• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఉపరితల రసాయనశాస్త్రం

         రసాయన చర్యలు చాలా వరకు ఘన ఉత్ప్రేరక ఉపరితలం మీద జరుగుతాయి. ఉపరితలంపై జరిగే దృగ్విషయాల గురించి తెలియజేసే రసాయనశాస్త్రమే ఉపరితల రసాయనశాస్త్రం. నిత్య జీవితంలో అనేక సందర్భాల్లో, పరిశ్రమల్లో, విశ్లేషణాత్మక పనిలో ఉపరితల రసాయనశాస్త్ర అనువర్తనాలు అనేకం. వాటిలో అధిశోషణం, ఉత్ప్రేరణం, కొల్లాయిడ్‌లు ముఖ్యమైన దృగ్విషయాలు.
         అధిక శూన్యాన్ని సృష్టించడం, క్రొమాటోగ్రఫీ విశ్లేషణ, సల్ఫైడ్ ధాతువులను గాఢత చెందించే ప్లవన ప్రక్రియ, దేవార్ ఫ్లాస్కులో జడవాయువులను వేరు చేయడం, వాయు ముసుగులు, తేమ నియంత్రణ, ద్రావణాలను వివర్ణం చేయడం... ఇవన్నీ అధిశోషణం అనువర్తనాలు.
        ఒక పదార్థ ఉపరితలం మీద అధిశోషించుకున్న పదార్థాన్ని ''అధిశోషితం'' అని, ఒక ఘనపదార్థం తన ఉపరితలంమీద అధిశోషణంగావించుకోగల పదార్థాన్ని ''అధిశోషకం'' అనీ అంటారు. అధిశోషకం ఉపరితలంమీద అధిశోషితపు అణువులు గాఢత చెందడాన్ని ''అధిశోషణం'' అంటారు. దేవార్ పద్ధతిలో జడవాయువులను వేరుచేసే ప్రక్రియలో ఉత్తేజిత బొగ్గు అధిశోషకం, జడవాయువు అధిశోషితం అవుతాయి. అధిశోషణంలో వాయువుల, ద్రవాల లేదా ద్రావితాల అణువులు ఘనపదార్థాల లోపలికి కూడా చొచ్చుకు వెళ్తాయి.
స్పాంజ్ ముక్కను నీటిలో ఉంచితే అది నీటిని అధిశోషించుకుంటుంది. వాయువుల అధిశోషణాన్ని రెండు రకాలుగా అంటే ''భౌతిక అధిశోషణం'', ''రసాయన అధిశోషణం''గా వర్గీకరించారు. అధిశోషణ ప్రక్రియ ఉష్ణమోచకం. వాయువుల అధిశోషణంలో ∆S = -Ve, ∆H = -Ve, ∆G = -Ve (ఎందుకంటే చర్య అయత్నీకృతం).

 

భౌతిక అధిశోషణం: భౌతిక బలాల అంటే బలహీనమైన వాండర్‌వాల్ బలాల కారణంగా అధిశోషక ఉపరితలంపై, అధిశోషితపు అణువులు అధిశోషణం చెందడం. ఉదా: ఉత్తేజిత బొగ్గుపై జడవాయువులు అధిశోషణం చెందటం.
రసాయన అధిశోషణం:  రసాయన బలాల కారణంగా అధిశోషకం ఉపరితలంపై, అధిశోషితపు అణువులు అధిశోషణం చెందడం. ఉదా: నికెల్ లోహ ఉపరితలంపై H2 అధిశోషణం చెందడం. 


భౌతిక అధిశోషణం, రసాయన అధిశోషణాలను పోల్చడం:

భౌతిక అధిశోషణం రసాయన అధిశోషణం
1. వాండర్ వాల్ బలాల వల్ల జరుగుతుంది. 1. రసాయన బంధాల వల్ల జరుగుతుంది.
2. ఇది వ్యుత్ర్కమణీయ చర్య 2. ఇది అనుత్రమణీయ చర్య.
3. అధిశోషణం ఎంథాల్పీ చాలా తక్కువ. (20 - 40 కి.జౌ. మోల్-1)    

3. అధిశోషణం ఎంథాల్పీ ఎక్కువ (40 - 400 కి.జౌ. మోల్-1)

4. అల్ప ఉష్ణోగ్రతలు అనుకూలం. 4. అధిక ఉష్ణోగ్రతలు అనుకూలం.
5. అనేక పొరల్లో జరుగుతుంది. 5. ఒక పొరలోనే జరుగుతుంది.
6. ఉపరితల స్వభావం పై అధారపడదు. 6. ఉపరితల స్వభావం పై ఆధారపడుతుంది.
7. అధిశోషణ పరిమాణం అధిశోషితం స్వభావం మీదే ఆధారపడుతుంది. 7. అధిశోషణ పరిమాణం అధిశోషితం, అధిశోషకం రెండింటి స్వభావాల మీద ఆధార పడుతుంది.
8. ఉత్తేజిత శక్తి చాలా తక్కువ. 8. ఉత్తేజితశక్తి చాలా ఎక్కువ.
9. వేగంగా జరిగే చర్య. 9. వేగంగా లేదా నెమ్మదిగా జరిగే చర్య
10. ఉష్ణోగ్రత పెరిగితే అధిశోషణం తగ్గుతుంది. 10. ఉష్ణోగ్రత పెరిగితే అధిశోషణం పెరుగుతుంది.
11. నిరధిశోషణం చాలా తేలిక 11. నిరధిశోషణం అంత తేలిక కాదు.

లోహాలపై వాయువుల అధిశోషణం: వాయువుల అధిశోషణ తీవ్రత అధిశోషక ఉపరితల వైశాల్యం, వాయుస్వభావం, అధిశోషిత (వాయువు) పీడనం, ఉష్ణోగ్రత, వాయువు అధిశోషణం చెందిన పొర మందంపై ఆధారపడి ఉంటుంది. ఒక యూనిట్ భారం ఉన్న అధిశోషకంపై అధిశోషణం చెందే వాయువు భారానికి , అధిశోషణం సమతా స్థితి పీడనం (P) తో, స్థిర ఉష్ణోగ్రత వద్ద ఉండే గణిత సంబంధాన్ని సమోష్ణోగ్రతా రేఖ అంటారు.
ఫ్రెండ్లిచ్ అధిశోషణం సమోష్ణోగ్రతారేఖ:  కు అధిశోషణ సమతాస్థితి పీడనానికి (P) మధ్య ఉండే సంబంధాన్ని ఫ్రెండ్లిచ్ కింది విధంగా తెలిపాడు.  
                                     
       x అనేది అధిశోషణం చెందిన వాయువు భారం, m అనేది అధిశోషకం భారం.   K, n లు అధిశోషణ స్థిరాంకాలు, P అనేది అధిశోషణ సమతాస్థితి పీడనం. K, n లు అధిశోషక స్వభావం,  ఇచ్చిన ఉష్ణోగ్రత వద్ద ఉండే వాయువు మీద ఆధారపడి ఉంటాయి. 
(1) వ సమీకరణాన్ని సంవర్గమాన రూపంలో రాస్తే, 
       


    
  స్థిరపీడనం వద్ద ఉష్ణోగ్రతను పెంచే కొద్దీ భౌతిక అధిశోషణ పరిమాణం తగ్గుతుందని ఈ వక్రాల ద్వారా మనకు తెలుస్తుంది. ఫ్రెండ్లిచ్ సమోష్ణోగ్రతారేఖను log  ను y అక్షంమీద, log P ను X-అక్షం మీద తీసుకుని (సరళరేఖ వస్తే) సరిచూడవచ్చు.  విలువలు '0' నుంచి 1 మధ్య ఉండొచ్చు. ఒకవేళ  = 0 అయితే  = స్థిరం. అంటే అధిశోషణం పీడనంపై ఆధారపడదు. ఒకవేళ  = 1 అయితే  = KP. అంటే పీడనం పెరిగే కొద్దీ అధిశోషణం పెరుగుతుంది. అధిక పీడనం వద్ద ఈ సమోష్ణోగ్రతారేఖను వివరించలేం.

 లాంగ్‌మ్యూర్ సమోష్ణోగ్రతారేఖ
     వాయువుల అణుచలన సిద్ధాంతాన్ని ఆధారం చేసుకుని లాంగ్‌మ్యూర్, సమోష్ణోగ్రతారేఖను ప్రవేశపెట్టాడు.
     ¤ రసాయన అధిశోషణంలో అధిశోషణ పొర ఏక అణుత పొరగా ఉంటుంది. 



 ఈ సమీకరణాన్నే లాంగ్‌మ్యూర్ అధిశోషణ సమోష్ణోగ్రతా రేఖ అంటారు. ఇది అధిక ఉష్ణోగ్రత, అల్పపీడనాలకు మాత్రమే వర్తిస్తుంది.
       ఉష్ణోగ్రత, పీడనం, గాఢతలో మార్పు లాంటి అనువైన పరిస్థితులను కల్పించినా చర్యారేటు నెమ్మదిగా ఉండవచ్చు. ఈ పరిస్థితుల్లో చర్యారేటు పెంపు చాలా అవసరం. రసాయన చర్యలో కొద్ది మొత్తంలోనే పాల్గొంటూ, తాను ఎంత మాత్రం వినియోగం చెందకుండా చర్యా వేగంలో మార్పు తీసుకురాగల పదార్థాన్ని ఉత్ప్రేరకం అని, ఈ ప్రక్రియను ఉత్ప్రేరణం అని అంటారు.
      ఉత్ప్రేరకం చర్యను ప్రారంభించదు. ఇది చర్యాసమతాస్థితి స్థానాన్ని ప్రభావితం చెయ్యదు. చర్య జరిగేప్పుడు వినియోగం కాదు. ఇది చర్యావేగాన్ని పెంచడం లేదా తగ్గించడం చెయ్యగలదు. దీనిని కొద్ది మొత్తంలో తీసుకున్నా చర్యావేగాన్ని ప్రభావితం చెయ్యగలదు. ఉష్ణోగ్రత మార్పుతో ఉత్ప్రేరణ చర్యరేటులో మార్పు వస్తుంది.    
చూర్ణస్థితిలో ఉంటే దీని చర్యాశీలత అధికం. ఉత్ప్రేరకం చర్యను నిర్దేశిస్తుంది. అంటే క్రియాజనకాలు ఒకటే అయినా, ఉత్ప్రేరకాన్ని మార్చడం ద్వారా వేర్వేరు క్రియాజన్యాలు వస్తాయి. 
                    
     చర్యారేటును పెంచే ఉత్ప్రేరకాన్ని ధన ఉత్ప్రేరకమని, తగ్గించేదాన్ని రుణ ఉత్ప్రేరకమని (ఉదా: H2O2 విఘటన చర్యలో గ్లిజరాల్, ఎసిటానిలైడ్), ఉత్ప్రేరకం క్రియాశీలతను పెంచే పదార్థాన్ని ప్రవర్ధకం లేదా ప్రమోటర్ (ఉదా: హేబర్ పద్ధతిలో NH3 సంశ్లేషణలో Fe ఉత్ప్రేరకానికి Mo ప్రమోటర్) అని అంటారు.


ఉత్ప్రేరణంలో రకాలు:

సజాతీయ ఉత్ప్రేరణ: క్రియాజనకాలు, ఉత్ప్రేరకం ఒకే ప్రావస్థలో (వాయు లేదా ద్రవ) ఉండే ఉత్ప్రేరణ. 
                   ఉదా.: 2 SO2 (వా) + O2 (వా)   2 SO3
విజాతీయ ఉత్ప్రేరణ: క్రియాజనకాలు, ఉత్ప్రేరకం వేర్వేరు ప్రావస్థల్లో ఉండే ఉత్ప్రేరణ.   
                     ఉదా: N2 (వా) + 3 H2 (వా)  2 NH3 
స్వయం ఉత్ప్రేరణ: ఒక రసాయన చర్యలో ఏర్పడే క్రియాజన్యం అదే చర్యకు ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. ఈ రకపు ఉత్ప్రేరణను స్వయం ఉత్ప్రేరణ అంటారు.
                     ఉదా: 2 AsH3  2 As + 3 H2
 2 KMnO4 + 3H2SO4 + 5H2C2O4 K2SO4 + 10CO2 + 8H2O + 2Mn+2 + 2 SO4-2
                                CH3COOC2H5 + H2O  CH3COOH + C2H5OH
    పై చర్యల్లో As, Mn+2, CH3COOH లు స్వయం ఉత్ప్రేరకాలు. జియొలైట్‌లకు తేనెతుట్టెలాంటి ఆకృతి ఉంటుంది.
ఎంజైమ్‌లు కూడా అనేక చర్యల్లో (జీవరసాయన) పాల్గొంటాయి.        

 

    
కొన్ని పారిశ్రామిక ఉత్ప్రేరక చర్యలు:
       హేబర్ విధానంలో NH3  _____    ఇనుము ఉత్ప్రేరకం.
       ఆస్ట్వాల్డ్ విధానంలో HNO3 ______   ప్లాటినం పొదిగిన ఆస్‌బెస్టాస్


స్పర్శా విధానంలో SO3:
       a) బాడిషె విధానం ప్లాటినైజ్ చేసిన రాతినార 
       b) బాండిషె విధానం V2O5
       c) గ్రిల్లో విధానం ప్లాటినం నిక్షేపిత MgSO
       d) మన్‌హైం విధానం Fe2O3 + CuO
ద్రావితం కణాల పరిమాణాన్ని అనుసరించి ద్రావణాలను నిజ ద్రావణాలు, కొల్లాయిడ్ ద్రావణాలు అవలంబనాలుగా వర్గీకరించారు. నిజద్రావణాల్లో ద్రావిత కణ పరిమాణం 1mµ (మిల్లిమైక్రాన్) కంటే తక్కువ ఉండగా, కొల్లాయిడ్ ద్రావణంలో 1mµ - 1µ మధ్య ఉంటుంది.  కొల్లాయిడ్ ద్రావణంలో విక్షేపక యానకం, విక్షిప్త ప్రావస్థలు ఉంటాయి.

విక్షేపక యానకం: కొల్లాయిడల్ కణాలను విక్షిప్తం చేసుకునే యానకం.
                  ఉదా: గోల్డ్ సాల్‌లోని నీరు.
విక్షిప్త ప్రావస్థ: విక్షేపక యానకంలో విక్షిప్తం చెందిన కొల్లాయిడల్ కణాలు. 
                  ఉదా: గోల్డ్ సాల్‌లోని గోల్డ్ కణాలు.

నిజద్రావణం  కొల్లాయిడ్ ద్రావణం
1. సజాతీయం, తేటగా ఉంటుంది.  1. విజాతీయం, తేటగా ఉండొచ్చు లేదా కాంతి నిరోధంగా ఉండొచ్చు.
2. వేగంగా వ్యాపనం చెందుతుంది 2. నెమ్మదిగా వ్యాపనం చెందుతుంది.
3. వడపోయలేం. 3. పాక్షికంగా వడపోయవచ్చు. 
4. టిండాల్ ఫలితాన్ని చూపదు. 4. టిండాల్ ఫలితాన్ని చూపుతుంది.
5. ద్రవాభిసరణ పీడనం ఎక్కువ. 5. ద్రవాభిసరణ పీడనం తక్కువ.

 

కొల్లాయిడ్ ద్రావణం  విక్షిప్త ప్రొవస్థ విక్షేపణ యానకం
1. పొగ కార్బన్ కణాలు గాలి
2. మేఘం నీటి బిందువులు గాలి
3. రక్తం ఆల్బుమినాయిడ్ నీరు
4. పాలు ద్రవకొవ్వు నీరు

విక్షిప్త ప్రావస్థ, విక్షేపక యానకాల మధ్య ఉండే ఆపేక్షను బట్టి కొల్లాయిడ్ ద్రావణాలను ద్రవప్రియ, ద్రవవిరోధి కొల్లాయిడ్‌లుగా వర్గీకరించారు. 


ద్రవప్రియ కొల్లాయిడ్ ద్రావణాలు: విక్షిప్త ప్రావస్థ, విక్షేపక యానకాల మధ్య ఎక్కువ ఆపేక్ష ఉండటం వల్ల ఏర్పడే కొల్లాయిడ్ ద్రావణాలు.
                    ఉదా: జిలెటిన్, స్టార్చ్, ప్రొటీన్లు.


ద్రవ విరోధి కొల్లాయిడ్ ద్రావణాలు: విక్షిప్త ప్రావస్థ విక్షేపక యానకాల మధ్య చాలా తక్కువ (పరిగణనలోకి తీసుకోనవసరం లేనంత) ఆపేక్ష ఉండటం వల్ల ఏర్పడే కొల్లాయిడ్ ద్రావణాలు.
                   ఉదా: గోల్డ్‌సాల్, సిల్వర్‌సాల్. 

ధర్మం ద్రవప్రియ కొల్లాయిడ్ ద్రవవిరోధి కొల్లాయిడ్
1. స్థిరత్వం చాలా ఎక్కువ చాలా తక్కువ
2. వ్యుత్ర్కమణీయత వ్యుత్ర్కమణీయం అనుత్ర్కమణీయం
3. సాల్వేషన్ చాలా ఎక్కువ చాలా తక్కువ
4. స్కందనం కష్టం తేలిక

* కొల్లాయిడ్ ద్రావణాలు కాంతి ధర్మాలు (విక్షిప్త ప్రావస్థలోని కణాలు పెద్దగా ఉండటం వల్ల), విద్యుత్ ధర్మాలు (కొల్లాయిడ్ కణాల మీద ఆవేశం ఉండటం వల్ల), అణు చలన ధర్మాలను (కొల్లాయిడ్ కణాలు దిశరహితంగా చలించడం వల్ల) ప్రదర్శిస్తాయి.
* ''కొల్లాయిడ్ ద్రావణం ద్వారా కాంతిని పంపితే, కొల్లాయిడ్ కణాలు కాంతిని విక్షేపణం చేసి కాంతిమంతమైన శంఖాకార పుంజాన్ని ఏర్పరచడాన్ని టిండాల్ ఫలితం'' అంటారు. ''కొల్లాయిడ్ ద్రావణంలోని కొల్లాయిడ్ కణాలు నిరంతరం క్రమరాహిత్యంగా అన్ని దిశల్లోనూ చలించడాన్ని బ్రౌనియన్ చలనం'' అంటారు. కొల్లాయిడ్ కణాలు ఎలక్ట్రాన్లను గ్రహించడం వల్ల లేదా విక్షిప్త ప్రావస్థలోని కణాలు, విక్షేపక యానకంలోని కణాల మధ్య అంతర్ తలంవద్ద విద్యుత్‌ద్వయం పొర ఏర్పడటం వల్ల కొల్లాయిడ్ కణాలపై ఆవేశం ఉంటుంది.
 ''ఒక కొల్లాయిడ్ ద్రావణానికి విద్యుద్విశ్లేష్యకాన్ని కలిపితే కొల్లాయిడ్ కణాలు ఆవేశాన్ని కోల్పోయి అవక్షేపంగా కిందికి రావటాన్ని స్కందనం అంటారు.''  
Al2O3.xH2O, CrO3. xH2O, Fe2O3.xH2O, TiO2  హిమోగ్లోబిన్, మిథిలీన్, నీలం ఇవన్నీ ధనాత్మక కొల్లాయిడ్‌లు. Cu, Ag, Au, As2S3, Sb2 S3, CdS, కాంగో ఎరుపు కొల్లాయిడ్ ద్రావణాలు, స్టార్చ్, బంక, జిలెటిన్, బంకమన్ను, బొగ్గు వీటన్నింటికీ రుణావేశం ఉంటుంది. ఒక అయాన్, స్కందనం చేయగల సామర్థ్యం దానిపై ఉండే గుర్తు (ధన లేదా రుణ), పరిమాణాలపై ఆధారపడి ఉంటుందని హార్డే, షుల్జ్ చెప్పారు. హార్డే షుల్జ్ నియమం ప్రకారం కొల్లాయిడ్ విద్యుదావేశానికి, విరుద్ధ ఆవేశం ఉండే అయాన్‌ని కలిపితే స్కందనం జరుగుతుంది. అయాన్ ఆవేశం పెరిగే కొద్దీ స్కందనం చెయ్యగల సామర్థ్యం కూడా పెరుగుతుంది.
            ధనాత్మక కొల్లాయిడ్ స్కందన సామర్థ్యం: Cl-< SO4-2< PO4-3
            రుణాత్మక కొల్లాయిడ్ స్కందన సామర్థ్యం: K+< Ba+2< Al+3


        స్కందన స్వభావం ఉండే ద్రవవిరోధి కొల్లాయిడ్‌లకు తక్కువ స్థిరత్వం ఉన్నందున, వీటిని స్థిరంగా ఉంచడానికి రక్షిత కొల్లాయిడ్‌లు (ద్రవప్రియ కొల్లాయిడ్‌లు) అవసరం. కొల్లాయిడ్‌ల పరిరక్షక శక్తిని ''గోల్డ్ సంఖ్య''తో వివరిస్తారు. ఈ సంఖ్యను జిగ్మాండే ప్రవేశపెట్టాడు. ''ఒక మిల్లీ లీటరు పరిమాణం ఉన్న, 10 శాతం సోడియం క్లోరైడ్ ద్రావణాన్ని, 10 మి.లీ. ప్రమాణ గోల్డ్ ద్రావణానికి కలిపితే ఏర్పడే స్కందనాన్ని నివారించడానికి కలపాల్సిన ద్రవప్రియ (లియోఫిలిక్) కొల్లాయిడ్ ద్రవ్యరాశి (మి.గ్రా.ల్లో)ని గోల్డ్‌సంఖ్య'' అంటారు.    
                      
   జిలెటిన్‌కు గోల్డ్ సంఖ్య అతి తక్కువ (0.005 నుంచి 0.01)గా ఉన్నందున దాని పరిరక్షక శక్తి చాలా ఎక్కువ. హిమోగ్లోబిన్‌కు గోల్డ్ సంఖ్య 0.03 నుంచి 0.07 వరకు, అల్బుమిన్‌కు 0.1 నుంచి 0.2, బంగాళాదుంప స్టార్చికి 25 ఉంటాయి.
       లోషన్లు, క్రీములు, ఆయింట్‌మెంట్లు, సౌందర్యాన్ని పెంచే పదార్థాలు, మందులు, నీటి నుంచి నూనెను వేరుచేయడం, కొవ్వుల జీర్ణప్రక్రియ, సల్ఫైడ్ ధాతువులను ప్లవన ప్రక్రియ విధానంలో గాఢత చెందించడం, బట్టల మురికిని వదిలించే చర్య, మీగడ నుంచి వెన్నను వేరు చేయడం... ఇవన్నీ ఎమల్షన్ల అనువర్తనాలే! 
* విక్షిప్త ప్రావస్థ, విక్షేపణ యానకం రెండూ ద్రవస్థితిలో ఉన్న కొల్లాయిడల్ వ్యవస్థనే ''ఎమల్షన్'' అంటారు. ఎమల్షన్‌లో ఉండే ఘటకాల పరిమాణాన్ని బట్టి రెండు రకాలుగా వర్గీకరించారు. అవి:
* నీటిలో తైలం రకం ఎమల్షన్: నీరు విక్షేపణ యానకంగా, తైలం విక్షిప్త ప్రావస్థగా ఉండే ఎమల్షన్. 
ఉదా: పాలు, వానిషింగ్ క్రీమ్
* తైలంలో నీరు రకం ఎమల్షన్: తైలం విక్షేపణ యానకంగా, నీరు విక్షిప్త ప్రావస్థగా ఉన్న ఎమల్షన్. 
ఉదా: కోల్డ్‌క్రీమ్, కాడ్ లివర్ నూనె, గట్టిగా ఉండే గ్రీజు.
* ఎమల్సీకరణ కారకం (ఎమల్సిఫయర్): ఎమల్షన్‌ను స్థిరంగా ఉంచడానికి కొద్ది మొత్తంలో కలిపే మూడో పదార్థాన్ని ఎమల్సీకరణ కారకం అంటారు.

ఎమల్షన్                                        ఎమల్సీకరణ కారకం

 నీటిలో కిరోసిన్                  -                     సబ్బు
నీటిలో ఆలివ్‌నూనె             -                     గుడ్డుసొన
బెంజిన్‌లో నీరు                  -                     HgI (ఘన)
పాలలోని నీటిలో నూనె       -                         కెసిన్


  కొల్లాయిడల్ ద్రావణం మరో ముఖ్య అనువర్తనం సబ్బుతో శుద్ధిచేసే ప్రక్రియ. కొన్ని పదార్థాలు తక్కువ గాఢతల వద్ద విద్యుద్విశ్లేషకంగా, ఎక్కువ గాఢత వద్ద కొల్లాయిడ్ ద్రావణాలుగా ప్రవర్తిస్తాయి (సముచ్ఛయ కణాలు ఏర్పడటం వల్ల). నిర్దిష్ట ఉష్ణోగ్రత కంటే ఎక్కువ ఉష్ణోగ్రత వద్దే ''సముచ్ఛయ కాంజికాభాలు'' (Micelles) ఏర్పడితే ఆ ఉష్ణోగ్రతను ''క్రాఫ్ట్ ఉష్ణోగ్రత'' (Tk) అని, ఒక నిర్దిష్ట గాఢత కంటే ఎక్కువ గాఢత వద్ద ఇది ఏర్పడితే ఆ గాఢతను ''సందిగ్ధ సముచ్ఛయ కాంజికాభగాఢత'' (Critical Micelle Concentration or CMC) అని అంటారు. సబ్బుకి CMC విలువ 10-3 నుంచి 10-4 మోల్ లీటరు-1 ఉంటుంది. సముచ్ఛయ కాంజికాభాలు ఏర్పడటానికి 100 లేదా అంతకంటే ఎక్కువ అణువులు పాల్గొంటాయి.
* ''సూక్ష్మస్థితిలో ఉన్న అణువులు లేదా అయాన్లు సముచ్ఛయంగా ఏర్పడి ద్రవప్రియ అంత్యం (తల), ద్రవ్యవిరోధ అంత్యం (తోక) ఉండే కొల్లాయిడ్ సైజులో ఏర్పడే కణాన్ని ''సముచ్ఛయ కాంజికాభం (మిసెల్)'' అంటారు.

 

సబ్బుతో పరిశుభ్రం చేసే ప్రక్రియ
       సబ్బుని సోడియం స్టియరేట్‌గా భావించవచ్చు. దీనిలో Na+ అయాన్లు C17H35 COO- (స్టియరేట్) అయాన్లు ఉంటాయి. ఈ స్టియరేట్ అయాన్‌లో C17H35 అధ్రువభాగం (తోక) ఉంటుంది. ఇది దుస్తులపై ఉన్న మురికిని, జిడ్డుని తనలో కరిగించుకుంటుంది. కాగా ధ్రువభాగమైన COO-  (తల) నీటిని ఆకర్షిస్తుంది. ఈ రెండూ కలసి ''నీరు-మురికి'' ఎమల్షన్‌గా ఏర్పడేందుకు సబ్బు తోడ్పడుతుంది. దుస్తులను జాడించి, ఉతికినప్పుడు ఈ ఎమల్షన్ నీటితోపాటు బయటికి వెళ్లిపోయి దుస్తులు శుభ్రపడతాయి.

Posted Date : 04-08-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని

విద్యా ఉద్యోగ సమాచారం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌