• facebook
  • twitter
  • whatsapp
  • telegram

అంతస్రావక వ్యవస్థ, రసాయన సమన్వయం

 ప్ర‌శ్న‌లు - జ‌వాబులు 

నాలుగు మార్కుల ప్రశ్నలు

1. పిట్యూటరీ గ్రంథి స్రావకాల గురించి వివరించండి.

జ: పిట్యూటరీ గ్రంథిని పూర్వ పిట్యూటరీ, పర పిట్యూటరీగా విభజించవచ్చు.

పూర్వ పిట్యూటరీ: ఇది ఆరు రకాల హార్మోన్‌లను స్రవిస్తుంది.

పెరుగుదల హార్మోన్‌: ఇది అస్థికణాల విభజనను ప్రేరేపించి, ఎముకలు పొడవుగా అయ్యేలా చేస్తుంది. తద్వారా దేహ పెరుగుదలకు తోడ్పడుతుంది.

ప్రొలాక్టిన్‌: ఇది స్త్రీలలో క్షీరగ్రంథుల పెరుగుదలకు, క్షీరోత్పత్తికి తోడ్పడుతుంది.

థైరాయిడ్‌ ప్రేరక హార్మోన్‌: ఇది థైరాయిడ్‌ గ్రంథిని ప్రేరేపిస్తుంది.

ఎడ్రినోకార్టికో ట్రోఫిక్‌ హార్మోన్‌: ఇది అధివృక్క గ్రంథి వల్కలాన్ని ప్రేరేపిస్తుంది.

పుటికా ప్రేరక హార్మోన్‌: ఇది స్త్రీలలో స్త్రీ బీజకోశ పుటికల పెరుగుదలను ప్రేరేపిస్తుంది. పురుషుల్లో శుక్రజననాన్ని నియంత్రిస్తుంది.

ల్యూటినైజింగ్‌ హార్మోన్‌: ఇది పురుషుల ముష్కాలను ప్రేరేపించి, ఆండ్రోజెన్‌ హార్మోన్‌ల విడుదలకు దోహదం చేస్తుంది. స్త్రీలలో స్త్రీబీజ కోశాలను ప్రేరేపించి ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్‌ హార్మోన్‌లను ఉత్పత్తి చేస్తుంది.

పరపిట్యూటరీ: ఇది రెండు హార్మోన్‌లను విడుదల చేస్తుంది.

ఆక్సిటోసిన్‌: స్త్రీలలో ప్రసవ సమయంలో గర్భాశయ కండరాల సంకోచానికి, ప్రసవం తర్వాత క్షీరోత్పత్తికి సహాయపడుతుంది.

వాసోప్రెస్సిన్‌: మూత్రపిండాలపై పనిచేసి, నీటి పునఃశోషణలో తోడ్పడుతుంది.

2. పిట్యూటరీ కుబ్జులు, థైరాయిడ్‌ మరుగుజ్జులను తులనాత్మకంగా వివరించండి.

జ: పిట్యూటరీ కుబ్జులు

* శిశువుల్లో పెరుగుదల హార్మోన్‌ లోపించడం వల్ల పెరుగుదల నిలిచిపోయి, అసాధారణంగా పొట్టిగా ఉంటారు. వీరినే పిట్యూటరీ కుబ్జులు అంటారు.

* వీరు లైంగికంగా, మేధోపరంగా సాధారణ మానవుల్లాగే ఉంటారు.

థైరాయిడ్‌ మరుగుజ్జులు

* గర్భం దాల్చిన స్త్రీలలో థైరాయిడ్‌ హార్మోన్‌ల ఉత్పత్తి తక్కువగా ఉన్నప్పుడు గర్భస్థ శిశువులో అభివృద్ధి లోపిస్తుంది. ఇలాంటి శిశువులను థైరాయిడ్‌ మరుగుజ్జులు అంటారు.

* పుట్టుకతోనే థైరాయిడ్‌ హార్మోన్‌ లోపించడం వల్ల పెద్దతల, పొట్టి కాళ్లు, బయటకు పొడుచుకువచ్చిన నాలుక, శారీరక మందకొడితనం, పొడిచర్మం, అల్పబుద్ధి నిష్పత్తి లాంటి లక్షణాలు కనిపిస్తాయి.

3. శరీరంలో హైపోథైరాయిడిజమ్, హైపర్‌ థైరాయిడిజమ్‌ ఎలాంటి ప్రభావం చూపుతాయో వివరించండి.

జ: హైపో థైరాయిడిజం: ఆహారంలో అయోడిన్‌ లోపం వల్ల థైరాయిడ్‌ గ్రంథి ఉబ్బి, థైరాక్సిన్‌ ఉత్పత్తి తగ్గిపోతుంది. ఈ లక్షణాన్ని హైపోథైరాయిడిజం అంటారు. దీన్నే సరళ గాయిటర్‌ అని కూడా అంటారు. గర్భిణిల్లో ఈ స్థితి ఏర్పడితే గర్భస్థ శిశువులో అభివృద్ధి లోపించి, క్రెటినిజం అనే అపస్థితి ఏర్పడుతుంది. దీనివల్ల పెరుగుదల లోపం, మానసిక మాంద్యం, అల్పబుద్ధి నిష్పత్తి, చెవిటి, మూగ లాంటి లక్షణాలు కలుగుతాయి. ప్రౌఢ మానవుల్లో ‘మిక్సిడిమా’ అనే అసాధారణ స్థితి ఏర్పడుతుంది. ఈ స్థితిలో మానసిక, శారీరక మందకొడితనం, ఉబ్బిన ముఖం, పొడిచర్మం లాంటి లక్షణాలు ఏర్పడతాయి.

హైపర్‌ థైరాయిడిజం: థైరాయిడ్‌ గ్రంథి అతి క్రియాశీలత లేదా క్యాన్సర్‌ లేదా గ్రంథిలో కణుతుల వల్ల థైరాక్సిన్‌ హార్మోన్‌ అధికంగా ఉత్పత్తి అవుతుంది. ఈ లక్షణాన్ని హైపర్‌ థైరాయిడిజం అంటారు.  ఈ స్థితిలో జీవక్రియా రేటు పెరుగుతుంది. కంటి వెనక కణజాలంలో ద్రవం చేరడం వల్ల కళ్లు ఉబ్బి, ముందుకు పొడుచుకుని వస్తాయి. ఈ స్థితిని ఎక్సాప్తాల్మిక్‌ గాయిటర్‌ అంటారు.

* హైప‌ర్ థైరాయిడిజ‌మ్ స్థితిలో హృద‌య స్పంద‌న రేటు పెరుగుతుంది.

* చివ‌ర‌కు న‌రాల బ‌ల‌హీన‌త‌, అధికంగా చెమ‌ట ప‌ట్ట‌డం లాంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి

4. అడిస‌న్స్ వ్యాధి, కుషింగ్ సిండ్రోమ్‌ల గురించి రాయండి. 

జ‌. అడిస‌న్స్ వ్యాధి: అడ్రిన‌ల్ వ‌ల్క‌లం స్ర‌వించే గ్లూకోకార్టికాయిడ్‌ల అల్పోత్ప‌త్తి వ‌ల్ల అడిస‌న్స్ వ్యాధి క‌లుగుతుంది. ఈ వ్యాధిగ్ర‌స్తుల్లో చ‌ర్మంపై కంచువ‌ర్ణ మ‌చ్చ‌లు ఏర్ప‌డ‌తాయి. అంతేకాకుండా బ‌రువు కోల్పోవ‌డం, కండ‌రాల బ‌ల‌హీన‌త, కండ‌ర అల‌స‌ట, ర‌క్తపీడ‌నం త‌గ్గిపోవ‌డం లాంటివి సంభ‌విస్తాయి. వ్యాధిగ్ర‌స్తుడు ఒత్తిడికి ప్ర‌తి స్పందించ‌లేడు.

కుషింగ్ సిండ్రోమ్‌: అడ్రిన‌ల్ వ‌ల్క‌లం స్ర‌వించే కార్టిసాల్‌/ ఇతర గ్లూకోకార్టికాయిడ్‌ల అధికోత్ప‌త్తి వ‌ల్ల కుషింగ్ సిండ్రోమ్ అనే అప‌స్థితి క‌లుగుతుంది. ఇందులో కండ‌ర ప్రోటీన్‌ల విచ్ఛిత్తి జ‌రిగి కండ‌రాలు బ‌ల‌హీనప‌డ‌తాయి. ముఖం, అంగాలు, వీపు ప్రాంతాల్లో కొవ్వు నిక్షిప్త‌మ‌వుతుంది. అందువ‌ల్ల ముఖం చంద్ర‌బింబాకారంలో, అంగాలు క‌దురు ఆకృతిలోకి మార‌తాయి. వీపుపై మూపురం, డోల‌న ఉద‌రం మొద‌లైన ల‌క్ష‌ణాలు కూడా క‌నిపిస్తాయి. ర‌క్తంలో కార్టిసాల్స్ స్థాయి పెరిగి కాలేయంలో అధిక గ్లైకోజ‌న్ నిక్షేప‌ణ‌లు ఏర్ప‌డ‌తాయి. దీని ఫ‌లితంగా అధిక శ‌రీర బ‌రువును పొందుతారు. 

రెండు మార్కుల ప్రశ్నలు

1. ఆక్రోమెగాలి అంటే ఏమిటి? ఈ అపస్థితిని కలగజేసే హార్మోన్‌ పేరు రాయండి.

జ: * ఆక్రోమెగాలి అనేది ఒక అపస్థితి. దీనిలో చేతులు, కాళ్లు, దవడ ఎముకలు, ముక్కు ఎముకల కొనలోని మృదులాస్థి అధికంగా పెరిగి, వారి ముఖం గొరిల్లా ముఖంలా కనిపిస్తుంది. 

    * ఇది మానవ పెరుగుదల హార్మోన్‌ అధికోత్పత్తి వల్ల కలుగుతుంది.

2. యాంటీ డైయూరిటిక్‌ హార్మోన్‌ అని దేన్ని అంటారు? దీన్ని స్రవించే గ్రంథి పేరు రాయండి.

జ: * వాసోప్రెస్సిన్‌ హార్మోన్‌ను యాంటీ డైయూరిటిక్‌ హార్మోన్‌ అంటారు.

    * పర పిట్యూటరీ గ్రంథి దీన్ని స్రవిస్తుంది.

3. బాల్యంలో పరిమాణంలో పెరుగుతూ, యుక్తవయసులో పరిమాణం తగ్గే గ్రంథి పేరేంటి? సంక్రమణ జరిగినప్పుడు ఈ గ్రంథి పోషించే పాత్ర ఏమిటి?

జ: థైమస్‌ గ్రంథి. ఇది థైమోసిన్‌ అనే హార్మోన్‌ను స్రవించి, T లింఫోసైట్‌ల ద్వారా ప్రతిదేహాలు ఏర్పడటంలో సహాయపడుతుంది.

4. డయాబెటిస్‌ ఇన్‌సిపిడస్, డయాబెటిస్‌ మెల్లిటస్‌ల మధ్య భేదాన్ని వివరించండి.

జ: డయాబెటిస్‌ ఇన్‌సిపిడస్‌: ఇది వాసోప్రెస్సిన్‌ హార్మోన్‌ లోపం వల్ల కలిగే అపసవ్యత. అధిక మూత్ర విసర్జన దీని లక్షణం. మూత్రం ద్వారా చక్కెర విడుదల కాదు.

    డయాబెటిస్‌ మెల్లిటస్‌: ఇది ఇన్సులిన్‌ హార్మోన్‌ లోపం వల్ల కలిగే అపసవ్యత. దీని వల్ల రక్తంలో గ్లూకోజ్‌ స్థాయి పెరుగుతుంది. మూత్రం ద్వారా గ్లూకోజ్‌ విసర్జన జరుగుతుంది.

5. ఇన్సులిన్‌ షాక్‌ అంటే ఏమిటి?

జ: ఇన్సులిన్‌ అధికోత్పత్తి వల్ల రక్తంలో గ్లూకోజ్‌ స్థాయి పడిపోతుంది. దీన్ని ఇన్సులిన్‌ షాక్‌ అంటారు.

6. పోరాట, పలాయన హార్మోన్‌లు అని వేటినంటారు?

జ: ఎపినెఫ్రిన్, నార్‌ఎపినెఫ్రిన్‌లను పోరాట, పలాయన హార్మోన్‌లు అంటారు. ఎందుకంటే ఇవి ఒత్తిడి, అత్యవసర పరిస్థితులను తట్టుకోవడానికి స్రవించబడతాయి.

7. ఎరిత్రోపాయిటిన్‌ అంటే ఏమిటి? దీని విధి ఏమిటి?

జ: * ఎరిత్రోపాయిటిన్‌ అనేది మూత్రపిండాలు స్రవించే ఒక పెప్టైడ్‌ హార్మోన్‌.

    * ఇది అస్థి మజ్జలో ఎర్ర రక్తకణాల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది.

Posted Date : 13-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని

విద్యా ఉద్యోగ సమాచారం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌