• facebook
  • twitter
  • whatsapp
  • telegram

జాతీయోద్యమ కవిత్వం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు
 

1. జాతీయోద్యమం అంటే ఏమిటి? ఇది భారతదేశంలో ఏ విధంగా వ్యాపించింది?
జ: సామ్రాజ్యవాద వ్యతిరేక ఉద్యమాన్ని జాతీయోద్యమం అంటారు.
సిపాయిల తిరుగుబాటు: బ్రిటిష్‌ సైనిక అధికారులు భారతీయ సిపాయిలను కుక్కల్లా చూశారు. బ్రిటిష్‌వారు సంస్థానాధీశుల అధికారాలను రద్దు చేశారు. దాంతో సిపాయిలు తిరుగుబాటు చేశారు. దేశంలోని రైతులు సిపాయిల తిరుగుబాటుకు మద్దతు ఇచ్చారు. సంస్థానాల ప్రభువులు, నానాసాహెబ్, ఝాన్సీ వీరోచితంగా ఆంగ్లేయులపై పోరాటం చేశారు.
ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌: భారతదేశంలోని ముడిపదార్థాలను దోచుకోవడానికి సామ్రాజ్య వాదులు చేసిన ప్రయత్నాలతో దేశంలో జాతీయభావం వ్యాపించింది. బ్రిటిష్‌వారు అనుసరించిన పద్ధతులు భారత మేధావులను కలవరపరిచాయి. 1876లో సురేంద్రనాథ్‌ బెనర్జీ, ఆనందమోహన్‌ బోస్‌ ఇండియన్‌ అసోసియేషన్‌ అనే అఖిల భారత సంస్థను ప్రారంభించారు. ప్రభుత్వం చేసే చట్టాలపై దేశంలో అసంతృప్తి అనేక రూపాల్లో వెల్లడైంది. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య సంబంధాలను ఏర్పరిచేందుకు  1885లో ఎ.ఓ.హ్యూమ్‌ ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ అనే వేదికను స్థాపించారు. ఈ వేదిక జాతీయోద్యమానికి కేంద్రంగా పనిచేసింది.
మితవాద రాజకీయాలు: దాదాభాయ్‌ నౌరోజీ, సురేంద్రనాథ్‌ బెనర్జీ లాంటి ధనవంతులైన భారత మేధావులు దేశ ఆర్థిక పరిస్థితులను సంస్కరించి బాగు చేయాలని బ్రిటిష్‌వారికి విజ్ఞాపనలు చేసి, వారిపై ఒత్తిడి తెచ్చారు. భారతీయుల అసంతృప్తిని అణచివేసేందుకు బ్రిటిష్‌వారు క్రూరమైన చట్టాలను చేశారు. 1905లో కర్జన్‌ బెంగాల్‌ని విభజించారు.
వందేమాతర ఉద్యమం: బెంగాల్‌ విభజన వ్యతిరేక ఉద్యమం వందేమాతర ఉద్యమంగా మారింది. వేలాది మంది విద్యార్థులు ఈ ఉద్యమంలో చేరారు. వందేమాతర ఉద్యమ నాయకులు స్వరాజ్య భావాన్ని, స్వదేశీ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ ఉద్యమం వల్ల జాతీయభావం పరిచయం అయ్యింది. మధ్య తరగతి ప్రజల్లో ప్రతిఘటనా శక్తి పెరిగింది.
హోంరూల్‌ ఉద్యమం: ఎన్నుకున్న ప్రతినిధులతో కూడిన పార్లమెంట్‌కు అంతరంగిక వ్యవహారాల్లో అధికారం సాధించడానికి అనిబిసెంట్, తిలక్‌ హోంరూల్‌ ఉద్యమాన్ని నడిపారు. ఈ ఉద్యమం కాంగ్రెస్‌లోని మితవాద నాయకులను, హిందూ - ముస్లింలను ఐక్యం చేసింది. స్వపరిపాలనపై ప్రజలకు అభిమానాన్ని పెంచింది.
జాతీయోద్యమం: జాతీయోద్యమంపై కవులు పద్యాలు, గేయాలు రాశారు. వారు ప్రత్యక్షంగా ఉద్యమంలో పాల్గొన్నారు. గాంధీజీ సత్యాగ్రహం, సహాయ నిరాకరణోద్యమం, శాసనోల్లంఘనం లాంటి రూపాల్లో పోరాటం సాగించారు. గాంధీజీ నాయకత్వంలో చంపారణ్‌ సత్యాగ్రహం, రౌలత్‌ సత్యాగ్రహం, ఖిలాపత్‌ ఉద్యమం, జలియన్‌ వాలాబాగ్‌ హత్యాకాండ, చౌరీచౌరా హింసాకాండపై ఉద్యమాలు సాగాయి. విదేశీ వస్తువులను ప్రజలు బహిష్కరించారు. వారు మద్యపాన నిషేధం కోసం పోరాడారు. ఎందరో నాయకులు జైళ్లకు వెళ్లారు. విద్యార్థులు పాఠశాలలు మాని పికెటింగ్‌ చేశారు. గాంధీజీ ఉప్పు సత్యాగ్రహం చేశారు. క్విట్‌ ఇండియా ఉద్యమం జరిగింది. ఈ విధంగా జాతీయోద్యమం ద్వారా భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం వచ్చింది.
 

2. తెలుగులో వచ్చిన జాతీయోద్యమ కవిత్వాన్ని వివరించండి.
జ: బిపిన్‌ చంద్రపాల్‌ వందేమాతర ఉద్యమ ప్రచారానికి ఆంధ్రాకు వచ్చినపుడు చిలకమర్తి లక్ష్మీ నరసింహం భరత ఖండాన్ని పాడి ఆవుతో పోలుస్తూ చక్కని పద్యం చెప్పారు. చిలకమర్తి ప్రభుత్వం విధించిన పన్నుల గురించి పద్యం చెప్పారు.
   చెన్నాప్రగడ భానుమూర్తి డ్రెయిన్‌ సిద్ధాంతం గురించి రాశారు. వందేమాతర ఉద్యమంలో జరిగిన స్వదేశీ ఉద్యమం ప్రేరణతో భానుమూర్తి దేశంలో వాడుకునే వస్తువులన్నీ విదేశాల నుంచి దిగుమతి కావడాన్ని ఆక్షేపిస్తూ పద్యం చెప్పారు. చిదంబరరావు మితవాద రాజకీయాలను నిరసిస్తూ పద్యం రాశారు. ఈ విధంగా మితవాద దశ, హోంరూల్‌ ఉద్యమం మీద కవులు పద్యాలు, గేయాలు రాశారు.
   గరిమెళ్ల సత్యనారాయణ వందేమాతర ఉద్యమం దశలో భారతమాత భావాన్ని, స్వరాజ్య నినాదాన్ని పాటగా రాశారు. గాంధీజీని మించిన సామ్యవాది లేరని చుక్కబొట్ల సత్యనారాయణ మూర్తి గేయం రాశారు. చంపారణ్‌ సత్యాగ్రహం, రౌలత్‌ సత్యాగ్రహం, ఖిలాఫత్‌ ఉద్యమం, జలియన్‌ వాలాబాగ్‌ హత్యాకాండ, చౌరీచౌరా హింసాకాండ లాంటి వాటిపై కవులు కవిత్వం రాశారు. సంపూర్ణ స్వరాజ్యం సిద్ధించే వరకూ భారతమాత పుత్రులు నిద్రపోకూడదని బలిజేపల్లి చైతన్య గీతికను ఆలపించారు. రౌలత్‌ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిర్మాణ కార్యక్రమం, ఖిలాఫత్‌ ఉద్యమం మీద కవులు రాశులకొద్దీ కవిత్వాలను రాశారు.
   రాట్నం, విదేశీ వస్తు బహిష్కరణ, మద్యపాన నిషేధం మీద ఎంతోమంది కవులు పద్యాలు రాశారు. డయ్యర్‌ను ఆంగ్లేయులు మెచ్చుకున్నప్పుడు గరిమెళ్ల నిరసనగా పద్యం రాశారు. చిల్లంగె శ్రీనివాసరావు జలియన్‌ వాలాబాగ్‌లో సామూహిక హత్య జరిపిన డయ్యర్‌ దుర్మార్గాన్ని గేయంగా రాశారు.
   స్త్రీలను అవమానించడం, విద్యార్థులను కొరడాతో కొట్టించడం, పొట్టపై పాకించడం లాంటి ఆంగ్లేయుల దుశ్చర్యలను  ఖండిస్తూ కవులు కవితలు రాశారు. ఉప్పు సత్యాగ్రహం, క్విట్‌ ఇండియా ఉద్యమం, ఆగస్టు విప్లవంతో పాటు జాతీయ జెండా మీద ఎన్నో కావ్యాలు, పద్యాలు రాశారు. గరిమెళ్ల సత్యనారాయణ ‘మాకొద్దీ తెల్లదొరతనం’ అనే పాటను రాశారు. జాతీయ కవిత్వం రాసిన అనేక మంది కవులు ఆయనతో పాటు ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. వారు లాఠీ దెబ్బలు తిని జైళ్లకు వెళ్లారు.
   ఆగస్టు 15న స్వాతంత్య్రం వచ్చినప్పుడు కవులు ఎన్నో గేయాలు రాశారు. గాంధీజీ హత్య జరిగినప్పుడు కవులు ఎలిజీలు అంటే విచార గీతాలు రాశారు. ఈ విధంగా తెలుగులో జాతీయోద్యమ కవిత్వం వర్ధిల్లింది.

సంక్షిప్త సమాధాన ప్రశ్నలు

1. చిలకమర్తి లక్ష్మీ నరసింహం తెలిపిన ఆనాటి పన్నులను పేర్కొనండి.
జ: చిలకమర్తి లక్ష్మీ నరసింహం బ్రిటిష్‌ ప్రభుత్వం విధించిన పన్నులను గురించి ఒక పద్యం చెప్పారు.
ఆనాటి పన్నులు:
* నేల దున్నితే జాలతరము పన్ను వేసేవారు.
* నీరు కావాలంటే నీటి పన్ను విధించేవారు.
* వర్తకం చేస్తే రాబడికి పన్ను వేసేవారు.
* సరకులు అమ్మితే సంత పన్ను విధించేవారు.
* కర్రలు అమ్మితే కలప పన్ను ఉండేది.
* పట్టణాల్లో మున్సిపల్‌ పన్ను విధించేవారు.
* పారిపోదామంటే బండి హాసీల్‌ పన్ను వేసేవారు.
* ఇళ్లను అమ్ముకుంటే స్టాంపు పన్ను వేసేవారు.
* ఉన్నదేదో తిందామంటే ఉప్పు పన్ను వేసేవారు.


2. బలిజేపల్లి లక్ష్మీకాంతం స్వరాజ్య కాంక్షను తెలపండి.
జ: బలిజేపల్లి కవి గొప్ప దేశభక్తులు. ఈయన జాతీయోద్యమంలో పాల్గొని పద్యాలు రాశారు.
బలిజేపల్లి చైతన్య గీతిక: పంజాలు దేశభక్తులను చంపిన ధూర్తులను శిక్షించే వరకు, ఇస్లాం సోదరుల కోరికకు అనుగుణంగా ఖిలాఫత్‌ నిర్ణయించే వరకు భారతపుత్రులు నిద్రపోకూడదు.
   భారతదేశం యొక్క గౌరవమైన ఆదేశాన్ని నాశనం చేస్తున్న భయంకరమైన రౌలత్‌ చట్టాన్ని ఉపసంహరించుకునే వరకు, జాతీయతను బహిష్కరించే చట్టాలు నశించే వరకు భారతమాత బిడ్డ నిద్రపోరాదని గరిమెళ్ల చెప్పారు. ధన్యమైన, సంపూర్ణమైన ఏ ఆటంకాలు లేని స్వరాజ్య పీఠం పొందామనే ప్రతిష్ఠ లభించే వరకు భారతీయులు నిద్రపోవడం తగదని బలిజేపల్లి లక్ష్మీకాంతం తన స్వరాజ్య కాంక్షను వెల్లడించారు.
 

3. డయ్యర్‌ను తెలుగు కవులు ఎలా నిరసించారు?
జ: డయ్యర్‌ అనే ఆంగ్ల సేనాని పంజాబ్‌ ప్రజలను కిరాతకంగా కాల్చి చంపాడు. అప్పుడు తెలుగు కవులు డయ్యర్‌ను నిరసిస్తూ గేయాలు రాశారు. 
గరిమెళ్ల గేయం: ‘డయ్యర్‌ అనే సిగ్గు, భయం లేని నీచుడు ఒకడు ఉన్నాడు. వాడు అధముడు. దెయ్యాన్ని కూడా అణచి వేస్తాడు. ఇప్పుడు ఆ డయ్యర్‌ ఆంగ్ల దేశానికి బాగా ఇష్టుడయ్యాడు’ అని గరిమెళ్ల రాశారు. 
చిల్లంగె శ్రీనివాసరావు గేయం: ‘డయ్యర్‌ బడాయి కలవాడు. అతడు పశు బలానికి భక్తుడు. వాడు పొద్దున్నే లేచి ఫిరంగి అనే దేవుడిని పూజించి, దానికి దండం పెడతాడు. ఆ డయ్యర్‌ ముప్పైకోట్ల భారతీయులను పప్పు సుద్దలు అని ఎగతాళి చేస్తూ నవ్వేవాడు. మైకేల్‌ డయ్యర్‌ పంజాబ్‌ను గుర్రంగా చేసి, దానిపై తాను స్వారీ చేస్తానన్నాడు. ప్రజలు కాలు కదిపితే వారిని ఖైదులో వేస్తానన్నాడు. డయ్యర్‌ ప్రజలపై తుపాకీ గుండ్ల వర్షం కురిపించాడు. భయపడి పారిపోయే ప్రజలపై అతడు మళ్లీ తుపాకీ గుండ్లు కురిపించాడు’ అని శ్రీనివాసరావు రాశారు. 
 

4. గరిమెళ్ల సత్యనారాయణ ప్రజల్లో ఏ విధంగా స్వాతంత్య్ర చైతన్యాన్ని కలిగించారు? 
జ: గరిమెళ్ల సత్యనారాయణ ‘మా కొద్దీ తెల్లదొరతనం’ అనే పాటను రాశారు. ఈ పాట ప్రజల మీద ఎంతో ప్రభావం చూపింది. జలియన్‌ వాలాబాగ్‌లో సామూహిక హత్య జరిపిన డయ్యర్‌ను గరిమెళ్ల నిందిస్తూ గేయం రాశారు. డయ్యర్‌ ఆంగ్లసీమకు ప్రియతముడయ్యాడని నిందించారు. వందేమాతర ఉద్యమం జరిగే రోజుల్లో భారతమాతకు వందనం స్వీకరించమంటూ గేయం రాశారు. భారతమాత  భారతీయులకు రాణి, సాత్విక నిరోధానికి జన్మశాఖ అని, అనేక మంది సమర్థులైన ప్రజలు కలదని కీర్తించారు. భారతమాత స్వరాజ్య దీక్షను స్వీకరించిన సత్యమూర్తి, అసహాయ వర్తిని అని చెప్పారు. ఈ విధంగా గరిమెళ్ల స్వరాజ్య నినాదాన్ని ఇచ్చి ప్రజలకు స్వాంతంత్య్ర చైతన్యాన్ని కలిగించారు. 

ఏక వాక్య సమాధాన ప్రశ్నలు 

1. ఇండియన్‌ అసోసియేషన్‌ సంస్థను ఎవరు స్థాపించారు? 
జ: ఇండియన్‌ అసోసియేషన్‌ సంస్థను 1876లో సురేంద్రనాథ్‌ బెనర్జీ, ఆనందమోహన్‌ బోస్‌ స్థాపించారు. 
 

2. ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ను ఎప్పుడు స్థాపించారు? 
జ: ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ను 1885లో ఎ.ఓ.హ్యూమ్‌ స్థాపించారు. 
 

3. బిపిన్‌ చంద్రపాల్‌ ఉపన్యాసాలను తెలుగులోకి అనువదించివారు? 
జ: బిపిన్‌ చంద్రపాల్‌ ఉపన్యాసాలను చిలకమర్తి లక్ష్మీ నరసింహం తెలుగులోకి అనువదించారు.  
 

4. ‘మా కొద్దీ తెల్ల దొరతనం’ అనే గీతం ఎవరు రాశారు?
జ: మా కొద్దీ తెల్ల దొరతనం అనే గీతాన్ని గరిమెళ్ల సత్యనారాయణ రాశారు. 
 

5. బెంగాల్‌ విభజనకు వ్యతిరేకంగా వచ్చిన ఉద్యమం ఏది? 
జ: బెంగాల్‌ విభజనకు వ్యతిరేకంగా వచ్చిన ఉద్యమం వందేమాతర ఉద్యమం. 

రచయిత: ఎం.మహేశ్వర నాయుడు

Posted Date : 28-12-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని

విద్యా ఉద్యోగ సమాచారం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌