• facebook
  • twitter
  • whatsapp
  • telegram

వేమన కవిత్వం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

1. వేమన పద్యాల్లోని హాస్యాన్ని వివరించండి.
జ: వేమన హాస్యం ఆయన కవిత్వానికి మెరుగు పెట్టి దానికి బలాన్ని చేకూర్చింది. ప్రాచీన కవులు చక్కని హాస్యాన్ని కలిగించే రచనలు చేయలేదు. ప్రాచీన నాటకాల్లోని విదూషకుడి హాస్యం అసహ్యాన్ని కలిగిస్తుంది. వేమన సహజంగా బోధకుడు, సంస్కర్త. అందువల్ల వేమనలోనూ హాస్యరసం కలుషితమైంది. వేమన అక్కడక్కడ అసభ్య రచనలు చేశాడు. అయినా ఆయన స్వతంత్ర బుద్ధి కలవాడు కాబట్టి తన పని తాను మరిచిపోయి స్వచ్ఛమైన హాస్యంతో తృప్తి కలిగించుకుంటాడు.
   ‘క్షీర సాగరంలో నిద్రించేవాడు గొల్లల ఇళ్లల్లో పాలు దొంగిలించి తాగడం ఎందుకు’ అని వేమన ప్రశ్నిస్తాడు. ‘ఎదుటి వారి సొమ్ములు ఎల్లవారికి తీపి’ అని తన ప్రశ్నకు తానే జవాబు చెప్పి మనల్ని నవ్విస్తాడు. వేమన చెప్పిన ఈ మాటలు వింటే అతడు ఎంతటి కృష్ణ భక్తుడైనా నవ్వకుండా ఉండలేడు. లోభిని అడగడం వల్ల ఫలితం ఉండదు. అది గొడ్డుటావును పితికినటువంటిది. అలాగే మేక మెడలోని చన్నులు తాగడం లాంటిది అని చెబితే చాలు. కానీ వేమన అంతటితో తృప్తి పడకుండా ‘గొడ్డుటావును పితకడానికి కుండను తీసుకువెళితే అది పళ్లు రాలగొడుతుంది కానీ పాలు ఇవ్వదు’ అని చెప్పాడు. అలాగే మేక గొంతు పట్టుకొని దాని మెడలోని చన్నులను తాగితే ఆశయే కానీ ఆకలి తీరదని చెబుతూ మనకు హాస్యాన్ని పండించాడు. ఇందులో కుండను తీసుకువెళ్లడం, గొంతు పట్టుకోవడం లాంటి మాటలు పాలు తాగబోయే వారి తొందరను స్పష్టంగా చూపించి వారి అజ్ఞానానికి మనకు నవ్వు తెప్పిస్తాయి. ఈ విధంగా వేమన కవితాధారలో చక్కని హాస్యం ఉంది.


2. వేమన నీతులను వివరించండి.
జ: వేమన చెప్పిన నీతులు ఆయన పేరును తెలుగుదేశంలో ఆచంద్రార్కక స్థాయిగా నిలిపాయి. ఈ లోకంలో నీతులు ఇతరులకు,  తనకు కూడా సౌఖ్యాన్ని కలిగిస్తాయి. వేమన చెప్పిన నీతులు స్వార్థాలు, పదార్థాలు అని రెండు విధాలుగా ఉన్నాయి. వేమన చెప్పిన నీతులకు ఆయన అనుభవమే మూలం. వేమన మంచి చెడ్డలను రెండింటినీ చేసి, దానిలోని తత్త్వాన్ని బాగా గ్రహించి ఇతరులకు బోధించాడు. అందువల్లనే సామాన్య నీతి గ్రంథాల్లో లేని తీవ్రత వేమన పద్యాల్లో కనిపిస్తుంది. 
దానం ఇవ్వడానికి పాత్రము: వేమన దానం ఇవ్వడానికి పేదరికమే ముఖ్యమైంది అని చెప్పాడు. దానం ఇవ్వాలనుకున్నప్పుడు  కులం, జాతి, గుణం లాంటివి చూడాల్సిన అవసరం లేదని పేదరికాన్ని మాత్రమే చూడాలని వేమన నీతి. తప్పు చేసినవాడైనా, నిందించేవాడైనా, శత్రువైనా, వేదం చదవడానికి అయోగ్యుడైనా ఏమీ లేని బీదవాడికే దానం ఇవ్వడం న్యాయమని ధనవంతుడికి దానం ఇవ్వకూడదని వేమన చెప్పాడు. అలాగే కన్యాదానం కూడా పేదవారికే చేయాలని, ధనవంతులకు చేయకూడదని తెలిపాడు.
అహింసా వ్రతం పాటించడం: వేమనకు అహింసా వ్రతంపై మక్కువ. జీవిని జీవి చంపితే అది శివుడిని చంపినట్లేనని, నిజం  తెలుసుకుంటే జీవి శివుడే అని అహింసా నీతిని బోధించాడు. వేమనకు హింస ఇష్టం లేదు. శత్రువును హింసించడం కూడా ఇష్టం లేదు. చంపడానికి యోగ్యుడైన శత్రువు తన చేతికి చిక్కినా అతడికి మేలు తప్పా కీడు చేయరాదని చెప్పాడు. ‘పొసఁగ మేలు చేసి పొమ్మనుటే చాలు’ అని వేమన చెప్పాడు.
వేమన స్వార్థ నీతుల్లో స్వానుభవం, వివేకం ఎక్కువగా కనిపిస్తాయి. మనుషులకు ఈ లోకంలో నెమ్మదిగా బతకడానికి అవసరమైన ఓర్పు, వివేకాన్ని వేమన నీతులు బోధిస్తాయి. వీటిని అందరూ ఇష్టపడతారు.
శౌర్య ప్రదర్శన: శౌర్యాన్ని తన కంటే బలవంతులపై చూపించడం అవివేకమని వేమన చెప్పాడు. తన బలాన్ని, ఇతరుల బలాన్ని సరిగా గుర్తించకుండా పట్టుదలతో ఎదుటివారిని ఎదిరించడం మంచిది కాదని చెప్పాడు. అలాగే అనుకూలత లేనప్పుడు తాము గొప్పవాళ్లమని చెప్పుకోకూడదని, అణగి మణగి ఉండటం తప్పుకాదని వేమన దృష్టాంత పూర్వకంగా నీతిని బోధించాడు. భార్య మాటలు విని అన్నదమ్ములను విడిచి వేరుగా వెళ్లేవాడు వెర్రివాడని, కుక్క తోక పట్టుకొని గోదావరిని ఈదలేడని స్పష్టంగా చెప్పాడు.
 

సంక్షిప్త రూప సమాధాన ప్రశ్నలు

1. వేమన కవిత్వంలోని భాషను వివరించండి.
జ: వేమన తీవ్రమైన భావాలు, అడ్డులేని నాలుక గలవాడు. వేమన రచనల్లో భావం, భాష రెండూ ఒకదానితో ఒకటి పోటీపడి ఆయన హృదయం నుంచి దూకి పైకి వస్తాయి. ఈయన భావాల మాదిరి భాష కూడా కృత్రిమం కాదు అది నిజమైన అచ్చతెనుగు.
   తెలుగు భాష స్వరూపాన్ని చెడగొట్టే మరో భాష వేమనకు తెలియదు. అందువల్లనే యోగ రహస్యాలు చెప్పేటప్పుడు వాడినపారి భాషిక పదాలు తప్పా వేమన ఏ మాట చెప్పినా తెలుగు మాట్లాడే వారందరికీ ఆయన పద్యాల్లో అర్థం కానివి ఏవీ ఉండవు.
   గొప్ప తత్వ విషయాలు చెప్పేటప్పుడు కూడా వేమన కవితా ధార ఇలాగే సులభంగా ఉంటుంది. ఈ సౌలభ్యంలోనే వేమన అసాధారణమైన కవితా శక్తి ఇమిడి ఉంది. అందువల్లనే వాటి సొగసు, బిగువును అందరూ అనుభవించి ఆనందిస్తారు.
ఉదా: ఆ.వె. పసుల వన్నె వేఱు పాలేక వర్ణమౌ
           పుష్ప జాతి వేఱు పూజ యొకటి
           దర్శనంబు వేఱు దైవంబొక్కటే
           విశ్వదాభిరామ వినుర వేమా!

2. లోభి స్వభావాన్ని తెలపండి.
జ: లోభి స్వభావాన్ని గురించి వేమన మంచి ఉదాహరణలతో అందరికీ నవ్వు వచ్చేలా కొన్ని కొసరు మాటలు చేర్చి రాశాడు. లోభి తాను తినడు, ఇతరులకు పెట్టడు. అందుకే లోభిని అడగడం వల్ల ఫలితం ఉండదు. లోభిని అడగటం గొడ్డుటావును పితికినట్లు, మేక మెడ చన్నును తాగినట్లు నిష్ప్రయోజనమైంది అని వేమన చెప్పాడు.
ఉదా: *  గొడ్డుటావుఁ బితుకఁ గుండ గొంపోయిన
         పండ్లు రాలదన్ను పాలనీదు
         లోభివాని నడుగ లాభంబు లేదయా
         విశ్వదాభిరామ వినుర వేమా!
గొడ్డుటావు దగ్గరకు పాలు పితకడానికి కుండను తీసుకువెళితే అది పాలను ఇవ్వదు. పైగా పళ్లు ఊడిపోయేలా తన్నుతుంది అని వేమన చెప్పాడు.
*  మేక కుతిక బట్టి మెడచన్ను గుడువగా
   ఆకలేల మాను ఆశగాక
   లోభివాని నడుగ లాభంబు గలుగునా
   విశ్వదాభిరామ వినుర వేమా!
మేక మెడలోని చన్నును తాగితే ఏదో ఆశయే కానీ ఆకలి తీరదని, అది లోభిని అడగడం లాంటిదని దాని వల్ల ఫలితం ఉండదని వేమన చెప్పాడు. 

3. అహింస గురించి వేమన అభిప్రాయం ఏమిటి?
జ: అహింసా వ్రతంపై వేమనకు చాలా ప్రీతి. ప్రాణిని ప్రాణి చంపడం శివుడిని చంపడం లాంటిదే అవుతుంది. పరిశీలించి చూస్తే ప్రతి ప్రాణి కూడా శివుడే అని వేమన చెప్పాడు. వేమనకు తన శత్రువును హింసించడం కూడా ఇష్టం లేదు.
ఆ.వె. చంపఁదగిన యట్టి శత్రువు తన చేత
      చిక్కెనేని కీడు చేయరాదు
      పొసఁగ మేలు చేసి పొమ్మనుటే చాలు
      విశ్వదాభిరామ వినుర వేమా!
నిజానికి చంపదగిన శత్రువు మన చేతికి చిక్కినా అతడికి కీడు చేయకూడదు, మేలు చేసి పొమ్మని చెప్పాలి అని వేమన చెప్పాడు. నిజానికి శత్రుత్వం చనిపోవాలి. అంతేకానీ శత్రువు చావాలని కోరడం అన్యాయం. మనుషులు ఇంతగా అహింసా వ్రతాన్ని పాటించలేరు. కనీసం జంతువులను బలి ఇవ్వడమైనా ఆపాలి. వేమన చెప్పినట్లు హింసను ఆపడానికి ప్రయత్నించడం మనందరి ముఖ్య ధర్మమని గుర్తించాలి.

ఏక వాక్య సమాధాన ప్రశ్నలు

1. ‘సారస్వతాలోకం’ను ఎవరు రాశారు?
జ: 
సారస్వతాలోకం అనే వ్యాసాలను రాళ్లపల్లి అనంత కృష్ణశర్మ రచించారు.


2. ‘రఘువంశం’ను ఎవరు రాశారు?
జ: రఘువంశంను సంస్కృతంలో కాళిదాసు రచించారు. దాన్ని రాళ్లపల్లి తెలుగులోకి అనువదించారు. 


3. వేమన పద్యాల్లోని ఛందస్సు ఏది?
జ: వేమన పద్యాల్లోని ఛందస్సు ఆటవెలది.


4. ప్రాచీన నాటకాల్లోని హాస్య పాత్ర ఏది?
జ: ప్రాచీన నాటకాల్లోని హాస్య పాత్ర విదూషకుడు.


5. దానానికి ఎవరు పాత్రము?
జ: దానానికి ఏమీలేని పేదవాడు పాత్రము.


6. రాళ్లపల్లి ఎవరి కీర్తనలకు స్వరకల్పన చేశారు?
జ: రాళ్లపల్లి అన్నమయ్య సంకీర్తనలకు స్వరకల్పన చేశారు.


రచయిత: ఎం.మహేశ్వర నాయుడు

Posted Date : 21-12-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని

విద్యా ఉద్యోగ సమాచారం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌