• facebook
  • twitter
  • whatsapp
  • telegram

నిత్యజీవితంలో రసాయనశాస్త్రం

వేసవిలో మాత్రమే దొరికే మామిడిపండ్ల రుచిని సంవత్సరం పొడవునా ఆస్వాదిస్తున్నాం. ఇదెలా సాధ్యం? ఆయా కాలాల్లో లభించే పండ్ల గుజ్జును రసాయనాలతో నిల్వ చేసి కావాలనుకున్నప్పుడు జ్యూస్ రూపంలో పొందవచ్చు. ఈ ప్రక్రియలో రసాయనశాస్త్ర అనువర్తనం ఇమిడి ఉంది. అలాగే వ్యాధుల బారిన పడకుండా మనల్ని రక్షించే ఔషధాలు, దుస్తుల శుభ్రతకు ఉపయోగించే డిటర్జెంట్లు, ఇంటి గోడలకు వాడే రంగులు .... ఇలా మన దైనందిన జీవితంలో రసాయనశాస్త్రం ప్రముఖ పాత్ర పోషిస్తోంది.
 

మందులు
అధిక అణుభారం ఉండే లక్ష్యంపై చర్య జరిపి, జీవన ప్రక్రియలో తగు మార్పు తీసుకొచ్చే తక్కువ అణుభారమున్న (100 - 500 U) రసాయన పదార్థాలను 'మందులు' అంటారు. వ్యాధి చికిత్సకు ఉపయోగపడి జీవనవిధానంలో మార్పు తీసుకొచ్చే రసాయన పదార్థాలను 'ఔషధాలు' అంటారు. చికిత్సలో వీటిని ఉపయోగించే ప్రక్రియను 'కీమోథెరపీ' (రసాయన చికిత్స) అంటారు.
ఔషధాల లక్ష్య అణువులు, మందుల్లో ఉండే రసాయన పదార్థాలు - అవి జరిపే చర్యలు, వ్యాధి సంబంధ ఔషధాల ఆధారంగా మందులను వర్గీకరిస్తారు. జీవ సంబంధమైన ఉత్ప్రేరకాలుగా పనిచేసే ప్రొటీన్లను 'ఎంజైమ్‌లు' అంటారు. శరీరంలో సమాచారాన్ని బదిలీ చేసే వ్యవస్థల్లో ప్రధానంగా పాల్గొనే పదార్థాలను 'గ్రాహకాలు' అంటారు.

 

     ఎంజైమ్‌లు రసాయనచర్య జరగడానికి వీలుగా క్రియాజనకాలను తనలో నిలుపుకోవడం, తర్వాత క్రియాధార అణువులతో తలపడే ప్రమేయ వర్గాలను సమకూర్చడం ద్వారా రసాయన చర్యను ప్రోత్సహిస్తాయి. ఎంజైమ్‌ల్లోని క్రియాశీల స్థానాలను బలహీనపరిచి, ఉత్ప్రేరక చర్యను నిరోధించే మందులను 'ఎంజైమ్ నిరోధకాలు' అంటారు. ఎంజైమ్‌లోని క్రియాశీల స్థానాల వద్ద బంధం ఏర్పరచడానికి క్రియాజనకాలతో పోటీపడే మందులను 'పోటీ నిరోధకాలు' అంటారు. క్రియాశీల స్థానాల వద్ద ఎలాంటి బంధం ఏర్పరచని మందులను 'ఎల్లోస్టీరిక్ స్థానం' అంటారు. శరీరంలో రెండు న్యూరాన్ల మధ్య లేదా న్యూరాన్ (నాడీకణం), కండరం మధ్య సమాచారాన్ని చేరవేసే రసాయన పదార్థాలను 'రసాయన సమాచార వాహకాలు' అంటారు. అంతర్ విరుద్ధకాలు (Antagonists) రకానికి చెందిన మందులు గ్రాహకం బంధన స్థానానికి బంధితమై ఉండి గ్రాహకం జరిపే సహజక్రియను నిరోధిస్తాయి. అలాగే అంతర్ సహాయకులు (Agonists) రకానికి చెందిన మందులు సహజ సమాచార వాహకాలను అనుకరణం చేసి గ్రాహకాన్ని తెరిచేలా చేస్తాయి.
 

చికిత్సలకు సంబంధించి మందులు జరిపే చర్యలు

ఒత్తిడి, దిగులు, మానసిక విచారం, మారిన జీవన విధానాల వల్ల ఉదరంలో ఆమ్లాలు అధిక మొత్తంలో స్రవించి పుండ్లు (Ulcers) ఏర్పడతాయి. pHని ప్రభావితం చేసి, అధికంగా స్రవించిన ఆమ్లాలను తటస్థీకరణం చెయ్యడానికి వాడే రసాయన సమ్మేళనాన్ని 'ఆమ్ల విరోధి' అంటారు. ఉదా: ఒమెప్రజోల్, లాన్సో ప్రజోల్. హిస్టమిన్ అనే రసాయన పదార్థం జీర్ణకోశంలో పెప్సిన్, HCl ఏర్పడటానికి సహకరిస్తుంది. ఈ చర్యను నిరోధించే సిమిటిడీన్ (టెగమెంట్), రానిటిడీన్ (జెన్‌టాక్) లాంటి మందులను 'యాంటీ హిస్టమిన్లు' అంటారు. అలర్జీ, ముక్కు దిబ్బడ, సాధారణ జలుబును నివారించడానికి సెల్‌డేన్, డిమిటేన్ లాంటి యాంటీ హిస్టమిన్లను వాడతారు. బాధానివారణ మందులు (Analgesics), ట్రాంక్విలైజర్లు నాడీ సంబంధిత వ్యాధులను నివారించే మందులు. మానసిక వేదన, ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి వాడే మందులను 'ట్రాంక్విలైజర్లు' అంటారు. ఉదా: సెక్రోటోనిన్, ఈక్వానిల్, వాలియం. ప్రకోపం, అత్యుత్సాహాలను కూడా ఇవి నివారిస్తాయి. నిద్రమాత్రల్లో ఉండే ముఖ్య అనుఘటకం 'నార్ అడ్రినలిన్' మూడ్ (విధం)ను మారుస్తుంది. నార్ అడ్రినలిన్ క్రమ పతన క్రియను ఉత్ప్రేరణం చేసే ఎంజైమ్‌ను నిరోధించే మందులను 'వ్యాకులతా నిరోధకాలు' (Antidepressants) అంటారు. ఉదా: ఇప్రోనియజడ్, ఫెనాల్జిన్. మనోవేదనలను తగ్గించేందుకు మెప్రోబమేట్, క్లోరో డైజీ పాక్సైడ్‌లను వాడతారు. అధిక రక్తపోటు, విచారం (depression) నివారణలో 'ఈక్వానిల్‌'ను ఉపయోగిస్తారు. వేలియం, సెరోటోనిన్‌లను కూడా ట్రాంక్విలైజర్లుగా వాడతారు. బార్‌బ్యుటరిక్ ఆమ్ల ఉత్పన్నాలైన వెరోనాల్, ఎమిటాల్, నెంబుటాల్, ల్యుమినాల్ నిద్ర తెప్పించే మందులు (Hypnotics).


 

నొప్పి నివారణులను కింది విధంగా వర్గీకరించవచ్చు.
నార్కోటిక్ నొప్పి నిరోధకాలు (Narocotic Analgesics): తీవ్ర గుండెనొప్పి, శస్త్ర చికిత్సానంతర నొప్పులు, క్యాన్సర్ నొప్పులు, ప్రసవ సమయంలో కలిగే నొప్పులను నివారించే ఆల్కలాయిడ్లను 'నార్కోటిక్ మందులు' అంటారు. ఇవి కేంద్ర నాడీ వ్యవస్థను కుంగదీసి, వశపరచుకునే (మాదక) ధర్మాన్ని కలిగి ఉంటాయి. 
ఉదా: మార్ఫీన్, హెరాయిన్, కొడైన్.

 

నాన్ నార్కోటిక్ నొప్పి నిరోధకాలు (Non Narocotic Analgesics): చిన్నపాటి తలనొప్పి, కీళ్లవాతంలో వచ్చే ఎముకల సంబంధిత నొప్పులు, నడుం నొప్పిలాంటి బాధల్ని నివారించగల రసాయన పదార్థాలను 'నాన్ నార్కోటిక్ నొప్పి నిరోధకాలు' అంటారు. వీటికి వశపరచుకునే ధర్మం ఉండదు. 
ఉదా: ఆస్పిరిన్, పారాసిటమాల్. ఇవి జ్వరాన్ని తగ్గించడం, రక్తంలో ప్లేట్‌లెట్లు గడ్డకట్టే చర్యను నిరోధించడం, రక్తం గడ్డకట్టకుండా చేసి గుండెపోటును నివారిస్తాయి.

 

సూక్ష్మజీవుల నిరోధకాలు: బ్యాక్టీరియా, ఫంగి, వైరస్‌లు కలుగజేసే వ్యాధికారక చర్యలను విధ్వంసం చేసే లేదా పూర్తిగా నిరోధించే మందులను 'సూక్ష్మజీవుల నిరోధకాలు' (Antimicrobials) అంటారు. యాంటీబయోటిక్‌లు, యాంటీసెప్టిక్‌లు, అంటురోగ నివారిణులు ఈ కోవకు చెందిన మందులే.
పెన్సిలిన్‌ను అలెగ్జాండర్ ఫ్లెమింగ్ కనుక్కున్నాడు. ఎజోరంజనాలు, సాల్వర్‌సన్‌లను 'సిఫిలిస్' వ్యాధి నివారణలో ఉపయోగిస్తారు. సల్ఫానిలమైడ్ అనేది మరో యాంటీబయోటిక్. అతి తక్కువ గాఢతలో కూడా రోగకారక సూక్ష్మజీవుల జీవరసాయన చర్యలను పూర్తిగా లేదా పాక్షికంగా అడ్డుకోవడానికి కృత్రిమ రసాయన చర్యల ద్వారా ఏర్పడే పదార్థాన్ని 'యాంటీబయోటిక్' అంటారు.
పెన్సిలిన్, ఎమైనో గ్లైకోసైడ్‌లు, ఓఫ్లాక్ససిన్ బ్యాక్టీరియాను చంపే యాంటీబయోటిక్ మందులు (bactericidal). ఎరిత్రోమైసిన్, టెట్రాసైక్లిన్, క్లోరాంఫెనికోల్ బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధించే యాంటీబయోటిక్ మందులు (bactoriostatic).

* గ్రామ్ ధనాత్మక (పాజిటివ్), గ్రామ్ రుణాత్మక (నెగెటివ్) బ్యాక్టీరియాను నాశనం చేసే లేదా నిరోధించే యాంటీబయోటిక్‌లను 'అధిక విస్తృతి యాంటీబయోటిక్‌లు' అంటారు. 
* ఉదా: క్లోరాంఫెనికోల్.
* గ్రామ్ ధన లేదా గ్రామ్ రుణ బ్యాక్టీరియాల్లో ఏదో ఒకదాన్ని మాత్రమే నిరోధించే లేదా నాశనం చేసే యాంటీబయోటిక్‌లను 'స్వల్ప విస్తృతి యాంటీబయోటిక్‌లు' అంటారు. 

ఉదా: పెన్సిలిన్ - జి. టైఫాయిడ్, అధిక జ్వరం, రక్త విరేచనాలు, నెమ్ము (న్యుమోనియా), మెదడులోని పొరల వాపు (మెనింజైటిస్) వ్యాధులన్నింటినీ క్లోరాంఫెనికోల్ నయం చేస్తుంది. గాయాలు, కోతలు, వ్రణాలు (Ulcers), రోగానికి గురైన చర్మం ఉపరితల నివారణకు వాడే బిథియొనోల్, క్లోరోజైలినోల్, డెట్టాల్, టర్పినియోల్, టింక్చర్ ఆఫ్ అయోడిన్, అయోడోఫాం, బోరిక్ ఆమ్లం లాంటివన్నీ యాంటీసెప్టిక్ (చీము నిరోధక) మందులే.

రోగకారక సూక్ష్మజీవుల పెరుగుదలను ఆపగల లేదా వాటిని చంపగల (చీము పట్టనీయకుండా చేసే) మందులను 'చీము నిరోధులు' (యాంటీసెప్టిక్స్) అంటారు. ఉదా: ఫ్యురాసిన్, సోఫ్రామైసిన్. డెట్టాల్ అనేది క్లోరోజైలినోల్, టర్పీనియోల్‌ల మిశ్రమం. నేలలు, మురుగు కాల్వలు, గచ్చు నేలలపై పెరిగే హానికర సూక్ష్మాంగ జీవులను నిర్మూలించడానికి వాడే పదార్థాలను 'క్రిమి సంహారిణులు' (disinfectants) అంటారు. 0.2% ఫీనోల్ యాంటీసెప్టిక్ కాగా 1% ఫీనోల్ క్రిమిసంహారిణి. 0.2 నుంచి 0.4 ppm ఉండే క్లోరిన్ జలం, తక్కువ గాఢత ఉండే SO2 కూడా క్రిమి సంహారిణులే.


 

గర్భనిరోధక మందులు (Antifertility drugs): జనాభా నియంత్రణకు నోటి ద్వారా తీసుకునే గర్భనిరోధక మాత్రలను వాడతారు. ఇవి స్త్రీ అండాశయం నుంచి పక్వమైన అండాలను వెలువడనీయకుండా చేస్తాయి. గర్భనిరోధక మాత్ర స్టిరాయిడ్ల మిశ్రమం (ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ ఉత్పన్నాలు). 
ఉదా: నార్‌థిన్ డ్రోన్, నోవెస్ట్రోల్, మైఫ్‌ప్రిస్టోన్. వీటిలో మైఫ్‌ప్రిస్టోన్‌ను చాలా దేశాల్లో 'ఉదయానంతర మాత్ర' (morning after pill) గా వాడుతున్నారు.
* పుట్టుకని నిరోధించే ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ అనే కృత్రిమ స్టిరాయిడ్లు ఉండే మందులను 'గర్భనిరోధక మందులు' అంటారు.

 

ఆహారంలో రసాయనాలు
పోషక విలువలను పెంచడానికి, బాహ్య రూపాన్ని ఆకర్షణీయంగా చెయ్యడానికి, చెడిపోకుండా నిల్వ ఉంచడానికి ఆహారానికి కలిపే రసాయన పదార్థాలను 'సంకలితాలు' అంటారు. ఆహార పదార్థాలను పాడు చేసే సూక్ష్మాంగ జీవులను పెరగకుండా చేసి, ఆహారం ఎక్కువ కాలం నిల్వ ఉండేలా చేసే రసాయన పదార్థాలను 'ఆహార పదార్థాల సంరక్షకాలు' అంటారు. ఉదా: ఉప్పు, పంచదార, వంటనూనె, సోడియం బెంజోయేట్. ఆహార పదార్థాలు ఆక్సిజన్‌తో చర్య జరపడాన్ని నివారించి, వాటి సంరక్షణకు వాడే సంకలితాలను 'యాంటీఆక్సీకరణులు' అంటారు.
ఉదా: B.H.A., B.H.T., SO2
క్యాలరీలను పెంచకుండానే ఎక్కువ తీపిని కలిగించే కృత్రిమ రసాయన పదార్థాలను 'కృత్రిమ తీపికారిణులు' అంటారు. ఉదా: సుక్రలోజ్, శకారిన్. చక్కెర కంటే ఆస్పర్‌టేమ్ 100 రెట్లు, శకారిన్ 550 రెట్లు, సుక్రలోజ్ 600 రెట్లు, అలిటేమ్ 2000 రెట్లు తియ్యగా ఉంటాయి.

 

శుభ్రం చేసే కారకాలు
డిటర్జెంట్లు (సబ్బులు, కృత్రిమ డిటర్జెంట్లు) శుభ్రం చేసే కారకాలు. కొవ్వులను (ఫాటీ ఆమ్లం యొక్క గ్లిజరాల్ ఎస్టర్) సోడియం హైడ్రాక్సైడ్‌తో కలిపి వేడిచేస్తే సబ్బు ఏర్పడటాన్నే 'సబ్బు తయారీ' అంటారు. సోడియం కంటే పొటాషియం సబ్బులే చర్మాన్ని మృదువుగా ఉంచుతాయి.

నాణ్యమైన నూనెలు, కొవ్వులు, రంగులు, సుగంధద్రవ్యాలను కలిపి, అధికంగా ఉండే క్షారాన్ని తొలగించి శరీర శుభ్రతకు వాడే సబ్బులను తయారు చేస్తారు. షేవింగ్ సబ్బుల్లో చర్మం పొడిబారకుండా చేసే గ్లిజరీన్‌ను కలుపుతారు. లాండ్రీ సబ్బుల్లో గట్టిదనం కోసం బోరాక్స్, Na2CO3లను కలుపుతారు. కఠినజలంలో Ca+2, Mg+2 అయాన్లు ఉండటం వల్ల సబ్బుతో తెట్టు కట్టిన మలినాలు (Scum) ఏర్పడతాయి. అందుకే శుభ్రపరిచే ప్రక్రియలో కృత్రిమ డిటర్జెంట్లను వాడతారు.

శాఖాయుత గొలుసులు ఉండే డిటర్జెంట్లు జీవ క్రమ పతన ప్రక్రియకు గురికానందున అవి వాతావరణాన్ని కలుషితం చేస్తాయి. కాబట్టి శాఖాయుతం లేని గొలుసులు ఉండే డిటర్జెంట్లను వాడటం వల్ల పరిసరాలు కాలుష్యానికి గురికావు. మృదుజలం, మంచు నీరు, కఠినజలంలో నురగనిచ్చే సబ్బు ధర్మాలు ఉండే (సబ్బు లేని) శుభ్రపరిచే కారకాన్ని 'కృత్రిమ డిటర్జెంట్' అంటారు. 
ఉదా: సోడియం లారైల్ సల్ఫేట్. కృత్రిమ డిటర్జెంట్లను కాటయానిక్, ఆనయానిక్, అయాన్ రహిత డిటర్జెంట్లుగా వర్గీకరించారు. పొడవైన గొలుసులు ఉండే సల్ఫోనేటెడ్ హైడ్రోకార్బన్ల సోడియం లవణాలను 'ఆనయానిక్ డిటర్జెంట్లు' అంటారు. వీటిని ఇళ్లల్లోనూ, టూత్ పేస్టుల్లోనూ  వాడతారు.

Cl-, Br-, CH3COOఅయాన్లు ఉండే ఎమీన్‌ల క్వాటర్నరీ అమ్మోనియం లవణాలను 'కాటయానిక్ డిటర్జెంట్లు' అంటారు. ఉదా: సిటైల్ ట్రైమిథైల్ అమ్మోనియం బ్రోమైడ్.
 
వీటిని హెయిర్ కండీషనర్‌లో వాడతారు. కాటయాన్ లేదా ఆనయాన్ లేని డిటర్జెంట్లను అయాన్ రహిత డిటర్జెంట్లు (పాత్రలను శుభ్రపరిచే ద్రవ డిటర్జెంట్లు) అంటారు.


ఇవి 'మిసెల్‌'లను ఏర్పరచి మడ్డి, జిడ్డు, మురికిని తొలగిస్తాయి.

Posted Date : 05-08-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని

విద్యా ఉద్యోగ సమాచారం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌