిద్ధ సంస్థలతోపాటు విదేశాల నుంచి నిపుణులు వచ్చి సీఎంఐ విద్యార్థులకు బోధిస్తారు. 


ఇన్ఫోసిస్, టీసీఎస్, మైక్రోసాఫ్ట్, శ్రీరాం గ్రూప్‌... తదితర కార్పొరేట్‌ సంస్థలతోపాటు కేంద్రానికి చెందిన డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ అటామిక్‌ ఎనర్జీ, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ దీనికి నిధులు అందిస్తున్నాయి. యూజీసీ 2006లో ఈ సంస్థకు యూనివర్సిటీ హోదా ఇచ్చింది. ఇక్కడి విద్యార్థులు దేశీయంగానే కాకుండా ప్రపంచ స్థాయి సంస్థల్లో బోధన, పరిశోధనలో గొప్ప అవకాశాలు సొంతం చేసుకుంటున్నారు. 


గత ఏడాది ప్రాంగణ నియామకాల్లో గరిష్ఠంగా రూ.62 లక్షల ప్యాకేజీ లభించింది. సగటున రూ.16 లక్షల వార్షిక వేతనం సీఎంఐలో చదువుకున్నవారు పొందుతున్నారు. ఇంటర్న్‌షిప్పులో రూ.80వేల వరకు స్టైపెండ్‌ అందుతోంది.  


ఫీజు..ఫెలోషిప్పులు


అన్ని కోర్సులూ రెసిడెన్షియల్‌ విధానంలో అందిస్తున్నారు. అన్ని కోర్సులకు ట్యూషన్‌ ఫీజు ప్రతి సెమిస్టర్‌కు రూ.1.25 లక్షలు చెల్లించాలి. ఎమ్మెస్సీ డేటా సైన్స్‌కు రూ.2.5 లక్షలు. విద్యార్థుల ఆర్థిక నేపథ్యం బట్టి అన్ని కోర్సుల్లోనూ పూర్తిగా లేదా పాక్షికంగా ఫీజు మినహాయింపు లభిస్తుంది. అలాగే ప్రతిభావంతులకు యూజీ కోర్సులకు ప్రతి నెలా రూ.5000 ఫెలోషిప్‌ చెల్లిస్తారు. ఎమ్మెస్సీ కోర్సులైతే రూ.6000 అందిస్తారు. పీహెచ్‌డీలకు మొదటి రెండేళ్లూ నెలకు రూ.31,000 తర్వాత మూడేళ్లు రూ.35,000 చెల్లిస్తారు. పీహెచ్‌డీలో చేరి, ప్రాంగణంలో వసతి సౌకర్యం పొందనివారు స్టైపెండ్‌లో 24 శాతం హెచ్‌ఆర్‌ఏ అందుకోవచ్చు. వీరికి ఏటా బుక్‌ గ్రాంట్‌ రూ.పదివేలు ఇస్తారు.


ప్రవేశం ఎలా?


అన్ని కోర్సుల్లోనూ పరీక్షలో చూపిన ప్రతిభతో ప్రవేశం కల్పిస్తారు. నేషనల్‌ ఒలింపియాడ్‌ల్లో ప్రతిభ చూపినవారికి నేరుగా యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు అవకాశం ఉంటుంది. పీజీ, పీహెచ్‌డీలకు పరీక్షలతోపాటు ఇంటర్వ్యూలూ ఉంటాయి. ఫిజిక్స్‌లో పీహెచ్‌డీకి పరీక్ష నిర్వహించరు. జాయింట్‌ ఎంట్రన్స్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌ (జెస్ట్‌) స్కోరుతో నేరుగా ఇంటర్వ్యూకి అవకాశం కల్పిస్తారు. అలాగే మ్యాథ్స్‌లో పీహెచ్‌డీ చేయాలనుకున్నవారు నేషనల్‌ బోర్డు ఫర్‌ హయ్యర్‌ మ్యాథమెటిక్స్‌ (ఎన్‌బీహెచ్‌ఎం) ఫెలోషిప్పునకు ఎంపికైతే పరీక్ష రాయకుండా నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు. ఇదే మాదిరిగా జస్ట్‌తో కంప్యూటర్‌ సైన్స్‌లో రిసెర్చ్‌ అర్హత పొందినవారు సైతం నేరుగా ఇంటర్వ్యూతో ప్రవేశం పొందవచ్చు. 


కోర్సులు.. అర్హతలు 

బీఎస్సీ ఆనర్స్‌: మ్యాథ్స్‌ అండ్‌ కంప్యూటర్‌ సైన్స్‌; మ్యాథ్స్‌ అండ్‌ ఫిజిక్స్‌

అర్హత: ఇంటర్‌ ఉత్తీర్ణులు, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 

ఎమ్మెస్సీ: మ్యాథ్స్, కంప్యూటర్‌ సైన్స్, డేటా సైన్స్‌

అర్హత: డిగ్రీలో మ్యాథ్స్‌ లేదా బీస్టాట్‌ లేదా బీటెక్‌ చదువుకున్నవారు ఎమ్మెస్సీ మ్యాథ్స్‌కు అర్హులు. కంప్యూటర్‌ సైన్స్‌ బ్యాక్‌గ్రౌండ్‌తో బీఎస్సీ, బీటెక్‌ కోర్సులు చదివినవారు ఎమ్మెస్సీ కంప్యూటర్‌ సైన్స్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. మ్యాథ్స్, స్టాటిస్టిక్స్‌ లేదా కంప్యూటర్‌ 

సైన్స్‌ నేపథ్యంతో యూజీ కోర్సులు చదివినవారు ఎమ్మెస్సీ డేటా సైన్స్‌కు అర్హులు. సంబంధిత సబ్జెక్టుల్లో ఆఖరు సంవత్సరం కోర్సులు చదువుతోన్న విద్యార్థులూ అర్హులే. 

పీహెచ్‌డీ: మ్యాథ్స్, కంప్యూటర్‌ సైన్స్, ఫిజిక్స్‌

అర్హత: సంబంధిత విభాగాల్లో పీజీ ఉత్తీర్ణులు, చివరి ఏడాది కోర్సులు చదువుతున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.


పరీక్ష ఇలా...

రెండు బీఎస్సీ కోర్సులకూ ఉమ్మడి పరీక్ష వంద పాయింట్లకు నిర్వహిస్తారు. ఇందులో 2 విభాగాలు ఉంటాయి. ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్‌ తరహా ప్రశ్నలు వస్తాయి. పార్ట్‌ ఏ 40, పార్ట్‌ బీ 60 పాయింట్లు. పరీక్ష వ్యవధి 3 గంటలు. పార్ట్‌ ఏ స్క్రీనింగ్‌. ఇందులో కనీస పాయింట్లు సాధిస్తే పార్ట్‌ బీ మూల్యాంకనం చేస్తారు. తుది ఎంపిక రెండు విభాగాల్లో సాధించిన పాయింట్లతో ఉంటుంది. పార్ట్‌ ఏలో 10 ప్రశ్నలు వస్తాయి. ఒక్కో దానికి 4 పాయింట్లు. పార్ట్‌ బీలో 6 ప్రశ్నలు ఉంటాయి. వీటికి 60 పాయింట్లు. ప్రశ్నలన్నీ ఇంటర్‌ మ్యాథ్స్‌లో ఆల్జీబ్రా, జామెట్రీ, ట్రిగనోమెట్రీ, కాలిక్యులస్‌ విభాగాల నుంచి అడుగుతారు.


ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ పరీక్షల్లోనూ రెండు పార్టులు ఉంటాయి. పార్ట్‌ ఏలో కనీస మార్కులు సాధిస్తేనే పార్ట్‌ బీ మూల్యాంకనం చేస్తారు. రెండు విభాగాల్లో సాధించిన మార్కులతో ప్రవేశం కల్పిస్తారు. ప్రశ్నలన్నీ సంబంధిత సబ్జెక్టుల్లో యూజీ పాఠ్యాంశాల నుంచి వస్తాయి. ఎమ్మెస్సీ డేటా సైన్స్‌ ప్రశ్నలు మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్‌ సైన్స్‌ నుంచి అడుగుతారు. పాత ప్రశ్నపత్రాలు, సొల్యూషన్లు సీఎంఐ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. వాటిని పరిశీలిస్తే ప్రశ్నల స్థాయి, చదవాల్సిన అంశాలపై అవగాహన పొందవచ్చు. 

  ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్‌ 9

  దరఖాస్తు ఫీజు: రూ.వెయ్యి. రెండు కోర్సులకు రూ.1200.     

  పరీక్ష తేదీ: మే 7

  తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విశాఖ పట్నం. 

  వెబ్‌సైట్‌: www.cmi.ac.in/admissions/

మరింత సమాచారం... మీ కోసం!

‣ అగ్నివీరుల‌కు ఆర్మీ ఆహ్వానం!

‣ ఫార్మసీలో పీజీకి జీప్యాట్‌!

‣ మహిళలకు యూనిఫామ్‌ సర్వీసెస్‌ కోర్సులు!

‣ ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలంటే ఏంచేయాలి?

‣ విదేశీ విద్యకు సిద్ధమవుతున్నారా?

‣ మిలిటరీ కాలేజీలో ఉద్యోగాలు

Posted Date: 07-03-2023


 

ప్ర‌ఖ్యాత సంస్థ‌లు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌