• facebook
  • twitter
  • whatsapp
  • telegram

18వ గ్రూపు మూలకాలు

       హీలియం (He), నియాన్ (Ne), ఆర్గాన్ (Ar), క్రిప్టాన్ (Kr), జీనాన్ (Xe), రేడాన్ (Rn) ఆవర్తన పట్టికలో 18వ గ్రూపుకు చెందిన మూలకాలు. రేడాన్ తప్ప మిగిలిన మూలకాలన్నీ గాలిలో లభిస్తాయి. అందువల్ల వీటిని 'ఎరోజన్‌లు' అని కూడా అంటారు. ఇవి గాలిలో భారాత్మకంగా 1% ఉంటాయి. వీటికి స్థిరంగా ఉండే ns2 np6 (He = 1s2)ఎలక్ట్రాన్ విన్యాసం ఉండటం వల్ల వీటి అయనీకరణ ఎంథాల్పీ ఎక్కువ. ఎలక్ట్రాన్ గ్రాహ్య ఎంథాల్పీలు ధనాత్మకం. ఇవి ఎలక్ట్రాన్లను దానం చేయవు, గ్రహించవు, పంచుకోవు. అందువల్ల వీటిని ఉత్కృష్ట లేదా జడ (రసాయన చర్యాశీలత లేనివి) వాయువులు అంటారు. వీటికి చర్యాశీలత లేకపోవడం వల్ల వీటి ఆవిష్కరణకు 100 సంవత్సరాలకు పైగా సమయం పట్టింది.

       1868 లో పి.జె.సి. జాన్‌సెన్, జె.ఎన్. లాకియర్ సంపూర్ణ సూర్యగ్రహణం సమయంలో హీలియం అనే (హీలియస్ = సూర్యుడు) కొత్త మూలకాన్ని కనుక్కున్నారు. హెన్రీ కెవెన్‌డిష్ గాలి నుంచి N2ను  వేరుచేసినప్పుడు N2లో వ వంతు వాయువు దేనితోనూ చర్య జరపకపోవడం పరిశీలించాడు. ఇలా బద్ధకంగా ఉండటం వల్ల దీనికి ఆర్గాన్ (ఆర్గోస్ = బద్ధకం) అని పేరు పెట్టాడు. గాలిలో ఇది అత్యధికంగా (0.934%) లభించే జడవాయువు. రామ్సే, ట్రావర్స్ ఆర్గాన్ ద్రవాన్ని వేర్వేరు పీడనాల వద్ద అంశిక స్వేదనం చేస్తే కొత్త మూలకం 'నియాన్' (నియోస్ = కొత్త) వచ్చింది.
రామ్సే అనేకసార్లు ద్రవగాలిని అంశిక స్వేదనం చేసి దాగి ఉన్న మరో మూలకం (క్రిప్టాన్ = దాగి ఉన్న) 'క్రిప్టాన్‌'ను కనుక్కున్నాడు. రామ్సే క్రిప్టాన్ నుంచి మరో అపరిచిత మూలకం జీనాన్ (జీనాన్ = అపరిచిత)ను కనుక్కున్నాడు. Ra - 226 విఘటనం చెంది 'రేడాన్‌'ను ఇస్తుంది.

           
         చర్యాశీలత లేకపోవడం వల్ల వీటికి చాలా ఉపయోగాలు ఉన్నాయి. వాయువులతో చల్లబరిచే పరమాణు కేంద్రక రియాక్టర్లలో హీలియంను ఉష్ణమార్పిడి కారకంగా ఉపయోగిస్తారు. Mg, Al లోహాలను వెల్డింగ్ చేసేటప్పుడు జడ వాతావరణాన్ని సృష్టించడానికి హీలియంను ఉపయోగిస్తారు. O2 − He మిశ్రమాన్ని (20% O2 + 80% He) ఉబ్బస వ్యాధిగ్రస్థులకు, సముద్రం లోతుకు వెళ్లే గజ ఈతగాళ్లకు కృత్రిమ శ్వాసను కల్పించడానికి (He బదులు N2ను వాడితే N2 రక్తంలో కరిగి 'కేసన్' లేదా 'బెండ్స్' అనే వ్యాధి వస్తుంది) వాడతారు. He కు అత్యల్ప బాష్పీభవన స్థానం (4.2 K) ఉండటం వల్ల దీన్ని క్రయోజనిక్ కారకంగా ఉపయోగిస్తారు. He ను రోగనిర్ధారణకు ఉపయోగించే NMR వర్ణపటలేఖిని, MRI వ్యవస్థల్లో ముఖ్య భాగమైన బలమైన అతివాహక అయస్కాంతత్వాన్ని ఉత్పత్తి చేయడానికి ఉపయోగిస్తారు. మండే స్వభావం లేని తేలికైన వాయువు కావడం వల్ల హీలియంను వాతావరణ పరిశీలనలో వాడే బెలూన్లను నింపడానికి ఉపయోగిస్తారు.
         నియాన్ బల్బులను ఉద్యానవనాలు, హరితగృహాల్లో వాడతారు. నియాన్‌ను ఉత్సర్గనాళికలో ప్రకటనల కోసం వాడే ప్రతిదీప్తి బల్బుల్లో ఉపయోగిస్తారు. నియాన్ దీపాలు మంచు, పొగ మంచుల్లో కూడా చాలా దూరం వరకు కనిపించడం వల్ల హెచ్చరిక సంజ్ఞల్లో (warning signals) ఉపయోగిస్తారు. నియాన్‌తో వేరే వాయువులను కలపడం వల్ల ఇవి రకరకాల రంగులను ఇస్తాయి.
 ఆర్గాన్‌ను ప్రతిదీప్తి దీపాలు, ఎలక్ట్రిక్ బల్బుల్లో ఉపయోగిస్తారు. ఇంకా లోహాలు, మిశ్రమలోహాలను వెల్డింగ్ చేసేటప్పుడు జడ వాతావరణాన్ని సృష్టించడానికి ఆర్గాన్‌ను వాడతారు.
      లోహ రేకుల మందాలను కొలవడానికి, ఎలక్ట్రిక్ బల్బులను నింపడానికి క్రిప్టాన్ వాయువును వాడతారు. ఎలక్ట్రానిక్ ట్యూబులను Kr − 85తో నింపుతారు.
      జీనాన్‌ను ఉపయోగించి బబుల్ ఛాంబర్‌లో తటస్థ మీసాన్‌లను, గామా ఫోటాన్లను కనుక్కుంటారు. అతివేగ ఫొటోగ్రఫీలో, వాయుపూరిత ఎలక్ట్రిక్ బల్బుల్లో కూడా జీనాన్‌ను వాడతారు.
      రేడాన్‌కు రేడియోధార్మికత ఉండటం వల్ల దీన్ని క్యాన్సర్ చికిత్సలో, పారిశ్రామిక రేడియోగ్రఫీలో; లోహాలు, ఘనపదార్థాల్లో అంతర్గతంగా ఉండే లోపాలను గుర్తించడానికి వాడతారు.
      ఉత్కృష్ట వాయువులు ఏక పరమాణుకత ఉండేవి . వీటికి రంగు, వాసన ఉండవు. అణువుల మధ్య బలహీన విక్షేపణ బలాలు ఉండటం వల్ల వీటికి ద్రవీభవన, బాష్పీభవన ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి. ఇవి నీటిలో స్వల్పంగా కరుగుతాయి. హీలియం తప్ప మిగతా జడవాయువులన్నీ ఉత్తేజిత కొబ్బరి బొగ్గుపై అధిశోషణం చెందుతాయి. స్థిర ఎలక్ట్రాన్ విన్యాసం ఉండటం వల్ల వీటికి అధిక అయనీకరణ ఎంథాల్పీ, ధన ఎలక్ట్రాన్ గ్రాహ్య ఎంథాల్పీ (గతంలో ఉత్కృష్ట వాయువుల ఎలక్ట్రాన్ ఎఫినిటీ విలువను సున్నాగా తీసుకునేవారు) ఉంటాయి. 1962కు పూర్వం ఉత్కృష్ట వాయువులు వేరే మూలకాలతో చర్య జరపవు, సమ్మేళనాలను ఏర్పరచవు అని భావించేవారు.
         




Posted Date : 04-08-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని

విద్యా ఉద్యోగ సమాచారం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌