‣ ఇంటర్ పరీక్షల సన్నద్ధత
ఇంటర్ వార్షిక పరీక్షల నగారా మోగింది కానీ విద్యార్థుల మానసిక సన్నద్ధత ప్రశ్నార్థకమే. ప్రస్తుత స్థితిలో పరీక్షల్లో గరిష్ఠ ప్రతిభ చూపేలా అన్ని రకాలుగా తమను తాము మలచుకోవటం చాలా ముఖ్యం. ఇందుకు కళాశాలల అధ్యాపకులూ, తల్లిదండ్రులూ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సివుంటుంది. ఈ ఏడాది ఏ సబ్జెక్టు అయినా ఐపీఈకి తొలగించిన పాఠ్యాంశాలేమిటో మొదట తెలుసుకోవాలి. ఒక్కో పాఠ్యాంశానికి కేటాయించిన వెయిటేజీ గమనించుకుని దానికి అనుగుణంగా ప్రణాళిక రూపొందించుకుని సిద్ధమవ్వాలి. అప్పుడే మెరుగైన ఉత్తీర్ణతను సాధించుకోవచ్చు!
ఇంతకు ముందు రోజుల్లోలా విద్యార్థులను ముఖ్యమైన ప్రశ్నలను చదవమని చెప్పి, చదువుతున్నారని భావిస్తే మాత్రం వచ్చే ఫలితాలు అనూహ్యంగా ఉంటాయి. అందుకని అధ్యాపకులు వీలైనంతవరకూ బేసిక్స్ నుంచి మరోమారు బోధించి, సమయం తక్కువగా ఉంటే ముఖ్యమైన అభ్యాసాలను ఎంచుకుని వాటిని సాధన చేయమనడం ద్వారా పరిస్థితులను కొంత మార్చవచ్చు. తల్లిదండ్రులు సైతం పిల్లలు చదువుతున్న తీరును పరిశీలిస్తూ వారితోపాటు కూర్చుని చదివించాల్సిన అవసరం ఈ ఏడాది ఎంతైనా ఉంది. ఎంత ఎక్కువగా సాధన చేస్తే అంత మంచి మార్కులు సాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా విలువైన సమయాన్ని వృథా చేయకుండా సక్రమంగా వినియోగించుకోవాలి. అప్పుడే అద్భుతమైన ఫలితాలు సాధ్యమవుతాయి.
తొలగించిన సిలబస్‌ను వెయిటేజీని మోడల్ పేపర్స్‌ను చూసి అధ్యాపకుల సాయంతో విద్యార్థులు పరీక్షకు సన్నద్ధమవ్వాలి. స్వల్ప, దీర్ఘ సమాధానాల ఎంపిక 50% ఉన్న కారణంగా ఎక్కువ మార్కులు సాధించడానికి అవకాశాలు ఎక్కువ. సమయాభావం లేనట్లయితే స్వల్ప, దీర్ఘ సమాధానాలు రాసేటపుడు అదనంగా తెలిసిన ప్రశ్నలకు సమాధానాలు రాయొచ్చు. అలాంటపుడు ఏదైనా ప్రశ్నలో మార్కులు పూర్తిగా సాధించలేకపోయినా ఉత్తమ మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. ఆ విధంగా అధిక మార్కులు తెచ్చుకునే వీలుంటుంది. గత ఏడాది మాదిరిగా విద్యార్థులను ఉత్తీర్ణులు చేస్తారన్న భావనలో ఉండొద్దు. ఎట్టి పరిస్థితుల్లోనైనా పరీక్షలు నిర్వహించి ఆ ఫలితాలను మాత్రమే పరిగణిస్తారు. ప్రస్తుతం ద్వితీయ సంవత్సర విద్యార్థులు వారి ప్రథమ సంవత్సరంలో వచ్చిన ఫలితాల్లో మార్పులుండవు. కాబట్టి పరీక్షలకు ప్రథమ ప్రాధాన్యంతో సన్నద్ధమవ్వాలి.
భౌతిక శాస్త్రం (ఫిజిక్స్)

ప్రథమ సంవత్సరం
ఈ ఏడాది ప్రశ్నపత్రంలో సెక్షన్-బి, సిల్లో 50% చాయిస్ ఇస్తున్నారు. గత మూడేళ్ల ప్రశ్నపత్రాలను సేకరించి, వాటిలో తొలగించిన ప్రశ్నలను వేరుచేసి సన్నద్ధమైతే సులువుగా మార్కులు సాధించవచ్చు.
ముందుగా దీర్ఘ సమాధాన ప్రశ్నలపై దృష్టిపెట్టాలి. ఎక్కువగా ‘వర్క్, పవర్, ఎనర్జీ’, ‘ఆసిలేషన్’ చాప్టర్లు బాగా చదవాలి. అలాగే థర్మోడైనమిక్స్ నుంచి ఈ ఏడాది హీట్ ఇంజిన్, కార్నట్ సైకిల్‌ను తొలగించారు. కానీ ఈ చాప్టర్ల నుంచి స్వల్ప సమాధాన ప్రశ్నలు అడిగే అవకాశముంది. రెండు స్వల్ప సమాధాన ప్రశ్నలను కలిపి ఒక దీర్ఘ సమాధానంగానూ అడగొచ్చు.
స్వల్ప సమాధాన ప్రశ్నలు గత ఏడాది వెయిటేజీ ప్రకారం సన్నద్ధమైతే సరిపోతుంది. మొదటగా మోషన్ ఇన్ స్ట్ర్టెయిట్ లైన్, మోషన్ ఇన్ ఎ ప్లేన్, లాస్ ఆఫ్ మోషన్, గ్రావిటేషన్, థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మేటర్, సాలిడ్స్, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్ చాప్టర్ల నుంచి ఏటా రెండు ప్రశ్నలు అడుగుతున్నారు. కాబట్టి వీటిని బాగా చదివితే సెక్షన్-బిలో పూర్తి మార్కులను సాధించవచ్చు. అలాగే అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు ముందుగా ఫిజికల్ వరల్డ్, మోషన్ ఇన్ ఎ ప్లేన్ యూనిట్లు, మెజర్మెంట్, లాస్ ఆఫ్ మోషన్, థర్మోడైనమిక్స్, థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ నుంచి మంచి మార్కులు సాధించవచ్చు.
తొలగించిన అంశాలు
‣ లాస్ ఆఫ్ మోషన్ (న్యూటన్ నియమాలు)
‣ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ (సమాంతర, లంబ సిద్ధాంతాలు)
‣ గ్రావిటేషన్ (కెప్లర్ నియమాలు, గురుత్వ త్వరణం)
‣ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ (యంగ్స్, షేర్ మాడ్యులస్, పాయిజన్స్ రేషియో, పొటెన్షియల్ ఎనర్జీ ఇన్ వైర్)
‣ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ (హీట్ ట్రాన్స్ఫర్, కండక్షన్, కన్వెక్షన్, రేడియేషన్)
‣ థర్మోడైనమిక్స్ (హీట్ ఇంజిన్, రెఫ్రిజిరేటర్, కార్నట్ ఇంజిన్)
ద్వితీయ సంవత్సరం
దీర్ఘ సమాధాన ప్రశ్నలు వేవ్స్, కరంట్ ఎలక్ట్రిసిటీ, న్యూక్లియర్ ఫిజిక్స్ నుంచి ఎక్కువగా అడుగుతున్నారు. వేవ్స్‌లో డాఫ్లర్ ప్రభావాన్ని తొలగించడంతో మిగతా ప్రశ్నలపై దృష్టిసారించాలి.
స్వల్ప సమాధాన ప్రశ్నలు ఎక్కువగా రే ఆప్టిక్స్, ఫిజికల్ ఆప్టిక్స్, ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటర్స్, మూవింగ్ చార్జెస్ మాగ్నటిజమ్, ఆటమ్స్ సెమీ కండక్టర్స్ చాప్టర్స్ నుంచి ఏటా అడుగుతున్నారు. కాబట్టి చూసుకోవాలి.
అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్, మాగ్నటిజమ్, మూవింగ్ చార్జెస్, ఆల్టర్నేటివ్ కరెంట్, ఎలక్ట్రో మాగ్నటిక్ వేవ్స్, కమ్యూనికేషన్ సిస్టమ్, సెమీ కండక్టర్స్, రే ఆప్టిక్స్ చాప్టర్లను ఎక్కువగా చదవాలి. అలాగే సంబంధిత మాదిరి ప్రశ్నలనూ చూసుకోవాలి.
తొలగించిన అంశాలు
‣ వేవ్ ఆప్టిక్స్ (పోలరైజేషన్, రిజాల్వింగ్ పవర్)
‣ వేవ్స్ (డాఫ్లర్ ఎఫెక్ట్)
‣ రే ఆప్టిక్స్ (స్కాటరింగ్ ఆఫ్ లైట్)
‣ కరెంట్ ఎలక్ట్రిసిటీ (రెసిస్టివిటీ, కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్)
‣ మాగ్నటిజమ్ (ప్రాపర్టీస్ ఆఫ్ మాగ్నటిక్ మెటీరియల్స్)
‣ న్యూక్లియర్ ఫిజిక్స్ (బైండింగ్ ఎనర్జీ, రేడియోధార్మికత)
రసాయన శాస్త్రం (కెమిస్ట్రీ)
ప్రథమ సంవత్సరం
ప్రస్తుత పరిస్థితుల్లో ముందుగా కనీస అర్హత మార్కులు సాధించడానికి ప్రయత్నించి, ఆపై పూర్తి మార్కుల సాధనకు కృషి చేయవచ్చు.
అటామిక్ స్ట్రక్చర్, కెమికల్ బాండింగ్, పీరియాడిక్ టేబుల్ ద్వారా (12+10+10) మార్కులు సాధించవచ్చు. ఆర్గానిక్ కెమిస్ట్రీ కూడా చదువుకుంటే 45 మార్కులకు పైగా పొందొచ్చు. గత సంవత్సరాల ప్రశ్నపత్రాల సరళిని పరిశీలిస్తూ సాధన చేస్తే ప్రయోజనం ఉంటుంది. పూర్తి మార్కుల సాధనకు అన్ని చాప్టర్లపై దృష్టి సారించాలి.
ప్రథమ సంవత్సరంలో ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీని తొలగించారు.
ద్వితీయ సంవత్సరం
పోటీ పరీక్షలనూ రాయాల్సి ఉంటుంది కాబట్టి, సన్నద్ధతపై ఎక్కువ శ్రద్ధపెట్టాలి. ద్వితీయ సంవత్సర రసాయన శాస్త్రంలో దాదాపుగా అన్ని చాప్టర్లూ ముఖ్యమైనవే. వీటిలో ముఖ్యంగా ఎలక్ట్రో కెమిస్ట్రీ అండ్ కెమికల్ కైనెటిక్స్ 16, 17 గ్రూపులు, కర్బన రసాయన శాస్త్రాల నుంచి (10+12+16) మార్కులు వచ్చే అవకాశం ఉంది. ఐపీఈ, ప్రవేశపరీక్షల నిమిత్తం ద్వితీయ సంవత్సర విద్యార్థి రసాయన శాస్త్రంపై ఎక్కువ పట్టు సాధించాలి.
ద్వితీయ సంవత్సరం సిలబస్ నుంచి పాలిమర్స్, కెమిస్ట్రీ ఇన్ డైలీ లైఫ్, మెటలర్జీలను తొలగించారు. కానీ.. విద్యార్థులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. తొలగించిన చాప్టర్ల నుంచి జాతీయస్థాయి ప్రవేశపరీక్షల్లో ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది.
జంతుశాస్త్రం
మొదటి సంవత్సరం
1. జీవ వైవిధ్యం (6 మార్కులు). దీనిలో వైవిధ్యం (బయో డైవర్సిటీ) మాత్రమే చదవాలి.
2. జంతు దేహ నిర్మాణం (10-12 మార్కులు)
3. జంతు వైవిధ్యం-1 (6 మార్కులు)
4. జంతు వైవిధ్యం-2 (6 మార్కులు)
5. గమనం, ప్రత్యుత్పత్తిలను తొలగించారు
6. మానవ సంక్షేమంలో జీవశాస్త్రం (10-12 మార్కులు)
7. పెరిప్లానెటా అమెరికానా (బొద్దింక)ను తొలగించారు.
8. జీవావరణం- పర్యావరణం నుంచి జీవావరణవ్యవస్థ (ఎకోసిస్టమ్), పర్యావరణం- పరిరక్షణ అంశాలను మాత్రమే తొలగించారు (12-14 మార్కులు)..
వెయిటేజీ పరంగా జంతు దేహ నిర్మాణం, మానవ సంక్షేమంలో జీవశాస్త్రం, జీవావరణం-పర్యావరణం పాఠ్యాంశాలకు ప్రాధాన్యం ఎక్కువ. వీటిలో దీర్ఘ సమాధాన ప్రశ్నలను అడుగుతారు. అందుకని వీటి మీద ఎక్కువ శ్రద్ధ చూపించాలి. ఈసారి సిలబస్ (70%) తక్కువ కాబట్టి ఉన్న పాఠ్యాంశాల్లోనే ఎక్కువ ప్రశ్నలు అడగొచ్చు. ఈసారి చాయిస్ ఎక్కువ. క్షుణ్ణంగా అన్ని ప్రశ్నలనూ చదివితే మంచి మార్కులు పొందవచ్చు.
ద్వితీయ సంవత్సరం
1. మానవ శరీర నిర్మాణం, శరీర ధర్మశాస్త్రం-1 (6 మార్కులు)
1ఎ. జీర్ణక్రియ, శోషణం (తొలగించారు).
1బి. శ్వాసించడం, వాయువుల వినిమయం
2. మానవ శరీర నిర్మాణం, శరీర ధర్మశాస్త్రం- 2 (10-12 మార్కులు)
2ఎ. శరీర ద్రవాలు, ప్రసరణ
2బి. విసర్జక పదార్థాలు, వాటి విసర్జన
3. మానవ శరీర నిర్మాణ శాస్త్రం, శరీరధర్మ శాస్త్రం-3 (8-10 మార్కులు)
3ఎ. కండర- అస్థిపంజర వ్యవస్థ (అస్థిపంజర వ్యవస్థను తొలగించారు)
3బి. నాడీ నియంత్రణ సమన్వయం (ప్రతీకార చర్యాచాపం, జ్ఞానేంద్రియాలు- కన్ను, చెవి తొలగించారు)
4. మానవ శరీర నిర్మాణం, శరీర ధర్మశాస్త్రం- 4 (8 మార్కులు)
4ఎ. అంతస్స్రావక వ్యవస్థ, రసాయన సమన్వయం
4బి. రోగనిరోధక వ్యవస్థ
5. మానవ ప్రత్యుత్పత్తి (10-12 మార్కులు)
5ఎ. మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థ
5బి. ప్రత్యుత్పత్తి సంబంధ ఆరోగ్యం
6. జన్యుశాస్త్రం (జెనెటిక్స్) (10-12 మార్కులు)
7. జీవ పరిణామం (తొలగించారు)
8. అనువర్తిత జీవశాస్త్రం (ఈసీజీ, ఈఈజీ, టీ-స్కాన్, ఎంఆర్ఐ స్కాన్, ఎలిశాలను తొలగించారు)
ద్వితీయ సంవత్సరానికి సంబంధించి శరీర ద్రవాలు, ప్రసరణ, విసర్జక పదార్థాలు- వాటి విసర్జన, మానవ ప్రత్యుత్పత్తి, జన్యుశాస్త్రం లాంటి పాఠ్యాంశాలకు ఎక్కువ ప్రాధాన్యం ఉంది. వీటి నుంచి దీర్ఘ సమాధాన ప్రశ్నలను అడుగుతున్నారు. వీటిపై ఎక్కువ దృష్టి సారించాలి. అంతేకాకుండా ఒక డయాగ్రమ్‌ను స్వల్ప సమాధాన ప్రశ్నల్లో అడుగుతున్నారు. ఎల్.ఎస్. ఆఫ్ కిడ్నీ, స్పైనల్ కార్డ్ అడ్డుకోత, గ్రాఫియన్ ఫాలికల్ల డయాగ్రమ్‌లను బాగా సాధన చేయాలి.
స్వల్ప సమాధాన ప్రశ్నలు అన్ని పాఠ్యాంశాల నుంచి అంటే ఒక్కో పాఠ్యాంశం నుంచి ఒక్కోటి చొప్పున రావొచ్చు. ముఖ్యంగా శ్వాసించడం, వాయువుల వినిమయం, కండర వ్యవస్థ, అంతస్స్రావక వ్యవస్థ, రసాయన సమన్వయం, రోగనిరోధక వ్యవస్థ, ప్రత్యుత్పత్తి సంబంధ ఆరోగ్యం, అనువర్తిత జీవశాస్త్రం లాంటి పాఠ్యాంశాల నుంచి వచ్చే అవకాశం ఎక్కువ. వీటిపై శ్రద్ధ చూపాలి. తరువాత మిగిలిన అన్ని పాఠ్యాంశాల్లోని సమాధానాలను నేర్చుకోవాలి.
అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు కూడా అన్ని పాఠ్యాంశాల నుంచీ వస్తాయి. 60/60 సాధించాలనుకునేవారు అన్ని చాప్టర్లపై దృష్టిసారిస్తూ అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు పూర్తిగా రాసేలా చూసుకోవాలి.
వృక్షశాస్త్రం
ద్వితీయ సంవత్సరంలో..
‣ ప్లాంట్ ఫిజియాలజీ, జెనెటిక్స్, బయో కెమిస్ట్రీల నుంచి 32+20+20 మార్కులను సాధించవచ్చు.
‣ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ప్లాంట్స్, మినరల్ న్యూట్రిషన్, ప్లాంట్ గ్రోత్, డెవలప్మెంట్ బ్యాక్టీరియా, వైరస్, స్ట్రాటజీస్ ఫర్ ఎన్హాన్స్మెంట్ ఫర్ ఫుడ్ తొలగించారు.
మిగిలిన అన్ని పాఠ్యాంశాలనూ పూర్తిగా చదివితే 100% మార్కులను సాధించవచ్చు.
ప్రథమ సంవత్సరంలో..
డైవర్సిటీ ఇన్ ద లివింగ్ వరల్డ్, సెక్సువల్ రీప్రొడక్షన్, సెల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ల నుంచి 20+ 24+20 మార్కులను ఆశించవచ్చు. తొలగించిన పాఠ్యాంశాల్లో జీవ ప్రపంచం, వర్గీకరణ స్థాయులు, వర్గీకరణ ఉపకరణాలు, వృక్షరాజ్యంలో ఆవృత బీజాలు, పుష్పించే మొక్కల బాహ్య స్వరూపశాస్త్రం, వేరు, కాండం, పత్రం, ఫలం, విత్తనం, ప్రత్యుత్పత్తి విధానాలు, మొక్కల వర్గీకరణం, ఫాబేసీ ఫ్యామిలీ, మొక్కల అంతర్ నిర్మాణంలో కణజాలశాస్త్రం, మొక్కల్లో పర్యావరణ అనుక్రమాలు, పర్యావరణ సేవలు ఉన్నాయి.
మిగిలిన పాఠ్యాంశాలను శ్రద్ధతో చదివి పునశ్చరణ చేయడం ద్వారా పూర్తి మార్కులు తెచ్చుకోవడం సాధ్యమే.
గణిత శాస్త్రం
1ఎ: మాత్రికలు అధ్యాయంపై పూర్తిగా (తొలగించినవి మినహా) పట్టు సాధిస్తే 33 మార్కులు తెచ్చుకునే వీలుంది. అందులోనూ మాత్రికల సంకలనం, వ్యవకలనం, గుణించడం, ఇచ్చిన సమీకరణాలను క్రామర్స్ పద్ధతి, మాత్రిక విలోమ పద్ధతులను నేర్చుకుంటే పూర్తి మార్కులను సాధించవచ్చు. మరో ముఖ్యమైన అధ్యాయం సదిశలు, సదిశ సంకలనం, బిందు లబ్ధం, వజ్రలబ్ధం, అదిశా త్రిక లబ్ధాల వరకు నేర్చుకుంటే 39 మార్కులు సాధించవచ్చు. 100% మార్కులకు ప్రయత్నించేవారు ప్రమేయాలు, త్రికోణమితినీ చేయాలి.
ప్రమేయాల్లో విలోమ ప్రమేయం సంబంధిత సిద్ధాంతాలు మినహా మిగిలినవాటికి సిద్ధం కావాలి. త్రికోణమితి నుంచి త్రికోణమితీయ సమీకరణాలు, సాధనలు, విలోమ త్రికోణమితీయ ప్రమేయాలు చాప్టర్లను తొలగించారు. హైపర్బోలిక్ ప్రమేయాల్లో విలోమ ప్రమేయాలనూ తొలగించారు.
1బి: సరళరేఖలు, అవకలనం పూర్తిగా సాధన చేస్తే 22+22 మార్కులు సాధించవచ్చు. టాంజెంట్స్ అండ్ నార్మల్స్ చాప్టర్లనూ సాధన చేస్తే 22+22+24 మార్కులు సాధించవచ్చు. 100% మార్కులకు అన్ని చాప్టర్లూ పూర్తి చేయాలి. సరళరేఖా యుగ్మాల నుంచి కోణ సమద్విఖండన రేఖలు, దానికి సంబంధించిన అన్ని సిద్ధాంతాలు, సమస్యలనూ; సమాంతర సరళరేఖాయుగ్మాలు- సంబంధిత సమస్యలు, సిద్ధాంతాలనూ తొలగించారు. 3డిలో ప్లేన్ (తలం)కి సంబంధించిన తల సమీకరణాలు తొలగించారు. కాల్క్యులస్లో అవిచ్ఛిన్నత, విలోమ, త్రికోణమితీయ ప్రమేయాల సంబంధిత సమస్యలనూ; రేట్ ఆఫ్ చేంజ్, రోల్స్, లెగ్రాంజ్ మీన్ వాల్యూ సిద్ధాంతాలను, ఆరోహణ, అవరోహణ ప్రమేయాలనూ తొలగించారు. వీటినీ గమనించుకోవాలి.
2ఎ: వర్గ సమాసాలు, సమీకరణాలు, థియరీ ఆఫ్ ఈక్వేషన్స్, ప్రాబబిలిటీ, రాండమ్ వేరియబుల్స్ (యాదృచ్ఛిక చలరాశులు), ప్రస్తారాలు, సంయోగాలు సాధన చేస్తే 13+20+38+19 మార్కులను సాధించవచ్చు. సులభమైన పాక్షిక భిన్నాలు చేసుకుంటే 8 మార్కులు సాధించవచ్చు. ద్విపద సిద్ధాంతంలో ద్విపద గుణకాలను తొలగించారు. కాబట్టి ద్విపద సిద్ధాంతం ప్రారంభంలో చాలా సులభమైన ప్రశ్నలను అడగవచ్చు. అనంత శ్రేణి సమస్యలను సాధిస్తే 9 మార్కులు పొందవచ్చు. సంభావ్యత బేస్ సిద్ధాంతం, దానికి సంబంధించిన ప్రశ్నలను తొలగించారు. 100% మార్కులకు స్టాటిస్టిక్స్ (సాంఖ్యాక శాస్త్రం)పై దృష్టి సారించాలి.
2బి: జామెట్రీలో వృత్తాలు, వృత్త సరణులు, అనిశ్చిత సమాకలనం, నిశ్చిత సమాకలనం, అవకలన సమీకరణాలు నేర్చుకుంటే 33+13+25+19+17 మార్కులు సాధించవచ్చు. పూర్తి మార్కులకు పరావలయం, దీర్ఘవృత్తం, అతి పరావలయం (9+6+8)లనూ చూసుకోవాలి. ముఖ్యంగా గమనించాల్సిందేంటంటే.. శంఖువులో స్పర్శరేఖ, అభిలంబరేఖ సమీకరణాలను తొలగించారు. సమాకలనంలో పాక్షిక భిన్నాలకు సంబంధించిన సమస్యలు, ఇంటిగ్రేషన్ బైపార్ట్స్, రిడక్షన్ ఫార్ములాలకు సంబంధించిన సమస్యలతోపాటు అవధులపై ఉన్న సమస్యలనూ తొలగించారు. పూర్తిగా తొలగించిన చాప్టర్- వైశాల్యాలు. ఇంకా సమఘాత, అసమఘాత అవకలన సమీకరణాలు, లీనియర్ డిఫరెన్షియేషన్ ఆఫ్ ఈక్వేషన్స్ కూడా తొలగింపు జాబితాలోనివే.