• facebook
  • twitter
  • whatsapp
  • telegram

బ్యాక్టీరియా 

 ప్రశ్నలు - జవాబులు

 అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు 

1. సూక్ష్మజీవుల ఉనికి, విస్తరణను గురించి క్లుప్తంగా రాయండి.

జ: సూక్ష్మజీవులు సర్వత్రా వ్యాపించి ఉంటాయి. తేమ, పోషక పదార్థాలు ఉన్న అన్ని రకాల ఆవాసాల్లో పెరుగుతాయి. మృత్తిక, బురద, నీరు, గాలి, మొక్కలు, జంతువులు, ఆహార పదార్థాలు, కలప, దుస్తులు, కాగితం, తోలు, గోళ్లు మొదలైన ఆవాసాలపై వివిధ రకాల సూక్ష్మ జీవులు పెరుగుతాయి. వేడినీటి బుగ్గలు, మంచుతో నిండిన పర్వతాలు, శీతల మండలాల్లో, తీవ్రమైన ఆమ్ల, క్షార లక్షణాలను, అధిక ఉష్ణోగ్రతల్లో లవణాల గాఢతను కూడా తట్టుకుని సూక్ష్మజీవులు పెరుగుతాయి.
 

2. సూక్ష్మ జీవశాస్త్రాన్ని నిర్వచించండి.

జ: కంటికి కనిపించని సూక్ష్మజీవుల గురించి చర్చించే జీవశాస్త్రంలోని విభాగాన్ని సూక్ష్మ జీవశాస్త్రం అంటారు.
 

3. మానవుడి పేగుల్లో సాధారణంగా నివసించే బ్యాక్టీరియమ్ ఏది? దాన్ని జీవ సాంకేతిక శాస్త్రంలో ఎలా ఉపయోగిస్తారు?

జ: సాధారణంగా మానవుడి పేగుల్లో ఎశ్చరీషియా కోలై అనే బ్యాక్టీరియమ్ సహజీవిగా నివసిస్తుంది. ఈ.కోలై ప్లాస్మిడ్‌లను జెనెటిక్ ఇంజినీరింగ్ సాంకేతికతలో వాహకాలుగా ఉపయోగిస్తారు.
 

4. బహురూప బ్యాక్టీరియమ్‌లు అంటే ఏమిటి? ఉదాహరణ ఇవ్వండి.
జ: పరిసర పరిస్థితులు, లభ్యమయ్యే పోషక పదార్థాలను బట్టి తరచూ ఆకారాన్ని మార్చుకునే బ్యాక్టీరియమ్‌లను బహురూప బ్యాక్టీరియమ్‌లు అంటారు.
ఉదా: అసిటోబాక్టర్.

 

5. లైంగిక పైలస్ అంటే ఏమిటి? దాని విధిని తెలపండి.
జ: సంయుగ్మం జరగడానికి అవసరమయ్యే ఒక ప్రత్యేక సంయుగ్మ పరికరాన్ని సంయుగ్మ నాళం లేదా పైలస్ లేదా లైంగిక పైలస్ అంటారు. ఇది రెండు సంయుగ్మకాలను అంటిపెట్టుకుని ఉండటంలో తోడ్పడుతుంది.

 

6. జీనోఫోర్ అంటే ఏమిటి?  

జ: బ్యాక్టీరియమ్ క్రోమోసోమ్‌ను 'జీనోఫోర్' అంటారు


7. సంయుగ్మం అంటే ఏమిటి? దాన్ని ఎవరు, ఏ జీవిలో కనుక్కున్నారు?
జ: సంయుగ్మ నాళం ద్వారా దాతకణం (F+) నుంచి గ్రహీతకణంలోకి జరిగే జన్యు పదార్థ మార్పిడిని 'సంయుగ్మం' అంటారు. సంయుగ్మాన్ని మొదటిసారిగా 1946 లో లెడర్‌బర్గ్, టాటమ్ ఎశ్చరీషియా కోలైలో కనుక్కున్నారు.

 

8. జన్యుపరివర్తన అంటే ఏమిటి? దాన్ని ఎవరు ఏ జీవిలో కనుక్కున్నారు?
జ: నగ్న DNA ఖండితాలను పరిసర వాతావరణం నుంచి స్వీకరించి గ్రహీత కణంలోకి ప్రవేశపెట్టడాన్ని జన్యుపరివర్తన అంటారు. ఇప్పుడు గ్రహీతకణం అంతకు ముందు లేని లక్షణాన్ని పొందుతుంది.  బ్యాక్టీరియమ్‌లో జరిగే ఈవిధమైన జన్యు పునఃసంయోజనాన్ని ఫ్రెడిరిక్ గ్రిఫిత్ (1928) స్ట్రెప్టోకోకస్ న్యూమోనియేలో కనుక్కున్నాడు.

 

9. జన్యువహనం అంటే ఏమిటి? దాన్ని ఎవరు, ఏ జీవిలో కనుక్కున్నారు?
జ: బ్యాక్టీరియోఫాజ్ ద్వారా జన్యుపదార్థం ఒక బ్యాక్టీరియమ్ నుంచి మరొక బ్యాక్టీరియమ్‌కు బదిలీ చెందడాన్ని జన్యువహనం అంటారు. లెడర్‌బర్గ్, జిండర్ (1951) సాల్మోనెల్లా టైఫిమ్యూరియమ్‌లో జన్యువహనాన్ని కనుక్కున్నారు.
   

 స్వల్ప సమాధాన ప్రశ్నలు 
 

1. సూక్ష్మ జీవశాస్త్ర ప్రాముఖ్యాన్ని వివరించండి.
జ: * అనేక సూక్ష్మజీవులు మానవుడికి ఎన్నో విధాలుగా ఉపయోగపడతాయి.
* చనిపోయిన మొక్కలు, జంతువుల దేహాలను ఇవి కుళ్లిపోయేలా చేసి, పోషక పదార్థాలను ఏర్పరచి నేలను సారవంతం చేస్తాయి. 
* సూక్ష్మజీవ నాశక ఔషధాలు, టీకా మందులను ఉత్పత్తిచేసి వ్యాధిరహిత ప్రపంచం ఏర్పడటానికి తోడ్పడతాయి.
* ఎంజైమ్‌లు, అమైనో ఆమ్లాలు, విటమిన్‌లు, సేంద్రియ ఆమ్లాలు, ఆల్కహాల్ లాంటి అనేక పారిశ్రామిక ఉత్పన్నాలు సూక్ష్మజీవుల వల్ల ఏర్పడుతున్నాయి.
* పాలు పెరుగుగా మారడానికి లాక్టోబాసిల్లస్ లాంటి బ్యాక్టీరియమ్‌లు తోడ్పడతాయి. అంతేకాకుండా B12 విటమిన్‌ను పెంచి, పోషక విలువలను అందిస్తాయి. పొట్టలో వ్యాధికారక సూక్ష్మజీవులను అరికట్టడంలోనూ LAB లు ప్రముఖ పాత్ర వహిస్తాయి. జున్ను, యోగర్ట్ లాంటి ఆహార పదార్థాలు సూక్ష్మజీవుల పెరుగుదలలో తయారయ్యే ఉప ఉత్పన్నాలే.
* బ్యాక్టీరియమ్‌లు, శిలీంద్రాల లాంటి సూక్ష్మజీవులు మురికి నీరు తొలగించడంలో ఉపయోగపడుతున్నాయి.
* శిలల నుంచి యురేనియం లాంటి లోహాలను నిష్కర్షణ చేయడానికి సూక్ష్మజీవులను వాడుతున్నారు. వీటి మూలంగా గనులు తవ్వడంలో 50% ఖర్చును తగ్గించవచ్చు.
* జెనెటిక్ ఇంజినీరింగ్ ద్వారా జీవుల్లో జన్యుమార్పిడి జరిపే ప్రక్రియను సూక్ష్మజీవ శాస్త్రానికి సంబంధించిన ఒక అతిముఖ్యమైన ప్రగతిగా చెప్పవచ్చు.
* సూక్ష్మజీవులు జీవ సంబంధ నివారణ వాహకాలుగా ఉపయోగపడతాయి.
* సూక్ష్మజీవులను ఉపయోగించి రోదసిలో జీవాన్వేషణ జరుపుతున్నారు. దీన్ని వ్యోమ సూక్ష్మ జీవశాస్త్రం అంటారు.
* జీవవాయువు కొన్ని వాయువుల మిశ్రమం. ఇది సూక్ష్మజీవుల చర్య వల్ల ఉత్పత్తి అవుతుంది. దీన్ని ఇంధనంగా వాడతారు.
* సూక్ష్మజీవులు జీవ ఎరువులుగా, బయోసెన్సర్లుగా, జీవ నియంత్రణలోనూ ఉపయోగపడుతున్నాయి.

 

2. స్వరూపం ఆధారంగా బ్యాక్టీరియమ్‌లను ఏవిధంగా వర్గీకరించవచ్చు?
జ: స్వరూపం, ఆకారం ఆధారంగా బ్యాక్టీరియమ్‌లను కింది విధంగా విభజించారు.
* కొకై - గోళాకార
* బాసిల్లై - సాగి ఉన్న దండాల లాంటి
* స్పైరిల్లమ్ - సర్పిల దండాలు (ఒక పూర్తి మెలిక కంటే ఎక్కువ మెలిక ఉన్న కణాలు - స్పష్టమైన సర్పిలాకారం)
* విబ్రియో - కామా ఆకారం (ఒక పూర్తి మెలిక కంటే తక్కువ మెలిక ఉన్న కణాలు)
* బహురూప బ్యాక్టీరియమ్‌లు - వాతావరణ పరిస్థితి, లభ్యమయ్యే పోషకాలను బట్టి ఆకారాలను మార్చుకుంటాయి.
* స్పైరోకీట్స్ - నమ్యత కలిగి ఉండే బ్యాక్టీరియమ్‌లు (సన్నటి, పొడవైన; కార్క్ స్క్రూ ఆకారం)
* తంతురూపం - దారం పోగు లేదా తంతువు రూపంలో (పొడువాటి గొలుసులు)
* బ్యాక్టీరియమ్‌లు ఒంటరిగా లేదా గుంపులుగా ఉండవచ్చు. ఒకదాంతో మరొకటి అంటి పెట్టుకునే కణాల సంఖ్య, వాటి అమరికను బట్టి అవి ............
* మోనోకోకస్ - ఒక విడికణం
* డిప్లోకోకస్ - ఒక జత కణాలు
* టెట్రాకోకస్ - నాలుగు కణాల గుంపు
* స్ట్రెప్టోకోకస్ - ఒకే వరుసలో అమరి ఉండే గొలుసు లాంటి కణాలు 
* స్టాఫైలోకోకై - క్రమరహిత పద్ధతిలో అమరి ఉండి గుత్తులుగా ఏర్పడిన కణాలు 
* సార్సినా - ఎనిమిది కణాలతో ఘనాకారంలో అమరి ఉండేవి.
* మోనోబాసిల్లస్ - ఒంటరిగా సాగి ఉన్న కణం.
* డిప్లోబాసిల్లస్ - ఒక జత బాసిల్లై కణాలు.
* స్ట్రెప్టోబాసిల్లస్ - స్ట్రాలా కనిపించే గొలుసు మాదిరిగా ఉండే బాసిల్లై

 

3. కశాభాల సంఖ్య, వాటి అమరికను బట్టి బ్యాక్టీరియమ్‌లను ఏవిధంగా వర్గీకరించారు?
జ: కశాభాల సంఖ్య, వాటి అమరికను బట్టి బ్యాక్టీరియమ్‌లను కింది విధంగా వర్గీకరించారు.
ఏకతంతుకం - ఒకే ఒక ధ్రువ కశాభం ఉంటుంది.
ద్విధ్రువతంతుకం - కణానికి ప్రతికొన వద్ద ఒక కశాభం ఉంటుంది.
బహుతంతుకం - కణానికి ఒక ధ్రువం వద్ద రెండు లేదా ఎక్కువ కశాభాలు ఉంటాయి.
పరితంతుకం - కశాభాలు కణం ఉపరితలం అంతటా విస్తరించి ఉంటాయి.

 

4. శక్తి, కార్బన్ మూలాల ఆధారంగా బ్యాక్టీరియమ్‌లలో పోషణ సముదాయాలు ఏవి?
జ: కర్బనం, శక్తి మూలాల ఆధారంగా బ్యాక్టీరియమ్‌లలో నాలుగు ప్రధాన పోషక సముదాయాలను గుర్తించారు.

 

5. రసాయన పరపోషిత బ్యాక్టీరియమ్‌లు, వాటి ఆవశ్యకతను క్లుప్తంగా రాయండి.
జ: కార్బన్, శక్తి ఈ రెండింటిని రసాయన పరపోషితాలు కర్బన సంయోగ పదార్థాల నుంచి పొందుతాయి. వీటిని రెండు సమూహాలుగా వర్గీకరించారు. అవి:
* పూతికాహారులు
* పరాన్నజీవులు
పూతికాహారులు: ఇవి స్వేచ్ఛగా ఉండే సూక్ష్మజీవులు. ప్రాథమికంగా కుళ్లిన, నిర్జీవ సేంద్రియ పదార్థాల నుంచి పోషకాలను గ్రహిస్తాయి.
ఉదా: బాసిల్లస్ జాతులు
పరాన్నజీవులు: ఆతిథేయి కణాలు, కణజాలాల నుంచి పోషకాలను గ్రహిస్తాయి (మొక్కలు, జంతువులు).
ఉదా: జాంథోమోనాస్ సిట్రి (సిట్రస్ మొక్కపై), సాల్మోనెల్లా టైఫిమ్యూరియమ్ (మానవులపై)  దీనివల్ల  టైఫాయిడ్ వ్యాధి వస్తుంది.
ప్రాముఖ్యం:
* పూతికాహారులు నిర్జీవ జంతు, వృక్షదేహాలను కుళ్లేలా చేస్తాయి. దీనివల్ల పోషక మూలకాలు నిరంతరం పునచక్రీయం చెందడమే కాకుండా, పరిసరాలు కూడా పరిశుభ్రమవుతున్నాయి.
* పరాన్నజీవులు వ్యాధులు కలిగించి నష్టపరిచినప్పటికీ, వీటిలో కొన్ని 'జీవకీటక నాశకారి'గా ఉపయోగపడుతున్నాయి.
* డెల్లోవైబ్రియా బ్యాక్టీరియోవోరస్‌ను గంగానదిని పరిశుభ్రం చేయడంలో వినియోగిస్తున్నారు.

 

6. బ్యాక్టీరియమ్‌లలోని సంయుగ్మాన్ని గురించి వివరించండి.
జ: * సంయుగ్మం అనేది బ్యాక్టీరియాలో ఒక జన్యు పునసంయోజన పద్ధతి.
* దీన్ని లెడర్‌బర్గ్, టాటమ్ మొదటిసారిగా 1946 లో ఎశ్చరీషియా కోలైలో పరిశీలించారు. 
* ఈ ప్రక్రియలో మొదట F+ (దాత)కణం, F- (గ్రహీత) కణంతో అంటిపెట్టుకుంటుంది. ఆ తరువాత సంయుగ్మానికి అవసరమయ్యే ఒక ప్రత్యేక సంయుగ్మ పరికరాన్ని సంయుగ్మనాళం లేదా లైంగిక పైలస్‌ను ఏర్పరుస్తుంది.
* F ప్లాస్మిడ్ ఉన్న F+ దాతకణంగా, ప్లాస్మిడ్ లేని F - గ్రహీతకణంగా వ్యవహరిస్తాయి.
* బ్యాక్టీరియా కణాలు అంటి పెట్టుకోగానే, పైలస్ పొట్టిదై రెండు కణాలను దగ్గరకు చేరుస్తుంది.
* దాతలోని F ప్లాస్మిడ్ ప్రతికృతి చెంది పైలస్ నుంచి ఏర్పడిన వంతెన ద్వారా గ్రహీత కణంలోకి చేరుతుంది.
* దీంతో సంయుగ్మం పూర్తవుతుంది. ఆ తరువాత కణాలు విడిపోతాయి.
* ఇది ఒక సంరక్షణ ప్రక్రియ. ఎందుకంటే దాతకణం జన్యుపదార్థం బదిలీ జరగడానికి ముందే దాని నకలును తనలో నిలిపి ఉంచుకుంటుంది.
 

 దీర్ఘసమాధాన ప్రశ్నలు  
 

1. బ్యాక్టీరియమ్‌లలో జరిగే వివిధ రకాల లైంగిక ప్రత్యుత్పత్తి పద్ధతులను వివరించండి.
జ: బ్యాక్టీరియమ్‌లలో నిజమైన లైంగిక ప్రత్యుత్పత్తి లేదు. కానీ లైంగిక ప్రత్యుత్పత్తిలో జరగాల్సిన జన్యుపదార్థ వినియమం (జన్యు పునసంయోజనం) వీటిలో మూడు విధాలుగా జరుగుతుంది. అవి:
* సంయుగ్మం
* జన్యుపరివర్తన
* జన్యు వహనం
సంయుగ్మం:
* ఇది సజీవదాత, గ్రహీత కణాల మధ్య ప్రత్యక్షంగా జరిగే డీఎన్ఏ మార్పిడి.
* దీన్ని లెడర్‌బర్గ్, టాటమ్ మొదటిసారిగా 1946 లో ఎశ్చరీషియా కోలైలో పరిశీలించారు.
* ఈ ప్రక్రియలో మొదట F+ కణం, F - కణంతో అంటి పెట్టుకుంటుంది. ఇవి లైంగిక పిలి లేదా సంయుగ్మనాళంతో అంటిపెట్టుకొని ఉంటాయి.
* F ప్లాస్మిడ్ ఉన్న F+ దాతకణంగా, ప్లాస్మిడ్ లేని F - గ్రహీతకణంగా వ్యవహరిస్తాయి.
* బ్యాక్టీరియా కణాలు అంటిపెట్టుకోగానే పైలస్ పొట్టిదై రెండు కణాలను దగ్గరకు చేరుస్తుంది.
* దాతలోని F ప్లాస్మిడ్ ప్రతికృతి చెంది, పైలస్ నుంచి ఏర్పడిన వంతెన ద్వారా గ్రహీత కణంలోకి చేరుతుంది.
* దీంతో సంయుగ్మం పూర్తవుతుంది. ఆ తరువాత కణాలు విడిపోతాయి.
* ఇది ఒక సంరక్షణ ప్రక్రియ, ఎందుకంటే దాత కణం జన్యుపదార్థం బదిలీ జరగడానికి ముందే దాని నకలును తనలో నిలిపి ఉంచుకుంటుంది.
జన్యుపరివర్తన
* నగ్న DNA ఖండితాలను పరిసర వాతావరణం నుంచి స్వీకరించి గ్రహీతకణంలోకి ప్రవేశపెట్టడాన్నే జన్యుపరివర్తన అంటారు.
* గ్రహీత కణం ఇంతకు ముందు లేని లక్షణాన్ని పొందుతుంది.
* ఈ విధమైన జన్యు పునఃసంయోజనాన్ని ఫ్రెడిరిక్ గ్రిఫిత్ (1928) స్ట్రెప్టోకోకస్ న్యూమోనియేలో కనుక్కున్నాడు.
జన్యువహనం
* బ్యాక్టీరియోఫాజ్ వైరస్ ద్వారా జన్యు పదార్థం ఒక బ్యాక్టీరియమ్ నుంచి మరొక బ్యాక్టీరియమ్‌కు బదిలీ చెందడాన్ని జన్యువహనం అంటారు.
* లెడర్‌బర్గ్, జిండర్ (1951) సాల్మోనెల్లా టైఫిమ్యూరియమ్‌లో జన్యు వహనాన్ని కనుక్కున్నారు.

2. 'బ్యాక్టీరియమ్‌లు మానవాళికి మిత్రులు, శత్రువులుగా ఉంటాయి' చర్చించండి.
జ: మొక్కలు, జంతువులు, మానవుల్లో బ్యాక్టీరియమ్‌లు వ్యాధులు కలగజేస్తాయి. అంతేకాకుండా అనేక బ్యాక్టీరియమ్‌లు మానవులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రయోజనకరంగా ఉంటాయి. బ్యాక్టీరియమ్‌లు మానవుల్లో కింది వ్యాధులు వస్తాయి.
అవి: టెటానస్ - క్లాస్ట్రీడియమ్ టెటాని
        కలరా - విబ్రియో కలరే
        టైఫాయిడ్ - సాల్మొనెల్లా టైఫిమ్యూరియమ్
        డిఫ్తీరియా - కొరినె బ్యాక్టీరియమ్ డిఫ్తీరియే
        ట్యూబర్‌క్యులోసిస్ - మైకో బ్యాక్టీరియమ్ ట్యూబర్‌క్యులోసిస్
        న్యూమోనియా - డిప్లోకోకస్ న్యూమోనియే
        లెప్రసీ - మైకో బ్యాక్టీరియమ్ లెప్రే
        గనేరియా - నిస్సేరియా గనేరియా
        సిఫిలిస్ - ట్రెపోనిమా పాల్లిడమ్
        క్లాస్ట్రీడియమ్ బోట్యులినం - బొట్యులిజం (ఆహారాన్ని పాడు చేయడం)

 

మొక్కల్లో
        వరిబ్లైట్ తెగులు - జాంథోమోనాస్ ఒరైజే, సిట్రస్ కాంకర్ - జాంథో మోనాస్ - ఆక్సనోపోడిస్ పీవీ సిట్రి, ఆపిల్, పియర్‌లలో క్రౌన్‌గాల్ తెగులు (ఆగ్రో బ్యాక్టీరియమ్ ట్యుమిఫేసియన్) అదే సందర్భంలో అనేక బ్యాక్టీరియమ్‌లు మానవుడికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రయోజనకరంగా ఉంటాయి.
* పూతికాహార బ్యాక్టీరియమ్‌లు నిర్జీవ వృక్ష, జంతుదేహాలను కుళ్లిపోయేలా చేసి వాటిలోని సంక్లిష్ట సేంద్రియ పదార్థాలను సరళ సేంద్రియ పదార్థాలుగా మార్చి నేలలో కలిపి, మొక్కలకు లభించేలా చేస్తున్నాయి. దీనివల్ల పోషక మూలకాలు నిరంతరంగా పునచక్రీయం చెందడమే కాకుండా పరిసరాలు పరిశుభ్రమవుతున్నాయి. కాబట్టి బ్యాక్టీరియాలను 'ప్రకృతిలోని పారిశుద్ధ్య పనివారు' అంటారు.
* అనేక బ్యాక్టీరియమ్‌లు నేలను సారవంతం చేయడంలో ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి.
* విటమిన్లు, సూక్ష్మజీవనాశకాలు, ఆల్కహాల్, ఎంజైమ్‌లు, హార్మోన్లను పారిశ్రామిక స్థాయిలో ఉత్పత్తి చేయడంలో బ్యాక్టీరియమ్‌లు ఎంతగానో తోడ్పడుతున్నాయి.
* జీవ సాంకేతికశాస్త్రం, జెనెటిక్ ఇంజినీరింగ్‌లో పనిముట్లుగా ఉపయోగపడుతున్నాయి.
* పాలు పెరుగుగా మారడంలో లాక్టోబాసిల్లస్ లాంటి బ్యాక్టీరియమ్‌లు తోడ్పడుతున్నాయి.
* మెథనో కోకస్, మెథనోబాసిల్లస్ లాంటి బ్యాక్టీరియమ్‌లను బయోగ్యాస్ ఉత్పత్తిలో ఉపయోగిస్తున్నారు.
* శిలల నుంచి యురేనియం లాంటి లోహాలను నిష్కర్షణ చేయడానికి సూక్ష్మజీవులను వాడుతున్నారు (బయోమైనింగ్).
* బ్యాక్టీరియమ్‌ల DNA అనుఘటకాలను బయోసెన్సర్‌గా ఉపయోగించి జీవక్రియావంతమైన విషపూరిత కాలుష్య కారకాలను గుర్తిస్తున్నారు.
* చీడ, పీడల నివారణలో జీవ కీటకనాశకారిగా ఉపయోగిస్తున్నారు.
* రైజోబియం, అజోస్పైరిల్లమ్, అజటోబాక్టర్ లాంటి బ్యాక్టీరియమ్‌లను జీవ ఎరువులుగా వాడుతున్నారు. కాబట్టి బ్యాక్టీరియమ్‌లను మానవుడి మిత్రులుగానూ, శత్రువులుగానూ కూడా భావించడం ఎంతైనా సమంజసం.

 అభ్యాసాలు


1. బ్యాక్టీరియమ్‌లు మానవులకు అనారోగ్యాన్ని, సాంక్రమిక వ్యాధులను మాత్రమే కలగజేస్తాయని చాలా వరకు ప్రజలు నమ్ముతారు. ఈ అధ్యాయంలో ఇచ్చిన సమాచారాన్ని బట్టి ఈ అపనమ్మకాన్ని మీరు ఎలా సరిదిద్దుతారు?
జ. బ్యాక్టీరియమ్‌ల వల్ల ఎన్నో ప్రయోజనాలు సమకూరతాయి.
ప్రయోజనకర చర్యలు: బ్యాక్టీరియమ్‌లు నిర్జీవ జంతు, వృక్షదేహాలను కుళ్లేలా చేస్తాయి. వాటిలోని సంక్లిష్ట కర్బన సమ్మేళనాలను సరళ పదార్థాలుగా మారుస్తాయి. దీని వల్ల పోషక మూలకాలు నిరంతరంగా పునచక్రీయం చెందుతాయి. దీన్నే జీవ - భూ రసాయన వలయాలు అంటారు. దీనివల్ల పరిసరాలు కూడా పరిశుభ్రమవుతాయి. అందువల్ల బ్యాక్టీరియమ్‌లను 'ప్రకృతిలోని పారిశుద్ధ్య పనివారు' అని కూడా అంటారు.

 

2. మానవుడు రోజులో 50 గ్రాముల విసర్జితాలు విడుస్తాడు. శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం మానవ విసర్జితాల్లో  వ వంతు బ్యాక్టీరియమ్‌లు ఉంటాయి. ఒక ఎ.కోలై కణం 1 × 10 -12 గ్రాముల బరువు ఉన్నట్లయితే ఒక రోజులోని విసర్జితాల్లో ఎన్ని బ్యాక్టీరియమ్‌లు ఉంటాయి? ఇది ఎలా సాధ్యం?

ద్విదావిచ్ఛిత్తి అనే ప్రత్యుత్పత్తి విధానం వల్ల.

3. ఒక జీవిని పరితంతుక బాసిల్లస్‌గా వర్ణించారు. ఈ బ్యాక్టీరియమ్ సంబంధిత భాషను మీరు జీవిని వర్ణించడానికి ఎలా అన్వయిస్తారు?
జ. చలనానికి తోడ్పడే అనేక కశాభాలు ఉపరితలం అంతా ఉన్న దండాకార బ్యాక్టీరియమ్.

Posted Date : 15-11-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని

విద్యా ఉద్యోగ సమాచారం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌