• facebook
  • twitter
  • whatsapp
  • telegram

1. మన ఆటలు

6 మార్కుల ప్రశ్నలు

1. పూర్వపు తెలుగువారి ఆటలను గురించి రాయండి. 
జ: 
తెలుగువారికి ప్రసిద్ధమైన జాతీయ క్రీడలు తక్కువ. యువతీయువకులు ఆడే ఆటలు బహు తక్కువ. మన ప్రబంధాల్లో బాలబాలికలు ఆడే అనేక ఆటల గురించి వర్ణించారు. వాటిలో కొన్ని నేటికీ వాడుకలో ఉన్నాయి.
            పూర్వం ఏడెనిమిదేళ్ల వయసు వచ్చే వరకు బాలబాలికలు కలిసి ఆడుకునేవారు. ప్రబంధాల్లో సుమారు వందేళ్ల క్రితం నాటి ఆటల గురించి అనేకం వర్ణించినప్పటికీ వాటిని ఎలా ఆడేవారో ఇప్పుడు ఎవరికీ తెలియదు. అయ్యలరాజు నారాయణామాత్యుడు తన ‘హంస వింశతి’ కావ్యంలో పూర్వం ఆడే ఆటల గురించి ఒక జాబితా ఇచ్చాడు. అందువల్ల ఆ ఆటల పేర్లు తెలిశాయి. కానీ వాటిని ఆడుకునే విధం తెలియలేదు. వాటిలో కొన్ని ఆటలు ఇంట్లో, ఇంకొన్ని ఆరు బయట ఆడేవారు. మరికొన్ని ఇంట్లో, బయటా బాలబాలికలు కలిసి ఆడుకునేవారు.
కొన్ని ఆటల పేర్లు: అచ్చనగండ్లు ఆటను బాలికలే ఆడేవారు. కోతి కొమ్మచ్చలు ఆటను బాలురు మాత్రమే ఆడేవారు. కందికట్టు, కంబాలాట, పుట్టగండ్లు, దాగిలిమూతలు లాంటి ఆటలను బాలబాలికలు ఇద్దరూ ఆడేవారు. ఈ ఆటల్లో కొన్నింటికి పాటలు కూడా ఉంటాయి. పాట పాడుతూ ఆటలాడటం పూర్వ పద్ధతి. ప్రస్తుతం పూర్వపు ఆటలతో పాటు పాటలు కూడా కనుమరుగుయ్యాయి. ఒకే ఆటకు ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరు ఉండేది. కోతి కొమ్మచ్చికి కోలక్రోతులని; కందికట్టుకు కందికాళ్లు, కుందెనగిరి, కుందెన గుడి అని పేర్లు ఉండేవి. మల్లయుద్ధం దక్షిణ హిందూ దేశంలో విరివిగా ప్రచారంలో ఉన్న ఆట. దీని గురించి విదేశీ యాత్రికులు సైతం వర్ణించారు. ఇప్పుడు జాతీయ క్రీడలని చెప్పాల్సి వస్తే చిడుగుడు, ఉప్పనబట్లు అనే ఆటలనే చెప్పుకోవాలి. ఉప్పనబట్లు, చిడుగులాట, బొంగరాల ఆట, గాలి పటం ఎగురవేయడం, అచ్చనగండ్ల ఆట, ఓమన గుంటలు, జూదం, పురి జూదం, చదరంగం లాంటి ఆటలు ఆరేడు వందల ఏళ్లకు పూర్వం ఉన్న మన తెలుగు ఆటలు. వీటిలో కొన్ని ఇంట్లో మరికొన్ని ఇంటి ఆరుబయట ఆడతారు.
చదరంగం: ఈ ఆట నిజంగా జాతీయ క్రీడ అని చెప్పుకోదగింది. దీన్ని ప్రపంచానికి భారతదేశమే పరిచయం చేసింది. ఈ ఆట ఆడే పలకకు అష్టాపదం అని పేరు. ఇది మన దేశం నుంచి పర్షియా, అరేబియా, స్పెయిన్‌ దేశాలకు వెళ్లింది. మన దేశంలో చదరంగం ఆటను ఉన్నత కులాలవారు, అందులో ముఖ్యంగా రాజులు ఎక్కువగా ఆడేవారు. కృష్ణదేవరాయలకు చదరంగం అంటే చాలా ఇష్టం. ఈయన కొప్పోలు కరణం బొడ్డుచర్ల తిమ్మనతో ఈ ఆటను ఎక్కువగా ఆడేవారు. దీనిలో తిమ్మన గొప్ప నేర్పరి. రాయలవారు కొప్పోలు గ్రామానికి కృష్ణరాయపురం అని పేరు పెట్టి తిమ్మనకు సర్వాగ్రహారంగా ధారపోశారు. ప్రస్తుతం చదరంగం జాతీయ క్రీడల్లో ఒకటి. 


2. పూర్వ కాలంలోని వేడుకలు, వినోదాల గురించి రాయండి. 
జ: 
పూర్వకాలంలో వేడుకలు, వినోదాలు ఎలా ఉండేవో ప్రాచీన ప్రబంధాల వల్ల తెలుస్తుంది. ప్రాచీన కాలంలో వసంతోత్సవం, శరదుత్సవం గొప్ప వేడుక రోజులు. 
వసంతోత్సవం: మన దేశంలో వసంతోత్సవాన్ని వెయ్యి సంవత్సరాల కిందటి నుంచే జరుపుకునేవారు. ఈ ఉత్సవానికి రెడ్డి రాజుల కాలంలో కొత్త శోభ వచ్చింది.
శరదుత్సవం: శరదృతువులో జరిగే ఉత్సవాలకు మహాలక్ష్మి పండుగలు, దేవీ నవరాత్రులు అని పేర్లు. మన పండుగలన్నీ మతానికి సంబంధించినవే. పండుగ రోజుల్లో ప్రజలు కొత్త బట్టలు కట్టుకొని, అలంకరించుకొని వేడుకలు, వినోదాలతో కాలం గడుపుతారు. గ్రామంలోని దేవుడి కల్యాణం, గ్రామ దేవత జాతర కూడా పండుగలే.
     ఈ పండుగ రోజుల్లో వీధి నాటకాలవారు, తోలుబొమ్మలవారు, దొమ్మరివారు వచ్చి ఆటలు ఆడి ప్రజలను సంతోష పెట్టే ఆచారం ఉండేది. గ్రామ సమూహి మాన్యం వల్ల వచ్చే ఆదాయాన్ని గ్రామస్థులు ఆట పాటల ఖర్చులకు ఉపయోగించేవారు. వినోద ప్రదర్శకులకు ఏడాదికి కొంత మొత్తాన్ని ఇచ్చేవారు. ప్రతి ఏటా వీరు ఉచితంగా ప్రదర్శనలు ఇచ్చి తమ వర్తనలను తీసుకువెళ్లేవారు.
మకర సంక్రమణం: సంక్రాంతి కూడా గొప్ప పండుగ. దీన్ని పెద్ద పండుగ అనేవారు. ఈ పండుగకు కొత్త ధాన్యం ఇంటికి వస్తుంది. గ్రామంలో ప్రతి ఇంటిని పసుపు, కుంకుమ, సున్నం పూతలు, ముగ్గులతో కన్నుల పండుగగా అలంకరిస్తారు. సంక్రాంతి అనేది భోగి, పెద్ద పండుగ, కనుమ అనే మూడు రోజుల పండుగ. మన దేశం వ్యవసాయ ప్రధానమైంది. వ్యవసాయానికి మేలు జాతి ఎద్దులు అవసరం. వీటిని తయారు చేసుకోవడానికి పూర్వం కొన్ని గ్రామాల్లో మాన్యాలు ఉండేవి. ఈ మాన్యాన్ని గెలుపెద్దుల మాన్యం అనేవారు. కనుమ పండుగ రోజున పశు ప్రదర్శనలు, ఎద్దుల పందేలు జరిగేవి. పరుగు పందెంలో గెలిచిన ఎద్దు గల ఆసామికి ఆ ఏడాదికి గెలుపెద్దుల  మాన్యం ఇచ్చేవారు. మరుసటి ఏడాది మరొకరి ఎద్దు గెలిస్తే ఆ మాన్యం అతడికి ఇచ్చేవారు.
కోడి పందేలు: సంక్రాంతి వేడుకల్లో కోడి పందేలు తప్పక ఉండేవి. కోడి పందేలు మన దేశంలో వెయ్యి సంవత్సరాలకు పూర్వమే ఉండేవి. 15వ శతాబ్దంలో వచ్చిన విదేశీ యాత్రికులు కోడి పందేల గురించి చెప్పారు. సంస్థానాల ప్రభువులకు కోడి పోరు చాలా ఇష్టమైన ఆట. పెద్దాపురం కోడిపుంజుల కథ ప్రసిద్ధమైంది. కోడి పోరు వల్లనే పల్నాటి యుద్ధం జరిగింది.
         పూర్వం వేడుకల్లో వృషభాల పోరు, మేష యుద్ధం, దున్నపోతుల యుద్ధం, ఏనుగుల పోరు, పొట్టేళ్ల  పోరు లాంటివి ఉన్నాయి. 900 ఏళ్ల కిందట అప్పటి ప్రజలకు ఇష్టమైన వినోదాల గురించి మానసోల్లాసం అనే విజ్ఞానకోశంలో సోమేశ్వర భూపతి రాశాడు. ఆ గ్రంథంలో మల్లయుద్ధాలు, అశ్వయుద్ధాలు; ఆంబోతులు, దున్నపోతులు, పొట్టేళ్లు, కోళ్ల యుద్ధాల గురించి తెలిపారు. కొండవీటి రెడ్డి రాజులు కాలం నాటికి గజములు, అశ్వాల పోరాటాలు వాడుకలో లేవు. కోడి పందేలు, పొట్టేళ్ల పోరాటాలు నేటికీ ఉన్నాయి. పూర్వం రాజులకు వేట అనే క్రీడ చాలా  ఇష్టం. ఈ వేటలో పారు వేట, విడి వేట, తెర వేట, దామెన వేట లాంటి రకాలు ఉండేవి. 


3 మార్కుల ప్రశ్నలు 

1. గెలుపెద్దుల మాన్యం గురించి రాయండి. 
జ: మనది వ్యవసాయ ప్రధాన దేశం. వ్యవసాయానికి మేలు జాతికి చెందిన బలమైన ఎద్దులు అవసరం. ఈ మేలు జాతి ఎద్దులను తయారు చేయడానికి పూర్వం కొన్ని గ్రామాల్లో గ్రామస్థులు ఒక మాన్యం ఏర్పాటు చేసినట్లు స్థానిక చరిత్రల వల్ల తెలుస్తుంది. ఈ మాన్యానికి గెలుపెద్దుల మాన్యం అని పేరు.
కనుమ పండుగ రోజు పశు ప్రదర్శనలు, ఎద్దుల పందేలు జరిగేవి. ఈ పరుగు పందెంలో గ్రామంలో ఎవరి ఎద్దు గెలుస్తుందో ఆ ఏడాదికి  గెలుపెద్దుల మాన్యం గెలిచిన యాజమానికి చెందుతుంది. మరుసటి ఏడాది మరొక ఎద్దు గెలిస్తే ఆ మాన్యం ఆ ఆసామికి చెందుతుంది. ఈ మాన్యం  ప్రస్తుత రోలింగ్‌ కప్‌ లాంటిది. ఈ గెలుపెద్దుల మాన్యం ప్రతి గ్రామంలో లేకపోయినా ప్రజలు పశువులను అలంకరించి కనుమ పండుగ రోజు తప్పకుండా వేడుకలు జరిపేవారు.


2. ధనుర్విద్య, కత్తిసాము, గుర్రపు స్వారి లాంటి వాటి గురించి తెలపండి. 
జ:
 ధనుర్విద్య, కత్తిసాము, గుర్రపు స్వారి, ఈటెను విసరడం లాంటి వాటిని అందరూ నేర్చుకునేవారు. ముఖ్యంగా క్షత్రియులు, శూద్రులు ఈ విద్యలను నేర్చుకునేవారు. ఏ కులం వారైనా పరిపాలించేవారు. ఆయుధ విద్యతో జీవించేవారు. బ్రాహ్మణులు, వైశ్యులు, విశ్వ బ్రాహ్మణులు కూడా గజాశ్వ విద్యలు, యుద్ధతంత్రం నేర్చుకొని రాజుల వద్ద దండనాథులుగా ఉండేవారని శాసనాలు తెలుపుతున్నాయి. కాకతి రుద్రమ దేవి, గణపదేవి లాంటి రాణులు గజ, అశ్వ శిక్షణ, యుద్ధ విద్యల్లో నిపుణులు.  కృష్ణరాయల అంతఃపురంలో మల్లవిద్య, కత్తిసాము, డాలును వాడటంలో నేర్పు గల 12 మంది స్త్రీలు ఉండేవారని పేయస్‌ అనే విదేశీ యాత్రికుడు తెలిపాడు.
       నాడు గుర్రపు స్వారీలో అందెవేసిన రౌతులు చాలా మంది ఉండేవారు. రాజమహేంద్రవర రాజ్య పాలకుడు వీరభద్రారెడ్డి తమ్ముడు దొడ్డారెడ్డి గుర్రపు స్వారీలో ఉద్ధండుడు. అతడు గుర్రాన్ని 24 మూరల దూరం దూకించాడట. కత్తిసాములో నేర్పు గలవారు ఒక్క వేటుకు ఆరు ముక్కలు చేసేవారట. కళింగ దేశ రాజకుమారులు గొప్ప రౌతురాయలు, గజ సాధనికులు. శస్త్ర విద్య, ధనుర్విద్యలను ద్రోణుడి లాంటి బ్రాహ్మణులే నేర్పేవారట.


3. చదరంగం గురించి రాయండి. 
జ: 
చదరంగం ఆట జాతీయ క్రీడగా చెప్పుకోదగింది. ఈ ఆటను మానవ జాతికి భారతదేశమే పరిచయం చేసింది. చదరంగం ఆడే పలకకు అష్టాపదం అని పేరు. ఇది మన దేశం నుంచి పర్షియా, అరేబియా, స్పెయిన్‌ లాంటి దేశాలకు వెళ్లింది. మన దేశంలో చదరంగం ఆటను ఉన్నత కులాలవారు ముఖ్యంగా రాజులు ఎక్కువగా ఆడేవారు. విజయనగర శ్రీకృష్ణదేవరాయలకు చదరంగం అంటే చాలా ఇష్టం. కృష్ణదేవరాయలు ఈ ఆటను ఎక్కువగా కొప్పోలు గ్రామ కరణం బొడ్డుచర్ల తిమ్మనతో ఆడేవారట. ఎంతమంది కలిసి ఎదురెత్తులు వేసినా తిమ్మన ఒక్కడే ఆడి వెయ్యార్లు పందెం గెలిచేవారట. రాయలవారు కొప్పోలు గ్రామానికి కృష్ణ రాయపురం అని పేరు పెట్టి బొడ్డుచర్ల తిమ్మనకు దాన్ని సర్వగ్రాహారంగా ధార పోశారట. ఇప్పుడు చదరంగం జాతీయ క్రీడల్లో ఒకటిగా ఉంది. 


4. గ్రామ సమూహి మాన్యం గురించి వివరించండి. 
జ: 
పూర్వం ప్రతి గ్రామంలో గ్రామం సమూహి మాన్యం అనే ఒక మాన్యం ఉండేది. ఈ మాన్యం ఏ ఒక్కరిదో కాదు అది గ్రామస్థులందరికీ చెందిన ఉమ్మడి మాన్యం. దాని మీద వచ్చే రాబడిని ధాన్యం లేదా రొక్కం రూపంలో గ్రామ ఉపయోగ కార్యాల నిమిత్తం వినియోగించేవారు. పండుగ రోజుల్లో ముఖ్యంగా స్వామి కల్యాణోత్సవ వేడుకల సమయంలో వీధి నాటకాలు ఆడే భాగవతులు, తోలుబొమ్మల ప్రదర్శన రూపంలో గ్రామస్థులను ఆనందింపజేయడానికి ఈ మాన్యాన్ని ఉపయోగించేవారు.


రచయిత: ఎం.మహేశ్వర నాయుడు


 

Posted Date : 09-12-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని

విద్యా ఉద్యోగ సమాచారం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌