• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఇంటర్ పరీక్షలకు ఇదిగో వ్యూహం!

స‌బ్జెక్టు అధ్యాప‌కుల సూచ‌న‌లు, స‌ల‌హాలు

న్యూస్‌టుడే, విజయవాడ విద్య: ఇంటర్‌ పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం అవుతున్నారు. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ ఇలా అన్ని బ్రాంచిల విద్యార్థులకు ఈ పరీక్షలు కీలకం. భవిష్యత్తు గ్రూపు ఎంపికలకు ఈ మార్కులు ప్రధానం. ఈసారి విద్యార్థులకు గ్రేడింగ్‌లో పాయింట్లు కేటాయించనున్నారు. సర్వశక్తులు ఒడ్డి చదవాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ తరుణంలో ప్రణాళికను మీకోసం ఇస్తున్నాం. ఈ విద్యా సంవత్సరం 30 శాతం సిలబస్‌ను తగ్గించి పరీక్షలు నిర్వహిస్తున్నారు.

 ఇంటర్‌ విద్యార్థులకు ఆయా సబ్జెక్టు అధ్యాపకుల సూచనలివి...

 ఎంపీసీ విద్యార్థులకు

ఎంపీసీ విద్యార్థులకు జేఈఈ మెయిన్స్‌లో టాప్‌-20 పర్సంటైల్‌ విధానం అందుబాటులో ఉంటుంది. ఎంసెట్‌లో ఇంటర్‌ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఉంటుంది.

‣ గణితం పట్టు పడదాం

- మురళీకృష్ణ, అధ్యాపకులు

ఇప్పటికే దాదాపు సిలబస్‌ పూర్తయి ఉంటుంది. స్వల్ప సమాధాన ప్రశ్నలను వివరణాత్మక విధానంలో అధ్యయనం చేయాలి. సిలబస్‌కు అనుగుణంగా ప్రశ్నలు, సమాధానాల రూపంలో ఆబ్జెక్టివ్‌కి సిద్ధమవ్వాలి. సిలబస్‌ పూర్తి చేశాం. పోటీ పరీక్షలకు ప్రాధాన్యం ఇద్దామన్న ధోరణి వీడాలి. ఇంటర్‌ పరీక్షలకు ఉన్న వెయిటేజీని గుర్తించాలి. 90 శాతం సమయం గ్రూపు సబ్జెక్టులకు కేటాయించాలి. ద్వితీయ సంవత్సర విద్యార్థులు సర్కిల్స్‌ (వృత్తాలు), ద్విపద సిద్ధాంతం, ప్రస్తారాలు సంయోగాలు, సంభావ్యత, అవకలన సమీకరణాలు, డిమూవర్స్‌ సిద్ధాంతం, వర్గ సమీకరణాలు, పరావలయాలు అంశాలను క్షుణ్ణంగా చదవాలి. మొదటి సంవత్సర విద్యార్థులు వెక్టార్‌ ఆల్‌జీబ్రా, మాత్రికలు, సరళ రేఖలు, సరళరేఖాయుగ్మాలు, అవకలనాలు, అప్లికేషన్స్‌ అండ్‌ డెరివేషన్స్‌ను బాగా సాధన చేయాలి. పాత గణిత పేపర్లలోని ప్రశ్నలను పునశ్చరణ చేయాలి. దీంతో రెండు మార్కుల ప్రశ్నలు చేయడం సులువవుతుంది. తొలగించిన సిలబస్‌ను మినహాయించి సిద్ధం కావాలి.

‣ భౌతికశాస్త్రం... సాధనకు సమయం

- శారదాదేవి, అధ్యాపకురాలు

స్వల్ప, అతిస్వల్ప సమాధానాల సాధనకు ఎక్కువ సమయం కేటాయించాలి. ద్వితీయ సంవత్సర విద్యార్థులు మూవింగ్‌ ఛార్జెస్‌ అండ్‌ మాగ్నటిజం, కరెంట్‌ ఎలక్ట్రిసిటీ, ఆప్టికల్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌, సెమీకండక్టర్స్‌, ఎలిమెంట్స్‌ అంశాలను బాగా చదవాలి. ప్రథమ సంవత్సర విద్యార్థులు రొటేటరీమోషన్‌, యూనివర్సల్‌ గ్రావిటేషన్‌, ఎస్కేప్‌ వెలాసిటీ, సింపుల్‌ హార్మోనిక్‌మోషన్‌, సర్ఫేస్‌ టెన్షన్‌, థర్మో డైనమిక్స్‌ వంటి అంశాలను సాధన చేయాలి. దీర్ఘ సమాధానాల ప్రశ్నలను సాధన చేసే సమయంలో అంచెల వారీ పరిష్కార విధానాన్ని అనుసరించాలి. ప్రాథమిక అంశాలు, లెక్కలకు ఎక్కువ సమయం ఇవ్వాలి.

‣ పౌరశాస్త్రం అవగాహనతో చదవాలి

- మాధవి

భారత రాజ్యాంగం శాఖలు, వ్యవస్థల అంశాలపై పట్టు సాధించాలంటే సమకాలీన రాజకీయ అంశాలపై అవగాహన ఉండాలి. మొదటి సంవత్సర విద్యార్థులు రాజ్యాంగం స్వభావం, తీరుతెన్నులపై అవగాహనతో చదవాలి.  ద్వితీయ సంవత్సరం వారు భారత రాజ్యాంగం, ప్రభుత్వ పరిపాలన, ప్రాధాన్యతలను చదవాలి.

 రసాయన శాస్త్రంలో ముఖ్యాంశాలను గుర్తుంచుకోవాలి

- ఆనందమోహన్‌

ద్వితీయ సంవత్సర విద్యార్థులు ఆయా ఛాప్టర్లకు వెయిటేజీ ప్రకారం విద్యుత్‌, రసాయనశాస్త్రం, పి.బ్లాక్‌మూలకాలు, డి, ఎఫ్‌ బ్లాకు మూలకాలను, లోహశాస్త్రం, సాలిడ్‌స్టేట్‌ వంటి అంశాలకు ప్రాధాన్యమివ్వాలి. ఆర్గానిక్‌ కెమిస్ట్రీ లోని అన్ని ముఖ్యాంశాలను గుర్తుంచుకోవాలి.  ప్రథమ సంవత్సర విద్యార్థులు కర్బన రసాయన శాస్త్రం, ఆవర్తన పట్టిక, పరమాణు నిర్మాణం, రసాయన బంధం తదితర అంశాలకు ప్రాధాన్యమివ్వాలి.

‣ వృక్షశాస్త్రాన్ని విశ్లేషణాత్మకంగా చదవాలి

- పి.హరిప్రసాద్‌

బోటనీ సబ్జెక్టుటును విశ్లేషణాత్మకంగా చదవాలి. ప్రశ్న, సమాధానం అన్న కోణం కాకుండా అందులో ఇమిడి ఉన్న అనువర్తనాలను నిజ జీవితంలోని పరిస్థితులతో బేరీజు చేసుకుని చదవాలి. ద్వితీయ సంవత్సర విద్యార్థులు మొక్కలు, శరీర ధర్మశాస్త్రం, బయోటెక్నాలజీ, మైక్రోబ్స్‌, అణుజీవన శాస్త్రానికి ప్రాధాన్యమివ్వాలి. గ్రాఫికల్‌ ప్రజంటేషన్‌పై అవగాహన పెంచుకోవాలి.తద్వారా ఫ్లోచార్టు, బొమ్మలు వేయడం సులువవుతుంది.  మొదటి సంవత్సర విద్యార్థులు మొక్కలు, నిర్మాణాత్మక సంవిదానం, స్వరూపశాస్త్రం, జీవ ప్రపంచంలో వైవిధ్యం, కణనిర్మాణం, విధులు, మొక్కల అంతర్నిర్మాణ సంవిదానం, మొక్కలలో ప్రత్యుత్పత్తి అంశాలపై దృష్టి సారించాలి.

‣ జంతుశాస్త్రంలో సమయమే కీలకం

జువాలజీకి సంబంధించి సమయపాలన కీలకం. ఆయా యూనిట్లకు లభిస్తున్న వెయిటేజీకి అనుగుణంగా సాధన చేయాలి. ద్వితీయ సంవత్సర విద్యార్థులు మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థ, ప్రత్యుత్పత్తి సంబంధిత ఆరోగ్యం, అంతస్వావక వ్యవస్థ, నాడీ నియంత్రణ సమన్యాయం, శరీరద్వారాలు, ప్రసరణ, విసర్జక పదార్థాలు, జన్యుశాస్త్రంకు ఎక్కువ ప్రాధాన్యమివ్వాలి. ప్రథమ సంవత్సర విద్యార్థులు జంతుదేహ నిర్మాణం, గమనం, ప్రత్యుత్పత్తి, జీవావరణం, బొద్దింక జీవ వ్యవస్థ, వంటి అంశాలను క్షుణ్ణంగా చదవాలి.  డయాగ్రమ్స్‌ చక్కగా సాధన చేయాలి.

 వాణిజ్య శాస్త్రంలో అన్ని అంశాలపై  దృష్టి

- వి.గాయత్రి

కామర్సులో మార్కులు సాధించాలంటే వాణిజ్య శాస్త్రం, వ్యాపార గణాంక శాస్త్రంపై పట్టు సాధించాలి. మొదటి సంవత్సర విద్యార్థులు వ్యాపారం, భావనలు, స్వరూపాలు, వ్యవస్థాపన-వ్యవస్థాపకులు అంశాలను చదవాలి. సిలబస్‌లోని అన్ని అంశాలను చదవాలి. కంప్యుటేషన్‌ నైపుణ్యాలు, తులనాత్మక అధ్యయన నైపుణ్యం, ఫైనల్‌ అకౌంట్స్‌, ప్రాఫిట్‌ అండ్‌ లాస్‌ షీటు, బ్యాంకింగ్‌ రీకన్సీలియేషన్‌ పై దృష్టి సారించాలి.ద్వితీయ సంవత్సర విద్యార్థులు పార్టు-1లో థియరీ కోసం మార్కెటింగ్‌ వ్యాపారం, స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ కార్యకలాపాలపై పట్టు సాధించాలి. పార్టు-2లో వ్యాపార గణాంక శాస్త్రంలో ట్రేడింగ్‌, కన్‌సైన్‌మెంట్‌, నాన్‌ప్రాఫిట్‌ ఆర్గనైజేషన్‌ అంశాలపై పట్టు సాధించాలి.

 అర్థశాస్త్రానికి వాస్తవ పరిస్థితులను అన్వయించాలి

సబ్జెక్టులోని మూల అంశాలను వాస్తవ పరిస్థితులకు అన్వయిస్తూ చదవాలి. మొదటి సంవత్సర విద్యార్థులు ఆర్థిక భావనలు, ఆర్థిక సూత్రాలు, వాటి నిర్వచనాలు, పట్టికలు, రేఖాపటాలు, ప్రమేయాలు, ప్రాముఖ్యత తదితర అంశాలను చదవాలి. బ్యాంకింగ్‌, ద్రవ్యోల్బణం, జాతీయ ఆదాయం, వంటి వాటిని చదవాలి. గ్రాఫికల్‌ అవగాహన అవసరం.  ద్వితీయ సంవత్సర విద్యార్థులు ఆర్థిక సమస్యలు, కారణాలు, నివారణ చర్యలు, గణాంక వివరాలపై దృష్టి సారించాలి. జాతీయ ఆదాయం, వ్యవసాయరంగం, పారిశ్రామిక రంగం, నూతన ఆర్థిక సంస్కరణలు చదవాలి. వీటితో పాటు సమకాలీన సమస్యలు, పరిష్కార మార్గాలను అర్థం చేసుకోవాలి.

Posted Date : 08-04-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని

విద్యా ఉద్యోగ సమాచారం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌