• facebook
  • twitter
  • whatsapp
  • telegram

యూనిట్ - II, అధ్యాయం - 8, వైరస్‌లు

ట్యూలిప్‌ల ఆకర్షణీయతకు కారణమేంటి?

వీటికి కణ నిర్మాణం ఉండదు. స్వయంగా జీవక్రియలను జరపలేవు. సాధారణ కాంతి సూక్ష్మదర్శిని కింద కనిపించవు. బ్యాక్టీరియా కంటే చిన్నవి. కానీ, బ్యాక్టీరియా, శైవలాలు, శిలీంద్రాలు, ప్రోటోజోవా, మొక్కలు, జంతువులతో సహా ప్రతి కణంలోకి చొచ్చుకుపోగలవు. అవి ప్రత్యేక 'జీవరూపాలు'. వీటిని విషద్రవంగా పిలుస్తారు. రసాయనికంగా న్యూక్లియోప్రొటీన్ రేణువులు. సజీవులు, నిర్జీవులకూ మధ్య వారధిలా వ్యవహరిస్తాయి. జీవ సాంకేతిక ప్రయోగాలకు ఎంతో అనుకూలంగా ఉంటాయి. ఇంతకూ ఏమిటవి? జీవ ప్రపంచంలో అతి విశిష్ట స్థానాన్ని, ఎంతో ప్రాముఖ్యాన్ని సంపాదించుకున్న వైరస్‌ల గురించి తెలుసుకుందాం. 8వ అధ్యాయంలో వైరస్‌ల ఆవిష్కరణ, వర్గీకరణ, నిర్మాణం, ప్రతికృతి; మానవుడు, మొక్కల్లో అవి కలిగించే వ్యాధుల గురించి అధ్యయనం చేస్తారు.

వైరస్‌ల అధ్యయనాన్ని 'వైరాలజీ' అంటారు.

వైరస్‌ల గురించి అధ్యయనం చేసే శాస్త్రవేత్తలు 'వైరాలజిస్టులు'.

వైరస్ అనే పదానికి అర్థం వెనమ్ లేదా విషపూరిత ద్రవం (పాశ్చర్).

వైరస్‌కు కణరూపం ఉండదు.

ఒక వైరస్ రేణువు ఒకే రకానికి చెందిన కేంద్రకామ్లం DNA లేదా RNA తో ఉంటుంది.

కేంద్రకామ్లాన్ని ఆవరించి ఒక ప్రొటీన్ తొడుగు ఉంటుంది. ఈ తొడుగు కొన్నిసార్లు లిపిడ్లు, ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్‌లతో కూడి ఉంటుంది.

ఫ్రెంచ్ రసాయన శాస్త్రవేత్త లూయిస్ పాశ్చర్ 'యాదృచ్ఛిక వంశానుగతం' (Spontaneous Generation) సిద్ధాంతాన్ని అసత్యమని నిరూపించి, జీవి సిద్ధాంతం (Germ theory) ను ప్రతిపాదించాడు. ప్యారిస్‌లో (ఫ్రాన్స్) 1888లో పాశ్చర్ సంస్థను ఆయన పరిశోధనల ప్రదర్శన కోసం స్థాపించారు.     
వైరస్‌లు సజీవులు కావు. జడమైన రసాయనికాలు కావు. మరి ఏమిటి? ఫ్రెంచ్ శాస్త్రజ్ఞుడు, పాశ్చర్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ పూర్వ డైరెక్టర్, నోబెల్ గ్రహీత ఆండ్రి లోఫ్ (Andre Lwoff) 'వైరస్ అంటే వైరస్' అని అన్నారు. (A Virus is a viurs)

వైరస్‌లు చాలావరకు కణంలో జరిగే జీవక్రియలను ప్రదర్శించవు. కానీ, ప్రత్యుత్పత్తి ద్వారా జన్యు లక్షణాలను కొనసాగిస్తూ, ఉత్పరివర్తనలకు లోనవుతాయి కాబట్టి, ఇవి కచ్చితంగా జడత్వం ఉన్న జీవరహిత అణువుల కంటే ఉన్నతమైనవి.

వైరస్‌లను వ్యాధి సంక్రమింపజేసే రేణువులుగా వర్గీకరించవచ్చు.

కణ నిర్మాణం ఉన్న జీవులనే సజీవులుగా భావిస్తే వైరస్‌లు వాస్తవంగా 'సజీవులు' కావు.

వైరస్‌ల ఆవిష్కరణ, నిర్మాణం తెలియడంతో వైరాలజీలో గణనీయమైన పురోగతి జరిగింది.

వైరస్‌లు అవికల్ప కణాంతస్థ పరాన్న జీవులు. అంటే, ఒక ప్రత్యేక ఆతిథేయి కణాన్ని ఆంక్రమించనంతవరకు ఇవి వృద్ధి చెందలేవు. ఇవి వాటి జన్యు, జీవక్రియా యాంత్రికాన్ని పిల్ల లేదా వైరస్‌ల సంతతి ఏర్పడటానికి, విడుదలకు నిర్దేశిస్తాయి.

ఈ ప్రక్రియలో ఇవి ఆతిథేయి కణాలను ధ్వంసం చేసి (మానవులు, మొక్కలు, జంతువుల్లో ) అపారమైన నష్టాన్ని, వ్యాధులను కలిగిస్తాయి.

ఆశించే ఆతిథేయిని బట్టి వైరస్‌లను కింది రకాలుగా విభజించారు.

1. ఫైటోఫాజ్‌లు : మొక్కలను ఆశించే వైరస్‌లు

2. జూఫాజ్‌లు : జంతువులను ఆశించే వైరస్‌లు

3. బ్యాక్టీరియోఫాజ్‌లు : బ్యాక్టీరియాలను ఆశించే వైరస్‌లు

4. మైకోఫాజ్‌లు : శిలీంద్రాలను ఆశించే వైరస్‌లు

5. జైమో ఫాజ్‌లు : ఈస్ట్‌లను ఆశించే వైరస్‌లు

6. సయనోఫాజ్‌లు : నీలి, హరిత శైవలాలను ఆశించే వైరస్‌లు

వైరస్‌ల వర్గీకరణ 

ఇంటర్నేషనల్ కమిటీ ఆన్ టాక్సానమీ ఆఫ్ వైరెసెస్ (ICTV) వైరస్‌ల నామీకరణ, వర్గీకరణకు సంబంధించిన నిబంధనలను నియంత్రిస్తుంది.

ICTV పథకంలో 3 వర్గీకరణ స్థాయులు మాత్రమే ఉన్నాయి. అవి: కుటుంబం (కొన్ని ఉప కుటుంబాలను చేర్చారు), ప్రజాతి, జాతి. కుటుంబాల పేర్లు 'విరిడే' అనే పదంతో అంతం కాగా, ప్రజాతి నామాలను 'వైరస్‌'తో, జాతి నామాలను వాటి స్వభావాన్ని వర్ణిస్తూ సాధారణ ఆంగ్లంలో వ్యక్తపరిచారు.

వైరస్‌ల నామీకరణ అవి కలిగించే వ్యాధులను బట్టి ఉంటుంది (ఉదా: రేబిస్ వైరస్, పోలియో వైరస్).

ICTV పద్ధతిని ఉపయోగిస్తూ మానవుల్లో వైరస్ కలగజేసే అక్వైర్డ్ ఇమ్యునో డెఫిషియెన్సీ సిండ్రోమ్ (AIDS) ను ఈ విధంగా వర్గీకరించవచ్చు.

      కుటుంబం       :       రిట్రో విరిడే

      ప్రజాతి            :        లెంటి వైరస్

      జాతి               :       హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియెన్సీ వైరస్ (HIV)

వైరస్‌ల నిర్మాణం

వైరస్‌ల పరిమాణం 300 నానోమీటర్లు (nm). TMV మొదలుకుని పార్వో వైరస్‌లలో మాదిరి 20 nm వరకు ఉంటుంది.

బ్యాక్టీరియోఫాజ్ F2 అతి చిన్న వైరస్. అతిపెద్ద వైరస్ వాక్సీనియా వైరస్.

వైరస్‌లు గరిష్ఠ పరిమాణం వద్ద, దాదాపు అతిచిన్న బ్యాక్టీరియం కణాలైన మైకోప్లాస్మాల పరిమాణంలో, కనిష్ఠ పరిమాణం వద్ద 'రైబోజోమ్‌'కు సమానమైన వ్యాసంతో ఉంటాయి.

స్వరూపం: విభిన్నరకాలు

సర్పిల వైరస్‌లు: పొడవైన దండల్లా ఉండి, దృఢంగా లేదా నమ్యంగా ఉంటాయి.

ఉదా: రేబిస్ వైరస్, పొగాకు మొజాయిక్ వైరస్ (TMV).

బహుభుజాకృతి (బహుతలాలు) : అనేక జంతు, వృక్ష బ్యాక్టీరియాలు; వైరస్‌లు ఈ ఆకృతిలో ఉంటాయి.

ఉదా: అడినో, హెర్పిస్ సింప్లెక్స్, పోలియో వైరస్‌లు.

ఆచ్ఛాదిత వైరస్‌లు: కాప్సిడ్‌ను ఆవరించి ఒక ఆచ్ఛాదన ఉంటుంది. ఇంచుమించు గోళాకారంలో ఉంటాయి.

ఉదా: ఇన్‌ప్లుయెంజా వైరస్

బ్యాక్టీరియోఫాజ్‌లు: సంక్లిష్ట నిర్మాణాలతో ఉంటాయి. వీటిని సంక్లిష్ట వైరస్‌లు అంటారు. ఇవి తోక కప్ప ఆకారంలో ఉంటాయి.

వైరాయిడ్‌లు/ ప్రియాన్‌లు

వైరాయిడ్: 1971లో టి.ఓ.డైనర్ వైరస్ కంటే చిన్నవైన సంక్రమణ కారకాలను గుర్తించాడు. ఇది స్వేచ్ఛా R.N.A. వైరస్‌లలో ఉండే ప్రొటీన్ కవచం దీనికి ఉండదు. అందువల్ల దీన్ని 'వైరాయిడ్' అని పిలిచారు. వైరాయిడ్‌లోని RNA తక్కువ అణుభారంతో ఉంటుంది. 

ఉదా: పొటాటో స్పిండిల్ ట్యూబర్ వైరస్, సిట్రస్ ఎక్సోకార్టోసిస్ వైరస్.

ప్రియాన్‌లు: కేంద్రకామ్లం లేకుండా కేవలం ప్రొటీన్‌లు మాత్రమే ఉండే వ్యాధి సాంక్రమిక కారకాలను 'ప్రియాన్‌లు' అంటారు. 

ఉదా: గొర్రెల్లో స్క్రాపి వ్యాధి, ఆవుల్లో 'మ్యాడ్ కౌ' వ్యాధి. 

సౌష్ఠవం: సంక్లిష్ట వైరస్‌లు తలభాగంలో బహుభుజ, తోకతొడుగులో సర్పిలాకార సౌష్ఠవాలతో ఉంటాయి.

మీజిల్స్ వైరస్ లాంటి కొన్ని వైరస్‌ల తొడుగులో కూచిమొన (Spikes) నిర్మాణాలు ఉంటాయి. ఇవి గ్లైకోప్రొటీన్‌తో నిర్మితమవుతాయి. ఈ పోచలు సుగ్రాహిక ఆతిథేయి కణాలపై ఉన్న గ్రాహ్య స్థలాలతో లగ్నం చెందడానికి ఉపయోగపడతాయి.

వైరస్‌లు రెండు ప్రాథమిక అంశాలను కలిగి ఉంటాయి. జీనోమ్‌ను ఏర్పరిచే కేంద్రంగా ఉన్న ఒక కేంద్రకామ్లం (కోర్), దాన్ని ఆవరించి ఉన్న కాప్సిడ్ అనే ప్రొటీన్ తొడుగు. కాప్సిడ్ వైరస్‌కు ఆకారాన్నిస్తుంది. జీనోమ్‌కు రక్షణ కవచాన్ని ఏర్పరుస్తుంది. ఇది ప్రొటీన్ ఉపప్రమాణాలతో (కాప్సోమియర్‌లు) నిర్మితమై ఉంటుంది. ప్రతివైరస్‌కు దాని కాప్సోమియర్‌ల సంఖ్య గుర్తింపు లక్షణంగా ఉంటుంది. వైరస్‌లో జన్యు సమాచారం రెండు పోగుల (ds) DNA లేదా ఒకే పోగు (ss) DNA రూపంలో ఉంటుంది.

సాధారణంగా మొక్కలను ఆశించే వైరస్‌లలో ds RNA, జంతువులను ఆశించే వైరస్‌లలో ss DNA ఉంటాయి. బ్యాక్టీరియోఫాజ్‌లు సాధారణంగా ds DNA వైరస్‌లు. వైరల్ కేంద్రకామ్ల అణువులు వలయాకారం లేదా దీర్ఘాకారంలో ఉంటాయి. అనేక వైరస్‌లలో ఒకే ఒక కేంద్రకామ్ల అణువు ఉంటుంది. అయితే కొన్నింటిలో ఒకటి కంటే ఎక్కువ (ఉదా: హెచ్ఐవీ, జీనోమిక్ నకళ్లను సూచించే, రెండు సారూప్యత ఉన్న ఆర్ఎన్ఏ అణువులతో) ఉంటాయి.

TMV, T4 ఫాజ్‌ల నిర్మాణం

TMV: పొగాకు మొజాయిక్ వైరస్ (TMV) సుమారు 300 nm పొడవు, 18 nm వ్యాసం, 39 × 106 డాల్టన్‌ల అణుభారంతో ఉంటుంది. 2130 ప్రొటీన్ ఉపప్రమాణాలతో కాప్సిడ్ నిర్మితమవుతుంది. ఈ ఉపప్రమాణాలన్నీ ఒకే పరిమాణంలో ఉంటాయి. వీటిని కాప్సోమియర్‌లు అంటారు. ఈ కాప్సోమియర్‌లు, మధ్యలో 4 nm (40 Aº )తో బోలుగా ఉండే ప్రదేశాన్ని చుట్టి, సర్పిల క్రమంలో అమరి ఉంటాయి. ప్రతిప్రొటీన్ ఉపప్రమాణం 158 అమైనో ఆమ్లాలున్న ఒకే పాలిపెప్టైడ్ గొలుసుతో నిర్మితమై ఉంటుంది. ప్రొటీన్ కాప్సిడ్ లోపల 6500 న్యూక్లియోటైడ్‌లు, వాటితోపాటు ఒకే పోగు సర్పిలాకార RNA అణువు చుట్టుకుని ఉంటుంది.

T4 లాంటి ఒక బ్యాక్టీరియోఫాజ్ దేహం తల, తోక భాగాలుగా విభేదనం చెంది, కాలర్‌తో కలిపి ఉంటుంది. తోకభాగంలో ఒక తోక తొడుగు, ఒక ఆధార ఫలకం, పిన్‌లు, తోకపోచలు ఉంటాయి. వైరస్ ఆతిథేయి కణాన్ని అంటిపెట్టుకోవడంలో ఇవి సహాయపడతాయి. వైరస్ డీఎన్ఏను ఆతిథేయి కణంలోకి ప్రవేశపెట్టడానికి తోకతొడుగు తోడ్పడుతుంది.

బ్యాక్టీరియోఫాజ్‌ల వృద్ధి (ప్రత్యుత్పత్తి/ ప్రతికృతి)

ఒక వైరస్ వృద్ధి లేదా ప్రత్యుత్పత్తి లేదా ప్రతికృతి జరపాలంటే అది తప్పనిసరిగా ఒక ఆతిథేయి కణాన్ని ఆక్రమించి ఆతిథేయి జీవక్రియా యంత్రాంగాన్ని తన ఆధీనంలోకి తీసుకోవాలి.

వైరస్ జీవిత చక్రాలను బ్యాక్టీరియోఫాజ్ జీవిత చక్రాల ద్వారా బాగా అర్థం చేసుకోవచ్చు.

ఫాజ్‌లు రెండు ప్రత్యామ్నాయ యాంత్రికాల ద్వారా వృద్ధి చెందుతాయి.

  1. లైటిక్ చక్రం     2. లైసోజెనిక్ చక్రం

లైటిక్ చక్రం ఆతిథేయి కణం విచ్ఛిన్నం లేదా నిర్జీవం అవడంతో పూర్తవుతుంది.

లైసోజెనిక్ చక్రంలో ఆతిథేయి కణాలు సజీవంగానే ఉంటాయి.

లైటిక్ చక్రం

T సరిసంఖ్య ఉన్న ఫాజ్‌లు (T2, T4, T6 బ్యాక్టీరియోఫాజ్‌లు) లైటిక్ చక్రాన్ని చూపుతాయి. ఇవి ఎ.కోలై (E.Coil) బ్యాక్టీరియాలపై దాడిచేసి, కణాలను విచ్ఛిన్నం చేస్తాయి. వీటిని విరులెంట్‌ఫాజ్‌లు అంటారు.

లైటిక్ చక్రం అయిదు దశల్లో జరిగే ప్రక్రియ.

   అవి: అంటిపెట్టుకోవడం, ప్రవేశం, జీవసంశ్లేషణ, పరిపక్వత, విడుదల.

ఫాజ్ రేణువులు, బ్యాక్టీరియాలు కాకతాళీయంగా ఢీ కొనడంతో అంటిపెట్టుకోవడం (అధిశోషణ) జరుగుతుంది. బ్యాక్టీరియాల కణకవచం మీద సంపూరక గ్రహీత స్థానాల వద్ద అంటిపెట్టుకోవడానికి ఫాజ్‌లు తోకపోచలను ఉపయోగిస్తాయి.

అధిశోషణాన్ని అనుసరిస్తూ ప్రవేశ ప్రక్రియ జరుగుతుంది. ఈ స్థితిలో ఫాజ్ తోకతొడుగు సంకోచించడం వల్ల తోక కేంద్రభాగం బ్యాక్టీరియాల కణకవచం ద్వారా లోనికి చొచ్చుకొని పోతుంది (ప్రవేశం).

తోక కొనభాగం ప్లాస్మాత్వచాన్ని చేరేసరికి, బ్యాక్టీరియోఫాజ్ డీఎన్ఏ తలభాగం నుంచి తోక మధ్య భాగం ద్వారా, ప్లాస్మాత్వచం ద్వారా ప్రయాణిస్తూ బ్యాక్టీరియాల కణంలోకి ప్రవేశిస్తుంది.

కాప్సిడ్ బ్యాక్టీరియాల కణం వెలుపలే ఉండిపోతుంది (ఘోస్ట్). కాబట్టి, ఫాజ్‌రేణువు ఉపబాహ్యచర్మం సిరంజిలా పని చేస్తూ డీఎన్ఏను బ్యాక్టీరియా కణంలోకి చొప్పిస్తుంది.

ఒకసారి ఫాజ్ డీఎన్ఏ ఆతిథేయి కణంలోని కణద్రవ్యంలోకి చేరిన తర్వాత ఆతిథేయి కణ యాంత్రికాన్ని ఉపయోగించుకుని అనేక ఫాజ్ డీఎన్ఏ నకళ్లు, ఎంజైమ్‌లు, కాప్సిడ్ ప్రొటీన్లు సంశ్లేషణ చెందుతాయి (జీవ సంశ్లేషణ).   

సంక్రమణ జరిగిన కొన్ని నిమిషాల వరకు పూర్తిఫాజ్‌లు ఆతిథేయి కణంలో కనిపించవు. కానీ, స్వతంత్య్ర డీఎన్ఏ ప్రొటీన్ అంశాలను గుర్తించవచ్చు.

పక్వదశలో బ్యాక్టీరియోఫాజ్ డీఎన్ఏ, కాప్సిడ్‌లు పూర్తి విరియన్‌లు ఏర్పడతాయి.

వైరస్‌ సంక్రమించే కణంలో ముదిరిన వైరస్ కనిపించే వరకు మధ్య ఉన్న కాలవ్యవధిని గుప్తదశ అంటారు.

వైరస్ వృద్ధిలో చివరిదశ ఆతిథేయి కణం విచ్ఛిన్నమయ్యే దశ. ఈ దశలో ఆతిథేయి కణం నుంచి విరియన్‌లు విడుదల అవుతాయి. ఆతిథేయి కణ ప్లాస్మాత్వచం ఆ కణంలోనే సంశ్లేషణ చెందే లైసోజైమ్ అనే వైరస్ ఎంజైమ్ వల్ల కరిగి లేదా విచ్ఛిన్నం చెందుతుంది. దాంతో బ్యాక్టీరియం కణ కవచం పగిలిపోయి, కొత్తగా ఉత్పత్తి అయిన ఫాజ్‌రేణువులు/ విరియన్‌లు విడుదల అవుతాయి.

ఒక కణం నుంచి కొత్తగా సంశ్లేషణ చెంది విడుదలయ్యే ఫాజ్‌రేణువుల సంఖ్యను పగిలే పరిమాణం (Burst Size) అని పిలుస్తారు. ఇది సాధారణంగా 50 నుంచి 200 దాకా ఉంటుంది.
విడుదలైన ఫాజ్ రేణువులు దగ్గరలో ఉన్న ఇతర సులభంగా వశమయ్యే కణాలకు సంక్రమించి వృద్ధిచక్రాన్ని పునరావృతం చేస్తాయి.

లైసోజెనిక్ చక్రం 

కొన్ని λ (లామ్డా) ఫాజ్‌ల లాంటి బ్యాక్టీరియోఫాజ్‌లు (కోలిఫాజ్‌లామ్డా) వృద్ధి చెందేటప్పుడు ఆతిథేయి కణం విచ్ఛిన్నమవదు లేదా నాశనం కాదు.

ఫాజ్ డీఎన్ఏ ఎ.కోలై కణంలోకి ప్రవేశించాక వలయాకార బ్యాక్టీరియల్ డీఎన్ఏతో సమాకలితమై దానిలో ఒక భాగమై గుప్తంగా (క్రియారహితంగా) ఉండిపోతుంది.

ఈ ఫాజ్‌లను టెంపరేట్‌ఫాజ్‌లు అంటారు. కలిసిపోయిన ఫాజ్ డీఎన్ఏను ప్రోఫాజ్ అంటారు.

బ్యాక్టీరియం జన్యుపదార్థం ప్రతికృతి జరిగిన ప్రతిసారి ప్రోఫాజ్ కూడా ప్రతికృతి చెందుతుంది. తర్వాతి సంతతి కణాల్లో ప్రోఫాజ్ గుప్తంగా ఉండిపోతుంది.

అరుదైన యాదృచ్ఛిక సంఘటనల్లో లేదా ఆతిథేయి కణం అతినీలలోహిత కాంతికి లేదా కొన్ని రసాయనాల ప్రభావానికి గురైనప్పుడు ఫాజ్ డీఎన్ఏ బ్యాక్టీరియల్ జన్యుపదార్థం నుంచి విడిపోయి, లైటిక్ చక్రం ప్రారంభానికి దారితీస్తుంది.

మొక్కల్లో వైరస్ వ్యాధులు

వైరస్‌లు అవికల్ప పరాన్నజీవులుగా ఉండి, మొక్కల్లో పెరుగుతూ అనేక వృక్షవ్యాధులను కలిగిస్తాయి.

వైరస్ వల్ల కలిగే మొక్కల వ్యాధులు చాలావరకు 'సర్వాంగీణం' (మొక్క మొత్తం ప్రభావితమవడం) గా ఉంటాయి.

సాధారణంగా తెగులు లక్షణాలు చాలావరకు పత్రాల్లో కనిపిస్తాయి.


 

పుష్పచీలికలు

ట్యూలిప్ పుష్పాలు అందానికి ప్రఖ్యాతి చెందాయి. ఆకర్షణ పత్రాలు ఒకే రంగులో ఉంటాయి. 'ట్యూలిప్ మొజాయిక్ చీలిక తెగులు' అనే వైరస్ వ్యాధి సోకినప్పుడు ఆకర్షణ పత్రాల మీద వివిధ రకాలుగా అలంకార చిత్రణలు (Patterns) ఏర్పడతాయి. దీనివల్ల పుష్పాలు మరింత ఆకర్షణీయంగా కనిపిస్తాయి. అందువల్ల మామూలు పుష్పాల కంటే వీటిని ఎక్కువ ధరకు అమ్ముతారు.

సాధారణంగా విరియన్‌లు సంక్రమణ చెందుతూ, వ్యాధులను కలగజేస్తాయి.

విరియన్ అంటే తన ఆతిథేయి కణం వెలుపల పూర్తిగా సంవిధానం చెందిన వైరస్.

అసాధారణంగా ఒక ప్రొటీన్ త్వచం లేని, 300 - 400 న్యూక్లియోటైడ్‌లతో ఉండే ఒక చిన్న కేంద్రకామ్ల ముక్కను వైరాయిడ్ అని పిలుస్తారు. ఇది ఆర్థిక ప్రాముఖ్యం ఉన్న అనేక మొక్కలపై (ఉదా: టమాట, పొటాటో, కుకుంబర్, సిట్రస్) వ్యాధులను కలగజేస్తుంది.

మానవుల్లో వైరస్ వ్యాధులు

వైరస్‌లు మానవుల్లో సాధారణంగా జలుబు, హెపటైటిస్, ఆటలమ్మ, ఇన్‌ఫ్లూయెంజా, హెర్పిస్, వ్రణాలు, పోలియో లాంటి వ్యాధులను కలగజేస్తాయి.

వైరల్ సంక్రమణలు మరణానికి దారి తీయనప్పటికీ రేబిస్, ఎయిడ్స్, ఎబోలా లాంటి కొన్ని వైరస్ వ్యాధులు అధిక మరణ రేటును చూపుతాయి.

కొన్ని పోలియో, నియోనేటల్ రూబెల్లా లాంటివి దీర్ఘకాలిక నిస్సత్తువ (శారీరక బలహీనత)ను కలగజేస్తాయి.

జంతువులు, మానవుల్లో ఎస్‌స్టీన్ - బార్ వైరస్, మానవ పాపిల్లోమా వైరస్‌లు కాన్సర్‌లను కలగజేస్తాయి (ఆంకోజెనిక్ వైరస్‌లు).

దీర్ఘకాలిక హెపటైటిస్ B (హెపటైటిస్ B వైరస్‌తో వచ్చేది) కాన్సర్‌కు దారితీస్తుంది. కాన్సర్‌ను కలగజేసే వైరస్‌లను 'ఆంకో వైరస్‌లు' అని పిలుస్తారు.

ప్రియాన్‌లు అని వ్యవహరించే 'ప్రొటీన్‌యుత సంక్రామిక రేణువులు' ఆవుల్లో మ్యాడ్ కౌ వ్యాధి (బొవైన్ స్పాంజిఫామ్ ఎన్‌సెఫాలైటిస్), గొర్రెల్లో స్క్రాపి అనే తీవ్రమైన జంతు వ్యాధులను కలగజేస్తాయి.

మ్యాడ్ కౌ వ్యాధిని కలగజేసే ప్రియాన్, ఎద్దు మాంసం ద్వారా మానవుడిని చేరి అతడిలో 'క్రట్జ్‌ఫెల్డ్ - జాకబ్' అనే వ్యాధిని కలగజేస్తుంది.


ప్రపంచ చరిత్రలో వైరస్ విలయతాండవం

1918-1919: స్పానిష్ ఫ్లూ -  ప్రపంచవ్యాప్తంగా 20 మిలియన్ల ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.

1957-1958: ఏషియన్ ఫ్లూ -  ప్రపంచవ్యాప్తంగా ఒక మిలియన్ ప్రజలు మరణించారు.

1968-1969: హాంకాంగ్ ఫ్లూ - హాంకాంగ్‌లో 10 వేల మంది, ప్రపంచవ్యాప్తంగా 7,00,000 మంది ప్రాణాలు కోల్పోయారు.

1976: స్వైన్ ఫ్లూ - ఒక సైనికుడు 'స్వైన్ ఫ్లూ'తో మరణించడంతో అమెరికా మొత్తం వణికిపోయింది. ప్రజలందరికీ సత్వరం టీకాలివ్వడంతో ప్రాణనష్టం పెద్దగా జరగలేదు.

1997: ఏవియన్ ఫ్లూ - పక్షుల నుంచి మనుషులను చేరిన వైరస్ వల్ల వ్యాధి రావడం ఇదే ప్రథమం. ఒక్క హాంకాంగ్‌లోనే 1.5 మిలియన్ పక్షులను చంపారు.

2003: 'సార్స్' -  ప్రపంచాన్ని గడగడలాడించిన 'సార్స్' వల్ల ఆసియా దేశాల్లోనే ప్రాణనష్టం జరిగింది.

2004-2006: ఏవియన్ ఫ్లూ - 2004లో ప్రపంచవ్యాప్తంగా మళ్లీ మిలియన్ల కొద్దీ పక్షులను చంపాల్సి వచ్చింది. ఇప్పుడీ వైరస్ పక్షుల నుంచి మనుషులను చేరి మనుషుల్లోని జలుబు వైరస్‌తో కలిసి, సూపర్‌వైరస్‌గా ఏర్పడుతోందని శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు.

Posted Date : 28-07-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని

విద్యా ఉద్యోగ సమాచారం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌