• facebook
  • twitter
  • whatsapp
  • telegram

C, H, O లు ఉన్న కర్బన సమ్మేళనాలు  

ప్ర‌శ్న‌లు - జ‌వాబులు

2 మార్కులు 

1. 'కెనిజారో చర్య' అంటే ఏమిటి?

జ: ఆల్ఫా హైడ్రోజన్లు లేని ఆల్డిహైడ్‌లను బలమైన క్షారంతో వేడిచేస్తే అననుపాత చర్య (కార్బాక్సిలిక్ ఆమ్ల లవణంగా ఆక్సీకరణం చెందడం, ఆల్కహాల్‌గా క్షయకరణం చెందడం)కు లోనవుతాయి. దీన్నే 'కెనిజారో చర్య' అంటారు.

2. 'డీ కార్బాక్సిలీకరణం' అంటే ఏమిటి?

జ: కార్బాక్సిలిక్ ఆమ్ల సోడియం లవణాన్ని సోడా లైమ్ (3 NaOH + 1 CaO)తో వేడిచేసినప్పుడు CO2ను కోల్పోయి ఆల్కేన్‌ను ఇచ్చే చర్య.

3. 'ఆల్డాల్ సంఘననం' అంటే ఏమిటి?

జ: ఆల్ఫా హైడ్రోజన్లు ఉండే ఆల్డిహైడ్‌లు సజల క్షారంతో సంఘననం చెంది బీటా హైడ్రాక్సీ ఆల్డిహైడ్ (ఆల్డాల్)ను ఇచ్చే చర్యను 'ఆల్డాల్ సంఘననం' అంటారు.

4. 'మిశ్రమ ఆల్డాల్ సంఘననం' అంటే ఏమిటి?

జ: రెండు వేర్వేరు ఆల్డిహైడ్లను (ఆల్ఫా హైడ్రోజన్లు ఉండే) సజల క్షారంతో వేడిచేసినప్పుడు సంఘననం చెంది, 4 వేర్వేరు ఈనోల్‌లను ఇచ్చే చర్య.

5. 'హెల్ - వోలార్డ్ - జెలెన్‌స్కి చర్య' అంటే ఏమిటి?

జ: కార్బాక్సిలిక్ ఆమ్లంలో ఆల్ఫా కార్బన్‌పై ఉండే ఆల్ఫా హైడ్రోజన్ స్థానంలో ఎర్ర భాస్వరం సమక్షంలో క్లోరిన్ లేదా బ్రోమిన్‌ను ప్రతిక్షేపించే చర్య.

6. 'క్లెమెన్‌సన్ క్షయకరణం' అంటే ఏమిటి?

జ: జింక్ అమాల్గమ్, గాఢ HCl లను ఉపయోగించి ఆల్డిహైడ్ లేదా కీటోన్‌లలో ఉండే కార్బోనైల్ సమూహాన్ని -CH2- గా క్షయకరణం చేసే చర్య.

7. 'ఉల్ఫ్ - కిష్నర్ క్షయకరణం' అంటే ఏమిటి?

జ: అధిక ఉష్ణోగ్రతల వద్ద ముందు H2N - NH2తోనూ తర్వాత ఇథిలీన్ గ్లైకాల్ ద్రావణిలోనూ NaOH ను ఉపయోగించి ఆల్డిహైడ్ లేదా కీటోన్‌లలో గల కార్బోనైల్ (-C = O) సమూహాన్ని CH2గా క్షయకరణం చేసే చర్య.

8. 'రోజన్‌మండ్ క్షయకరణం' అంటే ఏమిటి?

జ: ఆమ్ల క్లోరైడ్ (ఎసైల్ క్లోరైడ్)ను Pd − BaSO4 ఉత్ప్రేరకం సమక్షంలో క్షయకరణం చేస్తే ఆల్డిహైడ్ ఏర్పడే చర్య.


         

9. 'గాటర్‌మన్ - కోచ్ చర్య' అంటే ఏమిటి?

జ: బెంజీన్ CO,HClలతో, CuCl (లేదా అనార్ద్ర AlCl3)తో చర్య జరిపి బెంజాల్డిహైడ్‌ను ఏర్పరిచే చర్య.


 

 

10. 'ఇటార్డ్ చర్య' అంటే ఏమిటి?

జ: మిథైల్ సమూహం Cr2O2Cl2తో ఆక్సీకరణం చెంది సంశ్లిష్టాన్ని ఏర్పరుస్తుంది. దీన్ని మళ్లీ జలవిశ్లేషణ చేస్తే ఆల్డిహైడ్ వస్తుంది. దీన్నే 'ఇటార్డ్ చర్య' అంటారు.

11. 'స్టీఫెన్ చర్య' అంటే ఏమిటి?

జ: -CN సమూహం SnCl2, HCl తో క్షయకరణం చెంది ఇమైన్‌ను ఇస్తుంది. దీన్ని మళ్లీ జలవిశ్లేషణ చేస్తే ఆల్డిహైడ్ వస్తుంది.

12. 'కోల్బ్ చర్య' అంటే ఏమిటి?

జ: ఫీనాల్‌ను NaOH, CO2, H+ లతో వరుసగా చర్య జరిపి సాలిసిలిక్ ఆమ్లాన్ని ఇచ్చే చర్య.


 

13. 'టోలెన్స్ కారకం' అంటే ఏమిటి? ఆల్డిహైడ్‌లలో దాని చర్యను వివరించండి.

జ: అమోనికల్ సిల్వర్ నైట్రేట్ ద్రావణాన్ని 'టోలెన్స్ కారకం' అంటారు. క్షార యానకంలో ఆల్డిహైడ్‌ను టోలెన్స్ కారకంతో వేడిచేస్తే పరీక్షనాళిక గోడలపై వెండి పూత ఏర్పడుతుంది.

14. 'ఫెహిలింగ్ కారకం' అంటే ఏమిటి? ఆల్డిహైడ్‌లతో దాని చర్యను వివరించండి.

జ: సమాన పరిమాణాలు ఉండే ఫెహిలింగ్ ద్రావణం A (కాపర్ సల్ఫేట్ జలద్రావణం), ఫెహిలింగ్ ద్రావణం B (క్షార సోడియం పొటాషియం టార్టరేట్) మిశ్రమాన్ని ఫెహిలింగ్ కారకం అంటారు. ఎలిఫాటిక్ ఆల్డిహైడ్‌ను ఫెహిలింగ్ కారకంతో వేడిచేస్తే ఎర్రని అవక్షేపం ఏర్పడుతుంది.


 

15. కింది సమ్మేళనాలను HIతో వేడిచేస్తే ఏర్పడే ప్రధాన ఉత్పన్నాలు ఏమిటి?

16. కింది చర్యలకు సమీకరణాలను రాయండి.

     i) ఫీనాల్‌ను బ్రోమిన్‌తో చర్య జరిపి 2, 4, 6 ట్రై బ్రోమో ఫీనాల్‌గా మార్చడం

     ii) బెంజైల్ ఆల్కహాల్‌ను బెంజోయిక్ ఆమ్లంగా మార్చడం

జ: i) ఫీనాల్, బ్రోమిన్ జలంతో చర్య జరిపి 2, 4, 6 - ట్రై బ్రోమో ఫీనాల్ అనే తెల్లని అవక్షేపాన్ని ఇస్తుంది.


      
ii) ఆమ్లీకృత KMnO4 బెంజైల్ ఆల్కహాల్‌ను బెంజోయిక్ ఆమ్లంగా ఆక్సీకరణం చేస్తుంది.

         

17. ఆర్థో, పారా నైట్రో ఫీనాల్‌ల మిశ్రమాన్ని జలబాష్ప స్వేదనం చేసినప్పుడు జలబాష్పశీలత చూపే సదృశకం ఏది? కారణం తెలపండి.

జ:


         
O − నైట్రోఫీనాల్‌లో బలహీనమైన అణ్వంతర హైడ్రోజన్ బంధాలు ఉండటం వల్ల దీని బాష్పీభవన స్థానం తక్కువ, కాబట్టి ఇది జలబాష్పశీలత చూపుతుంది. కాగా p - నైట్రోఫీనాల్‌లో బలమైన అంతర అణుక హైడ్రోజన్ బంధాలు ఉండటం వల్ల దీని బాష్పీభవన స్థానం ఎక్కువ, కాబట్టి ఇది జలబాష్పశీలత చూపదు.

18. సమాన అణుభారం ఉండే హైడ్రోకార్బన్లు, ఈథర్‌ల కంటే ఆల్కహాల్‌లు అధిక ఉష్ణోగ్రత వద్ద మరుగుతాయి. వివరించండి.

జ: ఆల్కహాల్‌లలో బలమైన అంతరణుక హైడ్రోజన్ బంధాలు ఉండటం వల్ల అవి అధిక ఉష్ణోగ్రత వద్ద మరుగుతాయి. హైడ్రోకార్బన్లు, ఈథర్‌లు హైడ్రోజన్ బంధాలను ఏర్పరచలేవు. వీటి బాష్పీభవన స్థానాలు తక్కువ. C2H5OH అణు ద్రవ్యరాశి 46, CH3OCH3 అణు ద్రవ్యరాశి 46, C3H8 అణు ద్రవ్యరాశి 44, కానీ C2H5OH మాత్రమే అధిక ఉష్ణోగ్రత వద్ద మరుగుతుంది.


     
 

19. మిథాక్సీ ఫీనాల్ కంటే ఆర్థో నైట్రోఫీనాల్‌కు ఆమ్లత్వం ఎక్కువ. ఎందువల్ల?

జ: -NO2 సమూహం ఎలక్ట్రాన్లను ఆకర్షించి, స్థిరమైన ఫీనాక్సైడ్ (H+ను పోగొట్టుకుని) అయాన్‌ను ఇస్తుంది. కాబట్టి ఆర్థో నైట్రోఫీనాల్‌కు అధిక ఆమ్లత్వం ఉంటుంది. అదే −OCH3 (మిథాక్సీ) సమూహం ఎలక్ట్రాన్లను విడుదల చేసి ఫీనాక్సైడ్ అయాన్‌ను ఏర్పడకుండా అడ్డుకోవడం వల్ల H+ తేలిగ్గా విడుదల కానందున మిథాక్సీ ఫీనాల్ ఆమ్లత్వం తక్కువ.

20. ఆస్పిరిన్ అంటే ఏమిటి? దీన్ని ఎలా తయారుచేస్తారు? ఉపయోగాన్ని తెలపండి.

జ: ఎసిటైల్ సాలిసిలిక్ ఆమ్లాన్ని ఆస్పిరిన్ అంటారు. సాలిసిలిక్ ఆమ్లాన్ని ఎసిటిక్ ఎన్‌హైడ్రైడ్‌తో ఎసిలీకరణం చేస్తే ఆస్పిరిన్ వస్తుంది.


      
ఆస్పిరిన్‌ను నొప్పి నివారిణిగా, మంట నివారిణిగా జ్వరంలో అధిక ఉష్ణోగ్రత నివారణలో వాడతారు.

4 మార్కులు 

1. ఫీనాల్‌ల ఆమ్ల స్వభావాన్ని వివరించి, దాన్ని ఆల్కహాల్‌ల ఆమ్ల స్వభావంతో పోల్చండి.

జ: ప్రోటాన్ (H+) దాత ఆమ్లం. -OH సమూహం ఎలక్ట్రాన్లను స్వీకరిస్తుంది, బెంజీన్ వలయంలో ఉండే sp2 కార్బన్‌తో బంధించబడి ఉంటుంది. ఫీనాల్‌లో spకార్బన్‌కు రుణవిద్యుదాత్మకత ఎక్కువగా ఉండటం వల్ల, ఆక్సిజన్‌పై ఎలక్ట్రాన్ సాంద్రత తగ్గిపోతుంది. దీనితో O -H బంధం ధ్రువత్వం పెరిగి ఆల్కహాల్‌లో కంటే ఫీనాల్‌లో అయనీకరణం ఎక్కువ జరిగి H+ను సులువుగా ఇస్తుంది. ఆల్కాక్సైడ్ (RO-) అయాన్‌లో రుణావేశం కేవలం ఆక్సిజన్ పైనే ఉంటుంది. కానీ ఫీనాల్‌లో రుణావేశం అస్థానీకరణం చెందుతుంది. రెజొనెన్స్ కారణంగా స్థిరమైన ఫీనాక్సైడ్ ఏర్పడి, తేలిగ్గా H+ అయాన్‌ను ఇవ్వగలదు.

      
ఆల్కాక్సైడ్ కంటే ఫీనాక్సైడ్‌కి స్థిరత్వం ఎక్కువ. ఫీనాల్‌ల ఆమ్లత్వం ఆల్కహాల్‌ల ఆమ్లత్వం కంటే ఎక్కువ. ఫీనాల్‌లో బెంజీన్ వలయంపై ఆర్థో, పారా స్థానాల్లో −NO2 లాంటి ఎలక్ట్రాన్ ఆకర్షక సమూహాలుంటే ఫీనాల్ ఆమ్లత్వం ఇంకా పెరుగుతుంది. pKa వివరాల ప్రకారం చూస్తే ఫీనాల్‌కు, ఇథనోల్ కంటే మిలియన్ రెట్లు ఎక్కువ ఆమ్లత్వం ఉంటుందని తెలుస్తుంది.

 

2. కింది చర్యలకు సరైన ఉదాహరణలతో సమీకరణాలను రాయండి.

     a) రైమర్ - టీమన్ చర్య

     b) విలియంసన్ ఈథర్ సంశ్లేషణ

జ: a) రైమర్ - టీమన్ చర్య: ఈ చర్యలో ఫీనాల్‌ను క్లోరోఫాం, NaOH జలద్రావణం లేదా KOH జలద్రావణంతో చర్య జరిపితే సాలిసిలాల్డిహైడ్ ఏర్పడుతుంది.

b) విలియంసన్ ఈథర్ సంశ్లేషణ: ఈ పద్ధతిలో సౌష్టవ లేదా అసౌష్టవ ఈథర్లను తయారుచెయ్యడానికి ఆల్కైల్ హాలైడ్‌లను సోడియం ఆల్కాక్సైడ్‌తో చర్య జరుపుతారు.

3. కింది పదాలను వివరించండి. ప్రతిదాని చర్యకు ఉదాహరణ ఇవ్వండి.

         a) ఎసిటాల్          b) సయనోహైడ్రిన్

         c) ఆక్సైమ్            d) సెమికార్బజోన్

జ: a) ఎసిటాల్: ఎసిటాల్డిహైడ్ ఒక మోల్ మోనోహైడ్రిక్ ఆల్కహాల్ (ఉదా: (CH3OH)తో అనార్ద్ర HCl సమక్షంలో చర్య జరిపి హెమి ఎసిటాల్‌ను (గ్రీకు భాషలో హెమి అంటే సగం అని అర్థం), 2 మోల్‌లతో చర్య జరిపి ఎసిటాల్‌ను ఇస్తుంది.

b) సయనోహైడ్రిన్: ఎసిటాల్డిహైడ్, ఎసిటోన్‌లు HCNతో చర్య జరిపి వరుసగా ఎసిటాల్డిహైడ్ సయనోహైడ్రిన్‌ను, ఎసిటోన్ సయనోహైడ్రిన్‌ను ఇస్తాయి.

c) ఆక్సైమ్: ఎసిటాల్డిహైడ్, ఎసిటోన్‌లు హైడ్రాక్సిల్ ఎమీన్ (NH2OH)తో చర్య జరిపి వరుసగా ఎసిటాల్డాక్సైమ్, ఎసిటోన్ ఆక్సైమ్‌లను ఇస్తాయి.

d) సెమికార్బజోన్: ఎసిటాల్డిహైడ్, ఎసిటోన్‌లు సెమికార్బజైడ్ (H2N - NHCONH2)తో చర్య జరిపి వరుసగా ఎసిటాల్డిహైడ్ సెమికార్బజోన్, ఎసిటోన్ సెమికార్బజోన్‌లను ఇస్తాయి.

Posted Date : 08-12-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని

విద్యా ఉద్యోగ సమాచారం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌