• facebook
  • twitter
  • whatsapp
  • telegram

యూనిట్ - I : వృక్షశరీరధర్మశాస్త్రం

ఖనిజ పోషణ

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు

1. హైడ్రోఫోనిక్స్‌ను నిర్వచించండి.
జ: 'నిర్దిష్ట మూలకాల ద్రావణంలో మొక్కలను పెంచే సాంకేతిక పద్ధతిని హైడ్రోఫోనిక్స్' అంటారు. దీన్నే మృత్తికా రహిత వర్థనం అంటారు. దీన్ని మొదట నిరూపించింది జూలియస్ వాన్‌సాక్స్ (జర్మన్ 1860).

 

2. ఒక ఆవశ్యక మూలకాన్ని సూక్ష్మ లేదా స్థూల పోషకంగా ఎలా వర్గీకరిస్తారు?
జ: ఆవశ్యక మూలకం మొక్క పొడి బరువులో 10 m mole/ kg కంటే ఎక్కువ ఉంటే స్థూలపోషకంఅని, తక్కువ ఉంటే సూక్ష్మపోషకం అని అంటారు.

 

3. ఎంజైమ్‌లకు ఉత్తేజితాలుగా పనిచేసే ఆవశ్యక మూలకాల్లో రెండు ఉదాహరణలు ఇవ్వండి.
జ: కార్బాక్సిపెప్టిడేజ్ - జింక్
   కార్బాక్సిలేజ్ - జింక్
  హెక్సోకైనేజ్ - మెగ్నీషియం
   IAA ఆక్సిడేజ్ - మాంగనీస్

 

4. కాంతి జలవిచ్ఛేదనంలో ముఖ్యపాత్ర వహించే ఆవశ్య ఖనిజ మూలకాలను తెలపండి.
జ: కాంతి జలవిచ్ఛేదనంలో ముఖ్యపాత్ర వహించే ఆవశ్యక ఖనిజ స్థూలపోషకం - కాల్షియం.
సూక్ష్మపోషకాలు - మాంగనీస్, క్లోరిన్.

 

5. 17 ఆవశ్యక మూలకాల్లో ఖనిజాలు కాని ఆవశ్యక మూలకాలు ఏవి?
జ: ఖనిజాలు కాని ఆవశ్యక మూలకాలు
     స్థూలపోషకాలు - కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్.

 

6. సల్ఫర్ ఉండే రెండు అమైనో ఆమ్లాల పేర్లు తెలపండి.
జ: సల్ఫర్ ఉండే అమైనో ఆమ్లాలు
1. మిథియోనిన్
2.  సిస్టైన్

 

7. ఒక ఆవశ్యక మూలకం లోపించిందని ఎప్పుడు చెప్పగలవు?
జ: ఆవశ్యక మూలకం ఏ గాఢత వద్ద మొక్క పెరుగుదల ఆగిపోతుందో దాన్ని 'సందిగ్ధ గాఢత' (Critical concentration) అంటారు.
           ఆవశ్యక మూలకం ఈ గాఢత కంటే తక్కువగా లభించినప్పుడు ఆ మూలకం లోపించిదని చెప్పవచ్చు.

 

8. లేత పత్రాల్లో లోప లక్షణాలను ముందుగా చూపే రెండు మూలకాల పేర్లు రాయండి.
జ: మూలకాలు చలనశీలం కానప్పుడు వృద్ధి చెందిన భాగాల నుంచి లేత పత్రాలకు రవాణా చెందవు. అలాంటి మూలకాలు లోపించినప్పుడు లేతపత్రాల్లో లోప లక్షణాలు ముందుగా కనిపిస్తాయి.
ఉదా: సల్ఫర్, కాల్షియం

 

9. లెగ్యూమ్ మొక్కల వేర్లలో ఉండే గులాబీ రంగు వర్ణద్రవ్యం పాత్రను వివరించండి. దాన్ని ఏమంటారు?
జ: వేరు బుడిపెలోని నైట్రోజినేజ్ ఎంజైమ్ అణురూప ఆక్సిజన్ సమక్షంలో క్రియాశీలతను కోల్పోతుంది. అది అవాయు పరిస్థితిలో మాత్రమే వాతావరణ నత్రజనిని అమ్మోనియాగా మారుస్తుంది. ఈ ఎంజైమ్‌ను ఆక్సిజన్ నుంచి వేరు బుడిపెలో ఉండే గులాబీ రంగు వర్ణ ద్రవ్యం రక్షిస్తుంది. దీన్నే లెగ్ హిమోగ్లోబిన్ అంటారు. దాన్ని ఆక్సిజన్ సమ్మార్జకం (Oxygen scavenger) అని కూడా అంటారు.

 

10. మృత్తికలో Mn ఎక్కువగా ఉన్నప్పుడు Ca, Mg, Fe లోపానికి దారితీస్తుంది. వివరించండి.
జ: సూక్ష్మపోషకాలు కావాల్సిన మోతాదు (గాఢత) కంటే ఏ మాత్రం ఎక్కువ ఉన్నా అవి విషపూరితం.
మాంగనీస్ ఎక్కువగా ఉన్నప్పుడు
1. మొక్కలు Mg, Fe శోషించడాన్ని నిరోధిస్తాయి.
2. మొక్కలు Ca రవాణాను నిరోధిస్తాయి.
ఈ విధంగా Mn అధికంగా ఉన్నప్పుడు Mg, Fe, Ca లోపానికి దారితీస్తుంది.

 

11. మొక్కల్లో ఏది ఆవశ్యక మూలకాలను నిల్వ ఉంచుతుంది? ఇది ఏ పద్ధతి వల్ల ఏర్పడుతుంది?
జ: మొక్కల్లో స్వేచ్ఛా ప్రదేశం/కణబాహ్య ప్రదేశం/ అపోప్లాస్ట్ ఆవశ్యక మూలకాలను నిల్వ ఉంచుతుంది. మృత్తిక నుంచి అపోప్లాస్ట్‌లోకి గాఢతా ప్రవణతకు అనుకూలంగా నిష్క్రియా విధానం ద్వారా చేరుతుంది.

 

12. ఏ ఖనిజ లవణాన్ని 17వ ఆవశ్యక మూలకంగా గుర్తించారు? దానిలోపం వల్ల వచ్చే వ్యాధిని తెలపండి.
జ: నికెల్‌ను 17వ ఆవశ్యక (సూక్ష్మ) మూలకంగా గుర్తించారు. ఇది మొక్కల్లో వ్యాధినిరోధకతను పెంచుతుంది. దానిలోపం వల్ల పత్ర అగ్రభాగాలు ఎండిపోతాయి. పెకాన్‌లో మౌస్ ఇయర్ వ్యాధి వస్తుంది.

 

13. నత్రజని స్థాపనను కేంద్రక పూర్వజీవులే చూపుతాయి. నిజకేంద్రక జీవులు చూపవు. ఎందుకు?
జ: వాతావరణంలోని అణు నత్రజని అమ్మోనియాగా క్షయకరణ చెందడాన్ని నత్రజని స్థాపన అంటారు. ఈ చర్యకు తోడ్పడే ఎంజైమ్ నైట్రోజినేజ్. ఈ ఎంజైమ్ (కొన్ని) కేంద్రక పూర్వజీవుల్లో మాత్రమే ఉంటుంది. కాబట్టి నత్రజని స్థాపనకు కేంద్రక పూర్వజీవులు మాత్రమే తోడ్పడతాయి. నిజకేంద్రక జీవుల్లో ఈ ఎంజైమ్ ఉండకపోవడం వల్ల అవి తోడ్పడవు.

 

14. వాయుసహిత, వాయురహిత నత్రజని స్థాపన జరిపే కేంద్రక పూర్వజీవులకు ఒక ఉదాహరణ ఇవ్వండి.
జ: వాయుసహిత, నత్రజని స్థాపన జరిపే కేంద్రక పూర్వ సూక్ష్మజీవి అజటోబ్యాక్టర్, బైజరింకియా
నత్రజని స్థాపన జరిపే కేంద్రకపూర్వ వాయురహిత సూక్ష్మజీవి -రోడోస్పైరిల్లం. క్లాస్ట్రీడియం.

 

15. లెగ్యూమ్ కాని మొక్కలు కూడా వేరు బుడిపెలను ఏర్పరుస్తాయి. వివరించండి.
జ: ఆల్నస్ (ఆల్డర్), కాజురైనా, మిరికా అనే లెగ్యుమినేసేతర మొక్కలు కూడా వేరు బుడిపెలను ఏర్పరుస్తాయి. ఆక్టినోమైసిటీస్‌కు చెందిన ఫ్రాంకియా ఈ మొక్కల్లో వేరు బుడిపెలను ఏర్పరుస్తుంది.

 

16. నైట్రోజినేజ్ ఎంజైమ్‌లోని ఆవశ్యక మూలకాల పేర్లను తెలపండి. అవి ఏ రకం అవశ్యక మూలకాలు?
జ: నైట్రోజినేజ్ ఎంజైమ్‌లో Fe, Mo ఉంటాయి. ఇవి సూక్ష్మ ఖనిజ ఆవశ్యక మూలకాలు.

 

17. నత్రజని స్థాపన సమతుల్య సమీకరణాన్ని రాయండి.
జ: 


 

18. జీవనత్రజని స్థాపనలో ఒక అణువుకు వాతావరణ నత్రజని స్థాపన జరపడానికి ఎన్ని ATPల శక్తి అవసరం? ఆ శక్తి ఎక్కడి నుంచి లభిస్తుంది?
జ: ఒక అణువు నత్రజని (N2) స్థాపన జరపడానికి 16 ATPలు అవసరం. ఆ శక్తి శ్వాసక్రియ నుంచి లభిస్తుంది.

 

19. అమైడ్‌లు ఎందుకు దారువు ద్వారా రవాణా చెందుతాయి?
జ: అమైనో ఆమ్లాల కంటే అమైడ్‌లలో ఎక్కువ నత్రజని ఉంటుంది. కాబట్టి అవి మొక్కల దారునాళాల ద్వారా ఇతర భాగాలకు రవాణా చెందుతాయి.

 

20. ఆవశ్యక మూలకాల పేర్లు, వాటి లోపం వల్ల వచ్చే వ్యాధులను రాయండి.
జ:  ఆవశ్యక మూలకాలు - లోపం వల్ల వచే వ్యాధులు
 1. జింక్         -     మచ్చలు ఉండే పత్రం                  
2. కాపర్       -     నిమ్మలో డైబాక్
3. బోరాన్       -     బీటుదుంపలో మధ్య కుళ్లు     
4. మాలిబ్డినం  -     కాలిఫ్లవర్‌లో కొరడా తోక
5. క్లోరిన్          -    లెగ్యూమ్‌లో బ్రాంజింగ్                 
6. నికెల్          -     పెకాన్‌లో మౌస్ ఇయర్


స్వల్ప సమాధాన ప్రశ్నలు

1. ఒక మొక్కలో ఉండే మూలకాలన్నీ అది జీవించడానికి అవసరం కాకపోవచ్చు. వివరించండి.
జ: నేలలో అనేక మూలకాలు వివిధ రూపాల్లో ఉంటాయి. ఇవి ఒక్కో ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటాయి. అన్ని మొక్కలు నేలలోని అన్ని మూలకాలను శోషించవు. మొక్క శోషించిన వాటిలో సాధారణంగా 60 రకాలు ఉంటాయి. అన్ని మొక్కల్లో ఒకేరకానికి చెందిన మూలకాలు ఉండవు. మొక్కలోని అన్ని మూలకాలు ఒకే గాఢతలో శోషితంకావు. వివిధ రకాల పరిశ్రమల చుట్టూ ఉండే ప్రాంతాల్లో కొన్నిరకాల మూలకాలు ఎక్కువ గాఢతలో శోషితమవుతాయి. అణుపరీక్షలు జరిపే ప్రదేశాల్లో రేడియోధార్మికత ఉండే స్ట్రాన్షియాన్ని మొక్కలు ఎక్కువగా శోషిస్తాయి. మొక్కలు తాము గ్రహించిన మూలకాల్లో అన్నింటిని ఉపయోగించుకోవు. ఎన్నో మూలకాలు మొక్కల్లో ఉన్నప్పటికీ అవి అన్నీ మొక్కలు జీవించడానికి అవసరంలేదు.

 

2. మొక్కలో ఏవైనా 5 భిన్న లోప లక్షణాలను రాయండి. వాటిని వివరించి, అవి ఏ మూలకాల లోపం వల్ల వస్తాయో తెలపండి.
జ: ఆవశ్యక మూలకాలు సరైన గాఢతలో లభ్యమైనప్పుడు మొక్కలు ఆరోగ్యంగా ఉంటాయి. వాటి గాఢత తక్కువ ఉంటే మొక్క పెరుగుదల మాత్రమే ఆగిపోయి ఏ వ్యాధి కలగకపోతే ఆ గాఢతను సందిగ్ధ గాఢత అంటారు. సందిగ్ధ గాఢత వద్ద మొక్కల్లో ఏ లోప లక్షణాలు ఉండవు. అంతకంటే తక్కువగా మూలకాలు లభించినప్పుడు లోప లక్షణాలు కనిపిస్తాయి.
ఒక లోప లక్షణానికి కారణం భిన్నమూలకాలు కూడా కావచ్చు. అయితే కొన్ని మూలకాల లోపాల వల్ల వచ్చే లక్షణాలు ప్రత్యేకంగా ఉండటం వల్ల లోపించిన మూలకాలను గుర్తించవచ్చు. వాటిలో కొన్ని...
1) మచ్చలున్న పత్రం: పత్రాల్లో పత్రహరితం నశించి వివిధ ఆకృతి, పరిమాణంలో మచ్చలు ఏర్పడతాయి. ఇది Zn లోపం వల్ల సంభవిస్తుంది.
2) డైబాక్: సిట్రస్ మొక్కల్లో లేత పత్రాలు మొదట ఎండిపోయి క్రమంగా ముదిరిన పత్రాలు పత్రహరితాన్ని పూర్తిగా కోల్పోయి ఎండిపోయిన వాటిలా కనిపిస్తాయి. ఇది Cu లోపం వల్ల వస్తుంది.
3) బీటు దుంపల్లో మధ్య కుళ్లు: పోషకకణజాలం ద్వారా ఆహార పదార్థాల రవాణా సరిగా జరగకపోవడం వల్ల బీటుదుంప మధ్యభాగంలోని కణజాలం కుళ్లిపోతుంది. దీనికి కారణం విటమిన్ B లోపం.
4) కాలీఫ్లవర్‌లో కొరడా తోక: కాలీఫ్లవర్‌లో పుష్పవిన్యాస వృంతం సన్నగా పొడవుగా కొరడా తోకలా మారుతుంది. దీనికి కారణం Mo లోపం.
5) బ్రాంజింగ్: లెగ్యూమ్‌లలో ఈ లక్షణానికి కారణం Cl లోపం.
6) మౌస్ ఇయర్: పెకాన్ లో ఈ వ్యాధి Ni లోపం వల్ల వస్తుంది.

 

3. వేరు బుడిపెలు ఏర్పడే విధానంలోని వివిధ దశలను వివరించండి.
జ:  లెగ్యూమినేసి మొక్కలు అమైనో ఆమ్లాలు, ఫ్లావోనాయిడ్‌లు, చక్కెరలను స్రవించి బ్యాక్టీరియాలను ఆకర్షిస్తాయి.
 వేర్లు రైజోబియం బ్యాక్టీరియాలను గుర్తించడానికి లెక్టిన్ అనే ప్రొటీన్‌ను స్రవిస్తాయి. రైజోబియం బ్యాక్టీరియా ఉత్పత్తి చేసే రసాయనాల వల్ల మూలకేశాలు ఒంగుతాయి.

రైజోబియం చేసే దాడి వల్ల మూలకేశం కణకవచం కరిగిపోగా ప్లాస్మాత్వచాన్ని తోసుకుంటూ బ్యాక్టీరియా వల్కలాన్ని చేరుతుంది. ఈ దారినే సంక్రమణ పోగు అంటారు.

సంక్రమణ పోగు నుంచి విడుదలైన బ్యాక్టీరియాలు రసాయనాలను స్రవిస్తాయి. వీటి ప్రేరణతో వల్కల, పరిచక్ర కణాలు విభజన చెంది గోళాకార బుడిపెలు ఏర్పడతాయి.
 ఈ బుడిపెలు వేరు నాళికా పుంజాలతో నేరుగా సంబంధాన్ని కలిగి ఉంటాయి. వేరు బుడిపెల్లో బ్యాక్టీరియాలు బ్యాక్టీరాయిడ్‌లుగా మార్పు చెందుతాయి.


4. కొన్ని ఆవృతబీజ మొక్కలు వాతావరణంలోని నత్రజనిని శోషించడానికి అనుకూలంగా ఉంటాయి. రెండు ఉదాహరణలతో వివరించండి.
జ: సాధారణంగా కొన్ని కేంద్రక పూర్వజీవులు మాత్రమే వాతావరణంలోని నత్రజనిని శోషించగలవు. కానీ, ఆవృతబీజాల్లో కింద వివరించిన కొన్నిమొక్కలు వాతావరణంలోని నత్రజనిని శోషించడానికి అనుకూలనాలను కలిగి ఉంటాయి.

1) లెగ్యూమినేసి (ఫాబేసి)కి చెందిన మొక్కలు తమ వేర్ల బుడిపెల్లో రైజోబియం బ్యాక్టీరియాలకు ఆశ్రయంతోపాటు పోషక పదార్థాలను అందిస్తాయి. బదులుగా (సహజీవనం) రైజోబియం నత్రజనిని వేరుబుడిపెల్లో స్థాపిస్తుంది.
2) ఆల్నస్, మిరికా అనే ఆవృతబీజాల్లో కూడా వేరు బుడిపెల్లో ఆక్టినోమైసిటీస్‌కు చెందిన ఫ్రాంకియా అనే బ్యాక్టీరియాలు సహజీవనం చేస్తాయి. ఇవి మొక్కలో నత్రజని స్థాపనకు తోడ్పడుతాయి.

 

5. ఒక ఆరోగ్యవంతమైన మొక్కకు ఆవశ్యక మూలకాలను అధిక పరిమాణంలో అందిస్తే ఏం జరుగుతుంది? వివరించండి.
జ: ఒక ఆరోగ్యవంతమైన మొక్కకు ఆవశ్యక మూలకాలను (ప్రత్యేకంగా సూక్ష్మమూలకాలను) అధికంగా అందిస్తే అవి విషపూరితమవుతాయి.
ఉదా: మాంగనీస్ అధికంగా లభ్యమైనప్పుడు
1) Fe, Mg, Ca లోపాలను ప్రేరేపిస్తుంది.
2) మొక్కలు ఈ మూలకాలను శోషించేటప్పుడు మాంగనీస్ విషాన్ని నిరోధిస్తుంది.
3) Mg (సహకారంగా పనిచేసే) ఎంజైమ్‌లతో బంధితమయ్యేటప్పుడు పోటీ పడి నిరోధిస్తుంది.
4) కాండాగ్రానికి Ca రవాణాను నిరోధిస్తుంది.

 

6. మొక్కలు ఆవశ్యక మూలకాలను ఏ విధంగా శోషిస్తాయో క్లుప్తంగా రాయండి.
జ: వేరు పొడవు ఎదిగే భాగం, వేరు కొనభాగం మూలకాలను శోషించడంలో తోడ్పడతాయి. మొక్కలు తమకు కావాల్సిన ఆవశ్యక మూలకాలను అయాన్ల రూపంలో శోషిస్తాయి. ఈ శోషణ విధానంలో రెండు పదాల పరిచయం చాలా అవసరం.

1) అపోప్లాస్ట్ (బాహ్య ప్రదేశం): దీనిలో కణకవచం, కణాంతరావకాశాలు ఉంటాయి. ఇది నిర్జీవం. దీనిలో మూలకాలు శూన్యం.
     సింప్లాస్ట్ (అంతర ప్రదేశం): ప్లాస్మాత్వచంతో ఉండే జీవపదార్థం, వివిధ కణాలకు చెందిన వాటిని కలిపే కణద్రవ్యపు పోగులు ఉంటాయి. ఇది సజీవం. దీనిలో సాధారణంగా మృత్తికలో కంటే మూలకాల గాఢత ఎక్కువగా ఉంటుంది.
మొక్కలు ఆవశ్యక మూలకాలను 2 విధానాల్లో శోషిస్తాయి.
1) నిష్క్రియా శోషణ: మృత్తిక నుంచి అపోప్లాస్ట్‌లోకి గాఢతా ప్రవణతకు అనుకూలంగా శక్తి వినియోగం లేకుండా మూలకాల అయాన్లు ప్రవేశించడాన్ని నిష్క్రియా శోషణ అంటారు.
2) సక్రియా శోషణ: గాఢతా ప్రవణతకు వ్యతిరేకంగా శక్తి వినియోగంతో మూలకాల అయాన్లు అపోప్లాస్ట్ నుంచి సింప్లాస్ట్‌లోకి ప్లాస్మాత్వచం ద్వారా శోషించడాన్ని సక్రియా శోషణ అంటారు.

 

7. జీవపద్ధతిలోనే కాకుండా మృత్తికలో కూడా నత్రజని స్థాపన జరుగుతుంది. వివరించండి.
జ: మొక్కలు, జంతువులు నశించిన తర్వాత మృత్తికను చేరతాయి. ఇవి మృత్తికలో కుళ్లిపోతాయి. వీటి నుంచి సూక్ష్మజీవులు ఎలాంటి దుర్వాసన రాకుండా అమ్మోనియాగా మార్చడాన్ని అమ్మోనిఫికేషన్ అంటారు.
      అమ్మోనియా మృత్తికలో ఉన్నప్పుడే నైట్రేట్‌గా మారడాన్ని నత్రీకరణ అంటారు. ఇది 2 చర్యల్లో జరుగుతుంది

దీర్ఘ సమాధాన ప్రశ్న

1. నత్రజని వలయాన్ని సోదాహరణంగా వివరించండి.
జ: వాతావరణంలోని అణు నత్రజని మొదట మృత్తికను చేరుతుంది. మొక్కలు దాన్ని గ్రహించి వినియోగించుకుంటాయి. మొక్కలు ఆహారంగా తీసుకున్న జంతువుల్లో కూడా ఇది చేరుతుంది. చివరగా జంతువులు నశించిన తర్వాత సూక్ష్మజీవుల ద్వారా తిరిగి వాతావరణంలోకి ప్రవేశిస్తుంది. నిత్యం జరిగే ఈ చక్రాన్ని నత్రజని వలయం అంటారు.


నత్రజని వలయంలో 5 దశలు ఉంటాయి.
        1) నత్రజని స్థాపన
        2) నత్రజని స్వాంగీకరణ
        3) అమ్మోనిఫికేషన్
        4) నత్రీకరణ
        5) వినత్రీకరణ

1) నత్రజని స్థాపన: వాతావరణంలోని అణు నత్రజని (N  N) (78%) మందకొడి రకం. ఇది NH3గా మారడాన్ని నత్రజని స్థాపన అంటారు. సాధారణంగా కేంద్రక పూర్వ సూక్ష్మజీవులు మాత్రమే ఈ చర్య జరుపుతాయి. కాబట్టి దీన్ని జీవసంబంధ నత్రజని స్థాపన అంటారు. నైట్రోజినేజ్ అనే ఎంజైమ్ ఉన్న సూక్ష్మజీవులు మాత్రమే ఈ చర్యను జరుపుతాయి. 
            
ఈ సూక్ష్మజీవుల్లో కొన్ని
*వాయుసహిత స్వేచ్ఛారకం
   ఉదా: అజోటోబాక్టర్, బైజరింకియా
*వాయురహిత స్వేచ్ఛారకం
    ఉదా: రోడోస్పైరిల్లమ్
*నీలిఆకుపచ్చ శైవలాలు
    ఉదా: నాస్టాక్, అనబీనా
*సహజీవన రకం
    ఉదా: రైజోబియం

2) నత్రజని స్వాంగీకరణ: మొక్కలు అసేంద్రియ నత్రజనిని వినియోగించుకుని సేంద్రియ నత్రజనిగా (DNA, RNA, ప్రొటీన్‌లు, ఎంజైమ్‌లు లాంటివి) సంశ్లేషించుకోవడాన్ని నత్రజని స్వాంగీకరణ అంటారు.
3) అమ్మోనిఫికేషన్: ఇది మృత్తికలో జరుగుతుంది. మొక్కలు, జంతువులు నశించిన తర్వాత వాటిని నేలలోని పూతికాహార సూక్ష్మజీవులు (ఉదా: బాసిల్లస్) NH3 గా మారుస్తాయి. దీన్నే అమ్మోనిఫికేషన్ అంటారు.

4) నత్రీకరణ: ఇది మృత్తికలో 2 దశల్లో జరుగుతుంది.

5) వినత్రీకరణ: ఇది మృత్తికలోనే జరుగుతుంది. ఈ చర్యలో నైట్రేట్ అణు నత్రజనిగా మారి వాతావరణ సమతౌల్యానికి తోడ్పడుతుంది.
ఉదా: థయోబాసిల్లస్ సూడోమోనాస్, నైట్రోకాకస్

Posted Date : 28-01-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని

విద్యా ఉద్యోగ సమాచారం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌