• facebook
  • twitter
  • whatsapp
  • telegram

యూనిట్ - IB, శ్వాసించడం, వాయువుల వినిమయం

I. శ్వాసక్రియ 
       ఇది ఒక విచ్ఛిన్నక్రియ. ఈ క్రియలో ఆహార పదార్థాలు ఆక్సీకరణం చెంది, శక్తి విడుదలవుతుంది. శక్తితోపాటు CO2, నీరు కూడా విడుదల అవుతాయి. దీనిలో గాలి పీల్చడం, బాహ్య శ్వాసక్రియ/ వెంటిలేషన్, శ్వాస వాయువుల రవాణా, అంతర శ్వాసక్రియ లేదా కణ శ్వాసక్రియ అనే అంశాలు ఉంటాయి.
వాయురహిత శ్వాసక్రియ: ఆక్సిజన్ లభించనప్పుడు ఆహార పదార్థాలు, ఎంజైమ్‌ల మధ్య చర్య జరిగి శక్తి విడుదల అవడాన్ని వాయురహిత శ్వాసక్రియ అంటారు.
ఉదా: ఈస్ట్, బ్యాక్టీరియా.

(C2H5OH - ఇథైల్ ఆల్కహాల్ (ఇథనాల్); C3H6O3 లాక్టిక్ ఆమ్లం)

వాయుసహిత శ్వాసక్రియ: ఆక్సిజన్ లభించినప్పుడు గ్లూకోజ్, కొవ్వు ఆమ్లాలు, అమైనో ఆమ్లాలు సంపూర్ణంగా విచ్ఛిన్నం చెంది అధిక శక్తిని విడుదల చేసే క్రియను వాయుసహిత శ్వాసక్రియ అంటారు.
C6H12O6 + 6 H2O + 6 O2   6 CO2 + 12 H2O + 36 ATP

 

II. శ్వాసాంగాలు 


III. మానవుడి శ్వాసవ్యవస్థ 
 

మానవుడి శ్వాసవ్యవస్థలో కింది భాగాలు ఉంటాయి.
1. బాహ్య నాసికారంధ్రాలు: మానవుడిలో ఒక జత బాహ్య నాసికా రంధ్రాలు నోటిపై భాగంలో ఉంటాయి. ఇవి నాసికా కక్ష్యల్లోకి నాసికా మార్గం ద్వారా తెరుచుకుంటాయి.
2. నాసికా కక్ష్యలు: ఒక జత నాసికా కక్ష్యలు తాలువు పైభాగాన ఉంటాయి. వీటిని నాసికా విభాజకం వేరు చేస్తుంది. ప్రతి నాసికా కక్ష్య మూడు భాగాలుగా విభజించి ఉంటుంది.
i. ఆళింద భాగం: ఇందులో రోమాలు, చర్మవసా గ్రంథులు ఉంటాయి. ఇవి దుమ్ము, ధూళి రేణువులు లోనికి ప్రవేశించకుండా నిరోధిస్తాయి.
ii. శ్వాస భాగం: ఇది మూడు అస్థిఫలకాలతో ఉంటుంది. వీటిని టర్బినల్స్ (కాంకే) అంటారు. ఇది సహజ ఎయిర్ కండిషనర్‌గా పనిచేస్తుంది.
iii. ఘ్రాణ భాగం: ఇది వాసనను గుర్తించగల ఘ్రాణ ఉపకళతో ఆవరించి ఉంటుంది.
3. గ్రసని: నాసికా కక్ష్యలు ఒక జత అంతర నాసికా రంధ్రాల ద్వారా నాసికా గ్రసనిలోకి తెరచుకుంటాయి. నాసికా గ్రసని ముఖగ్రసనిలోకి తెరుచుకుంటుంది. ఇది కంఠబిలం, స్వరపేటిక ద్వారా వాయునాళంలోకి తెరచుకుంటుంది.
4. స్వరపేటిక: ఇది ధ్వని ఉత్పత్తికి సహాయపడే మృదులాస్థి పేటిక (ధ్వని పేటిక). స్వరపేటిక కుడ్యానికి ఆధారంగా థైరాయిడ్, క్రికాయిడ్, ఎపిగ్లాటిస్; ఒక్కో జత చొప్పున కార్నిక్యులేట్ (శాంటోరిని మృదులాస్థులు), ఎరిటినాయిడ్, క్యునిఫామ్ మృదులాస్థులు ఉంటాయి. థైరాయిడ్, ఎరిటినాయిడ్ మృదులాస్థులను కలుపుతూ రెండు పసుపు పచ్చటి స్థితిస్థాపక తంతువులు ఉంటాయి. వీటిని స్వర తంత్రులు అంటారు. స్వరతంత్రులు, ఎరిటినాయిడ్ మృదులాస్థుల ఖాళీని రిమాగ్లాటిడిస్ అంటారు.

* పురుషుల్లో స్వరతంత్రులు మందంగా, పొడవుగా ఉండి అల్పపరిమితి స్వరాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఇవి స్త్రీలు, పిల్లల్లో పలుచగా ఉండి హెచ్చు పరిమితి స్వరాన్ని ఉత్పత్తి చేస్తాయి.
* స్వరపేటిక శ్లేష్మస్తరం నుంచి ఏర్పడిన ముడతలతో ఉంటుంది. వీటిని మిథ్యా స్వరతంత్రులు అంటారు (ధ్వనిని ఉత్పత్తి చేయవు).
* థైరాయిడ్ మృదులాస్థి ఉదర మధ్య భాగం, స్వరపేటికా ఉబ్బెత్తుని ఏర్పరుస్తుంది. దీన్ని 'ఆడమ్స్ ఆపిల్' అంటారు.

5. వాయునాళం: స్వరపేటిక పలుచటి గోడలతో, వెడల్పాటి గొట్టమైన వాయునాళంగా అవతరిస్తుంది. దీని గోడలకు ఆధారంగా 'c' ఆకారపు కాచాభ మృదులాస్థి వలయాలు (హయలిన్ మృదులాస్థి నిర్మిత) ఉంటాయి. ఇవి పృష్ఠతలంలో అసంపూర్ణంగా ఉండి, వాయునాళం ముడుచుకుపోవడాన్ని నిరోధిస్తూ ఎల్లప్పుడూ తెరచుకుని ఉండేలా చేస్తాయి. వాయునాళం లోపలితలం మిథ్యాస్తరిత శైలికామయ ఉపకళతో ఆవరించి ఉంటుంది.
6. శ్వాసనాళాలు, శ్వాసనాళికలు: వాయునాళం ఉరః కుహరం మధ్యలో అయిదో ఉరః కశేరుక స్థాయి వద్ద రెండుగా చీలి కుడి, ఎడమ శాఖలను ఏర్పరుస్తుంది. వీటిని ప్రాథమిక శ్వాసనాళాలు అంటారు. ప్రతి శ్వాసనాళం తనవైపు ఉన్న ఊపిరితిత్తిలోకి ప్రవేశించి ద్వితీయ శ్వాసనాళాలను ఏర్పరుస్తుంది. ఇవి తిరిగి శాఖలుగా చీలి తృతీయ శ్వాసనాళాలను ఏర్పరుస్తాయి. ప్రతి తృతీయ శ్వాసనాళం అనేకసార్లు విభజన చెంది క్రమంగా ప్రాథమిక, ద్వితీయ, తృతీయ, చివరి శ్వాసనాళికలను ఏర్పరుస్తుంది. ప్రతి శ్వాసనాళిక వాయుకోశగోణుల గుంపులోకి తెరచుకుంటుంది.

వాయునాళం నుంచి ఏర్పడిన శ్వాసనాళం, శ్వాసనాళికలు, వాయుకోశ గోణులు కలిసి తలకిందులుగా ఉండే శ్వాస వృక్షాన్ని ఏర్పరుస్తాయి.

ఊపిరితిత్తులు: ఒక జత ఊపిరితిత్తులు ఉరఃకుహరంలో గుండెకు ఇరువైపుల ఒక్కోటి చొప్పున ఉంటాయి. ఊపిరితిత్తులను ఆవరించి రెండు పొరలున్న పుపుస త్వచం ఉంటుంది. ఈ రెండు పొరల మధ్య ఉండే పుపుస ద్రవం రాపిడిని తగ్గిస్తుంది.


               

* బాహ్యనాసికా రంధ్రాల నుంచి చివరి శ్వాసనాళికల వరకు విస్తరించిన భాగాన్ని 'వాహికాభాగం' అంటారు.
* వాయుకోశాలు, వాటి నాళికలు కలిసి 'వినిమయ భాగాన్ని' ఏర్పరుస్తాయి.

                     

ఊపిరితిత్తులు గాలి చొరబడని గది లాంటి ఉరఃకుహరంలో ఉంటాయి. దీని పృష్ఠభాగాన కశేరుదండం, ఉరఃభాగాన ఉరోస్థి, పార్శ్వ భాగాన పర్శుకలు, కింది భాగాన డోమ్ ఆకార విభాజకపటలం ఉంటాయి. ఉరఃకుహరంలో ఊపిరితిత్తుల అమరిక ఏ విధంగా ఉంటుందంటే ఉరఃకుహర ఘనపరిమాణంలో ఏ విధమైన మార్పు జరిగినా దాని ప్రభావం ఊపిరితిత్తి కుహరంపై పడుతుంది. ఈ అమరిక శ్వాసించడానికి అత్యవసరం.
                            మానవుడి శ్వాసక్రియ కింది దశల్లో జరుగుతుంది.
a. శ్వాసించడం / వెంటిలేషన్: వాతావరణంలోని గాలి (21% O2 ఉన్న)ని వాయుకోశాల్లోకి పీల్చడం, CO2 అధికంగా ఉన్న గాలిని బయటికి పంపించడం దీనిలో జరుగుతుంది.
b. వాయువుల వినిమయం: వాతావరణం (గాలి)లోని O2 రక్తంలోకి, రక్తంలోని CO2 వాయుకోశాల్లోకి వాయుకోశ త్వచం ద్వారా వినిమయమవుతాయి.
c. వాయువుల రవాణా: రక్తం ద్వారా జరుగుతుంది.
d. వాయువుల మార్పిడి: రక్తం, కణజాలాల మధ్య జరుగుతుంది.
e. కణశ్వాసక్రియ: మైటోకాండ్రియాలో జరుగుతుంది. ఇక్కడ ఆహార పదార్థాలు ఆక్సీకరణం చెంది శక్తి విడుదలవుతుంది. 

IV. శ్వాసక్రియా విధానం 

        గాలిని ఊపిరితిత్తుల్లోకి తీసుకోవడం, బయటకు వదిలేయడం... క్రమంగా జరిగే ఈ క్రియే శ్వాసించడం. ఆరోగ్యవంతమైన మానవుడు నిమిషానికి 12 - 16 సార్లు శ్వాసిస్తాడు. శ్వాసించడంలో రెండు దశలుంటాయి. అవి ఉచ్ఛ్వాసం, నిచ్ఛ్వాసం. కండరయుత విభాజకపటలం; బాహ్యా, అంతర పర్శుకాంతర కండరాలు శ్వాస కదలికల్లో ప్రముఖపాత్ర వహిస్తాయి.
1. ఉచ్ఛ్వాసం: పరిసరాల్లోని గాలిని ఊపిరితిత్తుల్లోకి పీల్చడాన్ని ఉచ్ఛ్వాసం అంటారు. ఇది క్రియాశీల ప్రక్రియ. ఈ ప్రక్రియలో విభాజకపటల కండరాలు సంకోచిస్తాయి. దీనివల్ల విభాజకపటలం బల్లపరుపుగా మారుతుంది. దీంతో పూర్వ - పర అక్షంలో ఉరః కుహర ఘనపరిమాణం పెరుగుతుంది. అదే సమయంలో వెలుపలి పర్శుకాంతర కండరాలు సంకోచించడం తో పర్శుకలు, ఉరోస్థిపైకి లేవడం వల్ల ఉరఃకుహరం పృష్ఠోదర అక్షంలో విశాలమవుతుంది. ఫలితంగా ఉరః కుహర, పుపుస ఘనపరిమాణాలు పెరిగి ఊపిరితిత్తుల్లో పీడనం తగ్గుతుంది. అందువల్ల పరిసరాల్లోని గాలి ఊపిరితిత్తుల్లోకి ప్రవహిస్తుంది.

 

2. నిచ్ఛ్వాసం: వాయుకోశాల్లోని గాలి బయటికి విడుదల కావడాన్ని నిచ్ఛ్వాసం అంటారు. ఇది నిష్క్రియా ప్రక్రియ. ఈ ప్రక్రియలో విభాజకపటలం కండరాలు, వెలుపలి పర్శుకాంతర కండరాలు సడలింపబడతాయి. దీనివల్ల విభాజకపటలం, ఉరోస్థి తిరిగి యథాస్థానానికి చేరతాయి. ఉరః కుహర, పుపుస ఘనపరిమాణాలు తగ్గుతాయి. ఫలితంగా పుపుస అంతర పీడనం పెరుగుతుంది. అంతేకాకుండా ఊపిరితిత్తుల నుంచి గాలి బయటికి వస్తుంది.

* బలవంత నిచ్ఛ్వాసం ఒక క్రియాశీల ప్రక్రియ. ఎందుకంటే దీనిలో అంతర పర్శుకాంతర కండరాలు, ఉదర కండరాలు సంకోచిస్తాయి.
* సాధారణ ఉచ్ఛాస లేదా నిచ్ఛ్వాసాల్లో పీల్చుకునే లేదా వదలివేసే గాలి ఘనపరిమాణాన్ని టైడల్ వాల్యూమ్ (TV) అంటారు. ఆరోగ్యవంతుడైన మానవుడిలో ఇది సుమారు 500 మి.లీ. ఉంటుంది. (ఆరోగ్యవంతుడైన మానవుడు నిమిషానికి 6000 నుంచి 8000 మి.లీ. గాలిని పీల్చుకుంటాడు లేదా వదలివేస్తాడు.)
* బలవంతంగా ఊపిరి పీల్చేటప్పుడు టైడల్ వాల్యూమ్ కంటే అధికంగా పీల్చుకోగలిగిన గాలి ఘనపరిమాణాన్ని ఉచ్ఛ్వాస నిల్వ ఘనపరిమాణం (IRV) అంటారు. ఇది సుమారు 3000 మి.లీ. వరకు ఉంటుంది.
* బలవంత నిచ్ఛ్వాసంలో టైడల్ వాల్యూమ్ కంటే అధికంగా బయటికి వదలగలిగిన గాలి ఘనపరిమాణాన్ని నిచ్ఛ్వాస నిల్వ ఘనపరిమాణం (ERV) అంటారు. ఇది సుమారు 1100 మి.లీ. వరకు ఉంటుంది.)
* నిచ్ఛ్వాసం అనంతరం ఊపిరితిత్తుల్లో మిగిలి ఉండే గాలి ఘనపరిమాణాన్ని అవశేష ఘనపరిమాణం (RV) అంటారు.

* సాధారణ ఉచ్ఛ్వాసం తర్వాత ఒక వ్యక్తి లోపలికి పీల్చగలిగే గాలి మొత్తం ఘనపరిమాణాన్ని ఉచ్ఛ్వాస సామర్థ్యం (IC) అంటారు.   IC = TV + IRV
* సాధారణ నిచ్ఛ్వాసం తర్వాత ఒక వ్యక్తి లోపలికి పీల్చగలిగే గాలి మొత్తం ఘపపరిమాణాన్ని నిచ్ఛ్వాస సామర్థ్యం (EC) అంటారు.
* సాధారణ నిచ్ఛ్వాసం తర్వాత ఊపిరితిత్తుల్లో మిగిలిన గాలి ఘనపరిమాణాన్ని క్రియాత్మక అవశేష సామర్థ్యం (FRC) అంటారు.
  FRC = ERV + RV
* బలవంతపు నిచ్ఛ్వాసం తర్వాత పీల్చగలిగే గాలి గరిష్ఠ ఘనపరిమాణాన్ని వైటల్ సామర్థ్యం (VC) అంటారు.
   VC = TV + IRV + ERV
* ఊపిరితిత్తులు బంధించగలిగే గాలి మొత్తం ఘనపరిమాణాన్ని పూర్ణ పుపుస సామర్థ్యం అంటారు.
  TLC = VC + RV

V. వాయువుల వినిమయం 
         వాయువుల మార్పిడి (O2, CO2) ఊపిరితిత్తుల్లోని వాయుకోశాల్లో జరుగుతుంది. ఇది రక్తం, కణజాలాలకు మధ్య కూడా జరుగుతుంది. వాయువుల మార్పిడి వినిమయం ద్వారా జరుగుతుంది. వాయుకోశాల్లో O2 పాక్షిక పీడనం (PO2) రక్తం కంటే ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా దైహిక చాపాల్లోని రక్తం PO2 కణజాలాల కంటే ఎక్కువగా ఉంటుంది. అలాగే వాతావరణంలోని గాలి PCO2 వాయుకోశాల్లోని రక్తం కంటే తక్కువగా ఉంటుంది. కణజాలాల్లో PCO2 రక్తం కంటే ఎక్కువగా ఉంటుంది.
వాయువుల మార్పిడి 2 రకాలుగా జరుగుతుంది.
వాయుకోశాల్లోని వ్యాపన త్వచం శల్కల ఉపకళ, వాయుకోశ కేశనాళికల అంతరస్తరం, వాటి
మధ్యన ఉండే ఆధారత్వచం వల్ల ఏర్పడుతుంది.

బాహ్యశ్వాసక్రియ / పుపుస వాయువుల మార్పిడి: వాయుకోశాల్లోని వాయువులు, పుపుస కేశనాళికల PO2, PCO2 వ్యత్యాసాలు; వాయుకోశాల నుంచి O2ను పుపుస రక్తకేశనాళికల్లోని రక్తంలోకి, పుపుస కేశనాళికల రక్తం నుంచి CO2 ను వాయుకోశంలోకి వ్యాపనం చెందడానికి దోహదపడతాయి.
అంతర శ్వాసక్రియ / దైహిక వాయుమార్పిడి: దైహిక కేశనాళికల్లోని హెచ్చు PO2, కణజాలాల్లోని తక్కువ PO2, కణజాలాల్లోకి O2ని; కణజాలాల నుంచి రక్తంలోకి CO2 వ్యాపనం చెందడానికి దోహదపడతాయి.

VI. రక్తం ద్వారా వాయువుల రవాణా 
ఆక్సిజన్ రవాణా: సాధారణ పరిస్థితుల్లో ప్రతి 100 మి.లీ. ఆమ్లజనియుత రక్తం కణజాలాలకు 5 మి.లీ. ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంది.
ఎ) ప్లాస్మా ద్వారా (3%): సుమారు 3 శాతం ఆక్సిజన్ రక్తంలోని ప్లాస్మాలో కరిగిన స్థితిలో రవాణా చెందుతుంది.
బి) RBC ద్వారా (97%): రక్తంలోని ఎర్ర రక్తకణాలు సుమారు 97 శాతం ఆక్సిజన్‌ను రవాణా చేస్తాయి. ఎర్ర రక్తకణాల్లో హిమోగ్లోబిన్ అనే ఇనుమును కలిగిన ఎరుపు రంగు వర్ణకం ప్రధాన వాహకంగా ఉంటుంది. ప్రతి హిమోగ్లోబిన్ అణువు నాలుగు ఆక్సిజన్ అణువులను రవాణా చేయగలుగుతుంది. ఊపిరితిత్తుల్లో O2 పాక్షిక పీడనం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆక్సిజన్ రక్తంలోకి ప్రవేశించి హిమోగ్లోబిన్‌తో బంధితమై ముదురు ఎరుపు రంగు పదార్థమైన ఆక్సీహిమోగ్లోబిన్‌ను ఏర్పరుస్తుంది (ఆమ్లజనీకరణం).
          Hb + 4 O2  ⇌  Hb (O2)4   
       కణజాలాల్లో O2 పాక్షికపీడనం తక్కువగా ఉంటుంది. కాబట్టి ఆక్సీహిమోగ్లోబిన్ వియోగం చెంది ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంది. ఈ ఆక్సిజన్ కణాల్లోకి వ్యాపనం చెందుతుంది.

        ఆక్సిజన్ రక్తం ద్వారా ప్రయాణించడానికి CO2 పాక్షికపీడనం, హైడ్రోజన్ అయాన్‌ల గాఢత (pH), రక్తం ఉష్ణోగ్రత ప్రభావితం చేస్తాయి.
ఆక్సిజన్ - హిమోగ్లోబిన్ వియోజన రేఖ: ఇది ఆక్సిజన్ పాక్షిక పీడనానికి, హిమోగ్లోబిన్ సంతృప్త శాతానికి మధ్య ఉండే సంబంధాన్ని తెలియజేస్తుంది. ఇది ఒక సిగ్మాయిడ్ రేఖ. ఇది హిమోగ్లోబిన్‌తో ఆక్సిజన్ బంధింపబడటంపై PCO2, H+  గాఢత, ఉష్ణోగ్రత లాంటి కారకాల ప్రభావాన్ని పరిశీలించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. వాయుకోశాల్లో PO2 అధికంగా, PCO2 తక్కువగా, pH అధికంగా, ఉష్ణోగ్రత తక్కువగా ఉండటం వల్ల ఆక్సీహిమోగ్లోబిన్ ఏర్పడటానికి అనుకూలంగా ఉంటుంది.     
కణజాలాల్లో PO2 తక్కువగా, PCO2 ఎక్కువగా, pH తక్కువగా, అధిక ఉష్ణోగ్రత ఉండటం వల్ల ఆక్సీహిమోగ్లోబిన్ వియోజనం చెంది ఆక్సిజన్ విడుదల కావడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ఆక్సిజన్ వియోజన వక్రరేఖ కుడివైపునకు విస్థాపన చెందుతుంది.

ఆక్సిజన్ - హిమోగ్లోబిన్‌ల అనుబంధంపై PCO2,  (pH) గాఢతల ప్రభావాన్ని బోర్ ప్రభావం అంటారు.
కార్బన్‌డయాక్సైడ్ రవాణా: COమూడు రకాలుగా రవాణా చెందుతుంది.
ఎ) ద్రావణస్థితిలో (7%): ప్లాస్మాలో కరిగి ద్రావణస్థితిలో కొంచెం CO2 రవాణా చెందుతుంది.
     CO2 + H2O ⇌  H2CO3 (కార్బోనిక్ ఆమ్లం)
బి) కార్బమైనో సంయోగ పదార్థాలుగా (20 - 25%): కొంత CO2 హిమోగ్లోబిన్‌లోని అమైనో సముదాయంతో కలవడం వల్ల కార్బమైనో హిమోగ్లోబిన్ ఏర్పడుతుంది. ఊపిరితిత్తుల్లో PCO2 తక్కువగా ఉండటం వల్ల కార్బమైనో హిమోగ్లోబిన్ నుంచి CO2 విడుదలవుతుంది.
     CO2 + Hb ⇌ కార్బమైనో హిమోగ్లోబిన్
సి) బైకార్బొనేట్‌గా (70%): మొదట CO2 కణజాలాల నుంచి రక్తంలోకి వ్యాపనం చెందుతుంది. తర్వాత ఎర్రరక్తకణాల్లోకి ప్రవేశించి, దానిలోని జీవపదార్థంతో కలిసి కార్బొనిక్ ఆమ్లాన్ని ఏర్పరస్తుంది. ఈ చర్య ప్లాస్మాలో నిదానంగా జరుగుతుంది. అయితే RBC లో కార్బొనిక్ ఎన్‌హైడ్రేజ్ ప్రభావం వల్ల 5000 సార్లు హెచ్చుస్థాయిలో వేగంగా జరుగుతుంది. కార్బొనిక్ ఆమ్లం కార్బొనిక్ ఎన్‌హైడ్రేజ్ ఎంజైమ్ ప్రభావం వల్ల H+, HCO3 గా వియోజనం చెందుతుంది. RBC ప్లాస్మాత్వచం కేటయాన్ల వ్యాపనానికి ప్రతికూలంగా, ఆనయాన్ల వ్యాపనానికి అనుకూలంగా ఉంటుంది. RBC లో HCO3- అయాన్ల సంఖ్య పెరిగేకొద్ది, అవి ప్లాస్మాలోకి వ్యాపనం చెందుతాయి. అయాన్ల సమతాస్థితిని నెలకొల్పడానికి, RBC నుంచి బయటికి వచ్చిన ప్రతి బై కార్బొనేట్ అయాన్‌కు ఒక క్లోరైడ్ అయాన్ RBC లోకి వ్యాపనం చెందుతుంది. ఈవిధంగా RBC, ప్లాస్మా మధ్య జరిగే క్లోరైడ్, బైకార్బొనేట్ అయాన్ల వినిమయాన్ని క్లోరైడ్ విస్థాపం లేదా హాంబర్గర్ దృగ్విషయం అంటారు.

H+ అయాన్ హిమోగ్లోబిన్‌తో కలిసి HHb (ఆమ్ల హిమోగ్లోబిన్)ని ఏర్పరుస్తుంది. దీనిలో హిస్టిడిన్ అనే అమైనోఆమ్లం అధికంగా ఉండటం వల్ల ఇది 'బఫర్' గా పనిచేస్తుంది.


          
     ఊపిరితిత్తుల్లో హిమోగ్లోబిన్ ఆక్సిజన్‌తో నిండి ఉండటం వల్ల దాని బంధం  పట్ల తగ్గుతుంది. దాంతో HHb వియోజనం చెందుతుంది. క్లోరైడ్ విస్థాపనం వ్యతిరేక దిశలో జరగడం వల్ల  RBC లోకి ప్రవేశించి  అయాన్లతో కలిసి H2CO3 గా ఏర్పడుతుంది. ఇది CO, H2O గా విడిపోతుంది. CO2, కొంత నీరు వాయుకోశాల్లోకి వ్యాపనం చెందుతాయి.
హిమోగ్లోబిన్‌తో ఆక్సిజన్ బంధం ఏర్పరచుకోవడం వల్ల రక్తంలో CO2 స్థానభ్రంశం చెందుతుంది.
దీన్ని హాల్డేన్ ప్రభావం అంటారు.

VII. శ్వాస కదలిక నియంత్రణ

    శ్వాస లయలు మెదడులో ఉండే మజ్జాముఖంలోని 'శ్వాస లయ జనక కేంద్రం' నియంత్రణలో ఉంటాయి. పాన్స్‌లోని 'న్యూమోటాక్సిక్ కేంద్రం' శ్వాస లయ బద్ధ కేంద్రాన్ని నియంత్రిస్తూ ఉంటుంది. ఈ కేంద్ర నాడీ సంకేతాలు నిచ్ఛ్వాస అవధిని తగ్గిస్తాయి. శ్వాస లయ కేంద్రం పక్కన రసాయన జ్ఞానప్రాంతం ఉంటుంది. ఇది CO2, హైడ్రోజన్ అయాన్లకు సున్నితత్వాన్ని కలిగి ఉంటుంది. ఇవి ఎక్కువైనప్పుడు ఈ కేంద్రం చైతన్యవంతమై శ్వాసలయ బద్ధ కేంద్రానికి సంకేతాలను పంపి శ్వాసప్రక్రియను సవరిస్తుంది.
 మహాధమని చాపం, కారోట ధమనులపై ఉండే రసాయన గ్రాహకాలు CO2, రక్త pH ల గురించి సంకేతాలను శ్వాసలయ కేంద్రానికి పంపి శ్వాసరేటును సవరిస్తాయి.

VIII. శ్వాసవ్యవస్థ అపస్థితులు 

1) బ్రాంకైటిస్: శ్వాసనాళికల్లో వాపు ఏర్పడటం వల్ల శ్వాసనాళికలోని శ్లేష్మస్తరం కూడా వాపునకు గురవుతుంది. దాంతో శ్లేష్మం ఉత్పత్తి అధికమై, శ్వాసనాళిక వ్యాసం తగ్గుతుంది. దీర్ఘకాలం దగ్గు, చిక్కటి శ్లేష్మం (కఫం) ఉత్పత్తి కావడం బ్రాంకైటిస్ ప్రధాన లక్షణం.
2) ఉబ్బసవ్యాధి (ఆస్తమా): ఇది శ్వాసనాళం, శ్వాసనాళికల్లో వాపు ఏర్పడటం వల్ల వస్తుంది. దీనిలో శ్వాసనాళం, శ్వాసనాళికా గోడల్లోని నునుపు కండరాల్లో ఈడ్పు (Spasms) లాంటి లక్షణాలు కనిపిస్తాయి. దగ్గు, శ్వాసించడం కష్టంగా ఉండటం, ఈల లాంటి శబ్దం రావడం మొదలైనవి ప్రధాన లక్షణాలు. ఆస్తమాలో ఎలర్జీని కలగజేసే కారకాలు హిస్టమిన్, ఇతర పదార్థాలను విడుదల చేయడం వల్ల శ్వాసనాళాలు కుంచించుకుపోతాయి.


 

3) న్యుమోనియా: ఇది స్ట్రెప్టోకోకస్ న్యుమోనియే, వైరస్, ఫంగై లాంటివి ఊపిరితిత్తుల్లోకి సంక్రమించడం వల్ల వస్తుంది. ఊపిరితిత్తుల్లో వాపు, వాయుకోశాల్లో శ్లేష్మం చేరడం, వాయువుల వినిమయం తగ్గడం లాంటివి దీని లక్షణాలు.


4) ఎంఫైసీమా: ఇది ఒక దీర్ఘరుగ్మత. దీనిలో వాయుకోశ గోడలు దెబ్బతిని శిథిలమవుతాయి. ఫలితంగా వాయువుల వినిమయం జరిగే శ్వాసతలం తగ్గుతుంది. ఊపిరితిత్తులు పెద్దగా మారి, వాయుకోశాలు తగ్గి, అధిక తంతుయుత కణజాలాన్ని, తక్కువ స్థితిస్థాపకతను కలిగి ఉంటాయి. దీనికి ముఖ్యకారణం పొగతాగడం.    
దీర్ఘకాలం ఆటంకం కలిగించే ఊపిరితిత్తి వ్యాధులు (COPD's)
ఎంఫైసీమా, దీర్ఘకాల బ్రాంకైటిస్, ఆస్తమా.

IX. వృత్తిపర శ్వాస రుగ్మతలు 

Posted Date : 02-08-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని

విద్యా ఉద్యోగ సమాచారం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌