• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఈ దారి ఎక్కడికి పోతుంది?

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

1. సమాజంలో వచ్చిన మార్పుల పట్ల అద్దేపల్లికి కలిగిన ఆవేదనను తెలపండి.
జ: సమాజంలో వచ్చిన మార్పుల పట్ల అద్దేపల్లి తన ఆవేదనను ఇలా తెలిపాడు.
అద్దేపల్లి ఆవేదన:
* నాయకులు, మేధావులు, సినిమా తారలు, తెలుగు టీచర్లు బియ్యంలో రాళ్లలా తెలుగులో ఇంగ్లిష్‌ పదాలను కలిపి మాట్లాడుతూ మన ప్రాణాలను నమిలి మింగుతున్నారు.
* విద్యాలయాల ద్వారా వ్యాపారం సాగిస్తున్న ఇంగ్లిష్‌ కాన్వెంట్లు పిల్లలకు ఇంగ్లిష్‌ రైమ్‌లను నేర్పిస్తూ ఆ కుప్పిగంతుల కింద తెలుగు పాటల ఊపిరిని అణగదొక్కుతున్నాయి. 
* చెవులు పగిలేలా అరుస్తూ వచ్చి వేర్వేరు భావధారలు ధన సముద్రంలో కలుస్తున్నాయి. నిషేధించిన కాబరే డాన్సులే చట్టబద్ధమైన పాప్‌ డ్యాన్సులుగా మారిపోయాయి.
* సంప్రదాయం, ఆధునికత, సంస్కారం అనే మూడింటిని కలిపిన పంచకోళ్ల కషాయం తాగుతున్న మాటలతో కొత్త మనిషి తన అస్తిత్వాన్ని కాపాడుకోలేక కన్నీరు కారుస్తూ నిలబడ్డాడు. అంతర్జాతీయ వ్యాపారం అనే తుపానులో మానవుడు తన సొంత ముద్ర చెదిరిపోయిన వస్తువుగా మారాడు. 
* మనిషికి బదులు వస్తువును ఆరాధిస్తూ ఆ వస్తువులను కొంటున్నాడు. ఒకప్పుడు అవసరం కోసం వస్తువులను కొన్న మానవుడు ఇప్పుడు తన స్థాయి కోసం విదేశీ వస్తువులు కొంటున్నాడు. భవిష్యత్తులో తాను ఒక వస్తువు కావడం కోసం మానవుడు తన జీవితాన్నే అమ్ముకుంటాడు. 
* ఈ రోజు మానవుడు అనుభూతులను విడిచిపెట్టి ప్రకృతి చెట్టును పెంచి హైకూల పచ్చని ఆకులుగా ఊగుతున్నాడు. భవిష్యత్తులో గదిలోని కంప్యూటర్‌లోకి ప్రకృతిని తీసుకువచ్చి సహజమైన ఆకు కంటే ఇంకా పచ్చని హైకూలను తయారుచేస్తాడు. 
* పూర్వపు ఆటలైన కత్తి పడవలు, నెమలి కన్నులు, ఇసుక గూళ్లు, బువ్వలాటలు, కొమ్ము ఉయ్యాలలు, కోతికొమ్మచ్చి లాంటి ఆటలన్నింటినీ నేటి మానవుడు వీడియో గేమ్‌లుగా మార్చుకుంటున్నాడు. కాలు కదపకుండానే ప్రపంచమంతా తిరిగి వస్తాడు.
ఈ విధంగా సమాజంలో వస్తున్న మార్పుల పట్ల అద్దేపల్లి ఈ దారి ఎక్కడికి పోతుంది అనే వచన కవితలో తన ఆవేదనను వెల్లడించాడు. 

2. మనిషిలో ఏ విధంగా చైతన్యం వస్తుందని అద్దేపల్లి చెప్పారు?
జ: 
మనిషి ప్రపంచీకరణ విష బీజ ప్రభావాలకు ఎదురొడ్డి నిలవాలి. తూర్పు మీద పడమటి నీడ పడకుండా చూసుకోవాలి. బహుళజాతి జనులతో వ్యాపార సంబంధాలు తగ్గించుకొని స్వదేశీ వస్తువులను కొని హస్తకళలను ఆదరించాలి.
   ప్రపంచ వ్యాపారం వైకుంఠపాళీ లాంటిది. ఈ వ్యాపారంలో మన దేశం నష్టపోకుండా చూసుకోవాలి. భారతదేశ ప్రజలు తమలో తాము అనుబంధాలను పెంచుకోవాలి. లేకపోతే అనుబంధాలు విమానాల రెక్కల నుంచి జారి సముద్రంలో కలిసిపోతాయి. మన అనుభవాలు యంత్రాల అద్దాల ముందు బట్టతలలను దువ్వుకోవాల్సి వస్తుంది.
   ఈ మధ్యనే స్వాతంత్య్రం తెచ్చుకున్న భారతదేశం పసిపాప లాంటిది. స్వదేశీ వర్తకాన్ని  ప్రోత్సహించాలి. లేకపోతే మన జీవితం అనే పసిపాప దేశం మార్కెట్‌లో తల్లిదండ్రుల నుంచి తప్పిపోతుంది. ఇప్పుడు మన మనసుల్లోని మట్టితనం మేలుకునే సమయం వచ్చింది. స్వదేశీ పరిశ్రమలను ప్రోత్సహిస్తే తప్పకుండా ప్రపంచీకరణ విష బీజ ప్రభావం చల్లారుతుంది. మన అమ్మతనం ముందు అమ్మకంతనం ఓడిపోతుంది.
   శ్రమతో మన దారిలోని ముళ్లు, రాళ్లను మనమే తొలగించుకొని కొత్తదారి ఏర్పరచుకోవాలి. అప్పుడే మన దేశం సగర్వంగా తలెత్తి ప్రపంచ దేశాల ముందు నిలబడుతుంది. ఆకాశమంత ఎత్తుకు ఎదుగుతుంది.
   మన దారిలోని అడ్డంకులను మనమే తొలగించుకుంటూ వెళ్తే గమ్యానికి చేరుతాం. అప్పుడు దారి మోచిన గమ్యం శరీరంపై శిరస్సులా కనిపిస్తుంది. దేశం ఒక చెండాలా మన గుప్పిట్లో నిలుస్తుంది. అప్పుడే మనిషిలో చైతన్యం వస్తుందని అద్దేపల్లి చెప్పారు.

సంక్షిప్త సమాధాన ప్రశ్నలు

1. అద్దేపల్లి దర్శించిన కొత్త మానవుడు ఎలా ఉన్నాడు?
జ: అద్దేపల్లి ముందు నిలబడిన కొత్త మానవుడు
* బియ్యంలో రాళ్లలా తెలుగులో ఇంగ్లిష్‌ పదాలు కలిపి నేటి నాయకులు, మేధావులు, సినిమా తారలు, తెలుగు ఉపాధ్యాయులు మాట్లాడుతున్నారు.
* విద్యను వ్యాపారంగా మార్చిన ఇంగ్లిష్‌ కాన్వెంట్లు ఇంగ్లిష్‌ రైమ్‌ల కుప్పిగంతుల కింద తెలుగు పాటల ఊపిరిని తొక్కి వేస్తున్నాయి. 
* చెవులు పగిలేలా గట్టిగా ధ్వని చేస్తూ వచ్చి వేర్వేరు భావాలన్నీ మెల్లగా ధన సముద్రంలో కలుస్తున్నాయి. నిషేధించిన కాబరే డ్యాన్సులే పాప్‌ డ్యాన్సుల పేరుతో చట్టబద్ధంగా సాగుతున్నాయి. సంప్రదాయం, ఆధునికత, సంస్కారం అనే మూడు కలిసిన పంచకోళ్ల కషాయం తాగుతున్న మాటలతో తెలుగుదనం అస్తిత్వం కోసం సముద్రంలా కన్నీరు కారుస్తూ నిలబడిన కొత్త మానవుడిని అద్దేపల్లి దర్శించారు.

2. మనిషి జీవితం వస్తువులా ఏ విధంగా మారిపోతూ ఉంది?
జ: నేటి కాలంలో మనిషి జీవితం ఒక వస్తువులా మారిపోతుందని అద్దేపల్లి ఆవేదన చెందారు. ఈ రోజు అనేక కొత్త వస్తువులు వివిధ దేశాల నుంచి మన దేశంలోకి దిగుమతి అవుతున్నాయి. ప్రపంచ దేశాల మధ్య అంతర్జాతీయ వ్యాపారం తుపానులా విజృభించిపోతుంది. ఈ తుపాను గాలిలో భారతీయుల సొంత ముద్ర చెరిగిపోయింది. భారతీయుడు ఒక వింత వస్తువులా నిలబడ్డాడు.
   తోటి మానవుడిని గౌరవించడం మానేసి అంటే స్వదేశీ వస్తువులను కాదని పాశ్చాత్య దేశాల నుంచి దిగుమతి అవుతున్న రేడియో, టీవీ, ఏసీ, ఫ్రిజ్‌ లాంటి వస్తువులను ఆరాధిస్తున్నాడు. పూర్వకాలంలో మన దేశ పౌరులు తమ అవసరాలకు కావాల్సిన వస్తువులనే కొనేవారు. కానీ ఇప్పుడు మానవుడు సంఘంలో తన స్థాయి, హోదాను పెంచుకోవడం కోసం కార్లు, మోటారు సైకిళ్లు, సెల్‌ఫోన్‌లు లాంటి వస్తువులను కొంటున్నాడు.
   క్రమంగా విదేశీ వస్తువులను కొనడం పెరిగిపోతుంది. ఆ వస్తువులు ఇంట్లో లేకపోతే పరువు తక్కువ అని మనిషి కోసం తన జీవితాన్ని అమ్ముకొని విదేశీ వస్తువులను కొంటాడు. ఈ విధంగా మనిషి జీవితం వస్తువులా మారింది.

3. మనిషి జీవితం గురించి అద్దేపల్లి భావనను తెలియజేయండి.
జ: నేటి కొత్త మానవుడు సంప్రదాయం, ఆధునికత, సంస్కారం కలిపిన పంచకోళ్ల కషాయం తాగుతున్న మాటలతో తన అస్తిత్వం కోసం పెద్దగా కన్నీళ్లు కారుస్తున్నాడు. అంతర్జాతీయ వ్వాపార తుపానులో సొంత ముద్ర చెరిగిపోయిన వింత వస్తువులా ఉన్నాడు. మనిషికి బదులు వస్తువులను ఆరాధిస్తూ వాటిని కొంటున్నాడు. 
   మానవుడు పూర్వం తన అవసరం కోసమే వస్తువులను కొనేవాడు. ప్రస్తుతం తన స్థాయిని పెంచుకోవడం కోసం అవసరం లేకున్నా విదేశీ వస్తువులను కొంటున్నాడు. రేపు తాను ఒక వస్తువు కావడం కోసం తన జీవితాన్నే అమ్ముకుంటాడు. ప్రకృతి చెట్టును పెంచి హైకూల పచ్చని ఆకుల మాదిరి తాను ఊగిపోతున్నాడు. కంప్యూటర్‌లోకి ప్రకృతిని తీసుకు వచ్చి ప్రపంచం మీద విసిరి కొడతాడు. కత్తి పడవలు, బువ్వలాటలు, కోతికొమ్మచ్చి లాంటి పూర్వం ఆటలను వీడియో గేమ్‌లుగా మార్చుకున్నాడు. ఇతడు కాలు కదపకుండా ప్రపంచమంతా తిరిగి వస్తాడు.

4. మనుషుల అనుబంధాలు ఎందుకు నాశనమవుతున్నాయి?
జ: ప్రపంచ పటంలో తూర్పున ఉన్న భారతదేశంపై పడమటి నీడ అంటే పాశ్చాత్య దేశాల ప్రభావం బాగా పడుతోంది. ఎర్రని సంధ్య చేస్తున్న మిక్కిలి ఎర్రని వ్యాఖ్యానం భారత గగన తలాన్ని వణికించింది. బహుళ జాతి రాజ్యాల సంబంధాలతో భారతదేశ హస్తం జారిపోతుంది. అంటే మన హస్తకళలు నశించాయి. ప్రపంచ దేశాల వ్యాపారం అనే వైకుంఠపాళీలో దేశ వ్యాపారం దెబ్బతింటోంది.
   పైన చెప్పిన వికృత పరిస్థితుల్లో మనుషుల అనుబంధాలు విమానాల అద్దాల ముందు నిలబడి తమ బట్టతలలను దువ్వుకుంటాయి. కామదేవత ముందు ప్రేమ తన శిరస్సును ఖండించుకుంటుంది. జీవితం అనే పసిపాప దేశం మార్కెట్‌లో తల్లిదండ్రుల నుంచి తప్పిపోతుంది.

5. అద్దేపల్లి రామమోహన రావు గురించి రాయండి.
జ: అద్దేపల్లి రామమోహన రావు మచిలీపట్టణంలో 1936, సెప్టెంబరు 6న రాజరాజేశ్వరి, సుందరరావు దంపతులకు జన్మించారు. ప్రాథమిక విద్య నుంచి కళాశాల విద్య వరకు మచిలీపట్టణంలో, తిరుపతి వేంకటేశ్వర విద్యాలయంలో ఎంఏ తెలుగు చదివారు. బందరులోని నందిగామ కళాశాలలో కొంతకాలం ట్యూటర్‌గా పనిచేశారు. అనంతరం కాకినాడ ఎంఎస్‌ఎన్‌ ఛారిటీస్‌ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేసి అక్కడే పదవీ విరమణ పొందారు. తొలిరోజుల్లో ఈయన ‘మధుజ్వాల’ పద్య కావ్యాన్ని రచించారు. తర్వాత అనేక వచన కవితా సంపుటాలు ప్రకటించారు. 
   అద్దేపల్లి అంతర్జ్వాల, రక్త సంధ్య, గోదావరి నా ప్రతిబింబం, మెరుపు పువ్వు, సంఘం శరణం గచ్ఛామి, అయినా ధైర్యంగానే, పొగచూరిన ఆకాశం, తెరలు, కాలం మీద సంతకం, అల్లూరి సీతారామరాజు లాంటి వచన కావ్యాలు రచించారు.
   ‘శ్రీశ్రీ కవితా ప్రస్థానం’ అనేది అద్దేపల్లి మొదటి విమర్శనా గ్రంథం. విమర్శ వేదిక, కుందుర్తి కవితా వైభవం, జాషువా కవితా సమీక్ష, దృష్టిపథం, గీటురాయి లాంటి విమర్శనా గ్రంథాలు రాశారు. అభ్యుదయ విప్లవ కవిత్వాలు - సిద్ధాంతాలు, శిల్పరీతులు అనేది అద్దేపల్లి పీహెచ్‌డీ సిద్ధాంత గ్రంథం. ఈయన సుమారు 600 కవితా సంపుటాలకు పీఠికలు రాశారు. 2016,  జనవరి 13న మరణించారు.

ఏక వాక్య సమాధాన ప్రశ్నలు

1. ‘ఈ దారి ఎక్కడికి పోతుది?’ పాఠ్యభాగ రచయిత ఎవరు? 
జ: ‘ఈ దారి ఎక్కడికి పోతుంది?’ అనే పాఠ్యభాగ రచయిత అద్దేపల్లి రామమోహనరావు.


2. బియ్యంలో రాళ్లలా కనిపించినవి ఏవి?
జ: తెలుగులో కలిసిన ఇంగ్లిష్‌ పదాలు బియ్యంలో రాళ్లలా కనిపించాయి.


3. నిషిద్ధమైన కాబరే డ్యాన్స్‌లు ఏ పేరుతో చట్టబద్ధమయ్యాయి?
జ: నిషిద్ధమైన కాబరే డ్యాన్స్‌లు పాప్‌ డ్యాన్స్‌ల పేరుతో చట్టబద్ధమయ్యాయి.


4. సగటు మనిషి దేనికోసం వస్తువులు కొంటున్నాడు?
జ: సగటు మనిషి తన స్థాయి కోసం వస్తువులను కొంటున్నాడు.    


5. అమ్మతనం ముందు ఏది ఓడిపోతుంది?
జ: అమ్మతనం ముందు అమ్మకంతనం ఓడిపోతుంది.

రచయిత: ఎం.మహేశ్వర నాయుడు

Posted Date : 25-01-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని

విద్యా ఉద్యోగ సమాచారం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌