• facebook
  • twitter
  • whatsapp
  • telegram

సంపదను నిర్వహించే సామర్థ్యాన్ని సంపాదించుకోండి!

వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ నిపుణులకు పెరుగుతున్న డిమాండ్‌

జీవితంలో అత్యంత ముఖ్యమైన అంశం. దీన్ని ఎలా  నిర్వహించాలో తెలిసినవాడు రాజవుతాడు! తప్పులు చేస్తే... పాతాళానికి పడిపోతాడు. అందుకే సంపదను సరైన రీతిలో నిర్వహించడం చాలా అవసరం. అయితే అందరికీ ఆ నైపుణ్యం ఉండదు కదా! అందుకే ‘వెల్త్‌ మేనేజ్‌మెంట్‌’ సేవలు అందించే నిపుణులకు ప్రస్తుతం గిరాకీ పెరుగుతోంది!

వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ అనేది అనేక సేవల సమాహారం. ఇందులో ఫైనాన్షియల్‌ అడ్వైజరీ సర్వీసెస్, అకౌంటింగ్‌ అండ్‌ టాక్స్‌ ప్లానింగ్, ఎస్టేట్‌ ప్లానింగ్, విల్‌ డ్రాఫ్టింగ్‌ వంటి ఎన్నో పనులు కలిసుంటాయి. బ్యాంకింగ్, ఆర్థిక రంగంలో ఆసక్తి, నైపుణ్యం, అనుభవం ఉన్నవారు సర్టిఫైడ్‌ వెల్త్‌ మేనేజర్లుగా రాణించవచ్చు. వీరినే ఫైనాన్షియల్‌ ప్లానర్స్‌ అని కూడా అంటారు.

  వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ రంగం మన దేశంలో ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతోంది. సంపద సృష్టికి మార్గాలు, ఆర్థిక అవగాహన పెరుగుతుండటంతో ఈ సేవలను పొందగోరే వారి సంఖ్యా పెరుగుతోంది. ఇటువంటి సంస్థల్లో ఉద్యోగాలు చేసేందుకు అర్హులైన యువత సంఖ్య తక్కువగా ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి.  అందువల్ల పోటీ తక్కువ ఉంది, జీతాలు కూడా ఇతర రంగాలతో పోలిస్తే అధికంగా ఉంటున్నాయి. అయితే కంపెనీలు అభ్యర్థుల నైపుణ్యాల విషయంలో మాత్రం రాజీ పడటం లేదు. డబ్బుతో వ్యవహారం కాబట్టి అన్నివిధాలా సమర్థులైన వారినే అత్యధిక వేతనాలతో తమ సంస్థల్లోకి ఆహ్వానిస్తున్నాయి. ఇప్పటికే దేశంలో ప్రసిద్ధ ఆర్థిక సంస్థలు, బ్యాంకులు వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ రంగంలోకి ప్రవేశిస్తున్నాయి.

 వెల్త్‌ మేనేజర్‌ క్లైంట్‌ ఆర్థిక వ్యవహారాలపై పూర్తి అవగాహన తెచ్చుకుని లాభదాయకమైన పద్ధతుల్లో డబ్బును పెట్టుబడి పెట్టడం, సురక్షిత మార్గాల్లో ఉంచడం వంటి పనులు పెట్టాల్సి ఉంటుంది. దేశ ఆర్థికాభివృద్ధి పెరిగేకొద్దీ ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులు పెరుగుతాయి. కంపెనీలు, వ్యక్తుల సంపద పెరిగేకొద్దీ వెల్త్‌ మేనేజర్ల అవసరం కూడా పెరుగుతుంది. అందువల్ల ఇప్పటినుంచే దీనిపట్ల అవగాహన పెంచుకుని ప్రయత్నిస్తే.. అత్యున్నతమైన కెరియర్‌ను పొందే అవకాశం ఉంది.


 

అర్హత: ఈ రంగంలో ప్రవేశించదలచిన అభ్యర్థులకు ఫైనాన్స్‌/ ఎకనామిక్స్‌/ మేనేజ్‌మెంట్‌లో పోస్టు గ్రాడ్యుయేట్‌ డిగ్రీ ఉండటం తప్పనిసరి. సీఎఫ్‌పీ (సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ ప్లానర్‌), సీడబ్ల్యూఎం (చార్టెడ్‌ వెల్త్‌ మేనేజర్‌) సర్టిఫికేషన్‌ ఉండటం మరింత ఉపకరిస్తుంది. డిప్లొమా, డిగ్రీ స్థాయిలోనూ కోర్సులున్నా... పీజీ ఉండటం జాబ్‌ మార్కెట్లో మంచి అవకాశాలు అందిపుచ్చుకునేందుకు దోహదం చేస్తుంది. వీరికి మ్యాథమెటికల్, ఎనలిటికల్, ఇన్ఫర్మేషన్‌ ప్రాసెసింగ్, భాషా నైపుణ్యాలు చాలా బలంగా ఉండాలి. 

ఇందులో వెల్త్‌ మేనేజర్‌ మాత్రమే కాకుండా ఇన్వెస్టిమెంట్‌ కౌన్సెలర్, పోర్ట్‌ఫోలియో మేనేజర్, బిజినెస్‌ డెవలపర్, ఫైనాన్షియల్‌ అడ్వైజర్‌ లాంటి అనేక పోస్టులు ఉన్నాయి.


 

కోర్సులు


వెల్త్‌ మేనేజ్‌మెంట్‌కు సంబంధించి అనేక రకాల కోర్సులను విద్యాసంస్థలు అందిస్తున్నాయి. సీఐఎస్‌ఐ, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫైనాన్షియల్‌ ప్లానింగ్, ఇతర వర్సిటీలు అందించే  - ఇంటర్నేషనల్‌ సర్టిఫికెట్‌ ఇన్‌ వెల్త్‌ అండ్‌ ఇన్వెస్టిమెంట్‌ మేనేజ్‌మెంట్, సర్టిఫికేషన్‌ ఇన్‌ ఫైనాన్షియల్‌ ప్లానింగ్‌ అండ్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్, అడ్వాన్స్‌డ్‌ ఫైనాన్షియల్‌ ప్లానింగ్‌ అండ్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌... ఇలా రకరకాల కోర్సులు చేసే వీలుంది.  దేశంలోని ఇతర ప్రముఖ విద్యాసంస్థలతోపాటు ఆన్‌లైన్‌ సంస్థలూ దీనికి సంబంధించిన కోర్సులను అందిస్తున్నాయి.

మరింత సమాచారం... మీ కోసం!

‣ పైలట్లకు పెరుగుతోంది డిమాండ్‌!

‣ ఇంటర్‌ తర్వాత ‘నెస్ట్‌’!

‣ ఫార్మసీలో పీజీకి జీప్యాట్‌!

‣ మహిళలకు యూనిఫామ్‌ సర్వీసెస్‌ కోర్సులు!

‣ ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలంటే ఏంచేయాలి?

‣ విదేశీ విద్యకు సిద్ధమవుతున్నారా?

Posted Date : 02-03-2023 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌