• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఇంటర్‌ పరీక్షల వేళ.. ఇవి ముఖ్యం!

మార్కుల సాధనకు మెలకువలు365 రోజుల కృషిని మూడు గంటల్లో వ్యక్త పరచాలి. ఏడాది పాటు సాగిన కఠోర శ్రమ ఫలితాన్ని నిర్ణయించడానికి ఈ మూడు గంటలే ప్రామాణికం. తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్‌ పరీక్షలకు సిద్ధమవుతోన్న విద్యార్థులందరికీ ఈ స్వల్ప వ్యవధే కీలకం. దీన్ని సద్వినియోగం చేసుకున్నవారిదే విజయం. ఇందుకు ఆత్మవిశ్వాసమే ఆయుధం.. సానుకూల దృక్పథమే ప్రేరణ.. ఈ రెండు అస్త్రాలతో పరీక్ష హాల్లోకి అడుగుపెట్టినవారికి.. ప్రతి ప్రశ్నకూ జవాబు దొరుకుతుంది. అన్ని సబ్జెక్టుల్లోనూ మెరుగైన స్కోరు కానుక అవుతుంది. 


అందరికీ అదే ప్రశ్నపత్రం, అవే ప్రశ్నలు. ఏడాదిగా పరిచయం ఉన్నవే.. ఎన్నోసార్లు చదివినవే. అన్నీ వచ్చినవే. వాటిని అక్షరీకరించాలి. పరీక్షలంటే ఇంతే. మూల్యాంకనం చేసే మాష్టార్లకి మీరు రాసిన సమాధానాలే ప్రమాణాలు. మిమ్మల్ని మరో మెట్టుకి తీసుకెళ్లడానికే ఇదంతా. అందువల్ల ఎలాంటి పొరపాట్లకూ అవకాశం ఇవ్వరాదు. ‘వచ్చినప్పటికీ.. రాయడం మర్చిపోయా’, ‘ఒత్తిడితో ఈ చిన్న తప్పు చేశా’, ‘నీరసంతో సరిగా రాయలేదు’, ‘సమయం సరిపోలేదు’.. ఇలా ఏ సాకులకూ అవకాశం లేదు. 


ఈ సమాధాన పత్రాలను మీ ఉపాధ్యాయులు మూల్యాంకనం చేయడం లేదు. వివరణ ఇవ్వడానికి అవకాశం లేదు. అందువల్ల శ్రద్ధతో జాగ్రత్తగా రాయాలి. గాభరా పడకుండా, తత్తరపాటు లేకుండా తెలిసినవన్నీ ఒక పద్ధతిగా పేర్చాలి. మూల్యాంకనం చేసినవారిని అవి హత్తుకోవాలి. ఏడాది పాటు ఏమి నేర్చుకున్నారో ఇప్పుడు కీలకం కాదు. ఒడిసిపట్టిన విజ్ఞానాన్ని ఎంత ప్రభావవంతంగా రాశారన్నదే ముఖ్యం. ఆందోళన చెందినా, ఒత్తిడికి గురైనా, మనసు పక్కకు మళ్లినా.. వచ్చిన ప్రశ్నలే ఇబ్బంది పెడతాయి. జవాబు తెలిసినప్పటికీ కలం ముందుకు కదలదు. 


ఈ ఇబ్బందులేవీ లేకుండా పరీక్షలో విజయం సాధించడానికి.. ఆత్మవిశ్వాసం, సానుకూల దృక్పథం, మానసిక సన్నద్ధత చాలా ముఖ్యం. వీటిని ఆచరించినవారు.. ఆనందంతో పరీక్షలు రాసి, సంతోషంతో బయటకు వస్తారు. ఫలితాలూ ఆశించినవే దక్కుతాయి. 


పరీక్ష రోజు..

అవసరమైనవన్నీ (హాల్‌ టికెట్, రెండు పెన్నులు, పెన్సిల్, రబ్బరు, నీళ్ల సీసా, రుమాలు, డబ్బులు..) ఉన్నాయో, లేవో పరిశీలించుకుని మీతోపాటు తీసుకువెళ్లండి. 

పరీక్షకు బయలు దేరే ముందు, వెళ్తున్న తోవలో ఏమీ చదవకుండా రిలాక్స్‌డ్‌గా ఉండండి. 

నిర్దేశిత సమయం కంటే కనీసం అర గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోండి.

హాల్లోకి వెళ్లక ముందే కాలకృత్యాలు తీర్చుకోండి. ఇలాచేయడం వల్ల పరీక్ష మధ్యలో అవాంతరాలకు అవకాశం ఉండదు. సమయమూ కలిసొస్తుంది. 

పూర్తి ఆత్మవిశ్వాసంతో పరీక్ష హాల్లోకి అడుగుపెట్టండి. రెండు మూడు సార్లు ఊపిరి బాగా పీల్చుకుని, నెమ్మదిగా వదలండి.

ప్రశ్నపత్రం అందుకున్న తర్వాత అందులోని ప్రశ్నలన్నీ ఒకసారి చదవండి. కష్టమైన ప్రశ్నలు, సమాధానం తెలియనివి కనిపిస్తే ఆందోళన చెందకండి. మీకు కష్టంగా అనిపించినవి పరీక్ష రాస్తున్న మీ సహచర విద్యార్థులందరికీ కష్టంగానే ఉంటాయని తెలుసుకోండి. 

నిబంధనలేమీ లేకపోతే బాగా తెలిసిన ప్రశ్నతో జవాబు ప్రారంభించండి. ముఖ్యమైన అంశాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వండి.  

అవసరమైన ప్రశ్నలకే సమాధానాలు రాయండి. సమయం మిగిలితేనే అదనపు సమాధానాల గురించి ఆలోచించండి. 

మధ్యలో జవాబు మర్చిపోతే కొంత సమయమే కేటాయించండి. అక్కడే ఆగిపోతే మిగిలిన వాటికి వ్యవధి సరిపోదు. అవసరమైనంత ఖాళీ వదిలి మరో ప్రశ్నలోకి వెళ్లండి. పరీక్ష చివరిలో ఇలా వదిలేసిన వాటి గురించి ఆలోచించండి. 

కనీసం పది నిమిషాల ముందైనా ప్రశ్నపత్రాన్ని పూర్తిచేయండి. అవసరమైన అన్ని ప్రశ్నలకూ జవాబులు రాశారో, లేదో సరిచూసుకోండి. ప్రశ్న సంఖ్య, సెక్షన్‌ కచ్చితంగా ఉన్నాయా, లేదా గమనించండి. ఎడిషనల్‌ పత్రాలు క్రమ పద్ధతిలో పేర్చారో, లేదో పరిశీలించండి. హాల్‌ టికెట్‌ నంబర్‌ మరోసారి చెక్‌ చేసుకోండి. 


పరీక్ష తర్వాత..

పరీక్ష ముగియగానే ప్రశాంతంగా బయటకు వచ్చేయండి. ఎవరితోనూ జవాబుల గురించి చర్చించవద్దు. చేసిన తప్పులు గుర్తుచేసుకుని ఎందుకలా జరిగిందని ఆలోచిస్తూ, దిగులు చెందొద్దు. రాసిన జవాబు సరైనదా, కాదా తెలుసుకోవడానికి పుస్తకాలు సమీక్షించవద్దు. ఈ వివరాలు సరిచూసుకోవడానికి అన్ని పరీక్షలూ ముగిసిన తర్వాత కావాల్సినంత సమయం ఉంటుంది. 

పరీక్షలో చేసిన తప్పు సరిదిద్దుకోవడానికి అవకాశం లేదు. అందువల్ల మర్చిపోండి. ఈ రోజు పరీక్ష ప్రభావం రేపటి దానిపై పడకుండా జాగ్రత్త వహించండి. చిన్న తప్పులు జరిగినా.. మిగిలిన పరీక్షల్లో ఆ పొరపాట్లు పునరావృతం కాకుండా చూసుకుంటూ వీలైనన్ని ఎక్కువ మార్కులు రాబట్టుకోవడానికి ప్రయత్నించండి. 


సమయం..

ప్రశ్నకు కేటాయించిన మార్కులను బట్టి ఎంత సమయం వెచ్చించాలో నిర్ణయించుకోండి. నిర్ణీత వ్యవధిలో పూర్తయ్యేలా చూసుకోండి. అప్పుడప్పుడు చేతి గడియారాన్ని గమనించండి. ఎక్కువ ఎడిషనల్స్‌ రాస్తేనే అధిక మార్కులు వస్తాయని భావించవద్దు. ఆ ప్రశ్నకు మించి రాయకూడదు. అందులో ఉపయోగించే కీలక పదజాలం (కీ వర్డ్స్‌) ముఖ్యం. బాగా అవగాహన ఉందని అనవసరమైన సమాచారం రాస్తే విలువైన సమయం కోల్పోయినట్లే. పరిధి దాటకుండా, పదాడంబరతకు పోకుండా, అడిగిన మేరకే, అవసరమైనంత వరకే రాయండి.   

ఆశావాదంతో ప్రశ్నపత్రాన్ని చదివితే ప్రతి ప్రశ్న మంచి అవకాశంలా కనిపిస్తుంది. చాలా బాగా జవాబులు రాస్తాను అనుకుని ప్రారంభించండి.  

ప్రశ్నపత్రాన్ని జయించడానికి ఒకటే ఆయుధం. అదే ఆత్మవిశ్వాసం. దానికి  మించిన అస్త్రం లేదు. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకాన్ని కోల్పోవద్దు. ఎందుకంటే విజయానికి అదే కీలకం. 

‘బాగా చదివాను.. కాబట్టి బాగా రాయగలను.. అందువల్ల ఆందోళన చెందాల్సిన పనిలేదు’-  ఇలా అనుకుంటే ఒత్తిడి దూరమవుతుంది. 

నిరుత్సాహానికి లోనుకావద్దు. అలాంటి పరిస్థితి వచ్చిన సందర్భాల్లో.. విజయం నాదే అనే సందేశాన్ని మీ మనసుకి పంపండి.  


ఈ రెండూ ముఖ్యమే..

ఆహారం తీసుకోకపోతే నేర్చుకున్న విషయాలు గుర్తుకు రావు. వేగంగా రాయలేము. మెదడు చురుకుగా పనిచేయాలంటే గ్లూకోజ్‌ అందాలి. అందువల్ల ఏమీ తినకుండా, ఖాళీ కడుపుతో పరీక్ష హాల్లోకి వెళ్లవద్దు. ఇడ్లీ, పాలు, అరటిపండు.. ఇలా మీకు నచ్చినవి తినండి. అవసరమైనన్ని నీళ్లు తాగండి. వాతావరణం కొంచెం వేడిగా ఉండొచ్చు కాబట్టి.. సౌకర్యవంతంగా, వదులుగా ఉండే లేత రంగు దుస్తులు ధరించడానికి ప్రాధాన్యం ఇవ్వండి.

పరీక్షలన్నాళ్లూ.. తొందరగా పడుకోవడం, తెల్లవారుజామున లేవడం అలవాటు చేసుకోండి. రాత్రిపూట ఎక్కువ సమయం మేల్కొని చదవడం వల్ల మెదడు చురుకుగా పనిచేయదు. మానసికంగానూ అలసట అనిపిస్తుంది. పరీక్ష హాల్లో ఆహ్లాదంగా, తాజాగా ఉండడానికి రాత్రి వేళల్లో 6 - 7 గంటల నిద్ర తప్పనిసరి. ఇలా చేస్తేనే పరీక్ష రాసేటప్పుడు చదివినవన్నీ గుర్తుంటాయి. వంద శాతం మార్కులు మీ సొంతమవుతాయి.   


దస్తూరీ

అకడమిక్‌ పరీక్షల్లో చేతిరాత ప్రాధాన్యం ఎక్కువే. మీ దస్తూరీ అర్థమయ్యేలా ఉండాలి. సరిగా రాయలేనివాళ్లు పదాలు, వాక్యాల మధ్య చిన్న ఖాళీ విడిచిపెట్టాలి. వీలైనంతవరకు కొట్టివేతలు, దిద్ది రాయడం లేకుండా చూసుకోవాలి. అక్షరాలు ముత్యాల్లా ఉండనవసరం లేదు. ప్రభావవంతంగా, అచ్చు తప్పులు, అన్వయ దోషాలు లేకుండా రాస్తే సరిపోతుంది. 
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం... మీ కోసం!

‣ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ తుది సన్నద్ధత! (ఏపీపీఎస్సీ)

‣ గ్రూప్‌-1 ప్రిపరేషన్‌ ప్లాన్‌ (టీఎస్‌పీఎస్సీ)

‣ ‘ట్రిపుల్‌ ఆర్‌’తో ఒత్తిడిని చిత్తు చేద్దాం!

‣ సివిల్స్‌ సన్నద్ధత!

‣ ఈ నైపుణ్యాలే ఫ్రెషర్లకు ధీమా!

‣ జ్ఞాపకశక్తిని మెరుగుపరుచుకుందాం ఇలా..

‣ ట్రెండింగ్‌ విద్యావిధానం.. టెక్నాలజీ ఎన్‌హాన్స్‌డ్‌ లెర్నింగ్‌!

Posted Date : 28-02-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని