• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ప్రమాణాలపై పట్టు సాధించాలి

బోర్డ్‌ ఆఫ్‌ ఇంటర్మీడియట్‌ ఈ ఏడాది సీనియర్‌ ఇంటర్‌ ఫిజిక్స్‌ సిలబస్‌ను 30% తగ్గించింది. విద్యార్థులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మిగతా సిలబస్‌పై పూర్తి అవగాహన కలిగి ఉండాలి. ద్వితీయ సంవత్సరం చదివే విద్యార్థులు ఈసారి సబ్జెక్టులతో పాటు ప్రాక్టికల్స్‌పై కూడా దృష్టి సారించాలి. సబ్జెక్టుపై పట్టు, వెయిటేజిపై అవగాహన పెంచుకుని చదివినట్లయితే భౌతికశాస్త్రంలో మంచి మార్కులు సాధించవచ్చు.

 విద్యార్థులు గుర్తుంచుకోవాల్సినవి 

*     విద్యార్థులు మొదటి సంవత్సరంలో చదివిన అంశాలను నిర్లక్ష్యం చేయవద్దు. ముఖ్యంగా మొదటి సంవత్సరంలోని ప్రమాణాలు - కొలతలు పాఠ్యాంశం. అలాగే ప్రయోగాలు వాటికి సంబంధించిన అంశాలపై ఒక విషయ సూచికను తయారు చేసుకోవాలి.

*    ప్రయోగ పరీక్షల కోసం మొదటి సంవత్సరంలోని డోలనాలు పాఠ్యాంశంలోని లఘులోలకం, స్ప్రింగ్‌ లోలకం, బాయిల్‌ నియమం, సమాంతర చతుర్భుజ నియమం, త్రిభుజ బల నియమం, విశిష్టోష్ణం లాంటి అంశాలు తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి.

*    ముఖ్యంగా దీర్ఘ సమాధాన ప్రశ్నల కోసం డోలనాలు, ప్రవాహ విద్యుత్, కేంద్రకాల పాఠ్యాంశాలను చదివితే సరిపోతుంది. ఈ విద్యా సంవత్సరం సిలబస్‌ని తొలగించారు. కాబట్టి పై మూడు పాఠ్యాంశాల్లోని మూడు ప్రశ్నలను తొలగించారు. విద్యార్థులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని చదవాలి. అలాగే యూనిట్ల వారీగా వెయిటేజిని తెలుసుకొని దానికి తగినవిధంగా ఒక ప్రణాళికను     రూపొందించుకోవాలి.

సమస్యల సాధనలో... 

*     భౌతికశాస్త్రంలో లెక్కలు - వాటి సాధనలు కూడా చాలా ముఖ్యమైనవి.

*     సమస్యలో ఏ భౌతికరాశి విలువ ఇచ్చారో తెలుసుకోవాలి.

*     ఏ భౌతికరాశిని కనుక్కోవాలో గుర్తించాలి. వీటికి తగిన సూత్రాన్ని ఎంచుకోవాలి.

*    భౌతికరాశుల ప్రమాణాలు తెలుసుకోవాలి. 

*     సమస్యలో ఇచ్చిన భౌతికరాశిని సూచించే ఆంగ్ల అక్షరం తెలిసి ఉండాలి.

*     సూత్రాలను గుర్తుంచుకొని, ప్రతిక్షేపించే సమయంలో అన్ని భౌతికరాశుల ప్రమాణాలు ఒకే పద్ధతిలో ఉన్నాయో లేదో  సరిచూసుకోవాలి.  

భౌతికశాస్త్రం ద్వితీయ సంవత్సరం పాఠ్యపుస్తకంలో మొత్తం 16 పాఠ్యాంశాలు ఉన్నాయి. ఇందులోని పాఠ్యాంశాల ఆధారంగా ప్రశ్నపత్రాన్ని మూడు సెక్షన్‌లుగా (అతి స్వల్ప, స్వల్ప, దీర్ఘ సమాధాన ప్రశ్నలు) విభజించారు. పాఠ్యాంశాలపై పూర్తి అవగాహన పెంచుకొని, సరైన ప్రణాళికను రూపొందించుకోవాలి. యూనిట్లలో అడిగే ప్రశ్నల ఆధారంగా పరీక్షకు సిద్ధం కావాలి. 

 యూనిట్ల వారీగా వెయిటేజి 

1) తరంగాలు: 8 + 8 మార్కులు

2) కిరణ దృశా శాస్త్రం - దృక్‌ సాధనాలు: 4 + 4 + 2 మార్కులు

3) తరంగ దృశా శాస్త్రం: 4 మార్కులు

4) స్థిర విద్యుదావేశాలు - క్షేత్రాలు: 4 + 4 మార్కులు

5) స్థిర విద్యుత్‌ పొటెన్షియల్‌ - కెపాసిటెన్స్‌: 4 + 4 మార్కులు

6) ప్రవాహ విద్యుత్తు: 8 మార్కులు

7) చలించే ఆవేశాలు - అయస్కాంతత్వం: 4 + 2 మార్కులు

8) అయస్కాంతత్వం - ద్రవ్యం: 2 + 2 మార్కులు

9) విద్యుదయస్కాంత ప్రేరణ: 4 మార్కులు

10) ఏకాంతర విద్యుత్‌ ప్రవాహం: 2 మార్కులు

11) విద్యుదయస్కాంత తరంగాలు: 2 మార్కులు

12) వికిరణం ద్రవ్యం - ద్వంద్వ స్వభావం: 2 + 2 మార్కులు

13) పరమాణువులు: 4 + 4 మార్కులు

14) కేంద్రకాలు: 8 మార్కులు

15) అర్ధవాహక ఎలక్ట్రానిక్‌ పదార్థాలు, పరికరాలు, సరళ వలయాలు: 4 + 2 మార్కులు

16) సంసర్గ వ్యవస్థలు: 2 మార్కులు

ఇందులో దీర్ఘ సమాధాన ప్రశ్నల కోసం 1, 6, 8వ పాఠ్యాంశాలు; స్వల్ప సమాధాన ప్రశ్నల కోసం 2, 3, 4, 5, 13, 15వ పాఠ్యాంశాలు చదవాలి. అతిస్వల్ప సమాధాన ప్రశ్నల కోసం 1, 6, 8వ పాఠ్యాంశాలు మినహా మిగిలినవన్నీ చదవాలి. పాత ప్రశ్నపత్రాలను చూసి విషయావగాహన పెంచుకోవాలి. ప్రశ్నలు అడిగే విధానం తెలుసుకొని పరీక్షకు సన్నద్ధమైతే భౌతికశాస్త్రంలో 60/60 మార్కులు సాధించవచ్చు.

మొదటి సంవత్సరంలో చేసిన పొరపాట్లను చేయకుండా పరీక్షలకు సిద్ధం కావాలి. ఏది చదివినా ఇష్టంతో, అర్థం చేసుకుంటూ పూర్వ జ్ఞానాన్ని ఉపయోగిస్తూ చదవాలి. చదివిన అంశాలను స్నేహితులతో చర్చిస్తే బాగా గుర్తుండిపోతాయి. పై విషయాలన్నీ తెలుసుకొని సరైన ప్రణాళికతో సన్నద్ధమవ్వాలి.

ప్రాక్టికల్స్‌...

ద్వితీయ సంవత్సరం భౌతికశాస్త్రంలో ప్రయోగాలు కూడా ఉంటాయి. ప్రాక్టికల్స్‌లో ఒక ప్రశ్న అడుగుతారు. దీనికి 30 మార్కులు కేటాయించారు. 

మూల్యాంకనం చేసే విధానం

సూత్రం: 2 మార్కులు, ప్రయోగ విధానం: 3 మార్కులు

పట్టిక: 2 మార్కులు, పరిశీలనలు: 4 మార్కులు

గ్రాఫ్‌: 2 మార్కులు, గణన: 4 మార్కులు

ఫలితం: 1 మార్కు, ప్రమాణం: 1 మార్కు

రికార్డు: 4 మార్కులు, జాగ్రత్తలు: 2 మార్కులు

వైవా: 5 మార్కులు

*    ప్రయోగ పరీక్షలో సూత్రం నుంచి దేన్ని కనుక్కోవాలో దానికి సంబంధించి ఒక పట్టికను రూపొందించుకోవాలి.

*    పరిశీలనలు, గణన, ఫలితం, గ్రాఫ్‌ ప్రయోగం చేసిన తర్వాత రాయాలి.

*    జాగ్రత్తలు, ఫలితానికి ప్రమాణం రాయడం మరిచిపోవద్దు.

*    మూల్యాంకనం చేసే విధానాన్ని జాగ్రత్తగా పరిశీలించి ప్రతి అంశాన్ని పూర్తిగా రాయాలి. 

మ‌రింత స‌మాచారం కోసం 

మోడ‌ల్ పేప‌ర్ స‌మాధానాల‌తో

Posted Date : 21-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని