• facebook
  • twitter
  • whatsapp
  • telegram

కేంద్ర సంస్థలో ట్రెయినీ ఇంజినీర్‌లు

ఎంపిక ప్రక్రియ, పరీక్ష సరళి వివరాలు



భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్, బెంగళూరు కాంప్లెక్స్‌ తాత్కాలిక ప్రాతిపదికన 517 ట్రెయినీ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అభ్యర్థులను ముందుగా రెండేళ్ల కాలానికి ఉద్యోగంలోకి తీసుకుంటారు. ప్రాజెక్టు అవసరాలు, అభ్యర్థి పనితీరును బట్టి మరో ఏడాది పొడిగిస్తారు.  


ట్రెయినీ ఇంజినీర్‌ పోస్టులకు దరఖాస్తు చేయాలంటే... బీఈ/ బీటెక్‌ లేదా ఎంఈ/ ఎంటెక్‌ ఇంజినీరింగ్‌ (ఎలక్ట్రానిక్స్‌/ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్‌/ టెలికమ్యూనికేషన్‌/ కమ్యూనికేషన్‌/ మెకానికల్‌/ ఎలక్ట్రికల్‌/ ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌/ కంప్యూటర్‌ సైన్స్‌/ కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌/ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌/ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ) పాసవ్వాలి. జనరల్, ఓబీసీ (ఎన్‌సీఎల్‌), ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు 55 శాతం మార్కులతో పాసవ్వాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు ఉత్తీర్ణులైతే సరిపోతుంది. 


01.02.2024 నాటికి బీఈ/ బీటెక్‌ అభ్యర్థులకు 28 ఏళ్లు, ఎంఈ/ ఎంటెక్‌ అభ్యర్థులకు 30 సంవత్సరాలు మించకూడదు. గరిష్ఠ వయసులో ఓబీసీ (ఎన్‌సీఎల్‌) అభ్యర్థులకు 3 ఏళ్లు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 ఏళ్ల సడలింపు ఉంటుంది. 

దరఖాస్తు రుసుము రూ.150+18 శాతం జీఎస్టీ. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు లేదు. మొత్తం 517 పోస్టుల్లో.. అన్‌రిజర్వుడ్‌కు 210, ఓబీసీలకు 139, ఈడబ్ల్యూఎస్‌లకు 52, ఎస్సీలకు 77, ఎస్టీలకు 39 కేటాయించారు. 

సెంట్రల్‌ జోన్‌లో 68, ఈస్ట్‌-86, వెస్ట్‌-139, నార్త్‌-78, నార్త్‌ఈస్ట్‌-15, సౌత్‌-131 ఖాళీలు ఉన్నాయి. ఎంపికైనవారికి మొదటి ఏడాది నెలకు రూ.30,000 రెండో ఏడాది 35,000, మూడో ఏడాది రూ.40,000 వేతనం చెల్లిస్తారు. అభ్యర్థులను జోన్లవారీగా నియమిస్తారు. 



ఎంపిక ఇలా...

ఆన్‌లైన్‌ దరఖాస్తుల ఆధారంగా అభ్యర్థుల షార్ట్‌లిస్ట్‌ను తయారుచేసి రాత పరీక్ష నిర్వహిస్తారు. దీంట్లో ప్రతిభ చూపిన అభ్యర్థులను 1:5 నిష్పత్తిలో ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ వేదికలను తర్వాత కాల్‌ లెటర్‌ ద్వారా తెలియజేస్తారు. 

రాత పరీక్షకు 85 మార్కులు, ఇంటర్వ్యూకు 15 మార్కులు ఉంటాయి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ కాల్‌ లెటర్లను ఈమెయిల్‌ ద్వారా పంపుతారు. ఎంపికైన అభ్యర్థుల వివరాలను వెబ్‌సైట్‌లో ప్రకటిస్తారు. 



గమనించాల్సినవి

ప్రస్తుతం ఉపయోగిస్తోన్న ఈమెయిల్‌ ఐడీ, మొబైల్‌ నంబర్లను మాత్రమే దరఖాస్తులో రాయాలి. ఉద్యోగ సమాచారాన్ని వీటికే తెలియజేస్తారు. 

ఇప్పటికీ బెల్‌ యూనిట్లలో ట్రెయినీ ఇంజినీర్‌గా పనిచేస్తున్నవాళ్లు దరఖాస్తుకు అనర్హులు. 

ప్రభుత్వ/ ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తోన్న అభ్యర్థులు ‘నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌’ను దరఖాస్తు సమయంలో అప్‌లోడ్‌ చేయాలి. లేదా ఇంటర్వ్యూ సమయంలో సమర్పించాలి. 

అభ్యర్థులకు ఇంగ్లిష్, హిందీ భాషలు చదవడం, మాట్లాడటం, రాయడం తెలియాలి. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ జోన్లలో పనిచేయాలి కాబట్టి ప్రాంతీయ భాషలోనూ నైపుణ్యం ఉండాలి. 

టీచింగ్‌/ అకడమిక్‌/ రీసెర్చ్‌ వర్క్‌/ బ్యాకింగ్‌/ ఫైనాన్షియల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌/ ఎన్జీవోలు/ ఇంటర్న్‌షిప్‌లో చేసిన పనిని అనుభవంగా పరిగణించరు. 



సిలబస్‌ సంగతి?

రాత పరీక్షకు సంబంధించిన సిలబస్‌ను అధికారికంగా ఇప్పటివరకూ వెల్లడించలేదు. దీనికి సంబంధించిన తాజా సమాచారం కోసం తరచూ వెబ్‌సైట్‌ను సందర్శిస్తుండాలి. 

 పాత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే సిలబస్, పరీక్ష విధానం గురించి ఒక అవగాహన వస్తుంది. సిలబస్‌లోని ముఖ్యాంశాలను పునశ్చరణ చేసుకుంటే ఫలితం ఉంటుంది. 

 విద్యార్హతలకు సంబంధించిన అంశాల నుంచి కొన్ని ప్రశ్నలు, లాజికల్‌ రీజనింగ్, జనరల్‌ నాలెడ్జ్, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్, జనరల్‌ ఇంగ్లిష్‌ నుంచి మరికొన్ని ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. 

 పాత ప్రశ్నపత్రాలను సాధన చేయాలి. ఏ అంశాల్లో వెనకబడి ఉన్నారో తెలుసుకుని వాటికి అదనపు సమయాన్ని కేటాయించాలి. ఈ పరీక్షకు సంబంధించి మార్కెట్లో అందుబాటులో ఉన్న పుస్తకాలనూ చదవొచ్చు. 

 జాతీయ, అంతర్జాతీయ వర్తమానాంశాలపై అవగాహన పెంచుకోవాలి. రోజూ వార్తాపత్రికను చదవడం అలవాటు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. 

 రోజూవారీ నేర్చుకున్న కొత్త విషయాలను నోట్‌ చేసుకోవటం మేలు.  

 రాత పరీక్షలో జనరల్‌/ ఈడబ్ల్యూఎస్‌/ ఓబీసీ అభ్యర్థులు 35 శాతం, ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు 30 శాతం కనీసార్హత మార్కులు సాధించాలి. 

దరఖాస్తుకు చివరి తేదీ: 13.03.2024

వెబ్‌సైట్‌: www.bel-india.in

మరింత సమాచారం... మీ కోసం!

‣ జనరల్‌ డిగ్రీతో జాబ్‌ సాధ్యమే!

‣ ఐడీబీఐలో కోర్సు.. కొలువుకు అవకాశం

‣ స్కామర్లతో తస్మాత్‌ జాగ్రత్త!

‣ స్టార్టప్‌లతో దూసుకెళ్దామా!

‣ కొత్తకళ వసతులు.. కో-లివింగ్‌ ఆవాసాలు!

‣ సందేహించొద్దు.. సాధిద్దాం!

‣ ఆఫర్‌ లెటర్‌ అందుకుంటే సరిపోదు!

‣ ఐటీ కొలువుకు దగ్గరి దారి

Posted Date : 06-03-2024 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.