• facebook
  • twitter
  • whatsapp
  • telegram

నాడీ నియంత్రణ, సమన్వయం

ప్ర‌శ్న‌లు - జ‌వాబులు

రెండు మార్కుల ప్రశ్నలు

1. మానవ మెదడును కప్పి ఉంచే రక్షణ పొరల పేర్లు తెలపండి.

జ: మానవ మెదడు మూడు సంయోజక కణజాలపు పొరలతో కప్పి ఉంటుంది. ఈ పొరలను కలిపి మెనింజెస్‌ అంటారు.

అవి: 1) వరాశిక         2) లౌతికళ         3) మృద్వ

2. కార్పస్‌కెల్లోసమ్‌ అంటే ఏమిటి?

జ: మెదడులో మస్తిష్కార్ధ గోళాలు రెండింటినీ కలుపుతూ వల్కలం కిందుగా బల్లపరుపు మయలిన్‌ సహిత నాడీ పట్టీ ఉంటుంది. దీన్ని కార్పస్‌కెల్లోసం అంటారు.

3. పూర్ణ లేదా శూన్య అనుక్రియ అంటే ఏమిటి?

జ: ప్రేరణ బలం త్రెషోల్డ్‌ కంటే తక్కువగా ఉన్నప్పుడు, నాడీకణంలో క్రియాశక్మం ఏర్పడదు. ప్రేరణ బలం త్రెషోల్డ్‌ స్థాయిలో లేదా అంతకంటే ఎక్కువగా ఉన్నప్పుడు నాడీకణంలో క్రియాశక్మం ఏర్పడుతుంది. దీన్నే పూర్ణ లేదా శూన్య అనుక్రియ అంటారు.

4. కోర్టి అంగం అంటే ఏమిటి?

జ: కర్ణావర్తనం ఉపకళ బేసిల్లార్‌ త్వచంపై ఒక జ్ఞానగట్టును ఏర్పరుస్తుంది. దీన్ని కోర్టి అంగం అంటారు.

5. అంధ చుక్క, ప‌సుపు చుక్క మ‌ధ్య భేదం ఏమిటి?

నాలుగు మార్కుల ప్రశ్నలు

1. మానవ వెన్నుపాము అడ్డుకోత చక్కటి పటం గీసి, భాగాలను గుర్తించండి. 

జ:

 

2. మాన‌వుడి కంటిలోని నేత్ర‌ప‌ట‌లం (రెటీనా) గురించి రాయండి.

జ‌. నేత్ర ప‌ట‌లం, నేత్ర గోళంలోని లోపలి పొర‌. దీనిలో వ‌ర్ణ‌యుత ఉప‌క‌ళ, నాడీ ప్రాంతం అనే రెండు భాగాలుంటాయి. వ‌ర్ణ‌యుత ఉప‌క‌ళ ఒక మెల‌నిన్ ఆచ్ఛాదం. నాడీ ప్రాంతంలో మూడు పొర‌లుంటాయి. అవి కాంతి గ్రాహ‌క‌స్త‌రం, ద్విధ్రువ క‌ణ‌స్త‌రం, నాడీ సంధి క‌ణ‌స్త‌రం.

కాంతి గ్రాహ‌క‌స్త‌రంలో దండ క‌ణాలు, శంకు క‌ణాలు అనే రెండు ర‌కాల కాంతి గ్రాహ‌కాలు ఉంటాయి. దండ క‌ణాల్లో విట‌మిన్‌-ఎ ఉత్ప‌న్న‌మైన రోడాప్సిన్ ఉంటుంది. ఇది మ‌స‌క చీక‌టిలో దృష్టికి ఉప‌యోగ‌ప‌డుతుంది. శంకు క‌ణాల్లో అయోడాప్సిన్ అనే దృశ్య వ‌ర్ణ ద్ర‌వ్యం ఉంటుంది. ఇది ఫోటాప్సిన్ అనే ప్రోటీన్ నిర్మితం. శంకు క‌ణాలు ప‌గ‌టిపూట దృష్టికి, రంగులు గుర్తించ‌డానికి ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ఇవి ఎరుపు, నీలం, ఆకుప‌చ్చ వ‌ర్ణాల‌ను గుర్తిస్తాయి.  

నేత్ర‌ప‌ట‌లం ప‌రాంత మ‌ధ్య భాగాన్ని ప‌సుపు చుక్క అంటారు. ప‌సుపు చుక్క మ‌ధ్య భాగంలో ఉండే చిన్న లోతైన ప్ర‌దేశాన్ని 'ఫోవియా సెంట్రాలిస్' అంటారు. దీనిలో శంకు క‌ణాలు మాత్ర‌మే ఉంటాయి. ఇవి న‌డిచేట‌ప్పుడు, చ‌దివేటప్పుడు, వాహ‌నాన్ని న‌డిపేట‌ప్పుడు తీక్ష‌ణ దృష్టికి తోడ్ప‌డ‌తాయి. నేత్ర‌ప‌ట‌లం, నేత్ర‌నాడి క‌లిసే ప్రాంతాన్ని అంధ‌చుక్క అంటారు. ఈ ప్రాంతంలో ఏ విధ‌మైన కాంతి గ్రాహ‌కాలు ఉండ‌వు. అందువ‌ల్ల ఈ ప్ర‌దేశంలో ప్ర‌తిబింబాలు ఏర్ప‌డవు.

 

8 మార్కుల ప్రశ్న

1.    మానవ మెదడు నిర్మాణం, విధులను గురించి సంక్షిప్త వివరణ రాయండి.

జ:    మెదడు సమాచార విశ్లేషణ, నియంత్రణ కేంద్రం. ఇది కపాల కుహరంలో భద్రపరచబడి, మూడు సంయోజక కణజాల పొరలు లేదా కపాల పొరలతో కప్పి ఉంటుంది. అవి వరాశిక, లౌతికళ, మృద్వి. ఈ రక్షణ పొరలన్నింటిని కలిపి ‘మెనింజస్‌’ అంటారు.

మెద‌డులో 3 భాగాలుంటాయి. అవి

 I. పూర్వ మెదడు

 II. మ‌ధ్య మెద‌డు

 III. అంత్య మెద‌డు

I. పూర్వ మెదడు: ఇందులో ఘ్రాణలశునం, మస్తిష్కం, ద్వారగోర్ధం అనే 3 భాగాలుంటాయి.

i) ఘ్రాణలశునం: ఇవి గదాకార నిర్మాణాలు. వాసనను గ్రహిస్తాయి.

ii) మస్తిష్కం: మెదడులో ఎక్కువ భాగం మస్తిష్కం ఆక్రమిస్తుంది. ‘ఆయతవిదరం’ దీన్ని నిలువుగా కుడి, ఎడమ మస్తిష్కార్ధ గోళాలుగా విభజిస్తుంది. రెండు మస్తిష్కార్ధ గోళాలను కలుపుతూ మయలిన్‌ సహిత అడ్డునాడీ పట్టీ ఉంటుంది. దీన్ని ‘కార్పస్‌ కెల్లోసమ్‌’ అంటారు. ఇది రెండు మస్తిష్కార్ధ గోళాల మధ్య సమన్వయాన్ని చేకూరుస్తుంది. మస్తిష్కం ఉపరితలంలో బూడిద వర్ణంలో ఉన్న ప్రాంతాన్ని మస్తిష్క వల్కలం అంటారు. మస్తిష్క వల్కలంలో నాడీకణ దేహాలు సాంద్రీకరించబడతాయి.

    మస్తిష్క వల్కలం ఉపరితలంలో అనేక మడతలు, గాడులు ఉంటాయి. ఈ మడతలను ‘గైరి’ అని, గాడులను ‘సల్సి’ అని అంటారు. గైరి, సల్సిలు మస్తిష్క వల్కలం ఉపరితల వైశాల్యాన్ని అధికం చేస్తాయి.

    మస్తిష్క వల్కలంలో జ్ఞాన, చాలక, అనుబంధ ప్రదేశాలు క్రియాత్మకంగా ఉంటాయి.

ఎ) జ్ఞాన ప్రదేశాలు: జ్ఞాన ప్రచోదనాల స్వీకరణ, విశ్లేషణ

బి) చాలక ప్రదేశాలు: అనియంత్రిత కండరాల కదలికల నియంత్రణ.

సి) అనుబంధ ప్రదేశాలు: ఇవి అత్యంత సంక్లిష్టమైన జ్ఞాపకశక్తి, సమాచార కేంద్రంగా పనిచేస్తాయి.

   మస్తిష్క దవ్వలో మయలిన్‌ సహిత తంత్రికాక్షాలు ఉంటాయి. అందువల్ల మస్తిష్క దవ్వ తెల్లగా ఉంటుంది. ప్రతి మస్తిష్కార్ధ గోళం 4 లంబికలుగా విభజితమై ఉంటుంది. అవి పూర్వ లంబిక, పార్శ్వ లంబిక, శంఖ లంబిక, అనుకపాల లంబిక.

iii) ద్వారగోర్ధం: పూర్వ మెదడులో పరభాగమే ద్వారగోర్ధం. దీనిలో ఊర్థ్వ పర్యంకం, పర్యంకం, అధోః పర్యంకం అనే 3 ప్రధాన భాగాలుంటాయి.

ఎ) ఊర్థ్వ పర్యంకం: ద్వారగోర్ధం పైకప్పును ఊర్థ్వ పర్యంకం అంటారు. దీనిలో నాడీ రహిత భాగం వరాశికతో కలిసి పూర్వ రక్త ప్లక్షాన్ని ఏర్పరుస్తుంది. పూర్వ రక్త ప్లక్షం వెనుక భాగంలో ఊర్థ్వ పర్యంకంపై ‘‘పీనియల్‌ వృంతం’’, దాని చివర గుండ్రటి పీనియల్‌ గ్రంథి ఉంటాయి.

బి) పర్యంకం: మధ్య మెదడుకు పై స్థానంలో పర్యంకం ఉంటుంది. ఇది జ్ఞాన, చాలక ప్రచోదనాల సమన్వయ కేంద్రంగా పనిచేస్తుంది.

సి) అధోఃపర్యంకం: పర్యంకం ఉదర ఆధార కుడ్యాన్ని అధోఃపర్యంకం అంటారు. అధోఃపర్యంకం కింది వైపు ఒక గరాటు లాంటి కాలాంచిక ఉంటుంది. దీని చివరలో పీయూష గ్రంథి ఉంటుంది. అధోఃపర్యంకంలో అనేక నాడీస్రావక కణాలుంటాయి. ఇవి అధోఃపర్యంక హార్మోన్‌లను స్రవిస్తాయి. అధోఃపర్యంకం స్వయం చోదిత నాడీ వ్యవస్థ నియంత్రణ, సమన్వయ కేంద్రంగా పనిచేస్తూ ద్రవాభిసరణ, ఉష్ణనియంత్రణ, ఆకలి, దప్పిక, తృప్తి లాంటి చర్యలను సమన్వయం చేస్తుంది.

II. మధ్య మెదడు: ఇది అధోఃపర్యôకం, పాన్స్‌వెరోలి మధ్య ఉంటుంది. మధ్యమెదడు ఉదరతలంలో ఒక జత ఆయత నాడీ తంతువుల పట్టీలు ఉంటాయి. వీటిని ‘‘సెరిబ్రల్‌ - పెడన్‌కుల్స్‌’’ అంటారు. ఇది మస్తిష్కార్ధ గోళాలను పాన్స్‌వెరోలితో కలుపుతాయి. మధ్య మెదడు పృష్టభాగంలో నాలుగు లంబికలు ఉండే కార్పొరా క్వాడ్రిజమైనా అనే నిర్మాణం ఉంటుంది. దీని పూర్వాంతంలో పెద్దగా ఉండే రెండు లంబికలను సుపీరియర్‌ కాలిక్యులి అని, పరాంతంలో చిన్నవిగా ఉండే రెండు లంబికలను ఇన్‌ఫీరియర్‌ కాలిక్యులి అని అంటారు. ఇవి దృష్టి, శ్రవణ విధులను నియంత్రిస్తాయి.

III. అంత్య మెదడు: దీనిలో అనుమస్తిష్కం, పాన్స్‌వెరోలి, మజ్జా ముఖం అనే భాగాలుంటాయి. 

a) అనుమస్తిష్కం: ఇది మెదడులో రెండో అతిపెద్ద భాగం. దీనిలో రెండు అనుమస్తిష్కార్ధ గోళాలు, మధ్య భాగంలో వర్మిస్‌ ఉంటాయి. ప్రతి అనుమస్తిష్కార్ధ గోళంలో 3 లంబికలుంటాయి. అవి పూర్వాంత లంబిక, పరాంత లంబిక, ఫ్లాక్యులార్‌ లంబిక. అనుమస్తిష్కంలో ఉండే తెలుపు వర్ణ పదార్థం అనేక శాఖలుగా, చెట్టులా ఉంటుంది. దీన్ని ‘‘ఆర్బోర్‌ విటే’’ అంటారు. దీని చుట్టూ బూడిద వర్ణ పదార్థం ఒక పొరలాగా అమరి ఉంటుంది.

b) పాన్స్‌వెరోలి: ఇది అనుమస్తిష్కానికి ముందుగా, మజ్జాముఖానికి వెనుకగా, మధ్య మెదడు కింద ఉంటుంది. దీనిలోని నాడీ తంతువులు ఇరువైపులా అనుమస్తిష్కార్ధ గోళాల మధ్య ఒక వంతెన లాగా ఏర్పడి ఉంటాయి. ఇది అనుమస్తిష్కానికి, వెన్నుపాముకు, మెదడులోని మిగతా భాగాలన్నింటికి మధ్య ఒక పునఃప్రసార కేంద్రంగా పనిచేస్తుంది. పాన్స్‌వెరోలిలోని న్యూమోటాక్సిక్‌ కేంద్రం శ్వాస కండరాల కదలికలను నియంత్రించి, తద్వారా ఉచ్ఛ్వాస ప్రక్రియలో ఒక వ్యక్తి పీల్చే వాయువుల ఘనపరిమాణాన్ని క్రమపరుస్తుంది.

c) మజ్జాముఖం: ఇది మెదడు పరాంత భాగం. పాన్స్‌వెరోలి వద్ద ప్రారంభమై వెన్నుపాముగా కొనసాగుతుంది. దీనిలో పరాంత ప్లక్షం ఉంటుంది. హృదయ స్పందన, శ్వాసక్రియ, మింగడం, వాంతి, దగ్గు, తుమ్ము, వెక్కిళ్లు మొదలైన వాటి నియంత్రణ కేంద్రాలు మజ్జాముఖంలో ఉంటాయి.

* మధ్య మెదడు, పాన్స్‌వెరోలి, మజ్జాముఖాలను కలిపి ‘మెదడు మూలం’ అంటారు.

Posted Date : 02-08-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని

విద్యా ఉద్యోగ సమాచారం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌