• facebook
  • twitter
  • whatsapp
  • telegram

జీవాణువులు

* జీవరాశులన్నీ కార్బోహైడ్రేట్లు, లిపిడ్లు, హార్మోన్లు, ఎంజైమ్‌లు, ప్రొటీన్లు, విటమిన్లు లాంటి జీవాణువులతో తయారైనవే. పెరుగుదల, పునరుత్పత్తి, ఆరోగ్య సంరక్షణలో వీటి పాత్ర చాలా ముఖ్యమైంది. జీవులు, జీవుల మధ్య సంబంధం: 
* జీవాణువులు  ఆర్గనెల్‌లు  జీవకణాలు  కణజాలాలు  అంగాల  జీవులు 
* విభిన్న చర్యల్లో జీవకణాలకు శక్తి అవసరం. ఇవి గిబ్స్ శక్తి పెరిగే విధంగా (Δ G > 0) అంటే 'ఎండర్‌గోనిక్', గిబ్స్ శక్తి తగ్గే విధంగా (Δ G < 0) అంటే 'ఎగ్జర్‌గోనిక్'గా ఉంటాయి. 
* జీవులకు ఆహారం అవసరం. ఆహారంలో స్టార్చి, గ్లూకోజ్ లాంటి కార్బోహైడ్రేట్లు; పత్తి, రేయాన్, చెక్క సామగ్రి మొదలైన వాటిలో సెల్యులోజ్ ఉంటాయి. కార్బోహైడ్రేట్లకు Cx(H2O)y. ఫార్ములా ఉంటుంది కాబట్టి వీటిని కార్బన్ యొక్క హైడ్రేట్లుగా భావించారు. అయితే కార్బోహైడ్రేట్లయిన డీ ఆక్సీరైబోజ్ (C5H10O4), రాంనోజ్ (C6H12O5) లను ఈ ఫార్ములాతో సూచించలేం. ఎసిటికామ్లం (CH3COOH), మిథనాల్ (HCHO) లను Cx(H2O)y తో సూచించినా అవి కార్బోహైడ్రేట్లుకావు. కాబట్టి పాత నిర్వచనం తప్పని తెలిసింది. కొత్త నిర్వచనం ప్రకారం కార్బోహైడ్రేట్స్ అంటే ''ధ్రువణ భ్రమణత కలిగి, జల విశ్లేషణలో ఆల్డిహైడ్‌లు లేదా కీటోన్లను ఇవ్వగల పాలీహైడ్రాక్సీ ఆల్డిహైడ్లు లేదా పాలీ హైడ్రాక్సీ కీటోన్లు''. ఇవి తియ్యటి రుచిని ఇస్తాయి కాబట్టి వీటిని శాకరైడ్‌లు (లాటిన్‌లో శాకరమ్ = చక్కెర) అంటారు.
* జల విశ్లేషణ చేయడం ద్వారా వచ్చే ఉత్పన్నాలను బట్టి శాకరైడ్‌లను వర్గీకరించవచ్చు. మోనోశాకరైడ్‌లు (జల విశ్లేషణలో తన కంటే చిన్న శాకరైడ్ అణువులను ఏర్పరచలేని సమ్మేళనాలు ఉదా: గ్లూకోజ్, ఫ్రక్టోజ్), ఒలిగోశాకరైడ్‌లు (జల విశ్లేషణలో 2-10 అణువుల మోనోశాకరైడ్ అణువులను ఇచ్చే సమ్మేళనాలు), డై శాకరైడ్‌లు (జల విశ్లేషణలో 2 అణువుల మోనోశాకరైడ్‌లను ఇచ్చేవి. ఉదా: సుక్రోజ్, మాల్టోజ్, లాక్టోజ్), పాలీశాకరైడ్‌లు (జల విశ్లేషణలో 100 నుంచి 3,000 మోనోశాకరైడ్‌లను ఇచ్చేవి. ఉదా: స్టార్చి, సెల్యులోజ్). 
* హెమి ఎసిటాల్, హెమికీటాల్ రూపాల్లో ఉన్న ఆల్డిహైడ్‌లు, కీటోన్‌లు ఉన్న కార్బోహైడ్రేట్లు మాత్రమే ఫెహ్లింగ్ ద్రావణం, టోలెన్స్ కారకాలను క్షయకరణం చేస్తాయి. అందుకే వాటిని ''క్షయకరణం చెందించే చక్కెరలు'' (అన్ని మోనోశాకరైడ్‌లు, మాల్టోజ్, లాక్టోజ్) అంటారు. వీటిని క్షయకరణం చెయ్యని వాటిని ''క్షయకరణం చెందించని చక్కెరలు'' (ఉదా: సుక్రోజ్, పాలీశాకరైడ్‌లు) అంటారు.

 

మోనోశాకరైడ్‌లు
గ్లూకోజ్: ద్రాక్షపండ్లు, తేనె, మామిడిపండ్లు, ఆపిల్స్‌లో గ్లూకోజ్ స్వేచ్ఛాస్థితిలో ఉంటుంది. గ్లైకోసైడ్‌లు, డైశాకరైడ్‌లు, పాలీశాకరైడ్లలో గ్లూకోజ్ సంయోగస్థితిలో ఉంటుంది. గ్లూకోజ్‌నే ''గ్రేప్‌షుగర్'' లేదా ''డెక్ట్రోజ్'' అని కూడా అంటారు. స్టార్చ్ లేదా సుక్రోజ్‌ను విలీన సల్ఫ్యూరికామ్ల ఆల్కహాలిక్ ద్రావణంలో మరిగించి జల విశ్లేషణ చేస్తే గ్లూకోజ్ వస్తుంది.
గ్లూకోజ్ నిర్మాణాన్ని బేయర్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించాడు. గ్లూకోజ్ అణుఫార్ములా C6H12O6.
* గ్లూకోజ్‌ను ఎసిటిక్ ఎన్‌హైడ్రైడ్‌తో ఎసిటలీకరణం చేస్తే పెంటాఎసిటేట్‌ను ఇస్తుంది. దీనర్థం గ్లూకోజ్‌లో 5 -OH గ్రూపులున్నాయి.
* గ్లూకోజ్‌ను నైట్రిక్ ఆమ్లంతో ఆక్సీకరణం చేస్తే శకారిక్ ఆమ్లం (HOOC − (CHOH)4 − COOH) వస్తుంది. అంటే ఒక ప్రైమరీ -OH సమూహం ఉంటుంది.
* గ్లూకోజ్ NH2OH తో గ్లూకోజ్ ఆక్జైమ్‌ను, HCN తో సయనోహైడ్రిన్‌ను ఇస్తుంది. అంటే కార్బోనైల్ సమూహం (C = O) ఉన్నట్లు.
* టోలెన్ కారకంతో వెండి అద్దాన్నిస్తుందంటే కార్బోనైల్ సమూహం, ఆల్డిహైడేనని (-CHO) అర్థం.
* HI, ఎర్ర భాస్వరంతో n - హెక్సేన్‌ను ఇస్తుంది. దీనిలో ఆరు కార్బన్‌లు రేఖీయంగా ఉంటాయని ఈ చర్య చెబుతుంది.
* పై చర్యలను బట్టి గ్లూకోజ్‌కు వివృత శృంఖల నిర్మాణం OHC − (CHOH)4 −CH2OH ఉంటుంది.
* గ్లూకోజ్ వివృత శృంఖల నిర్మాణం NaHSO3, NH3, 2, 4 - DNP ల సంకలన చర్యలు పరివర్తిత భ్రామకాన్ని (ధ్రువణ భ్రమణత ఉన్న సమ్మేళనం విశిష్ట భ్రమణంలో కలిగిన అయత్నీకరణ మార్పు) వివరించలేకపోయినందువల్ల హావర్త్ చక్రీయ పైరనోజ్ నిర్మాణాన్ని (ఇది అన్ని ధర్మాలను వివరిస్తుంది.)

 

ఫ్రక్టోజ్
       తేనె, తియ్యటి పండ్లలో ఫ్రక్టోజ్ స్వేచ్ఛాస్థితిలో లభిస్తుంది. దీని అణు ఫార్ములా C6H12O6 దీన్ని ''లెవులోజ్'' లేదా ''పండ్ల చక్కెర'' అని కూడా అంటారు. గ్లూకోజ్‌లో ఆల్డిహైడ్ సమూహం ఉంది. ఫ్రక్టోజ్‌లో కీటోన్ ప్రమేయ సమూహం ఉంది.


 

డైశాకరైడ్‌లు
సుక్రోజ్

    రోజూ మనం వాడే పంచదారనే ''సుక్రోజ్'' అంటారు. దీన్ని చెరకు గడ లేదా బీటుదుంపల నుంచి తయారు చేస్తారు. దీని అణు ఫార్ములా C12H22O11 దీన్ని జల విశ్లేషణ చేస్తే α -D గ్లూకోజ్, β -D ఫ్రక్టోజ్‌లు ఏర్పడతాయి.  

సుక్రోజ్‌కు డెక్స్‌ట్రో (కుడివైపు) భ్రమణం ఉంది. కానీ జలవిశ్లేషణం తర్వాత కుడి భ్రమణం ఉన్న గ్లూకోజ్‌ను, ఎడమ భ్రమణం ఉన్న ఫ్రక్టోజ్‌ను ఇస్తుంది. ఇవి ఒకే మోల్‌ల నిష్పత్తిలో ఉంటాయి. ఈ ప్రక్రియను ''విలోమ భ్రమణక్రియ'' అంటారు. భ్రమణం డెక్స్‌ట్రో (+; అంటే కుడి) నుంచి లావోకు (-; అంటే ఎడమకు) మారడమే ''విలోమ భ్రమణం''. గ్లూకోజ్‌లోని C1 - α కు, ఫ్రక్టోజ్‌లోని C2 - β ల మధ్య గ్లైకోసైడిక్ బంధం (రెండు మోనోశాకరైడ్ల మధ్య ఉండే ఈథర్ బంధం) ఏర్పడుతుంది. సుక్రోజ్ క్షయకరణం చెందని చక్కెర ఎందుకంటే దీనిలో గ్లూకోజ్, ఫ్రక్టోజ్‌లకు చెందిన హెమిఎసిటాల్ -OH సమూహాలున్నాయి. ఇవే గ్లైకోసైడిక్ బంధాన్ని ఏర్పరుస్తున్నాయి.

మాల్టోజ్
ఇది మొలకెత్తిన బార్లీ గింజల్లో ఉంటుంది. డయాస్టేజ్ ఎంజైమ్ సమక్షంలో స్టార్చ్‌ని జల విశ్లేషణ చేసి ''మాల్టోజ్''ని పొందవచ్చు. 

మొదటి గ్లూకోజ్‌లోని C1 - α కు, రెండు గ్లూకోజ్‌లోని C4 - α కు మధ్య గ్లైకోసైడిక్ బంధం ఏర్పడుతుంది. ప్రతి గ్లూకోజ్ యూనిట్‌లో హెమిఎసిటాల్ -OH గ్రూపులు ఉన్నాయి. అందుకే ఇది క్షయకరణమయ్యే చక్కెర.

లాక్టోజ్ (C12H22O11)
     ఇది ఆవు పాలలో (4-5%), తల్లి పాలలో (6-8%) ఉంటుంది అందుకే దీన్ని ''పాల చక్కెర'' అని కూడా అంటారు. దీన్ని జలవిశ్లేషణ చేస్తే β - D - గ్లూకోజ్, β - D - గెలాక్టోజ్ వస్తాయి.

గెలాక్టోజ్‌లోని C1 - β గ్లూకోజ్‌లోని C4 - β ల మధ్య గ్లైకోసైడిన్ బంధం ఏర్పడుతుంది. ఇది క్షయకరణం చెందగల చక్కెర.

పాలీశాకరైడ్‌లు
  జల విశ్లేషణలో 10 లేదా అంతకంటే ఎక్కువ మోనోశాకరైడ్‌లను ఇచ్చే కార్బోహైడ్రేట్లను పాలీశాకరైడ్‌లు అంటారు. ఉదా: స్టార్చ్, సెల్యులోజ్, హెక్సిట్రిన్, గ్లైకోజన్.

 

స్టార్చ్: ఇది α - D - గ్లూకోజ్‌లు ఉన్న పాలిమర్, పాలీశాకరైడ్. ఇది బియ్యం, గోధుమ, మొక్కజొన్న, బంగాళదుంపల్లో ఉంటుంది. దీని అణు ఫార్ములా (C6H10O5)n. ఇందులో 10-20% నీటిలో కరిగే 'ఎమైలోజ్' ఉంటుంది. ఇది అయోడిన్ ద్రావణంతో నీలిరంగును ఇస్తుంది. దీనిలో 200 - 1000 α - D - గ్లూకోజ్ యూనిట్‌లు (దీర్ఘ రేఖీయ శృంఖలం) α - గ్లైకోసైడిక్ బంధాలతో బంధితమై ఉంటాయి. దీని అణుభారం 10,000 - 50,000 వరకు ఉంటుంది. నీటిలో కరగని 'ఎమైనో పెక్టిన్' అనే పదార్థం స్టార్చిలో 80-90% వరకు ఉంటుంది. ఇది అయోడిన్ ద్రావణంతో నీలిరంగును ఇవ్వదు. దీనిలో 25 - 30 D - గ్లూకోజ్ యూనిట్‌లు ఉంటాయి. దీనిలో α - గ్లైకోసైడిక్ బంధాలు (మొదటి గ్లూకోజ్ యూనిట్ C1, రెండో యూనిట్ C4 ల మధ్య) ఉంటాయి. అయితే ఇదే రకపు గ్లైకోసైడిక్ బంధాలు C1, C6 ల మధ్య ఉత్పన్నమై శాఖీయుత శృంఖలాలు ఏర్పడతాయి.


 

సెల్యులోజ్: ఇది β - D - గ్లూకోజ్‌లున్న పాలిమర్, పాలీశాకరైడ్. పత్తిలో 90%; చెక్కలో 40-50% సెల్యులోజ్ ఉంటుంది. దీని అణుఫార్ములా (C6H10O5)n. దీనిలో అనేక β - D - గ్లూకోజ్ యూనిట్లు β (1, 4) గ్లైకోసైడిక్ బంధాలతో బంధితమై ఉంటాయి. సెల్యులోజ్ అణువులో 300-2500 β - D - గ్లూకోజ్ యూనిట్లున్నాయి. దీని అణు భారం 50,000 5,00,000 U ఉంటుంది. హైడ్రోజన్ బంధాల వల్ల ఇది రేఖీయ నిర్మాణంతో, విడివిడి పోగుల మాదిరి ఉంటుంది. అందుకే ఇది గట్టిగా ఉంటుంది. ఇది క్షయకరణం చెందని చక్కెర. గొర్రెలు, గేదెలు లాంటి పశువులు మాత్రమే సెల్యులోజ్‌ని అరిగించుకోగలవు.


గ్లైకోజన్: దీన్నే 'జంతు పిండిపదార్థం' అంటారు. దీని నిర్మాణం 'ఎమైలో పెక్టిన్'ని పోలి ఉంటుంది. ఇది మెదడు, కాలేయం, కండరాలు, ఈస్ట్, ఫంగస్‌లలో ఉంటుంది.

కార్బోహైడ్రేట్ల ఉపయోగాలు:
* గ్లూకోజ్ నుంచి 'విటమిన్- C' ని తయారుచేస్తారు.
* యాంటిబయోటిక్‌లైన స్ట్రెప్టోమైసిన్, కెనామైసిన్, నియోమైసిన్, జంటామైసిన్‌లు కార్బోహైడ్రేట్ సంబంధిత ఔషధాలే!
* రేయాన్, ప్లాస్టిక్‌ల తయారీలో సెల్యులోజ్ ఎసిటేట్‌ని ఉపయోగిస్తారు.
ఇవి శక్తిజనకాలు.
* కాల్షియం గ్లూకోసైట్‌ను శరీరంలో కాల్షియం లోపాన్ని సవరించడానికి వాడతారు.

 

ప్రొటీన్లు
     α - ఎమైనో ఆమ్లాల మధ్య పాలీపెప్టైడ్ బంధాలు సంఘనన పాలిమరీ కరణం చెందినప్పుడు 'ప్రొటీన్' ఏర్పడుతుంది. దీని అణుభారం 10,000 U ఉంటుంది. ఇవి గోళ్లు, జుట్టు, చర్మం, కండరాలు, టెండాన్లలో ఉంటాయి. ఒక ఎమైనో ఆమ్లానికి చెందిన -NH2 గ్రూపు, ఇంకో ఎమైనో ఆమ్లానికి చెందిన -COOH గ్రూపు సంఘననం చెంది - CONH - అనే పెప్టైడ్ బంధం ఏర్పడుతుంది. వీటి అణు నిర్మాణం ఆధారంగా వీటిని రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి:
(a) నారలాంటి ప్రొటీన్లు: గోళ్లు, చర్మం, జుట్టు, ఉన్నిలో ఉండే కెరటిన్, కండరాల్లో ఉండే మయోసిన్, చర్మంలో ఉండే ఫైబ్రోయిన్ ఈ రకమైన ప్రొటీన్లు.


(b) గోళాకార ప్రొటీన్లు: ఎంజైమ్‌లు, ఇన్సులిన్, యాంటి బయోటిక్‌లు, ఆల్బుమిన్, హిమోగ్లోబిన్‌లో గోళాకార ప్రొటీన్లు ఉంటాయి. జల విశ్లేషణలో వచ్చే క్రియజన్యాలను అనుసరించి వీటిని సరళ, సమ్మేళన, ఉత్పాదిత ప్రొటీన్లుగా విభజించవచ్చు.
i) సరళ ప్రొటీన్లు: కోడిగుడ్డు తెల్లసొనలో ఉండే ఆల్బుమిన్, గోధుమలో ఉండే గ్లుటమిన్, జుట్టు, గోళ్లలో ఉండే కెరటిన్. 
ii) సమ్మేళన ప్రొటీన్లు: α - ఎమైనో ఆమ్లంతోపాటు ప్రొటీన్ కాని ప్రొస్తెటిక్ గ్రూపు ఉంటుంది.
iii) ఉత్పాదిత ప్రొటీన్లు: ప్రొటియోజ్, పెప్టోన్, పాలీపెప్టైడ్‌లు ఉత్పాదిత ప్రొటీన్లకు ఉదాహరణ.


ప్రొటీన్ల నిర్మాణం, ఆకృతులను తెలుసుకోవడం కోసం వాటిని నాలుగు దశల్లో అధ్యయనం చేయాల్సి ఉంటుంది.
ప్రైమరీ నిర్మాణం: ఇది ఎమైనో ఆమ్లాల క్రమాన్ని తెలియజేస్తుంది.
సెకండరీ నిర్మాణం: ఇది పాలీ పెప్టైడ్ గొలుసు ఆకృతిని వివరిస్తుంది.
టెర్షియరీ నిర్మాణం: ఇది ప్రొటీన్‌లో ఉండే పరమాణువుల త్రిమితీయ అమరికను తెలియజేస్తుంది.
క్వాటర్నరీ నిర్మాణం: ఇది ఉపయూనిట్ల ప్రాదేశిక అమరికను తెలుపుతుంది.
              ప్రొటీన్‌లో pH ని మార్చినా, యూరియాను కలిపినా, వేడిచేసినా, క్షోభింపజేసినా (కుదిపినా) ప్రైమరీ నిర్మాణానికి ఎలాంటి విఘాతం కలగకుండా, త్రిమితీయ నిర్మాణానికి మాత్రం విఘాతం కలిగించి ప్రొటీన్లలో ఉండే బంధాలను విచ్ఛిన్నం చెయ్యటాన్ని 'ప్రొటీన్ స్వభావ వికలత' అంటారు (ఉదా: ఉడికించిన కోడిగుడ్డు, పాలనుంచి జన్ను తయారవడం).


ఎమైనో ఆమ్లాలు

    - NH2 & - COOH లున్న ద్విప్రమేయ సమూహ కర్బన సమ్మేళనాలనే ఎమైనో ఆమ్లాలు అంటారు. ప్రకృతిలో దొరికే 700 ఎమైనో ఆమ్లాల్లో కేవలం 20 మాత్రమే ముఖ్యమైనవి. దాదాపు ప్రకృతిలో దొరికే ప్రొటీన్లలో ఉంటాయి. శరీరంలో తయారవని, కేవలం ఆహారం ద్వారా శరీరానికి అందే ఎమైనో ఆమ్లాలను 'ఆవశ్యక ఎమైనో ఆమ్లాలు'' అని (వాలిన్, లూసీన్, ఐసోలూసీన్, ఆర్జినైన్, లైసీన్, థ్రియోనైన్, హిస్టడిన్, మిథియొనైన్, ఫినైల్ అలనైన్, ట్రిప్టాపాన్), శరీరంలో తయారయ్యే మిగతా 10 ఎమైనో ఆమ్లాలను 'అనావశ్యక ఎమైనో ఆమ్లాలు' అంటారు.

అన్ని 20 ఎమైనో ఆమ్లాల్లో కేవలం R మాత్రమే మారుతుంటుంది. ప్రొలైన్ 


మినహా (దీనిలో సెకండరీ ఎమైన్ ఉంటుంది) మినహా మిగతా ఎమైనో ఆమ్లాల్లో ప్రైమరీ ఎమైనో సమూహం ఉంటుంది. గ్లైసీన్ మినహా మిగతా ప్రకృతిలో లభించే α - ఎమైనో ఆమ్లాలన్నిటికి ధ్రువణ భ్రమణత ఉంటుంది. ఇవి రంగులేని, ఘనస్థితిలో ఉండే స్ఫటిక పదార్థాలు. నీటిలో వీటికి అధిక ధ్రువత్వం ఉండటంతో ఇది జ్విట్టర్ అయాన్‌ను ఏర్పరుస్తాయి.

ఒక నిర్దిష్ట pH వద్ద, జ్విట్టర్ అయాన్ తటస్థంగా ఉండటంతో అది ఆనోడ్ వైపు లేదా కాథోడ్ వైపు ప్రయాణించకపోవడాన్ని ''సమవిద్యుత్ స్థానం'' అంటారు. సమ విద్యుత్ స్థానం తటస్థ ఎమైనో ఆమ్లాలకు PH 7 కంటే తక్కువగా (గ్లైసీన్ = 6.1), ఆమ్ల ఎమైనో ఆమ్లాలకు pH 3.0 - 5.4 (ఆస్పార్టిక్ ఆమ్లం = 3.0), క్షార ఎమైనో ఆమ్లాలకు pH 7.6 - 10.8 (లైసీన్ = 9.7) గా ఉంటాయి.
న్యూక్లియిక్ ఆమ్లాలు
              ఇవి న్యూక్లియోటైడ్‌లు, పాలీ ఫాస్ఫేట్ ఎస్టర్ శృంఖలాలతో బంధితమైన పొడవైన శృంఖలాలుండే జీవ బృహదణువులు. RNA, DNA లు న్యూక్లియిక్ ఆమ్లాల్లో ప్రధానమైనవి. న్యూక్లియిక్ ఆమ్లాల్లో చక్కెర, క్షారాలు (యురాసిల్, సైటోసిన్, థయోమీన్ అనే పిరిమిడిన్ లేదా అడినైన్, గ్వానైన్ అనే ప్యురైన్ క్షారాలు) ఉంటాయి.
             క్షారాలు + చక్కెర   న్యూక్లియోసైడ్‌
             క్షారాలు + చక్కెర + ఫాస్ఫేట్   న్యూక్లియోటైడ్‌


D.N.A

     డీ ఆక్సీరైబోన్యూక్లియిక్ ఆమ్లంలో 2-డీ ఆక్సీ- రైబోజ్ చక్కెర ఉంటుంది. దీనిలో సైటోసిన్, గ్వానైన్, అడినైన్, థయమిన్ అనే క్షారాలుంటాయి. దీనికి α - ద్విసమసర్పిల నిర్మాణం ఉంటుంది. ఇది కణంలోని కేంద్రకంలో ఉంటుంది. ఇది అనువంశికతను నియంత్రిస్తుంది. ఈ నిర్మాణం ద్విగుణీకరణం, ప్రతిపూరితత్వాలను కూడా వివరిస్తుంది. DNA లో A = C & G = C కానీ A + G = C + T, మానవ జాతికి  నిష్పత్తి 1.52, E. కోలిజాతికి 0.93 ఉంటాయి. 

DNA కు ద్విసమసర్పిల నిర్మాణాన్ని J.D. వాట్సన్, F.H.C. క్రిక్ ప్రతిపాదించారు. దీనిలోని రెండు పాయలూ అసమానాంతరంగా ఉంటాయి. ద్విసమ సర్పిల వ్యాసం 2 nm ఉండి, ద్విసమ సర్పిల నిర్మాణం ప్రతి 3.4 nm వద్ద పునరావృతమవుతూ ఉంటుంది. వేడిచేస్తే ఈ రెండు పాయలూ విడిపోతాయి. చల్లబరిస్తే దగ్గరకు వస్తాయి. ఇలా దగ్గరకు రావడాన్ని 'మందశీతలీకరణం' అని, దూరంగా జరగడాన్ని 'కరగడం' అని అంటారు.


R.N.A

    రైబోన్యూక్లియిక్ ఆమ్లంలో D - రైబోజ్ చక్కెర ఉంటుంది. ఇంకా సైటోసిన్, గ్వానైన్, అడినైన్, యురాసిల్ ఉంటాయి. దీనికి α - సర్పిల ఏకపాయ నిర్మాణం ఉంటుంది. జీవకణం సైటోప్లాజమ్‌లో ఇది ఉంది. ఇది ప్రొటీన్ల సంశ్లేషణను నియంత్రిస్తుంది.


అనువంశికత - జన్యుస్మృతి
    న్యూక్లియిక్ ఆమ్లాలు అనువంశికతను అణుపరిమాణంలోనే నియంత్రిస్తాయి. అనువంశికత సమాచారమంతా DNA లో ఉండే రెండు సర్పిలాకారపాయల్లో కోడ్‌భాషలో (A, C, G, T  క్షారక్రమం) ఉంటుంది. ఉదాహరణకు ల్యూసీన్‌కు CUU అనే కోడ్ ఉంటుంది. 3 వరుస క్షారాలను తెలియజేసే ఎమైనో ఆమ్లాన్ని జన్యుస్మృతి (Genetic code) అంటారు. దీనికి నాలుగు ప్రధాన లక్షణాలు ఉంటాయి.
* అన్ని జీవులకూ ఒకే విధమైన జన్యుస్మృతి
* నిరంతర చర్య
* జన్యుస్మృతి డీజనరేట్ కావటం
* కోడాన్‌లోని 3వ క్షారం మారుతుండటం
      
     అసలు DNA అణువుకు సరిసమానమైన కొత్త DNA అణువునిచ్చే ప్రక్రియను 'ప్రతిపూరితత్వం' (Replication) అంటారు. DNA నుంచి mRNA అణువును తయారుచేసే ప్రక్రియను 'అనులేఖనం' (Transcription) అంటారు. mRNA అణువులో ఉండే జన్యు సమాచారాన్ని డీకోడింగ్‌చేసి కొత్త ప్రొటీన్‌ల తయారీని నిర్దేశించటాన్ని 'అంతర్థానం' (Translation) అంటారు. మానవుడి జన్యు సమాచారమంతా 46 క్రోమోజోమ్‌ల మీద ఆధారపడి ఉంది. 

Posted Date : 05-08-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని

విద్యా ఉద్యోగ సమాచారం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌