• facebook
  • twitter
  • whatsapp
  • telegram

 వైరస్‌లు

ప్రశ్నలు - జవాబులు

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు 

1. వైరస్‌ల జీవ, నిర్జీవ లక్షణాలను తెలపండి.
జ: జీవ లక్షణాలు: వైరస్‌లలో DNA లేదా RNA జన్యుపదార్థంగా ఉంటుంది. ఇవి ప్రత్యుత్పత్తి ద్వారా జన్యు లక్షణాలను కలిగిస్తూ, ఉత్పరివర్తనాలకు లోనవుతాయి. కొన్నిసార్లు కేంద్రకామ్లం వెలుపల ఒక ప్రొటీన్ తొడుగు లేదా లిపిడ్‌లు, ప్రొటీన్‌లు, కార్బోహైడ్రేట్లతో కూడిన ఆచ్ఛాదన ఉంటుంది.
నిర్జీవ లక్షణాలు: వైరస్‌లకు కణరూపం ఉండదు. జీవక్రియలను ప్రదర్శించవు. కాబట్టి, నిర్జీవులుగా భావిస్తారు.

 

2. T4 ఫాజ్ ఆకారం ఏమిటి? దానిలోని జన్యుపదార్థాన్ని తెలపండి.
జ: * T4 ఫాజ్ తోక కప్ప ఆకృతిలో ఉండే వైరస్.
     * దీనిలో రెండు పోగుల DNA జన్యుపదార్థంగా ఉంటుంది.

3. విరులెంట్‌ఫాజ్‌లు అంటే ఏమిటి? ఉదాహరణ ఇవ్వండి.
జ: బ్యాక్టీరియల్ కణాన్ని విచ్ఛిన్నం చేసే (లైటిక్ చక్రంలో పాల్గొనే) ఫాజ్‌లను విరులెంట్‌ఫాజ్‌లు అంటారు.
ఉదా: T సరిసంఖ్య (T2, T4, T6) ఉన్న బ్యాక్టీరియోఫాజ్‌లు.

4. లైసోజైమ్ అంటే ఏమిటి? దాని విధిని తెలపండి.
జ: * లైసోజైమ్ బ్యాక్టీరియోఫాజ్‌లలో ఉండే ఎంజైమ్.
* లైసోజైమ్ ఆతిథేయి కణకవచాన్ని కరిగించి, ఫాజ్ కేంద్రకామ్లాన్ని దానిలోకి ఇంజెక్ట్ చేయడానికి ఒక రంధ్రాన్ని ఏర్పరుస్తుంది. బ్యాక్టీరియం కణకవచం పగిలిపోయి, కొత్తగా ఉత్పత్తి అయిన ఫాజ్ రేణువుల విడుదలకు కూడా తోడ్పడుతుంది.


5. వైరస్‌లకు సంబంధించి 'విచ్ఛిన్నం', 'పగిలే పరిమాణం' లను నిర్వచించండి. ఆతిథేయి కణాలపై వాటి ప్రభావం ఏమిటి?
జ: * ఆతిథేయి కణంలో ఫాజ్ రేణువుల ప్రతికృతి తర్వాత, ఆ కణం పగిలిపోయి లోపల ఉండే ఫాజ్ రేణువులు విడుదలయ్యే ప్రక్రియను 'విచ్ఛిన్నం' (లైసిస్) అంటారు. దీనివల్ల ఆతిథేయి కణకవచం పగిలి అది చనిపోతుంది.
 *  ఒక ఆతిథేయి కణం నుంచి సంశ్లేషణ చెందే ఫాజ్ రేణువుల సంఖ్యను, దాని 'పగిలే పరిమాణం'గా చెబుతారు. దీనివల్ల ఫాజ్ రేణువులు దగ్గరలో ఉన్న ఇతర, సులభంగా వశమయ్యే కణాలకు సంక్రమించి వృద్ధి చక్రాన్ని     పునరావృతం చేస్తాయి.

 

6. ప్రోఫాజ్ అంటే ఏమిటి?
జ: లైసోజెనిక్ జీవితచక్రం చూపే ఫాజ్ వైరస్‌ల DNA బ్యాక్టీరియా DNA తో సమాకలితమై, దానిలో ఒక భాగమై గుప్తంగా, క్రియారహితమై ప్రతికృతి చెందుతుంది. దీన్నే 'ప్రోఫాజ్' అంటారు.

 

7. టెంపరేట్‌ఫాజ్‌లు అంటే ఏమిటి? ఒక ఉదాహరణ ఇవ్వండి.
జ: లైసోజెనిక్ చక్రం చూపే ఫాజ్‌ని టెంపరేట్‌ఫాజ్ అంటారు.
ఉదా: కోలిఫాజ్‌లామ్డా

 

8. విరులెంట్‌ఫాజ్‌లు, టెంపరేట్‌ఫాజ్‌ల మధ్య భేదాలను తెలపండి.
జ: * లైటిక్‌చక్రం చూపే ఫాజ్‌లు విరులెంట్‌ఫాజ్‌లు 
ఉదా: T4 బ్యాక్టీరియోఫాజ్
* లైసోజెనిక్ చక్రం చూపే ఫాజ్‌లు టెంపరేట్‌ఫాజ్‌లు 
ఉదా: λ (లామ్డా) ఫాజ్.

 

 స్వల్ప సమాధాన ప్రశ్నలు

1. ICTV అంటే ఏమిటి? వైరస్‌లను నామీకరణం చేసే విధానాన్ని రాయండి.
జ: * ICTV అంటే ఇంటర్నేషనల్ కమిటీ ఆన్ టాక్సానమీ ఆఫ్ వైరసెస్. ఇది వైరస్‌ల నామీకరణ, వర్గీకరణకు సంబంధించిన నిబంధనలను నియంత్రిస్తుంది.
* ICTV విధానంలో మూడు వర్గీకరణ స్థాయులు ఉంటాయి. అవి కుటుంబం (కొన్ని ఉపకుటుంబాలు చేర్చారు), ప్రజాతి, జాతి.
* కుటుంబాల పేర్లు 'విరిడే' అనే పదంతో అంతమవుతాయి. ప్రజాతి నామాలను వైరస్‌తో, జాతి నామాలను వాటి స్వభావాన్ని వర్ణిస్తూ సాధారణమైన ఆంగ్లంలో వ్యక్తీకరిస్తారు.
* వైరస్‌ల నామీకరణ అవి కలగజేసే వ్యాధులను బట్టి ఉంటుంది.
ఉదా: పోలియో వైరస్ 
*ICTV పద్ధతిని ఉపయోగిస్తూ మానవుల్లో అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ (AIDS)ను కలిగించే వైరస్‌ను కిందివిధంగా వర్గీకరిస్తారు.
కుటుంబం: రిట్రో విరిడే,
ప్రజాతి: లెంటి వైరస్,
జాతి: హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్ (HIV)

 

2. వైరస్‌ల రసాయన నిర్మాణాన్ని వివరించండి.
జ: * వైరస్‌లు కేంద్రకామ్లం, ప్రొటీన్లు అనే రెండు రకాల సంయోగ పదార్థాలతో ఏర్పడతాయి. కాబట్టి, వాటిని 'న్యూక్లియో ప్రొటీన్ రేణువులు' అంటారు.
* విరియన్ మధ్యభాగంలో DNA లేదా RNA కేంద్రకామ్లం ఉంటుంది.
* కేంద్రకామ్లం చుట్టూ ఆవరించి ఉండే ప్రొటీన్ తొడుగును 'కాప్సిడ్' అంటారు. ఇది కాప్సోమియర్‌లనే ఉపప్రమాణాలతో ఏర్పడుతుంది.
* కేంద్రకామ్లం, కాప్సిడ్‌ను కలిపి 'న్యూక్లియోకాప్సిడ్' అంటారు.
* కాప్సిడ్ కేంద్రకామ్లానికి రక్షణతోపాటు, ఆతిథేయి కణాల మధ్య కేంద్రకామ్ల బదిలీకి కూడా సహాయపడుతుంది.
* జంతువులను ఆశించే వైరస్‌లలో ప్రొటీన్ కాప్సిడ్ వెలుపల ప్రొటీన్లు, లిపిడ్లు, కార్బోహైడ్రేట్లతో ఏర్పడిన 'పెప్లోస్' అనే తొడుగు ఉంటుంది. ఇది పెప్లోమియర్‌లు అనే ఉప ప్రమాణాలతో ఏర్పడుతుంది. 
* మొక్కలను ఆశించే వైరస్‌లలో dsRNA జన్యుపదార్థంగా ఉంటుంది. కానీ, కాలీఫ్లవర్ మొజాయిక్ వైరస్‌లలో DNA జన్యుపదార్థంగా ఉంటుంది. జంతువులను ఆశించే వైరస్‌లలో ss DNA జన్యు పదార్థంగా ఉంటుంది. కానీ, పోలియో వైరస్‌లో RNA జన్యుపదార్థం.

 

3. TMV నిర్మాణాన్ని వివరించండి.
జ: * పొగాకు మొజాయిక్ వైరస్ (టొబాకో మొజాయిక్ వైరస్ - TMV) ని స్టాన్లీ 1935 లో పొగాకు మొక్క నుంచి వేరు చేసి, స్ఫటికీకరించారు. ఫ్రాంక్లిన్, అతడి సహచరులు (1957) TVM నిర్మాణాన్ని వివరించారు.
*  ఇది సుమారు 300 nm పొడవు, 18 - 19 nm వ్యాసంతో, 39 ×  డాల్టన్ల అణుభారంతో ఉంటుంది.
*  TMV ఒక దండాకార వైరస్. సర్పిలాకార సౌష్ఠవం చూపుతుంది.
* ఈ వైరస్‌లోని ప్రొటీన్ కాప్సిడ్ 2130 కాప్సోమియర్లతో ఏర్పడి ఉంటుంది. కాప్సోమియర్‌లు 4 nm పరిమాణంలోని గొట్టం చుట్టూ సర్పిలాకారంలో అమరి ఉంటాయి.
* ప్రతీ కాప్సోమియర్‌లో 158 అమైనో ఆమ్లాలున్న ఒకే పాలీపెప్టైడ్ గొలుసు ఉంటుంది.
* కాప్సిడ్ లోపల ఒకే పోగు ఉన్న RNA అణువు ఉంటుంది. ఇది సర్పిలాకారంలో చుట్టుకుని కుండలి ఆకారంలో ఉంటుంది. RNA లో 6,500 న్యూక్లియోటైడ్లు ఉంటాయి. 

 
 

4. T - సరిసంఖ్య బ్యాక్టీరియోఫాజ్‌ల నిర్మాణాన్ని వివరించండి.                                                      
జ: * బ్యాక్టీరియాలను ఆశించే వైరస్‌లను బ్యాక్టీరియోఫాజ్‌లు అంటారు. వీటిని ట్వార్ట్ (1915) కనుక్కున్నాడు. ఫెలిక్స్ డీహెరిల్లి విపులంగా అధ్యయనం చేశాడు.
* బ్యాక్టీరియోఫాజ్‌లు సాధారణంగా తోకకప్ప ఆకృతిలో ఉంటాయి. T సరిసంఖ్య ఉన్న (T2, T4, T6) బ్యాక్టీరియోఫాజ్‌ల గురించి అధ్యయనం జరిగింది.
* తోకకప్ప ఆకారంలో ఉండే T4 ఫాజ్‌లో తల, తోక అనే రెండు భాగాలు ఉంటాయి.
* తలభాగం సుమారు 65 × 95 nm పరిమాణంలో ఉంటుంది. తలభాగం అడ్డుకోతలో షడ్భుజాకృతిలో ఉంటుంది. దీని పైభాగం షడ్భుజాకృతిలో ఉన్న పిరమిడ్‌లా కనిపిస్తుంది.
* తల అనేక కాప్సోమియర్లతో ఏర్పడుతుంది. ప్రతి కాప్సోమియర్‌లో ఒకే ప్రొటీన్ ఉంటుంది. తలభాగం లోపల ముడతలు పడిన రెండు పోగుల DNA (ds DNA) ఉంటుంది. దీన్ని ఆవరించి ఉండే తలభాగంలోని ప్రొటీన్ త్వచం విచక్షణా త్వచంగా పనిచేస్తుంది. ఫాజ్ కంటే DNA పొడవు 1,000 రెట్లు ఎక్కువ ఉంటుంది.

 


* ఫాజ్ మధ్యన ఉండే గొట్టం లాంటి దేహభాగాన్ని ఆవరించి తోక ఉంటుంది. తోక కోర్ సుమారు 95 nm పొడవు, 8 nm వ్యాసార్ధంతో ఫాజ్ తల నుంచి తోక ఫలకం వరకు వ్యాపించి ఉంటుంది.
* కోర్ చుట్టూ తొడుగు ఉంటుంది. ఇది సుమారు 144 ఉప ప్రమాణాలతో ఉంటుంది.
* ఈ ఉప ప్రమాణాలు 24 వలయాల్లో అమరి ఉంటాయి (ప్రతి వలయంలో 6 చొప్పున).
* తొడుగు, ఫాజ్ తల భాగాన్ని కలుపుతూ 'కాలర్' లాంటి నిర్మాణం ఉంటుంది.
* తోక చివరిభాగంలో షట్కోణాకృతిలో ఉండే వాల ఫలకం ఉంటుంది.
* వాలఫలకం ప్రతిమూల వద్ద ఉండే పోచ లాంటి తోకపిన్, తోకపోగుతో సంబంధం కలిగి ఉంటుంది. కాబట్టి, ఆరు పిన్‌లు, ఆరు తోకపోగులు ఉంటాయి.
* తోకపోగులు బ్యాక్టీరియా కణాన్ని అంటి పెట్టుకోవడానికి తోడ్పడతాయి.

 

5. కొన్ని వైరస్‌లకు సంబంధించి లైటిక్ చక్రాన్ని వివరించండి.
జ: లైటిక్ జీవిత చక్రం: విరులెంట్‌ఫాజ్‌లు (T సరిసంఖ్య ఉన్న ఫాజ్‌లు) చూపే లైటిక్ జీవితచక్రంలో 4 దశలు ఉంటాయి. అవి...
అధిశోషణ: ఆతిథేయి (బ్యాక్టీరియం) కణానికి విరియన్ అతుక్కోవడాన్ని 'అధిశోషణ' అంటారు. మొదట విరియన్ ఆతిథేయి కణాన్ని తాకి, తర్వాత తోక పోగుల సహాయంతో ఆతిథేయి కణకవచానికి ప్రత్యేక స్థానాల్లో అంటి పెట్టుకుంటుంది.
ప్రవేశం: ఈ దశలో ఫాజ్ DNA ఆతిథేయి కణంలోకి ప్రవేశిస్తుంది. ఫాజ్‌లో ఉత్పత్తయ్యే లైసోజైమ్ ఎంజైమ్ ఆతిథేయి కణకవచాన్ని కరిగించి ఒక రంధ్రం చేస్తుంది. ఈ రంధ్రం ద్వారా DNA ఆతిథేయి కణంలోకి ఇంజెక్ట్ అవుతుంది. విరియన్ ప్రొటీన్ తొడుగు (కాప్సిడ్) ఆతిథేయి కవచం వెలుపలనే ఉండిపోతుంది. దీన్ని ఘోస్ట్ అంటారు. విరియన్ DNA ఆతిథేయిలోకి ప్రవేశించాక, ఆతిథేయి DNA నశించిపోతుంది. దాంతో ఆతిథేయి కణం, వైరస్‌ల ప్రతికృతికి తోడ్పడేలా నియంత్రణ జరుగుతుంది.
గుప్తదశ: దీనిలో రెండు ఉపదశలను గుర్తించారు. మొదటి దశలో సంక్రమణంలో ఉండే విరియన్లు కనిపించవు. దీన్ని 'గ్రహణ దశ' అంటారు. రెండోదశలో ఫాజ్ రేణువులు ఏర్పడి, ఆతిథేయి కణం అంతటా ఉంటాయి. దీన్ని 'పక్వదశ' అంటారు. ఫాజ్ ప్రతికృతిలో మొదట ప్రొటీన్ కాప్సిడ్‌లు, తర్వాత DNA నకళ్లు సంశ్లేషితమవుతాయి. కాప్సిడ్‌లోని తల, తోక, వాలఫలకం, తోకపోగులు వేర్వేరుగా తయారవుతాయి. తలభాగంలోకి DNA ప్రవేశించిన తర్వాత దానికి వాల ఫలకం, తోక పోగులు సంధానమవుతాయి. ఈ విధంగా పూర్తి విరియన్‌లు ఏర్పడతాయి.

 


విచ్ఛిన్నం: ఆతిథేయి కణంలో అనేక ఫాజ్ రేణువులు ఏర్పడిన తర్వాత లైసోజైమ్ చర్య వల్ల, బ్యాక్టీరియం కణకవచం ప్రత్యేక భాగాల్లో కరిగి, పగిలిపోతుంది. దీనివల్ల ఆతిథేయిలోని ఫాజ్‌ రేణువులు విడుదలవుతాయి. దీన్నే 'లైసిస్' దశ అంటారు. ప్రతీ ఆతిథేయి కణం నుంచి సంశ్లేషణ చెందే ఫాజ్ రేణువుల విశిష్ట సంఖ్యను 'పగిలే పరిమాణం' అంటారు.
 

6. లైటిక్, లైసోజెనిక్ చక్రాల మధ్య భేదాలు తెలపండి.

 జ:

 
 

దీర్ఘ సమాధాన ప్రశ్నలు 

1. వైరస్‌ల వృద్ధి విధానాన్ని వర్ణించండి.
జ: ఒక వైరస్ వృద్ధి లేదా ప్రత్యుత్పత్తి లేదా ప్రతికృతి జరపాలంటే తప్పనిసరిగా అది ఒక ఆతిథేయి కణాన్ని ఆక్రమించాలి. అంతేకాకుండా ఆ ఆతిథేయి జీవక్రియా యంత్రాంగాన్ని తన ఆధీనంలోకి తీసుకోవాలి. వైరస్ జీవితచక్రాలను బ్యాక్టీరియోఫాజ్ జీవితచక్రాల ద్వారా బాగా అర్థం చేసుకోవచ్చు. ఫాజ్‌లు రెండు ప్రత్యామ్నాయ యాంత్రికాల ద్వారా వృద్ధి చెందుతాయి. అవి లైటిక్ చక్రం, లైసోజెనిక్ చక్రం. లైటిక్ చక్రం ఆతిథేయి కణం 'విచ్ఛిన్నం' లేదా నిర్జీవం కావడంతో పూర్తవుతుంది. అయితే, లైసోజెనిక్ చక్రంలో ఆతిథేయి కణాలు సజీవంగానే ఉంటాయి. T - సరిసంఖ్య ఉన్న ఫాజ్‌లు (T2, T4, T6) ఎ.కోలై బ్యాక్టీరియాలపై దాడి చేసి, కణాలను విచ్ఛిన్నం చేస్తాయి. వీటిని 'విరులెంట్‌ఫాజ్‌లు' అంటారు. ఇవి లైటిక్ చక్రాన్ని చూపుతాయి. ఇది అయిదు దశలుగా జరిగే ప్రక్రియ. 
        అంటి పెట్టుకోవడం, ప్రవేశం, జీవసంశ్లేషణ, పరిపక్వత, విడుదల. ఫాజ్ రేణువులు, బ్యాక్టీరియాలు కాకతాళీయంగా ఢీకొనడంతో అంటిపెట్టుకోవడం లేదా అధిశోషణ జరుగుతుంది. ఫాజ్‌లు బ్యాక్టీరియాల కణకవచం మీద సంపూరక గ్రహీత స్థానాల వద్ద అంటిపెట్టుకోవడానికి తోకపోచలను ఉపయోగిస్తాయి. అధిశోషణాన్ని అనుసరిస్తూ ప్రవేశ ప్రక్రియ జరుగుతుంది. ఈ స్థితిలో ఫాజ్ తోక తొడుగు సంకోచించడం వల్ల తోక కేంద్ర భాగం బ్యాక్టీరియాల కణకవచం ద్వారా లోనికి చొచ్చుకొనిపోతుంది. దీన్ని 'ప్రవేశం' అంటారు. తోక కొనభాగం ప్లాస్మాత్వచాన్ని చేరేసరికి, బ్యాక్టీరియోఫాజ్ DNA, తలభాగం నుంచి, తోక మధ్య భాగం, ప్లాస్మాత్వచం ద్వారా ప్రయాణిస్తూ, బ్యాక్టీరియాల కణంలోకి ప్రవేశిస్తుంది. కాప్సిడ్ బ్యాక్టీరియాల కణం వెలుపలే ఉండిపోతుంది. దీన్ని 'ఘోస్ట్' అంటారు. కాబట్టి, ఫాజ్ రేణువు ఉపబాహ్య చర్మ సిరంజిలా పనిచేస్తూ DNA ను బ్యాక్టీరియం కణంలోకి చొప్పిస్తుంది. ఒక ఫాజ్ DNA ఆతిథేయి కణంలోని కణద్రవ్యంలోకి చేరిన మీదట ఆతిథేయి కణ యాంత్రికాన్ని ఉపయోగించుకుని అనేక ఫాజ్ DNA నకళ్లు, ఎంజైమ్‌లు, కాప్సిడ్ ప్రొటీన్లు సంశ్లేషణ చెందుతాయి. సంక్రమణ జరిగిన కొన్ని నిమిషాల వరకు, పూర్తి ఫాజ్‌లు ఆతిథేయిలో కనిపించవు, కానీ, స్వతంత్ర DNA, ప్రొటీన్ అంశాలను గుర్తించవచ్చు. వీటి తర్వాత వచ్చేదే 'పక్వదశ'. ఈ ప్రక్రియలో బ్యాక్టీరియోఫాజ్ DNA, కాప్సిడ్‌లు పూర్తి విరియన్‌లు ఏర్పడతాయి. వైరస్ సంక్రమణ జరిగే కణంలో ముదిరిన వైరస్ కనిపించేవరకు మధ్య ఉన్న కాలాన్ని 'గుప్త దశ' అంటారు.  వైరస్ వృద్ధిలో చివరి దశ ఆతిథేయి కణం 'విచ్ఛిన్నం అయ్యే దశ'. ఈ దశలో ఆతిథేయి కణం నుంచి విరియన్‌లు విడుదల అవుతాయి. ఆతిథేయి కణం ప్లాస్మాత్వచం, ఆ కణంలోనే సంశ్లేషణ చెందే లైసోజైమ్ అనే ఒక వైరస్ ఎంజైమ్‌తో కరిగి లేదా విచ్ఛిన్నం చెందుతుంది. దాంతో బ్యాక్టీరియం కణకవచం పగిలిపోయి, కొత్తగా ఉత్పత్తి అయిన ఫాజ్ రేణువులు/ విరియన్‌లు విడుదల అవుతాయి.  ఒక కణం నుంచి నూతనంగా సంశ్లేషణ చెంది విడుదలయ్యే ఫాజ్ రేణువుల సంఖ్యను 'పగిలే పరిమాణం' అని పిలుస్తారు. ఇది సాధారణంగా 50 నుంచి 200 దాకా ఉంటుంది. విడుదలైన ఫాజ్ రేణువులు దగ్గరలో ఉన్న ఇతర సులభంగా వశమయ్యే కణాలకు సంక్రమించి వృద్ధి చక్రాన్ని పునరావృత్తం చేస్తాయి.

  
 

లైసోజెనిక్ చక్రం: కొన్ని λ (లామ్డా) ఫాజ్‌ల్లాంటి బ్యాక్టీరియోఫాజ్‌లు వృద్ధి చెందేటప్పుడు ఆతిథేయి కణం విచ్ఛిన్నం లేదా నాశనం చెందడం జరగదు. దీనికి బదులు ఫాజ్ DNA ఎ.కోలి కణంలోకి ప్రవేశించాక వలయాకార బ్యాక్టీరియల్ DNAతో సమాకలితమై దానిలో ఒక భాగమై గుప్తం (క్రియారహితం) గా ఉండిపోతుంది. ఇలాంటి ఫాజ్‌లను 'టెంపరేట్‌ఫాజ్‌లు' అంటారు.  ఇలా కలిసిపోయిన ఫాజ్ DNA ను ప్రోఫాజ్ అంటారు. బ్యాక్టీరియం జన్యుపదార్థం ప్రతికృతి జరిగిన ప్రతిసారి ప్రోఫాజ్ కూడా ప్రతికృతికి లోనవుతుంది. తర్వాతి సంతతి కణాల్లో ప్రోఫాజ్ గుప్తంగా ఉండిపోతుంది. అయితే, కొన్ని అరుదైన యాదృచ్ఛిక సంఘటనల్లో లేదా ఆతిథేయి కణం అతి నీల లోహిత కాంతి లేదా కొన్ని రసాయనాల ప్రభావానికి గురైనప్పుడు, ఫాజ్ DNA బ్యాక్టీరియల్ జన్యు పదార్థం నుంచి విడిపోయి, లైటిక్ చక్రం ప్రారంభానికి దారితీస్తుంది.
 

అభ్యాసాలు

1. వైరస్‌ల వృద్ధి గురించి చర్చించేటప్పుడు, వైరాలజిస్టులు ఈ విధానాన్ని ప్రత్యుత్పత్తి అనడం కంటే, ప్రతికృతి అని పిలవడానికి మొగ్గు చూపుతారు. ఎందుకు?
జ: 1) వైరస్‌లు అవికల్ప కణాంతస్థ పరాన్నజీవులు. ఇవి వృద్ధి చెందాలంటే ఒక ఆతిథేయి కణం అవసరం.
2) వైరస్‌లలో కణవిభజన జరగదు. ఎందుకంటే ఇవి కణరహితాలు.
3) వైరస్‌ల DNA మాత్రమే ఆతిథేయి కణంలోకి ప్రవేశించి కొత్త విరియన్‌లు రూపొందుతాయి. కాబట్టి, వైరాలజిస్టులు దీన్ని ప్రత్యుత్పత్తి అని కాకుండా, ప్రతికృతి అని పిలుస్తారు.

2. ప్రజారోగ్య నిర్వహణలో, బ్యాక్టీరియా వ్యాధులను ఎదుర్కోవడానికి చికిత్సా విధానాన్ని అనుసరిస్తారు. వైరల్ వ్యాధులకు ఆచరించే సాధారణ ప్రజారోగ్య చికిత్సా విధాన స్వభావం ఏమిటో ఊహించగలరా? మీ జవాబును బలపరచడానికి ఎలాంటి ఉదాహరణ చూపుతారు?
జ: 1) బ్యాక్టీరియాల వల్ల వచ్చే వ్యాధులను సూక్ష్మజీవ నాశకాలు (యాంటీ బయోటిక్స్) ఉపయోగించి తగ్గించవచ్చు.
2) వైరస్‌లు కణరహితాలు, సొంత ప్రొటీన్ సంశ్లేషణ కలిగి ఉండవు. కాబట్టి, వాటిపై యాంటీ బయోటిక్స్ పనిచేయవు.
3) వైరస్ వ్యాధులను నిరోధించడానికి టీకా (Vaccine) పద్ధతిని ఉపయోగిస్తారు.

Posted Date : 28-07-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని

విద్యా ఉద్యోగ సమాచారం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌