• facebook
  • twitter
  • whatsapp
  • telegram

భాషపై పట్టు సాధించాలి 

తెలుగులో ప్రతి పాఠాన్ని క్షుణ్నంగా చదివితే విద్యార్థి ఎలాంటి ప్రశ్నకైనా సులువుగా సమాధానం రాయవచ్చు. విద్యార్థులు వ్యాకరణాంశాలపై దృష్టి సారించాలి. పదాలను విభజించి అర్థాలు, భాషపై పట్టు సాధించి అక్షరదోషాలు లేకుండా రాస్తే తెలుగులో మంచి మార్కులు పొందవచ్చు.      

    ఈ విద్యాసంవత్సరం 30% సిలబస్‌ను తొలగించారు. కాబట్టి విద్యార్థులు ప్రస్తుత సిలబస్‌కు అనుగుణంగా ప్రణాళికతో పరీక్షలకు సిద్ధం కావాలి. 

    ద్వితీయ సంవత్సరం తెలుగు వార్షిక ప్రశ్నపత్రంలో నాలుగు భాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. 

పద్యభాగం 

* దీని నుంచి '*' గుర్తున్న పద్యాలు ఇస్తారు. ఇచ్చిన వాటిలో ఏదైనా ఒకదానికి ప్రతిపదార్థం, భావం రాయాలి. దీనికి 8 మార్కులు. 

*  ప్రాచీన పద్యభాగం (1, 2, 3), ఆధునిక పద్యభాగం (5, 6) నుంచి ప్రశ్నలు అడుగుతారు. దీనిలో ఒక ప్రశ్నకు 20 పంక్తుల్లో సమాధానం రాయాలి. దీనికి  6 మార్కులు కేటాయించారు.

*  ఇచ్చిన సందర్భ సహిత వ్యాఖ్యల్లో రెండింటికి సమాధానాలు రాయాలి. ఒక్కోదానికి 3 మార్కులు. ఇందులో కవి పరిచయానికి ఒక మార్కు, సందర్భానికి ఒక మార్కు, భావం (వివరణ)కు ఒక మార్కు కేటాయిస్తారు. (పాఠ్యాంశాలు 1, 2, 3, 5, 6)

*  సంగ్రహ రూప ప్రశ్నల్లో ఏవైనా రెండింటికి మాత్రమే సంక్షిప్తంగా సమాధానాలు రాయాలి. ఒక్కోదానికి 2 మార్కులు. (పాఠ్యాంశాలు - 1, 2, 3, 5, 6)

*  ఏక వాక్య సమాధాన ప్రశ్నల్లో ఆరింటికి జవాబులు రాయాలి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. 

గద్యభాగం

* వ్యాసరూప సమాధాన ప్రశ్నల్లో ఒకదానికి 20 పంక్తుల్లో జవాబు రాయాలి. దీనికి 6 మార్కులు కేటాయిస్తారు. (పాఠ్యాంశాలు 1, 2, 4, 5)

* సంగ్రహ రూప ప్రశ్నల్లో రెండింటికి మాత్రమే సంక్షిప్తంగా సమాధానాలు రాయాలి. ఒక్కోదానికి 2 మార్కులు.  

* ఏక వాక్య సమాధాన ప్రశ్నల్లో ఆరింటికి జవాబులు రాయాలి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయిస్తారు. 

ఉపవాచకం

ఇచ్చిన ప్రశ్నల్లో రెండింటికి 15 పంక్తుల్లో సమాధానాలు రాయాలి (1, 2 నాటకాలు). ఒక్కోదానికి 4 మార్కులు ఉంటాయి.  సందర్భ సహిత వ్యాఖ్యల్లో రెండింటికి సమాధానాలు రాయాలి. ఒక్కో సందర్భానికి 3 మార్కులు. దీనిలో కవి పరిచయానికి ఒక మార్కు, సందర్భానికి ఒక మార్కు, వివరణకు ఒక మార్కు కేటాయిస్తారు. ఈ సందర్భాలు 1, 2 నాటకాల నుంచి మాత్రమే వస్తాయి.

వ్యాకరణాంశాలు (ఛందస్సు, అలంకారాలు, భాషాభాగాలు)

ఛందస్సు

* దీనిలో పద్య లక్షణాలను తెలిపే ప్రశ్నలు అడుగుతారు. వీటిలో ఏదైనా ఒకదానికి పద్య లక్షణాలు, ఉదాహరణ రాసి, గణవిభజన చేసి సమన్వయపరిస్తే 6 మార్కులు పొందవచ్చు. దీనిలో లక్షణాలకు 3 మార్కులు, ఉదాహరణ గణవిభజనకు 2 మార్కులు, సమన్వయ పరిచినందుకు ఒక మార్కు కేటాయిస్తారు.

* ఛందస్సు నుంచి ఏక వాక్య సమాధాన ప్రశ్నలు కూడా వస్తాయి. వీటిలో ఆరింటికి సమాధానాలు రాయాలి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. 

 అలంకారాలు 

    దీనిలో అలంకార లక్షణాలకు సంబంధించి ప్రశ్నలు అడుగుతారు. ఇచ్చిన వాటిలో ఒకదానికి లక్షణాలు రాసి ఉదాహరణతో సమన్వయ పరిస్తే 6 మార్కులు పొందవచ్చు. లక్షణాలకు 3 మార్కులు, ఉదాహరణకు 2 మార్కులు, సమన్వయ పరిచినందుకు ఒక మార్కు కేటాయిస్తారు.

    అలంకారాల నుంచి కూడా ఏక వాక్య సమాధాన ప్రశ్నలు ఇస్తారు. వీటిలో ఆరింటికి సమాధానాలు రాయాలి. ఒక్కోదానికి ఒక మార్కు. 

   సంక్షిప్తీకరణ 

    పాఠ్యపుస్తక గద్యభాగంలోని పాఠ్యాంశం నుంచి ఒక పేరాగ్రాఫ్‌ ఇస్తారు. ఆ పేరాను చదివి 1/3వ వంతుకు కుదించి రాయాలి. దీనికి 6 మార్కులు ఉంటాయి.

సంభాషణ రచనా నైపుణ్యం 

పాఠ్యపుస్తకంలోని సంభాషణ రచనా నైపుణ్యాల నుంచి ఒక ప్రశ్న వస్తుంది. దీనికి సంబంధించి కొన్ని పదాలు ఇస్తారు. ఆ పదాల ఆధారంగా ఇద్దరి మధ్య సంభాషణ ఎలా జరుగుతుందో రాయాలి. దీనికి 5 మార్కులు.

  భాషాభాగాలు 

భాషాభాగాల నుంచి అయిదు ప్రశ్నలు అడుగుతారు. వీటికి ఒక వాక్యంలో సమాధానం రాయాలి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. 

  తొలగించిన అంశాలు

పద్యభాగంలో అన్నదాత; గద్యభాగంలో సినారె కవిత్వం - మానవతా వాదం, పక్షుల కథనం పాఠ్యాంశాలను; ఉపవాచకం నుంచి స్వాతంత్య్ర వాహిని నాటకాన్ని తొలగించారు 

విద్యార్థులు చేసే పొరపాట్లు

*     అక్షరదోషాలు రాయడం.

*     పద్యంలోని పదాల అర్థాలు, భావం సరైన విధంగా రాయకపోవడం.

*     సందర్భ సహిత వ్యాఖ్యల్లో కవి, గ్రంథం పేర్లు మరిచిపోవడం. 

*     ఛందస్సులో లఘువు, గురువులు, యతిమైత్రి గుర్తించలేకపోవడం. గణవిభజన సరిగ్గా చేయకపోవడం; గణాలు, సరైన ఉదాహరణ పద్యపాదం రాయకపోవడం. 

*     అలంకార లక్షణాలు, దానికి సరైన ఉదాహరణ రాయకపోవడం. 

*     ఒక మార్కు ప్రశ్నలకు జవాబులు రాసేటప్పుడు నంబర్లు తప్పుగా వేయడం, ఒక సమాధానానికి మరొకటి రాయడం. 

*     సంభాషణ రచనా నైపుణ్యంలో ఇచ్చిన పదాలను సరైన విధంగా ఉపయోగించలేకపోవడం. 

*     విద్యార్థులు ఇలాంటి పొరపాట్లు చేయకుండా జాగ్రత్త వహించాలి.

గుర్తుంచుకోవాల్సిన అంశాలు

*     పరీక్షలో రాసిన ప్రశ్నలన్నింటికీ నంబర్లు సరిగ్గా రాశారో లేదో చూసుకోవాలి.

*     ఒకటికి రెండు సార్లు ప్రశ్నను చదివి సమాధానాలు రాయాలి.

*     సందర్భ సహిత వ్యాఖ్యలు రాసేటప్పుడు కవి పరిచయం, సందర్భం, వివరణ తప్పనిసరిగా రాయాలి.

*     ఛందస్సు ఉదాహరణ పాదం తీసుకొని రాసేటప్పుడు గణవిభజన, పాదంలో అక్షరాలు ఒక్కోసారి తప్పుగా రాస్తుంటారు. పద్యపాదంలోని అక్షరాలతో పాటు గురువు, లఘువులు, గణాలు తప్పులు లేకుండా గుర్తించి గణవిభజన చేయాలి.  

*     అలంకారాలకు సరైన ఉదాహరణ రాసి సమన్వయం చేయాలి.

*     సంక్షిప్తీకరణలో ఇచ్చిన పేరాను బాగా చదివి మూడో వంతుకు కుదించి రాయాలి.

మ‌రింత స‌మాచారం కోసం 

మోడ‌ల్ పేప‌ర్ స‌మాధానాల‌తో

Posted Date : 13-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని

విద్యా ఉద్యోగ సమాచారం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌