• facebook
  • twitter
  • whatsapp
  • telegram

5. కర్మభూమిలో పూసిన ఓ పువ్వా!

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు
 

1. ‘కర్మభూమిలో పూసిన ఓ పువ్వా’ పాట ద్వారా కలేకూరి ప్రసాద్‌ వర్ణించిన స్త్రీల దుస్థితిని వివరించండి.
జ: దేశంలో కొత్త పెళ్లికూతుళ్ల కళ్లలోని ఆశలు నీరు కారిపోతున్నాయి. నవ వధువులు కట్నం మంటల్లో సమిధలు అవుతున్నారు. వారి పాదాల పారాణి ఆరకముందే, పెళ్లికి కట్టిన తోరణాలు వాడకముందే, పెళ్లిపందిరి తీయకముందే కొత్త పెళ్లికూతుళ్లు చనిపోతున్నారు.
   పెళ్లికి వచ్చిన బంధువులు వారి ఇళ్లకు వెళ్లకుండానే, మంగళవాయిద్యాలు మోగుతుండగానే, అప్పగింతలు పూర్తికాకుండానే కొత్త పెళ్లికూతుళ్లు శ్మశానానికి కాపురానికి వెళుతున్నారు. దేశంలో మానవత్వం నశించింది. ప్రేమబంధంగా స్త్రీల మెడలో కట్టిన తాళి ఉరితాడై వారిని కాటేస్తోంది. వారి బతుకును కారుమబ్బులు కమ్మేశాయి. కొత్త పెళ్లికూతుళ్లు చీకటి చితిలో శవాలుగా మారుతున్నారు.
   నరకం లాంటి సంఘంలో రాక్షసత్వం రాజ్యమేలుతుంది. నవ వధువులకు ఆడపడుచులు శత్రువులయ్యారు. అత్తల కళ్లలో నిప్పులు చెరుగుతున్నాయి. కొత్త పెళ్లికూతుళ్లు వరకట్న జ్వాలకు బలైపోతున్నారు. దేశంలో ఆడవారి కంటే అడవిలో చెట్టుకు విలువ ఇస్తున్నారు. స్త్రీలు అత్తవారింటికి వెళ్లగానే ఆడపడుచుల ఆరళ్లు మొదలవుతున్నాయి. కోడళ్లను బాధించే అత్తలకు కూడా గర్భశోకం తప్పడం లేదు. పిశాచాల లాంటి అత్తమామల ఆనందం కోసం కొత్త పెళ్లికూతుళ్ల హత్యలు అనే మారణహోమం దేశంలో సాగుతోంది. స్త్రీల జీవనరాగం ఆర్తనాదమైంది. వారి కళ్లల్లో నీళ్లు ఏరులై పారుతున్నాయి. ఈ విధంగా కలేకూరి ప్రసాద్‌ ‘కర్మభూమిలో పూసిన ఓ పువ్వా’ పాటలో స్త్రీల దుస్థితిని వివరించాడు.


2. కర్మభూమిలో పూసిన ఓ పువ్వా పాఠం ద్వారా కవి వివరించిన వరకట్న దురాచారాన్ని విశ్లేషించండి. 
జ: ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేయాలంటే వరుడికి దండిగా కట్నాలు ఇవ్వాల్సి వస్తుంది. అడిగినంత కట్నం ఇచ్చి పెళ్లి చేసినా అదనపు కట్నం తీసుకురమ్మని అత్తింటివారు బాధిస్తున్నారు. లాంఛనాల పేరుతో పెళ్లికూతురి తల్లిదండ్రులను అల్లుళ్లు వేధిస్తున్నారు. పండుగ బహుమతులని, సారెలని మోటారు సైకిళ్లు, కార్లు కావాలని అత్తమామలను పీక్కు తింటున్నారు.
   అడిగిన కట్నాలు, లాంఛనాలు, సారెలు ఇచ్చినా కొత్త పెళ్లికూతుళ్ల అత్తమామలు తృప్తి చెందడం లేదు. ఇంకా  అత్తగారి సాధింపులు, ఆడపడుచులు శత్రువులై ఆరళ్లు పెట్టడం సాగుతోంది. ఈ వేధింపులతో విసిగి వేసారిన కొత్త పెళ్లికూతుళ్లు ఆత్మహత్యలకు సిద్ధపడుతున్నారు. కొన్ని సందర్భాల్లో నవ వధువులను అత్తింటివారే చంపేసి మళ్లీ తమ కొడుకులకు పెళ్లిళ్లు చేసి కొత్తగా కట్నాలు తీసుకోవచ్చని ఆశిస్తున్నారు.

సంక్షిప్త సమాధాన ప్రశ్నలు
 

1. కలేకూరి ప్రసాద్‌ గురించి రాయండి.
జ: కలేకూరి ప్రసాద్‌ కృష్ణా జిల్లా కంచికచర్లలో 1964 అక్టోబరు 25న జన్మించారు. ఈయన తల్లిదండ్రులు లలిత సరోజిని, శ్రీనివాసరావు. కలేకూరి గుంటూరు ఎ.సి.కాలేజీలో ఇంటర్‌ చదువుతున్న సమయంలో విద్యార్థి ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్నారు. మహబూబ్‌నగర్‌ పరిధిలోని బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన ప్రాజెక్టుకు కొంతకాలం ఛైర్మన్‌గా ఉన్నారు. సాక్షి హ్యూమన్‌ రైట్స్‌ వాచ్‌ సంచాలకులుగా కొంతకాలం బాధ్యత వహించారు.
   కలేకూరి ప్రసాద్‌ స్వగ్రామంలో కంచికచర్ల కోటేశును అగ్రవర్ణ భూస్వాములు సజీవ దహనం చేశారు. ఆ సంఘటన కలేకూరిని కవిని చేసింది. అణగారిన జనంపై నరమేధం జరిగిన ఘటనలకు సంబంధించి ఈయన ప్రతిఘటనాత్మక రచనలు చేశారు. యువక, శబరి, సంఘమిత్ర, నవత లాంటి కలం పేర్లతో చేసిన రచనలు వివిధ పత్రికల్లో వచ్చాయి. దళిత సాహిత్యం, దళిత సాహిత్యోద్యమం, పిడికెడు ఆత్మ గౌరవం కోసం అంటరాని ప్రేమ లాంటివి ఈయన రచనల్లో ముఖ్యమైనవి.
   కలేకూరి ప్రసాద్‌ గొప్ప విమర్శకుడు, మంచి అనువాదకుడు. మహాశ్వేతా దేవి, అరుంధతి రాయ్, స్వామి ధర్మతీర్థ, ప్లాబో నెరుడా, నామ్‌దేవ్‌ ధసాల్‌ లాంటి ప్రసిద్ధ రచయితలను తెలుగు వారికి పరిచయం చేశారు.


2. కలేకూరి ప్రసాద్‌ స్త్రీలలో ఆశించిన చైతన్యం ఏమిటి?
జ: కలేకూరి ప్రసాద్‌ స్త్రీలలో చైతన్యం రావాలని కోరాడు. స్త్రీలు అందరూ ఏకమై రాక్షసుల్లా కట్నాల కోసం పీడించే సమాజాన్ని ఎదిరించాలన్నాడు. స్త్రీలూ, పురుషులూ అనే తేడా లేకుండా మనుషులందరికీ సమానమైన విలువనిచ్చే సమాజం రావాలని కోరుకున్నాడు. ప్రస్తుతం దేశంలో ఆడవారి కంటే అడవిలో చెట్టుకే విలువ ఇస్తున్నారని బాధపడ్డాడు. ఆడపడుచును ఆరడి పెట్టే స్త్రీలు కూడా తమ అత్తవారింట్లో అలాంటి ఆరడి తప్పదని గుర్తించాలని హితవు చెప్పాడు. అలాగే కోడలి బతుకులో నిప్పులు  పోసే అత్తగారు కూడా తమ కూతుళ్లకు అత్తవారింట్లో అలాంటి బాధలే సంభవిస్తాయని, అప్పుడు వారికి కూడా గర్భశోకం  తప్పదని గుర్తించాలని జ్ఞానోపదేశం చేశాడు. స్త్రీలు ఏడుస్తూ కూర్చోవద్దని వారిపై జరిగే వరకట్న దురాచారాలను ఎదిరించాలని, వారిలో చైతన్యం రావాలని హెచ్చరించాడు.

ఏక వాక్య సమాధాన ప్రశ్నలు


1. ‘కర్మభూమిలో పూసిన ఓ పువ్వా’ పాట రచయిత ఎవరు?
జ: కర్మభూమిలో పూసిన ఓ పువ్వా పాట రచయిత కలేకూరి ప్రసాద్‌. 


2. కలేకూరి ప్రసాద్‌ కలం పేర్లు తెలపండి. 
జ: 
కలేకూరి ప్రసాద్‌ కలం పేర్లు యువక, శబరి, సంఘమిత్ర, నవత. 


3. మనిషికీ, మనిషికీ మధ్య సంబంధాలు ఏమయ్యాయి? 
జ: 
మనిషికీ, మనిషికీ మధ్య సంబంధాలు మార్కెట్లో సరకులయ్యాయి.

రచయిత: ఎం.మహేశ్వర నాయుడు

Posted Date : 23-12-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని

విద్యా ఉద్యోగ సమాచారం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌