• facebook
  • twitter
  • whatsapp
  • telegram

జీర్ణక్రియ - శోషణం

I. జీర్ణక్రియ: స్థూల ఆహార పదార్థాలను సరళ, శోషింపదగిన పదార్థాల రూపంలోకి మార్చే ప్రక్రియను జీర్ణక్రియ అంటారు. ఇది యాంత్రిక, జీవ రసాయన ప్రక్రియల ద్వారా జీర్ణవ్యవస్థలో జరుగుతుంది.
II. జీర్ణవ్యవస్థ: మానవుడి జీర్ణవ్యవస్థ ఆహారనాళం, దాని అనుబంధ గ్రంథులతో ఉంటుంది.
1. ఆహార నాళం: మానవ ఆహార నాళం నోటితో ప్రారంభమై, పాయువుతో అంతమవుతుంది. ఇది పొడవుగా ఉండే మెలి తిరిగిన నిర్మాణం.
A. నోరు: నోటిని ఆవరించి పెదవులు (అధరాలు) ఉంటాయి. నోరు ఆస్యకుహరంలోకి తెరుచుకుంటుంది.
B. ఆస్యకుహరం: ఆస్యకుహర పైభాగం తాలువుతో ఏర్పడుతుంది. ఈ తాలువు ఉదర ఆహార మార్గాన్ని పృష్ట నాసికా కక్ష్య నుంచి వేరు చేయడం వల్ల ఆహారం నమలడం, శ్వాసించడం ఏకకాలంలో జరుగుతాయి. తాలువు పూర్వాంతం అస్థితో నిర్మితమై ఉంటుంది. దీన్ని పాలటైన్ రుగే అంటారు. పరభాగంలో మృదు తాలువు గ్రసనిలోకి వేలాడుతూ ఉంటుంది. దీన్ని యువులా అంటారు. దవడ ఎముకపై దంతాలు ఉంటాయి. ఆస్యకుహరం ఆధారం దగ్గర నాలుక అతికి ఉంటుంది.
a) దంతాలు: మానవుడిలో దంతాలు దవడ ఎముక గర్తాల్లో ఇమిడి ఉంటాయి. ఈ రకం దంతాలను గర్తదంతి అంటారు. మానవుడి జీవితకాలంలో దంతాలు రెండుసార్లు ఏర్పడతాయి. బాల్యదశలో తాత్కాలిక పాలదంతాలు లేదా ఊడిపోయే దంతాలు, ప్రౌఢదశలో వాటి స్థానంలో శాశ్వత దంతాలు ఏర్పడతాయి. ఈ రకం దంత విన్యాసాన్ని ద్వివార దంత విన్యాసం అంటారు.
         ప్రౌఢ దశలో నాలుగు రకాల దంతాలు ఉంటాయి. అవి, కుంతకాలు (కు), రదనికలు (ర), అగ్రచర్వణకాలు (అ.చ.), చర్వణకాలు (చ). ఈ రకమైన దంత విన్యాసాన్ని విషమదంత విన్యాసం అంటారు. మానవుడి ప్రౌఢదశలో 32 దంతాలు ఉంటాయి. ఇవి పై, కింది దవడల్లో సగభాగంలో అమరి ఉంటాయి.
ఈ క్రమాన్ని దంత సూచి గా పేర్కొంటారు.


* మూడో చర్వణకాలు 21 ఏళ్ల వయసులో వస్తాయి. వీటిని జ్ఞానదంతాలు అంటారు.
* కుంతకాలు ఉలి ఆకారంలో ఉండి ఆహారాన్ని కొరకడానికి, రదనికలు మొనదేలి ఆహారాన్ని చీల్చడానికి; అగ్రచర్వణకాలు, చర్వణకాలు ఆహారాన్ని నమలడానికి ఉపయోగపడతాయి.

 

దంత నిర్మాణం:
* దంతంలో మూడు భాగాలు ఉంటాయి. అవి మూలం (దవడ ఎముక గుంటలో ఇమిడి ఉంటుంది), కిరీటం, గ్రీవం (బయటకి కనిపించే భాగం).

* దంతంలో అధిక భాగం డెంటిన్ అనే దృఢమైన పదార్థంతో ఏర్పడుతుంది (మధ్యస్త్వచం నుంచి).
* దంతంలోని చిన్న కుహరం పిప్పి లాంటి పదార్థంతో నిండి ఉంటుంది. దీన్ని పల్ప్ కుహరం అంటారు. ఈ పల్ప్ కుహరాన్ని ఆవరించి ఒడొంటోబ్లాస్ట్ కణాల వరుస ఉంటుంది. ఇది డెంటిన్‌ను స్రవిస్తుంది.
* దంతమూలం దవడ ఎముక గుంటలో ఇమిడి ఉండి పెరియోడాంటల్ పొర, సిమెంట్ పదార్థంతో స్థిరీకృతమవుతుంది.
* ఈ స్థిరీకృత పంటి చిగుళ్లతో దంతానికి మరింత బలం చేకూరుతుంది.
* కిరీటాన్ని ఆవరించి తెల్లటి, మెరుస్తున్న పింగాణి పదార్థం ఉంటుంది. ఇది దేహంలో అతి దృఢమైన పదార్థం. దీన్ని బహిస్త్వచం నుంచి ఏర్పడిన ఎమియోబ్లాస్ట్‌లు స్రవిస్తాయి.
b) నాలుక: ఇది బల్లపరుపు, అర్ధ చంద్రాకారంలో ఉండే కండరయుత నిర్మాణం. ఆస్యకుహర అడుగు భాగంలో ఫ్రెన్యులమ్ అనే కణజాలంతో అతికి ఉంటుంది. నాలుక పై భాగంలో చిన్నగా ముందుకు పొడుచుకుని వచ్చే నిర్మాణాలు ఉంటాయి. వీటిని సూక్ష్మాంకురాలు అంటారు. ఇవి మూడు రకాలు.
i. ఫంజీఫామ్ సూక్ష్మాంకురాలు - పూర్వ ఉపాంతభాగంలో, నాలుక చివర ఉంటాయి.
ii. తంతురూప సూక్ష్మాంకురాలు - నాలుక ఉపరితంలో ఉంటాయి.
iii. సర్కంవెల్లేట్ సూక్ష్మాంకురాలు - నాలుక పరాంతంలో, ఆధారభాగంలో ఉంటాయి.
* సూక్ష్మాంకురాలు రుచి గుళికలతో ఉంటాయి.
* నాలుక ఆహారాన్ని లాలాజలంతో కలపడానికి, రుచిని గుర్తించడానికి, మింగడానికి, మాట్లాడటానికి సహాయపడుతుంది.
* నాలుక సర్వసామాన్య దంత బ్రష్ (యూనివర్సల్ బ్రష్)గా పనిచేస్తుంది.

C. గ్రసని: ఆస్యకుహర పరాంతం గ్రసనిలోకి తెరుచుకుంటుంది. ఇది ఆహారం, గాలి ప్రయాణించే ఐక్య మార్గం. మృదుతాలువు గ్రసనిని నాసికాగ్రసని (మృదుతాలువు పైన ఉండేది), ఆస్యగ్రసని (మధ్యభాగం), స్వరపేటికా గ్రసని (కింది భాగం) గా విభజిస్తుంది. ఆహారవాహిక, వాయునాళాలు స్వరపేటికా గ్రసనిలోకి గల్లెట్, కంఠబిలం ద్వారా విడిగా తెరుచుకుంటాయి. మృదులాస్థితో తయారైన ఉపజిహ్విక ఆహారాన్ని మింగేటప్పుడు కంఠబిలంలోకి ప్రవేశించకుండా నిరోధిస్తుంది. గ్రసని కుడ్యం గవదబిళ్లలు (శోషరస కణజాలం) కలిగి ఉంటుంది. ఇవి మూడు రకాలు.
అవి.. i) గ్రసని గవద బిళ్లలు (ఎడినాయిడ్స్),
        ii) తాలవ్య గవద బిళ్లలు,
        iii) జిహ్వ గవద బిళ్లలు.

D. ఆహార వాహిక (Oesophagus): ఆహార వాహిక పలుచటి, పొడవైన నాళం. ఇది మెడ, ఉరః కుహరం, విభాజక పటలం ద్వారా పరభాగానికి ప్రయాణించి, కార్డియా ద్వారా జీర్ణాశయంలోకి తెరచుకుంటుంది. దీనికి కండరయుతమైన జఠర సంవరిణి ఆవరించి ఉంటుంది. (జఠర సంవరిణి ఆహారవాహిక జీర్ణాశయంలోకి తెరచుకోవడాన్ని నియంత్రిస్తుంది).
E. జీర్ణాశయం (Stomach): జీర్ణాశయం వెడల్పైన, స్పీత, కండరయుత సంచి లాంటి నిర్మాణం. ఇది
ఉదరకుహరానికి పైభాగాన, ఎడమవైపు ఉంటుంది. ఇది హార్థిక (ఆహార వాహికలోకి తెరచుకుంటుంది), ఫండిక్, పర జఠర నిర్గమ (చిన్నపేగులోకి జఠర నిర్గమ రంధ్రం ద్వారా తెరచుకుంటుంది) అనే మూడు భాగాలుగా విభజించి ఉంటుంది. జఠర నిర్గమ రంధ్రం దగ్గర జఠర నిర్గమ సంవరిణి ఉంటుంది.
F. చిన్నపేగు (Small Intestine): మానవుడి ఆహారనాళంలో చిన్నపేగు చాలా పొడవుగా ఉండే భాగం. దీని పూర్వభాగాన్ని ఆంత్రమూలం, మధ్యభాగాన్ని జెజునం, దూరాగ్రంలో మెలికలు తిరిగిన భాగాన్ని శేషాంత్రికం అని పిలుస్తారు. శేషాంత్రికం పెద్ద పేగులోకి తెరచుకుంటుంది.
          జీర్ణక్రియ, జీర్ణపదార్థాల శోషణ చిన్నపేగులో ఎక్కువగా జరుగుతుంది. చిన్నపేగు లోపలి గోడలకు చూషకాలుంటాయి. ఇవి శోషణ భాగాన్ని పెంచుతాయి.
G. పెద్దపేగు (Large Intestine): ఇది మూడు భాగాలుగా విభజితమై ఉంటుంది. అవి అంధనాళం (సహజీవనం చేసే సూక్ష్మజీవులకు ఆతిథ్యం ఇస్తుంది. అంధనాళం నుంచి క్రిమిరూప ఉండూకం ఏర్పడుతుంది. అంధనాళం కోలాన్‌లోకి తెరుచుకుంటుంది.), కోలాన్ (ఆరోహ, అడ్డు, అవరోహ భాగాలుగా; సిగ్మాయిడ్ కోలాన్‌గా విభజించి ఉంటుంది.) కోలాన్‌కి బాహ్యంగా కోష్టకాలు ఉబికి ఉంటాయి. వీటిని హాస్ట్రా అంటారు. కోలాన్ తర్వాత భాగం పురీషనాళంగా మారుతుంది. ఇది పాయువు ద్వారా బయటకు తెరుచుకుంటుంది. పెద్దపేగు నీరు, ఖనిజాలు, కొన్ని ఔషధాలను శోషిస్తుంది.

H. పాయువు (Anus): పాయువు కాలువ పాయువు ద్వారా బయటికి తెరచుకుంటుంది. పాయువు రంధ్రం దగ్గర అరేఖిత కండరాలతో ఏర్పడిన అంతర పాయువు సంవరిణి, రేఖిత కండరాలతో ఏర్పడిన బాహ్యపాయువు సంవరిణిలు నియంత్రిస్తుంటాయి.
 

ఆహారనాళం గోడల్లో కణజాలాలు (Histology of Alimentary Canal)
         మానవుడి ఆహారనాళంలోని గోడల్లో నాలుగు స్తరాలు ఉంటాయి. అవి సీరోసా (పలుచటి మీసోథీలియం, కొంత సంయోజక కణజాలంతోనూ ఏర్పడుతుంది), వెలుపలి కండర స్తరం (వెలుపల ఆయత కండరాలు, లోపల వలయ కండరాలతో ఏర్పడుతుంది. జీర్ణాశయం లాంటి కొన్ని భాగాల్లో కండర స్తరం మందంగా ఉంటుంది),
అథ శ్లేష్మస్తరం (వదులైన సంయోజక కణజాలంతో ఏర్పడుతుంది.), శ్లేష్మస్తరం.
* జీర్ణాశయపు లోపలి ఉపకళ క్రమరహిత ముడతలతో ఉంటుంది. వీటిని జఠర రూగే అంటారు.
* చిన్నపేగు శ్లేష్మస్తరం చిన్నవేళ్లలాంటి ముడతలను ఏర్పరుస్తుంది. వీటిని చూషకాలు అంటారు. చూషకాలను ఆవరించి స్తంభాకార ఉపకళా కణాల ప్లాస్మాత్వచం ఉంటుంది. ఇది అనేక సూక్ష్మనిర్మాణాలతో ఉంటుంది. వీటిని సూక్ష్మచూషకాలు అంటారు. చూషకాలు, సూక్ష్మచూషకాలు శోషణ తలాన్ని పెంచుతాయి.
* ప్రతి ఆంత్ర చూషకంలో ఒక కేశనాళికల జాలకం, లాక్టియల్ అని పిలిచే శోషరస నాళిక ఉంటాయి.

2. జీర్ణగ్రంథులు (Digestive glands)
A. లాలాజల గ్రంథులు:

       ఆస్యకుహరంలోకి తెరుచుకుని, మూడు జతల లాలాజల గ్రంథులు ఉంటాయి. అవి,
i. పెరోటిడ్ గ్రంథులు - వెలుపలి చెవి పీఠభాగంలో ఉంటాయి.
ii. అథోజంభికా గ్రంథులు - కింది దవడ మూలభాగంలో ఉంటాయి.
iii. అథోజిహ్వికా గ్రంథులు - నాలుక కింది భాగంలో ఉంటాయి.
      లాలాజల గ్రంథులు సీరస్ కణాలు, శ్లేష్మకణాలతో ఉండి లాలాజలాన్ని స్రవిస్తాయి. (pH = 6.8). లాలాజలంలో నీరు, లవణాలు, శ్లేష్మం, టయలిన్ (లాలాజల ఎమైలేజ్) ఉంటాయి.

B. జఠర గ్రంథులు (Gastric glands):
ఇవి సూక్ష్మ నాళాకారంలో ఉండి, జీర్ణాశయ గోడల్లో ఉంటాయి.
ఇవి మూడు రకాలు.
       i) హార్థిక గ్రంథులు (శ్లేష్మాన్ని స్రవిస్తాయి),
       ii) జఠర నిర్గమ గ్రంథులు (శ్లేష్మాన్ని, గాస్ట్రిక్ హర్మోన్‌ను స్రవిస్తాయి),
       iii) ఫండిక్ /ఆక్సింటిక్ గ్రంథులు.
ఫండిక్ గ్రంథులు మూడు రకాల కణాలతో ఉంటాయి. అవి,
       a) గ్రీవ కణాలు (శ్లేష్మాన్ని స్రవిస్తాయి),
       b) పెప్టిక్ లేదా ముఖ్యకణాలు (ప్రోఎంజైమ్‌లైన పెప్సినోజెన్, ప్రోరెనిన్‌లను స్రవిస్తాయి),
       c) ఆక్సింటిక్ కణాలు (HCl, కాసిల్ ఇంట్రిన్సిక్ కారకాలను స్రవిస్తాయి).
       జఠర గ్రంథులు జఠర రసాన్ని స్రవిస్తాయి (pH = 0.9 - 1.8). ఈ రసంలో శ్లేష్మం, HCl, పెప్సినోజెన్, ప్రోరెనిక్, కాసిల్ ఇంట్రిన్సిక్ కారకం, గాస్ట్రిక్ లైపేజ్ ఉంటాయి.

 

C. ఆంత్ర గ్రంథులు (Intestinal glands):
         ఇవి చిన్నపేగు గోడల్లో ఉంటాయి. ఇవి రెండు రకాలు. బ్రన్నర్ గ్రంథులు, లీబర్ కూన్ గుహికలు. ఈ రెండూ స్రవించే రసాన్ని ఆంత్రరసం లేదా సక్కస్ ఎంటెరికస్ (pH 7.5 - 8.0) అంటారు. ఆంత్రరసంలో పెప్టిడేజ్‌లు (అమైనోపెప్టిడేజ్, ట్రైపెప్టిడేజ్, డైపెప్టిడేజ్), డై శాఖరైడేజ్‌లు (సుక్రేజ్/ఇన్‌వర్టేజ్, మాల్టేజ్, లాక్టేజ్), లైపేజ్, ఎంటిరోకైనేజ్ (ఎంజైమ్ యాక్టివేటర్)లు ఉంటాయి.
* ఆంత్ర గ్రంథుల ఆధారాల్లో ఉండే పనీత్ కణాలు లైసోజోమ్‌ను స్రవిస్తాయి. ఇది జీర్ణాశయంలో HCl చర్యలో విచ్ఛిన్నం కాకుండా బయటపడిన బ్యాక్టీరియాలను చంపేస్తుంది. పనీత్ కణాలు పేగు గోడల్లోని మూల కణాల రక్షణలో ముఖ్య పాత్ర వహిస్తాయి.
* పేగు గోడల్లోని మూల కణాలు పేగు ఉపకళ నుంచి కోల్పోయిన కణాల స్థానాన్ని కొత్త కణాలతో భర్తీ చేయడంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి.

 

D. కాలేయం (Liver):
         మానవుడి దేహంలో కాలేయం అతిపెద్ద గ్రంథి (1.2 - 1.5 కిలో గ్రాములు). ఇది రెండు లంబికలతో కుడివైపున విభాజక పటలానికి కింద ఉదర కుహరంలో అమరి ఉంటుంది. ప్రతి కాలేయ లంబిక షడ్భుజాకార లఘు లంబికలతో ఏర్పడుతుంది. వీటి చుట్టూ పలుచటి సంయోజక కణజాల పొర ఉంటుంది. దీన్ని గ్లిస్సన్స్ గుళిక అంటారు. లఘు లంబికలు కాలేయ నిర్మాణాత్మక, క్రియాత్మక ప్రమాణాలు. ప్రతి లఘు లంబిక మధ్యభాగంలో కేంద్ర సిర ఉంటుంది. ఈ సిర చుట్టూ కాలేయ కణాలు కాలేయ రజ్జువులుగా అమరి ఉంటాయి. కాలేయం పైత్యరసాన్ని స్రవిస్తుంది (pH = 7.6). దీనిలో ఎంజైమ్‌లు ఉండవు.
      కాలేయ కణాలు స్రవించే పైత్యరసం కాలేయ నాళాల ద్వారా ప్రయాణించి పలుచటి కండరయుత సంచి లాంటి పిత్తాశయంలో నిల్వ ఉంటుంది. పిత్తాశయం నుంచి వెలువడే కోశీయ నాళం కాలేయ నాళంతో కలిసి
ఐక్యపైత్యరస నాళంగా ఏర్పడుతుంది. ఐక్యపైత్య రసనాళం, క్లోమనాళం ఆంత్రమూలంలోకి ఐక్య కాలేయ క్లోమనాళం ద్వారా తెరచుకుంటాయి. ఈ నాళం రంధ్రాన్ని ఆవరించి ఒడ్డి సంవరిణి ఉంటుంది. పైత్యరసానికి క్షార గుణం ఉంటుంది. ఇది కొవ్వులను ఎమల్సీకరణం చేస్తుంది.

E. క్లోమం (Pancreas):
        క్లోమం మానవ దేహంలోని రెండో అతిపెద్ద గ్రంథి. ఇది మిశ్రమ గ్రంథి. అసినై, లాంగర్‌హాన్స్ పుటికలతో ఏర్పడి ఆంత్రమూలానికి చెందిన శిక్యంలో ఇమిడి ఉంటుంది. క్లోమరసాన్ని స్రవిస్తుంది. (pH = 8.4). దీనిలో సోడియం బైకార్బనేట్, ట్రిప్సినోజెన్, కైమోట్రిప్సినోజెన్, కార్బోపెప్టిడేజ్, లైపేజ్/స్టియాప్సిన్;  ఎమైలేజ్, న్యూక్లియేజ్‌లు (DNA ase /RNA ase) ఉంటాయి. లాంగర్‌హాన్స్ పుటికలు ఇన్సులిన్, గ్లూకగాన్, ఇతర హార్మోన్‌లను స్రవిస్తాయి.

 

III. జీర్ణక్రియా విధానం

మానవుడిలో బాహ్యజీర్ణక్రియ జరుగుతుంది. దీనిలో రెండు రకాల చర్యలు ఉంటాయి. అవి, యాంత్రిక జీర్ణక్రియ (దంతాలు ఆహారాన్ని కొరకడం, నమలడం వల్ల పెరిస్టాలిసిస్ కదలికలు మొదలైనవి), రసాయనిక జీర్ణక్రియ (జలవిశ్లేషక ఎంజైమ్‌ల చర్య వల్ల).
1. ఆస్యకుహరంలో జీర్ణక్రియ: ఆస్యకుహరంలో ఆహారాన్ని దంతాలతో బాగా నములుతాం. ఈ సమయంలో ఆహారం లాలాజలంతో కలుస్తుంది. ఈ క్రియలో నాలుక ప్రధానపాత్ర వహిస్తుంది. లాలాజలంలో ఉండే శ్లేష్మం ఆహారాన్ని మెత్తగా చేస్తుంది. దీన్ని బోలస్ అంటారు. టయలిన్ పిండి పదార్థాలపై (కార్బోహైడ్రేట్) చర్య జరిపి దాదాపు 30% పిండి పదార్థాన్ని మాల్టోజ్‌గా మారుస్తుంది. లాలాజలంలోని లైసోజోమ్ హానికర సూక్ష్మజీవులను చంపేస్తుంది. తర్వాత బోలస్ రూపంలో ఉండే ఆహారం గ్రసని, ఆహార వాహిక ద్వారా జీర్ణాశయాన్ని చేరుతుంది. ఈ విధానాన్ని 'డెగ్లూషన్' అంటారు.

 

2. జీర్ణాశయంలో జీర్ణక్రియ: జీర్ణాశయంలో ఆహారం కొన్ని గంటలపాటు నిల్వ ఉంటుంది. అది జఠర రసంతో కలిసి, జీర్ణాశయ గోడల్లోని కండరాల చర్య వల్ల బాగా చిలకబడుతుంది. జఠరరసంలో ఉండే శ్లేష్మం, శ్లేష్మస్తర ఉపకళను లూబ్రికేట్ చేయడంలోనూ, గాఢ HCl నుంచి కాపాడటంలోనూ ముఖ్యపాత్ర వహిస్తుంది. ఆహారంతోపాటు జీర్ణాశయాన్ని చేరే సూక్ష్మజీవులను HCl చంపేస్తుంది. దాంతోపాటు ప్రోఎంజైమ్‌లైన పెప్సినోజెన్, ప్రోరెనిన్‌లను; పెప్సిన్, రెనిన్ అనే చైతన్యవంత ఎంజైమ్‌లుగా మారుస్తుంది. రెనిన్ శిశువుల్లో ఉంటుంది. ఇది పాలలోని కేసిన్ అనే ప్రొటీన్‌ను కాల్షియం అయాన్ల సమక్షంలో కాల్షియం పారాకేసినేట్‌ (పెరుగు) గా మారుస్తుంది. పెప్సిన్ ప్రొటీన్లు, పెరుగును; ప్రొటియేజెస్, పెప్టోన్లుగా మారుస్తుంది. గాస్ట్రిక్ లైపేజ్ చర్యకు ప్రాధాన్యం ఉండదు.

ఈ విధంగా పాక్షికంగా జీర్ణమైన ఆహారం జీర్ణాశయం గోడల్లోని కండరాల చర్య వల్ల పాక్షిక ద్రవరూపంలోకి మారుతుంది. దీన్ని కైమ్ అంటారు. ఇది కొద్ది కొద్దిగా చిన్నపేగును చేరుతుంది.
 

3. చిన్నపేగులో జీర్ణక్రియ: ఆంత్రమూలంలో కైమ్ పైత్య, క్లోమ, ఆంత్ర రసాలతో కలుస్తుంది. క్లోమం స్రవించే శ్లేష్మం ఆంత్ర శ్లేష్మస్తరాన్ని రక్షిస్తుంది. అంతే కాకుండా కైమ్ ఆమ్ల మాధ్యమాన్ని క్షారయుతంగా మారుస్తుంది. ఎందుకంటే క్లోమ, ఆంత్రరస ఎంజైమ్‌లు క్షారమాధ్యమంలో బాగా పని చేస్తాయి.
A. ప్రొటీన్‌ల జీర్ణక్రియ: ట్రిప్సినోజెన్‌ను ఎంటిరోకైనేజ్ అనే ఎంజైమ్ ఉత్తేజితం చేసి క్రియాశీల ట్రిప్సిన్‌గా మారుస్తుంది. ఈ ట్రిప్సిన్ తిరిగి ట్రిప్సినోజెన్‌ను క్రియాశీలం చేస్తుంది (స్వయం ఉత్ప్రేరణ). ట్రిప్సిన్ కైమోట్రిప్సినోజెన్‌ను కైమోట్రిప్సిన్‌గా మారుస్తుంది. కైమ్‌లో ఉండే ప్రొటీన్లు, ప్రొటియేజెస్, పెప్టోన్లు ట్రిప్సిన్, కైమోట్రిప్సిన్, కార్బాక్సీపెప్టిడేజ్, అమైనోపెప్టిడేజ్ ఎంజైమ్‌లతో ట్రై, డైపెప్టైడ్లుగా జీర్ణం అవుతాయి. ట్రైపెప్టైడ్లు, డైపెప్టైడ్లు; ట్రైపెప్టిడేజ్, డైపెప్టిడేజ్ ఎంజైమ్‌లతో అమైనో ఆమ్లాలుగా జీర్ణం అవుతాయి. ఈ విధంగా జీర్ణక్రియ తర్వాత ప్రొటీన్లు అమైనో ఆమ్లాలుగా మారతాయి.

B. కొవ్వుల జీర్ణక్రియ: కొవ్వు పదార్థాలను పైత్యరసంలోని పైత్యరస లవణాలు ఎమల్సీకరిస్తాయి (ట్రైగ్లిజరైడ్లు). (పెద్ద కొవ్వు పదార్థాలు సమాంతరంగా విస్తరించి ఉండే చిన్న పదార్థాలుగా విడిపోవడాన్ని ఎమల్సీకరణం అంటారు.) క్లోమరసంలోని లైపేజ్ (స్టియాప్సిన్), ఆంత్రరస లైపేజ్‌లు కొవ్వులను (ట్రైగ్లిజరైడ్లు) కొవ్వు ఆమ్లాలు, గ్లిజరాల్‌గా విడగొడతాయి.


          ఈ విధంగా జీర్ణక్రియ తర్వాత కొవ్వులు (ట్రై గ్లిజరైడ్లు), కొవ్వు ఆమ్లాలు, గ్లిజరాల్‌గా మారతాయి.
C. కార్బోహైడ్రేట్‌ల జీర్ణక్రియ: క్లోమరసంలో ఉండే ఎమైలేజ్ ఎంజైమ్ కార్బోహైడ్రేట్‌లను డైశాఖరైడ్‌లు (మాల్టోజ్, సుక్రోజ్, లాక్టోజ్ మొదలైనవి)గా మారుస్తుంది. ఇవి మోనోశాఖరైడేజేస్ (మాల్టేజ్, సుక్రేజ్, లాక్టేజ్ మొదలైనవి)వల్ల మోనోశాఖరైడ్‌లుగా మారతాయి.


ఈ విధంగా జీర్ణక్రియ తర్వాత కార్బోహైడ్రేట్‌లు మోనోశాఖరైడ్‌లుగా మారతాయి.

 

D. కేంద్రకామ్లాల జీర్ణక్రియ: క్లోమరసంలోని న్యూక్లియేజ్‌లు కేంద్రకామ్లాలను కింది విధంగా జీర్ణం చేస్తాయి.


 

 IV. శోషణ
జీర్ణమైన ఆహార పదార్థాలు పేగు గోడల్లోని శ్లేష్మస్తరం, దాని నుంచి రక్తం లేదా శోషరసంలోకి గ్రహించబడటాన్ని 'శోషణ' అంటారు.
i) మోనోశాఖరైడ్లు (గ్లూకోజ్, గెలాక్టోజ్), అమైనో ఆమ్లాలు, క్లోరైడ్ అయాన్లు తక్కువ పరిమాణంలో సరళ వ్యాపన పద్ధతిలో శోషణ చెందుతాయి (వ్యాపనం గాఢత ప్రవణత ఆధారంగా).
ii) ఫ్రక్టోజ్, అమైనో ఆమ్లాల లాంటి కొన్ని పదార్థాలు వాహక అయాన్ల (Na+)తో కలిసి శోషణ చెందుతాయి (రవాణా సౌలభ్య వ్యాపనం).
iii) నీరు ద్రవాభిసరణ ప్రవణతపై ఆధారపడి శోషితమవుతుంది.
iv) గ్లూకోజ్, అమైనో ఆమ్లాలు, కొన్ని ఎలక్ట్రోలైట్‌లు సక్రియ రవాణా ద్వారా శోషితమవుతాయి.
v) పైత్య లవణాలు, కొవ్వు ఆమ్లాల పెద్ద గొలుసులు, గ్లిజరాల్‌తో కలిసి మైసెల్లేలను ఏర్పరుస్తాయి. ఇవి పేగు శ్లేష్మస్తర కణాల్లోకి ప్రవేశిస్తాయి. ఉపకళా కణంలో మోనోగ్లిజరైడ్‌లు, కొవ్వు ఆమ్లాలు తిరిగి ట్రైగ్లిజరైడ్‌లుగా సంశ్లేషణం చెంది కొద్ది మొత్తంలో ఫాస్ఫోలిపిడ్‌లు, కొలెస్ట్రాల్‌తో కలిసి చిన్నచిన్న గుళికల రూపంలోకి మారతాయి. వీటిని ఆవరించి ప్రొటీన్లు ఉంటాయి. వీటిని కైలోమైక్రాన్‌లు అంటారు. ఇవి ఆంత్ర చూషకాల్లో ఉండే 'లాక్టియల్' శోషరస సూక్ష్మనాళికలోకి కణ బహిష్కరణ పద్ధతిలో ప్రవేశిస్తాయి. శోషరసం రక్తంతో కలిసినప్పుడు, కైలోమైక్రాన్‌లు లైపోప్రొటీన్ లైపేజ్ ఎంజైమ్ చర్య ద్వారా విచ్ఛిన్నం చెంది కొవ్వు ఆమ్లాలు, గ్లిజరాల్‌గా మారతాయి.

 

 V. స్వాంగీకరణం: జీర్ణమైన ఆహార పదార్థాలు శోషణం చెంది జీవ పదార్థ అనుఘటకాలుగా మారతాయి. ఇవి శక్తి ఉత్పాదన, పెరుగుదల, మరమ్మతు చేయడానికి ఉపయోగపడతాయి. ఈ విధానాన్ని 'స్వాంగీకరణం' అంటారు.
 

VI. మల విసర్జన: జీర్ణంకాని, శోషణ చెందని పదార్థాలు (రఫేజ్) పెద్ద పేగులోని 'కోలాన్‌'ని చేరతాయి. ఇక్కడ కొంత నీరు, ఖనిజాలు, కొన్ని ఔషధాలు శోషణం చెందుతాయి. పెద్దపేగు స్రవించిన శ్లేష్మ పదార్థం జీర్ణంకాని పదార్థాలను దగ్గరగా చేర్చి, లూబ్రికేట్ చేసి సులభంగా బయటికి పంపే విధంగా మారుస్తుంది. ఆ పదార్థం పురీషనాళంలో తాత్కాలికంగా (పాయువు ద్వారా బయటికి వెళ్లే వరకు) నిల్వ ఉంటుంది (మల విసర్జన). నాడీ ప్రతీకార చర్యల ప్రేరణ వల్ల మలపదార్థం బయటికి వెళుతుంది. మల విసర్జన బలమైన తరంగ చలనాల వల్ల జరిగే నిరంతర ప్రక్రియ.
 

VII. జీర్ణక్రియపై జఠరాంత్ర హార్మోన్‌ల ప్రభావం:  జఠరాంత్ర శ్లేష్మం కొన్ని వినాళ గ్రంథులను కలిగి ఉంటుంది. ఇది జీర్ణక్రియకు తోడ్పడే కొన్ని హార్మోన్‌లను స్రవిస్తుంది.

హార్మోన్ స్రావక భాగం ప్రభావం
గ్యాస్ట్రిన్ జీర్ణాశయకుడ్యం ఉపకణాలు హైడ్రోక్లోరిక్ ఆమ్లం, పెప్సినోజెన్
 స్రావాన్ని ప్రేరేపిస్తుంది.
ఎంటిరోగ్యాస్ట్రోన్/ జఠర నిరోధక పెప్టైడ్ (GIP) ఆంత్రమూలం ఉపకణాలు జఠర స్రావకతను నిరోధిస్తుంది.
సెక్రిటిన్ ఆంత్రమూలం ఉపకణాలు

క్లోమ ఎసినైని ప్రేరేపించి, నీరు, బైకార్బనేట్‌లున్న 
 క్లోమ రసాన్ని స్రవించేలా చేస్తుంది.

కోలిసిస్టోకైనిన్ ఆంత్రమూలం ఉపకణాలు పిత్తాశయాన్ని సంకోచింపజేసి,
పైత్య రసాన్ని  విడుదల చేయిస్తుంది.
పాంక్రియోజైమిన్ ఆంత్రమూలం ఉపకణాలు క్లోమరస ఎంజైమ్‌ల స్రావకాలను ప్రేరేపిస్తుంది.
ఎంటిరోక్రైనిన్ ఆంత్రమూల శ్లేష్మస్తర కణాలు సక్కస్ ఎంటెరికస్ స్రావాన్ని ప్రేరేపిస్తుంది.
విల్లికైనెన్ ఆంత్ర చూషకాలు చూషకాల కదలికలను ప్రేరేపించి
శోషణను అధికం చేస్తుంది.

VIII. కెలోరీ విలువలు
ఒక గ్రాము పిండి పదార్థాలు, మాంసకృత్తులు, కొవ్వులు ఆక్సీకరణం చెందడం వల్ల విడుదలయ్యే శక్తి కింది పట్టికలో చూడండి.

ఆహార పదార్థం (కేజీ)

ఆక్సీకరణం వల్ల విడుదలైన శక్తి
(కిలో కేలరీల్లో)

పిండి పదార్థాలు

4.0

మాంసకృత్తులు

4.0

కొవ్వులు

9.0

IX. జీర్ణవ్యవస్థ అపస్థితులు
i. ఆంత్రనాళ ఉజ్వలనం (నొప్పితో కూడిన వాపు): 
ఇది బ్యాక్టీరియా, వైరస్‌ల సంక్రమణల వల్ల ఏర్పడే అతి సాధారణమైన వ్యాధి. దీని వల్ల ఆంత్రనాళం వాస్తుంది.
ii. వాంతి చేయడం: జీర్ణాశయంలో ఉన్న పదార్థాలు నోటి ద్వారా బయటకు రావడాన్ని వాంతి చేయడం అంటారు. ఈ ప్రతీకార చర్యను మజ్జాముఖంలోని వాంతి కేంద్రం నియంత్రిస్తుంది.
iii. నీళ్ల విరేచనాలు: అసాధారణ ఆంత్ర కదలికలు, పలుచటి ద్రవరూప మల విసర్జన దీని లక్షణం. ఆహార శోషణ తగ్గి అధిక నీటి నష్టం జరగడం వల్ల దేహం నిర్జలీకరణకు గురవుతుంది.
iv. అజీర్ణం: ఈ స్థితిలో ఆహారం సరిగా జీర్ణం కాదు. జీర్ణాశయం నిండుగా ఉన్నట్లు అనిపిస్తుంది. దీనికి కారణం మసాలాలతో కూడిన ఆహారాన్ని అధికంగా తీసుకోవడం.
v. మలబద్ధకం: మలంలో నీటి శాతం తక్కువగా ఉండి, పురీషనాళంలో నిల్వ ఉండటం వల్ల మలబద్ధకం ఏర్పడుతుంది. పేగు కదలికలు అస్తవ్యస్తంగా ఉంటాయి.
vi. కామెర్లు: ఇది కాలేయానికి వచ్చే వ్యాధి. ఆకలి లేకపోవడం దీని సాధారణ లక్షణం. రక్తంలో పైత్యరస లవణాలు అధికంగా ఉండి చర్మం, కంటిలోని తెల్లటి భాగంలోకి చేరడం వల్ల ఇవి పసుపు రంగులోకి మారతాయి.

 

X. కాలేయం విధులు
* కాలేయం పైత్యరసాన్ని స్రవిస్తుంది. దీనిలో పైత్య లవణాలు (గ్లైకో కోలేట్, సోడియం, పొటాషియం టారోకోలేట్) ఉంటాయి. ఇవి జీర్ణక్రియలో కొవ్వులను ఎమల్సీకరణం చేస్తాయి.
* కాలేయం కార్బోహైడ్రేట్‌ల జీర్ణక్రియ (గ్లైకోజెనిసిస్, గ్లైకోజెనాలిసిస్, గ్లూకోనియో జెనిసిస్, లైపోజెనినిస్), కొవ్వుల జీర్ణక్రియ (ట్రైగ్లిజరైడ్‌లు, కొలెస్ట్రాల్ సంశ్లేషణ)లో ముఖ్య పాత్ర వహిస్తుంది.
* ప్రొటీన్లను డీఎమినేషన్ చేసి అమ్మోనియాను యూరియాగా మారుస్తుంది. ఆర్నిథిన్ వలయం కాలేయంలో జరుగుతుంది.
* వాయురహిత కండర సంకోచంలో ఏర్పడిన లాక్టిక్ ఆమ్లాన్ని గ్లైకోజన్‌గా మారుస్తుంది (కోరి వలయం)
* కాలేయం విషరహిత అవయవంగా పనిచేస్తుంది.
* ఇది ఉష్ణక్రమత అవయవంగా, పిండదశలో రక్తకణోత్పాదక అంగంగా కూడా పనిచేస్తుంది.
* ఇది ప్లాస్మాప్రొటీన్లు (ఆల్బుమిన్, గ్లోబ్యులిన్లు), రక్త స్కందన కారకాలు (ఫైబ్రినోజెన్, ప్రోత్రాంబిన్), ప్రతిస్కందకం (హెపారిన్) లాంటి వాటిని సంశ్లేషిస్తుంది.
* కుఫర్ కణాలు భక్షక కణాలుగా పనిచేసి హానికర సూక్ష్మజీవులను క్రిమి భక్షణ పద్ధతిలో తొలగిస్తాయి.

 

గ్లైకోజెనిసిస్: గ్లూకోజ్ నుంచి గ్లైకోజెన్ ఏర్పడటం.

గ్లైకోజెనాలిసిస్: గ్లైకోజెన్ నుంచి గ్లూకోజ్ ఏర్పడటం.

గ్లూకోనియోజెనిసిస్: పిండి పదార్థాలు (కార్బోహైడ్రేట్లు) కాని పదార్థాల నుంచి గ్లూకోజ్ సంశ్లేషణ చెందడం.

లైపోజెనిసిస్: కొవ్వులు ఏర్పడటం.

Posted Date : 30-07-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని

విద్యా ఉద్యోగ సమాచారం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌