• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఉష్ణ   విద్యుత్

ప్ర‌శ్న‌లు - జ‌వాబులు


1. సీబెక్ ప్రభావాన్ని పటం సహాయంతో వివరించండి.

జ:

                            సీబెక్ ప్రభావం

పటంలో చూపినట్లు రాగి, ఇనుము లాంటి రెండు వేర్వేరు లోహాలతో రెండు సంధులతో కూడిన ఒక సంవృత వలయాన్ని ఏర్పరిచి, ఆ రెండు సంధులను వేర్వేరు ఉష్ణోగ్రతల వద్ద ఉంచినప్పుడు ఆ వలయంలో విచాబ జనించి కొంత విద్యుత్ ప్రవహిస్తుంది.దీన్నేసీబెక్ ప్రభావంఅంటారు.

               

2. పెల్టియర్ ప్రభావం, థామ్సన్ ప్రభావాలు అంటే ఏమిటి? వాటి గుణకాలను నిర్వచించండి.
జ: రెండు సంధుల వద్ద ఒకే ఉష్ణోగ్రత ఉన్న ఒక ఉష్ణయుగ్మం ద్వారా విద్యుత్‌ను ప్రవహింపజేస్తే ఆ రెండు సంధుల మధ్య ఉష్ణోగ్రతా భేదం ఏర్పడుతుంది. దీన్నే పెల్టియర్ ప్రభావం అంటారు.

పెల్టియర్ గుణకం: రెండు విభిన్న లోహాలతో ఏర్పడిన సంధి ద్వారా ఒక కూలుంబ్ విద్యుదావేశం ప్రవహించినప్పుడు ఆ సంధి వద్ద శోషితమయ్యే లేదా వెలువడే ఉష్ణరాశిని పెల్టియర్ గుణకం అంటారు.
థామ్సన్ ప్రభావం: అసమానంగా వేడి చేసిన వాహకం నుంచి విద్యుత్ ప్రవాహం కారణంగా వాహకపు ప్రతి బిందువు వద్ద ఉష్ణం శోషితమవడాన్ని లేదా వెలువడటాన్ని థామ్సన్ ప్రభావం అంటారు.
థామ్సన్ గుణకం: ఒక వాహకంలో ఏకాంక ఉష్ణోగ్రతా భేదం (1ºC) ఉన్న రెండు బిందువుల మధ్య 1 A విద్యుత్ ప్రవాహం ఒక సెకన్ కాలం పాటు ప్రవహించినప్పుడు శోషితమయ్యే లేదా వెలువడే శక్తిని థామ్సన్ గుణకం అంటారు.

 

3. ఉష్ణ విద్యుచ్ఛాలక బలం, వేడి సంధి ఉష్ణోగ్రతల మధ్య గీసిన గ్రాఫ్ సహాయంతో తటస్థ విలోమన ఉష్ణోగ్రతలను వివరించండి.
జ:

             ఉష్ణోగ్రత (T) --->
ఉష్ణోగ్రత - ఉష్ణ విద్యుచ్ఛాలక బలం

చల్లటి సంధి ఉష్ణోగ్రతను 0ºC వద్ద స్థిరంగా ఉంచి, వేడి సంధి ఉష్ణోగ్రతను క్రమంగా పెంచితే ఉష్ణ విద్యుచ్ఛాలక బలం క్రమంగా పెరుగుతూ ఒక గరిష్ఠ విలువను చేరి తర్వాత తగ్గుతూ శూన్యం అవుతుంది. గ్రాఫ్ పరావలయంలా ఉంటుంది. 
తటస్థ ఉష్ణోగ్రత: చల్లటి సంధి ఉష్ణోగ్రత స్థిరంగా ఉంచి వేడి సంధి ఉష్ణోగ్రతను పెంచితే ఏ ఉష్ణోగ్రత వద్ద విద్యుచ్ఛాలక బలం గరిష్ఠం అవుతుందో ఆ ఉష్ణోగ్రతను తటస్థ ఉష్ణోగ్రత అంటారు.       

విలోమన ఉష్ణోగ్రత: తటస్థ ఉష్ణోగ్రత తర్వాత ఉష్ణోగ్రత ఇంకా పెంచుతూ వెళ్తే ఉష్ణ విద్యుచ్ఛాలక బలం తగ్గుతూ శూన్యమయ్యే ఉష్ణోగ్రతను విలోమన ఉష్ణోగ్రత అంటారు.
 

4. థర్మోఫైల్ పనిచేసే విధానంపై లఘుటీక రాయండి.
జ: ఉష్ణ వికిరణాన్ని శోధించడానికి శ్రేణిలో కలిపిన అనేక ఉష్ణయుగ్మాల అమరికను థర్మోఫైల్ అంటారు. ఉష్ణ యుగ్మాలను కలిపి ఒక వైపు సంధుల సముదాయాన్ని నల్లటి మసితో పూత పూసి ఉష్ణ వికిరణం నేరుగా పడేలా చేస్తే అది వేడి సంధిలా పని చేస్తుంది. రెండో వైపు చల్లటి సంధిలా పని చేస్తుంది. ఫలితంగా ఉష్ణ విద్యుచ్ఛాలక బలం ఉత్పన్నమవుతుంది. విద్యుచ్ఛాలక బలాన్ని కొలిచి వికిరణ తీవ్రతను లెక్కిస్తారు

 

5. డడల్ ఉష్ణ గాల్వనా మీటర్ నిర్మాణం, పనిచేసే విధానాన్ని వివరించండి.
జ: ఒక ఉష్ణ యుగ్మం,ఒక కదిలే తీగచుట్ట గాల్వనా మీటర్ కలయిక వల్ల డడల్ ఉష్ణ గాల్వనా మాపకం ఏర్పడుతుంది.
   ఉష్ణయుగ్మం ఒక సంధిని హీటర్ తీగకు దగ్గర ఉంచితే అది వేడి సంధిగా పనిచేస్తుంది. మరో సంధి చల్లటి సంధిగా పనిచేస్తుంది. కొలవాల్సిన విద్యుత్ ప్రవాహాన్ని హీటర్ తీగ ద్వారా పంపితే అది ఉత్పత్తి చేసిన ఉష్ణోగ్రతకు అనుగుణంగా తీగచుట్టలో విద్యుచ్ఛాలక బలం ఉత్పన్నం అవుతుంది.విద్యుత్ ప్రవాహానికి తీగచుట్ట అపవర్తనం అనులోమానుపాతంలో ఉంటుంది.ఈ విధంగా అపవర్తనాన్ని కొలిచి హీటర్ తీగలో ప్రవహించే విద్యుత్‌ను లెక్కిస్తారు. 

     
    డడల్ ఉష్ణ గాల్వనో మీటర్

6. ఉష్ణయుగ్మం అంటే ఏమిటి? దానివల్ల కలిగే ఏదైనా ఒక ఉపయోగాన్ని రాయండి.
జ:  రెండు వేర్వేరు లోహాలతో రెండు సంధులు ఏర్పడేలా చేసిన అమరికను ఉష్ణయుగ్మం అంటారు.
      ఉష్ణయుగ్మంలో ఉష్ణోగ్రతను కొలవచ్చు.                                       

 

7.  పెల్టియర్ గుణకం, థామ్సన్ గుణకాల ప్రమాణాలను తెలపండి.
జ:  పెల్టియర్ గుణకం ప్రమాణాలు:  JC-1   లేదా   వోల్ట్           
     థామ్సన్ గుణకం ప్రమాణాలు: V ºC-1                                                                             

 

8.  చల్లటి సంధి ఉష్ణోగ్రత (Tc), తటస్థ ఉష్ణోగ్రత (Tn),  విలోమన ఉష్ణోగ్రతల (Ti) మధ్య సంబంధాన్ని తెలపండి.

జ:     Tn - Tc = Ti - Tn
         2 Tn = Ti + Tc         

         

Posted Date : 14-10-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని

విద్యా ఉద్యోగ సమాచారం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌