• facebook
  • twitter
  • whatsapp
  • telegram

రోగ నిరోధక వ్యవస్థ

ప్ర‌శ్న‌లు - జ‌వాబులు

నాలుగు మార్కుల ప్రశ్నలు
1. B-కణాల గురించి లఘుటీక రాయండి.
జ: B-కణాలు అంటే ఒక రకమైన లింఫోసైట్‌లు. వీటిని మొదట పక్షుల్లోని ‘బర్సా ఫాబ్రిసియస్‌’ అనే భాగాల్లో కనుక్కోవడం వల్ల తీకణాలు అంటారు. ఇవి అస్థిమజ్జ కాండ కణాల నుంచి ఏర్పడతాయి. క్షీరదాల్లో అస్థిమజ్జ, భ్రూణపు కాలేయంలోనూ పరిణతి చెంది B-కణాలుగా ఏర్పడతాయి. ఇవి లింఫాయిడ్‌ అవయవాల్లో క్రియాశీల B-కణాలుగా మారతాయి. తర్వాత ఇవి ప్లాస్మా కణాలు, జ్ఞప్తి కణాలుగా మారతాయి. ప్లాస్మా కణాలు ప్రతిజనకాలకు వ్యతిరేకంగా ప్రతిదేహాలను ఉత్పత్తి చేస్తాయి. జ్ఞప్తి కణాలు కొన్ని దశాబ్దాల వరకు జీవించి ఉంటాయి. అదే ప్రతిజనకం రెండోసారి దేహంలోకి ప్రవేశించినప్పుడు ఇవి స్పందిస్తాయి. B-కణాలు ముఖ్యంగా హ్యూమోరల్‌ లేదా దేహద్రవ నిర్వర్తిత రోగనిరోధకతలో పాల్గొంటాయి.

 

2. ఇమ్యునోగ్లోబ్యులిన్స్‌ గురించి లఘుటీక రాయండి.
జ:      వ్యాధిజనక జీవులకు లేదా ప్రతిజనకాలకు ప్రేరణగా B-లింఫోసైట్‌లు ప్రతిదేహాలు అనే ప్రొటీన్‌ అణువులను ఉత్పత్తి చేస్తాయి. వీటిని ఇమ్యునోగ్లోబ్యులిన్‌లు అంటారు. రోడ్నిపోర్టర్‌ అనే శాస్త్రవేత్త ప్రతిదేహ నిర్మాణాన్ని వివరించాడు. ఇది Y ఆకారపు అణువు. దీనిలో నాలుగు పాలీపెప్టైడ్‌ గొలుసులు ఉంటాయి. అందులో రెండు పొట్టి, తేలికపాటి గొలుసులు, మిగిలిన రెండు పొడవాటి భార గొలుసులు. ఈ రెండు ఒకదానిలో మరొకటి డైసల్ఫైడ్‌ బంధాలతో బంధితమై ఉంటాయి.
           ప్రతిదేహం ఒక చివరను Fab లేదా ప్రతిజనక బంధన ఖండం అంటారు. మరొక చివరను Fc లేదా కణబంధన ఖండం అంటారు. ప్రతిజనకాన్ని గుర్తించి, దానితో బంధితమయ్యే ప్రతిదేహ భాగాన్ని పారాటోప్‌ అంటారు. నిర్మాణాన్ని బట్టి ప్రతిదేహాలు IgG, IgA, IgM, IgE, IgD అని అయిదు రకాలు. Ig అంటే ఇమ్యునోగ్లోబ్యులిన్‌. వీటిలో IgG, IgD, IgE లు ఏకాణుక రూపాలుగానూ; IgA ద్విఅణుక రూపంలోనూ, IgM పంచ అణుక రూపంలోనూ ఉంటాయి.


                         

ఇమ్యూనోగ్లోబ్యులిన్ (ప్ర‌తిదేహం) నిర్మాణం

రెండు మార్కుల ప్రశ్నలు
1. ఏవైనా నాలుగు ఏక కేంద్రక ఫాగోసైట్‌ల (భక్షక కణాల) పేర్లు రాయండి.
జ: * కూఫర్‌ కణాలు - కాలేయంలో ఉంటాయి.
   * మైక్రోగ్లియల్‌ కణాలు - మెదడులో ఉంటాయి.
   *  ఆస్టియోక్లాస్ట్‌లు - ఎముకలో ఉంటాయి.
   * సైనోవియల్‌ కణాలు - సైనోవియల్‌ ద్రవంలో ఉంటాయి.

 

2. పెర్‌ఫోరిన్స్, గ్రాన్‌జైమ్స్‌ మధ్య భేదాలు తెలపండి.
జ: పెర్‌ఫోరిన్స్‌: సహజ హంతక కణాలు/ క్రియాశీలక Tc కణాలు పెర్‌ఫోరిన్‌లను విడుదల చేస్తాయి. ఇవి లక్ష్య కణత్వచాలకు రంధ్రాలు చేస్తాయి.
  గ్రాన్‌జైమ్స్‌: వీటిని కూడా సహజ హంతక కణాలు/ క్రియాశీలక Tc కణాలు విడుదల చేస్తాయి. పెర్‌ఫోరిన్‌లు చేసిన రంధ్రాల ద్వారా లక్ష్య కణాల్లోకి గ్రాన్‌జైమ్స్‌ ప్రవేశించి అపోప్‌టోసిస్‌ (ప్రణాళికాబద్ధ మరణం) ప్రారంభించి, నాశనం      చేస్తాయి.

 

3. పరిపూరక ప్రొటీన్‌లు అంటే ఏమిటి?
జ: ప్లాస్మాలో, కణత్వచ ఉపరితలంపై ఉండే అచేతన ప్రొటీన్‌లను పరిపూరక ప్రొటీన్‌లు అంటారు.

Posted Date : 02-08-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని

విద్యా ఉద్యోగ సమాచారం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌