• facebook
  • twitter
  • whatsapp
  • telegram

4. కన్యక 

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

1. రాజు కన్యకను చెరపట్టడానికి ఎలా ప్రయత్నించాడు?
జ: ఒక వైశ్య కన్యక బంగారు జరీ చీర కట్టుకొని, తలలో పూలు, నుదుటన కుంకుమ బొట్టు పెట్టుకొని అందంగా హంసలా నడుస్తూ రాజవీధికి వచ్చింది. ఆమె చెలికత్తెలు బిందెల్లో పాలు, పెరుగు; పళ్లెంలో పూలు, పండ్లు పెట్టుకొని చిరునవ్వులు నవ్వుతూ కన్యక వెంట నడిచి వచ్చారు. అంతలో ఆ దేశాన్ని పాలించే రాజు వారికి ఎదురుగా వచ్చాడు. కన్యక ఆనందానికి ఆయన కన్ను చెదిరింది. నక్షత్రాల మధ్య చంద్రుడిలా వెలిగిపోతున్న ఆమె ముందు అంతఃపురం సుందరులు తీసికట్టు అనుకున్నాడు. ఆ కన్యకను బలవంతంగా చెరపట్టి మన్మథ రాజ్యం ఏలాలని, రసికుల్లో గొప్పవాడని అనిపించుకోవాలని రాజు అనుకున్నాడు.
   నాలుగు వీధుల మధ్యలో ఆ రాజు దుష్టులైన తన మంత్రులతో పెండెం కట్టుకట్టి కన్యకను చుట్టుముట్టి చెరపట్టాలని ప్రయత్నించాడు. అప్పుడు ఆ వైశ్య కన్యక ధైర్యం తెచ్చుకొని తనను తాకవద్దని, దైవ కార్యం తీర్చివస్తానని, తాను కోమటి బిడ్డనని, రాజును కాదని ఎక్కడికి వెళ్లలేనని చెప్పింది.
   ఆ వైశ్య కన్య తండ్రి సెట్టి కూడా తన కూతురిని బలవంతం చేయనవసరం లేదని తన బిడ్డను రాజు పెళ్లి చేసుకోవడం వైశ్య జాతికి వన్నె తెస్తుందని చెప్పి కుమార్తెను అగ్నిసాక్షిగా వివాహం చేసకోమని కోరాడు. ముందుగా వీరభద్రుడి గుడికి వెళ్లి పళ్లెరం సాగించి వస్తానని సెట్టి రాజుతో చెప్పాడు. 
   రాజు అందుకు అంగీకరించి తాను కూడా గుడికి వచ్చి అక్కడే కన్యకను అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకుంటానన్నాడు. వైశ్య కన్యక దుర్గ కొలనులో స్నానం చేసి వచ్చింది. గుడిలో అగ్ని గుండం మండుతోంది. ఆమె తన జాతివారికి సందేశం ఇచ్చింది. రాజును తనను పట్టుకోమని చెబుతూ కన్యక అగ్నిగుండంలోకి ప్రవేశించింది.
రాజు ప్రయత్నం నెరవేరలేదు. ఈ సంఘటనతో కన్యక కీర్తి, రాజు అపకీర్తి నేటికీ నిలిచాయి. రాజు కోటలు మట్టిలో కలిసిపోయాయి.

2. కన్యక రాజును ప్రతిఘటించిన విధానాన్ని వివరించండి. 
జ: ఒక వైశ్య కన్య అలంకరించుకొని హంసలా నడుస్తూ చెలికత్తెలతో కలిసి దేవాలయానికి వెళ్తుంది. ఆమె మహా సౌందర్యవతి. ఆ దేశాన్ని పాలించే రాజుకు కన్యక సొగసును చూసి కన్ను చెదిరింది. ఆమె అందం ముందు తన అంతఃపుర సుందరులు తీసికట్టని రాజు భావించాడు.
   పట్టపగలు నాలుగు వీధుల మధ్యలో ఆ వైశ్య కన్యను బలవంతంగా చెరపట్టి మన్మథ రాజ్యం ఏలాలని రాజు అనుకున్నాడు. తన దుష్ట మంత్రుల సాయంతో వైశ్య కన్యను చుట్టుముట్టి పట్టుకోవడానికి ప్రయత్నించాడు. 
కన్యక ప్రతిఘటించిన తీరు: వైశ్య కన్యక తనకు ఇక దైవమే దిక్కని తలచి ధైర్యాన్ని కూడగట్టుకొని రాజుతో ఇలా చెప్పింది.
   ‘రాజా! నన్ను తాకవద్దు. దేవకార్యం తీర్చి వస్తాను. నీవు ఈ దేశాన్ని ఏలే రాజువు. నేను కోమటి బిడ్డను. నిన్ను కాదని ఎక్కడకూ పోలేను’ అని కన్యక తాను దైవపూజ చేసి వస్తానని రాజు నుంచి తాత్కాలికంగా తప్పించుకుంది.
  కన్యక తండ్రి కోరిక మేరకు రాజు ఆమెను అగ్నిసాక్షిగా పెళ్లాడతానని చెప్పాడు. కన్యక తనవారందరితో కలిసి దుర్గగుడికి వెళ్లింది. అక్కడ అగ్నిగుండంలో మంట ఆకాశాన్ని తాకుతోంది. కన్యక దుర్గమ్మను భక్తితో సేవించి తన నగలను తీసి శక్తికి అర్పించింది. తర్వాత కొలనులో స్నానం చేసి, రక్త గంధం, ఎర్రని పూల మాలను ధరించి, గుండం చుట్టూ నిలబడిన తనవారికి ఇలా సందేశం ఇచ్చింది.
కన్యక సందేశం: ‘అన్నల్లారా! తండ్రుల్లారా! నా విన్నపం వినండి. వైశ్య కులంలో భార్యా బిడ్డలను రక్షించుకోవడానికి మీకు పౌరుషం లేదా? పదవుల కోసం ఆశపడక కాసు, వీసం చాలు అనుకోకుండా బుద్ధిబలం, బాహుబలం పెంచుకొని దేవుడిపై భారం వేసి రాజుల్లో రాజుల్లా జీవించండి. రాజును పాలించే దేవుడు కూడా ఉంటాడు’ అని కన్యక తన వైశ్య జాతికి ధైర్యంగా సందేశం ఇచ్చింది. 
వైశ్య కన్య రాజును ప్రతిఘటించి అగ్ని ప్రవేశం చేయడం: ‘ఓ రాజా! పట్టపగలు నడివీధిలో జారులు, దొంగలు కూడా స్త్రీలను తాకరు. కానీ నీవు పట్టపగలు బలవంతంగా నన్ను చెరపట్టడానికి ప్రయత్నించావు. నీవు పట్టణాన్ని పాలించే రాజువు కావు. ఇంతటి దుర్మార్గానికి తలపెట్టావు. దేవుడంటూ ఉంటే దీన్ని చూస్తూ ఊరుకోడు. మా కుల పెద్దలు ఇక్కడే ఉన్నారు. అగ్నిసాక్షికి అగ్ని ఉంది. నీవు కోరుకున్న కన్యను నేను ఇక్కడే ఉన్నాను. నీవు నిజంగా పట్టమేలే రాజువైతే నన్ను పట్టుకో’ అంటూ వైశ్య కన్య అగ్నిప్రవేశం చేసింది. ఈ విధంగా వైశ్య కన్యక రాజును ప్రతిఘటించింది.

సంక్షిప్త సమాధాన ప్రశ్నలు

1. గురజాడ రచనలను పేర్కొనండి.
జ: గురజాడ వెంకట అప్పారావు అనేక రచనలు చేశారు.
* భావ కవిత్వం ఒరవడిలో మాటల మబ్బులు, పుష్పలావికలు, మెరుపులు అనే ఖండ కావ్యాలు; సుభద్ర అనే అసంపూర్ణ కావ్యాన్ని రాశారు.
* రుతుశతకం, నీలగిరి పాటలను రాశారు. 
* కన్యాశుల్కం, బిల్హణీయం, కొండుభట్టీయం అనే నాటకాలను రాశారు.
* దిద్దుబాటు, మీ పేరేమిటి, మెటిల్డా, పెద్ద మసీదు, సంస్కర్త హృదయం అనే కథానికలు రాశారు.
* ముత్యాల సరాలు అనే మాత్రా ఛందస్సుతో కొత్త పాతల మేలు కలయికతో ‘ముత్యాల సరాలు’ అనే కావ్యాన్ని రాశారు. ముత్యాల సరాలు సంపుటిలో దేశభక్తి, ముత్యాల సరాలు, కాసులు, లవణరాజు కల, పూర్ణమ్మ, కన్యక, మనిషి లాంటి గేయ ఖండికలు ఉన్నాయి.

2. కన్యక తన వారికిచ్చిన సందేశం ఏమిటి?
జ: కన్యక దుర్గ కొలనులో స్నానం చేసి, రక్త గంధం, ఎర్రని పూల మాలలు ధరించి గుండం చుట్టూ నిలబడిన తనవారితో ఇలా చెప్పింది. 
కన్యక తనవారికి ఇచ్చిన సందేశం: ‘అన్నలారా! తండ్రులారా! ఒక విన్నపాన్ని వినండి. మన వైశ్య కులంలో భార్యా బిడ్డలను రక్షించుకోవాలనే కోరిక లేదా? ఆయన పట్టమేలే రాజు కావచ్చు. ఆ రాజును పాలించే దేవుడు కూడా ఉంటాడు కదా! పరువును నిలపాలనే పౌరుషం మీకు ఎందుకు కలగడం లేదు.
   చదువుకున్న వాడే బ్రాహ్మణుడు, పరాక్రమం ఉన్నవాడే క్షత్రియుడు అనే ధర్మ పద్ధతిని మరిచి  పదవుల కోసం ఆశ పడక, కాసో వీసమో ఉంటే చాలనుకొని పౌరుషం తెలియక, విద్య నేర్చుకోకుండా, అవివేకంగా ఉంటే కష్టాలు రాకుండా ఉండవు. కాబట్టి మీరు బుద్ధి, బాహు బలాలను పెంచుకొని దేవుడిపై భారం వేసి రాజుల్లో రాజుల్లా జీవించండి’ అని కన్యక తనవారికి సందేశం ఇచ్చింది. 

3. కన్యక తండ్రికి, రాజుకు మధ్య జరిగిన సంభాషణను తెలపండి. 
జ: కన్యక తండ్రి రాజుతో అన్న మాటలు: 
కన్యక తండ్రి సెట్టి రాజుకు నమస్కరించి ఇలా చెప్పాడు. ‘ఓ రాజా! నీవు పట్టణాన్ని పరిపాలించే రాజువే. బలవంతంగా మా అమ్మాయిని పట్టుకోనవసరం లేదు. కన్యక కూడా నీ సొమ్మే. నీవు మా అమ్మాయిని కోరడం కంటే మా వైశ్య జాతికి గొప్పతనం మరొకటి లేదు. కానీ నీవు మమ్మల్ని, మా బంధువులను, కులపెద్దలను గౌరవించి అగ్నిసాక్షిగా మా అమ్మాయిని వివాహం చేసుకొని ఆదరించు. కావలసిన మొత్తంలో కానుకలు స్వీకరించు. మా వైశ్య జాతిని రక్షించు’ అని సెట్టి రాజును కోరాడు. 
రాజు సెట్టితో పలికిన మాటలు: సెట్టి మాటలు విని రాజు హేళనగా నవ్వి ఇలా అన్నాడు. ‘పట్టమేలే రాజుకు సెట్టి ధర్మమార్గం గురించి చెప్పడం వింతగా ఉంది. రాజు అనుకున్నదే ధర్మం. చెప్పిందే చట్టం. రాజులకు గాంధర్వ వివాహం పేరు పొందిందే కదా! కాబట్టి నీవు ఆలస్యం చేయకుండా ఈ రోజూ, రేపు అని గడువు పెట్టకుండా నీ కన్యను నాకు ఇవ్వు. లేకపోతే వెళ్లు. డేగ పిట్టను విడిచి పెట్టదు. నీ కన్యక తిరిగి ఇంటికి వెళ్లదు. కానుకలు తీసుకురా. అంతవరకు  నేను కదలను’ అని రాజు చెప్పాడు. 

ఏక వాక్య సమాధాన ప్రశ్నలు

1. ‘ఆధునిక మహిళ చరిత్ర తిరగరాస్తుంది’ అని ఎవరన్నారు? 
జ: 
ఆధునిక మహిళ చిరిత్ర తిరగరాస్తుందని కవి గురజాడ వెంకట అప్పారావు అన్నారు. 

2. గురజాడ రాసిన కొత్త ఛందస్సు పేరేమిటి? 
జ: గురజాడ రాసిన కొత్త ఛందస్సు పేరు ముత్యాల సరాలు.

3. కన్యకను అగ్నిసాక్షిగా వివాహం చేసుకోమని రాజుతో ఎవరన్నారు? 
జ: కన్యకను అగ్నిసాక్షిగా వివాహం చేసుకోమని ఆమె తండ్రి సెట్టి రాజుకు చెప్పాడు. 

4. పట్టమేలే రాజు గర్వం ఏమైంది? 
జ: పట్టమేలే రాజు గర్వం మట్టిలో కలిసిపోయింది. 

5. గురజాడ రచించిన ప్రసిద్ధ నాటకం? 
జ: గురజాడ రచించిన ప్రసిద్ధ నాటకం కన్యాశుల్కం.

రచయిత: ఎం.మహేశ్వర నాయుడు

Posted Date : 16-12-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని

విద్యా ఉద్యోగ సమాచారం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌