‣ AF CAT - 2022: ఏఎఫ్ క్యాట్ 2022 ప్రకటన విడుదల
రక్షణ రంగంలో.. అందులోనూ వాయుసేనలో (Air Force) మేటి ఉద్యోగాలు ఆశించేవారు రాయాల్సిన పరీక్షల్లో ఏర్‌ఫోర్స్ కామన్ ఎంట్రన్స్ టెస్టు (ఏఎఫ్ క్యాట్ - AF CAT) ముఖ్యమైంది. ఇందులో విజయం సాధించి, ఇంటర్వ్యూలో ప్రతిభ చూపిస్తే శిక్షణ అనంతరం పైలట్, గ్రౌండ్ డ్యూటీ పోస్టులను సొంతం చేసుకోవచ్చు. సాధారణ డిగ్రీ/ బీటెక్ పూర్తయినవారూ, ఆఖరు సంవత్సరం కోర్సులు చదువుతున్నవారూ వీటికి పోటీ పడవచ్చు. మహిళలకూ అవకాశం ఉంది. తాజాగా వెలువడిన ఏఎఫ్ క్యాట్ - 2022(1) (AF CAT - 2022 (1) ప్రకటన వివరాలు చూద్దాం!
ఇటీవలే డిగ్రీ పూర్తిచేసుకున్న విద్యార్థులూ, ప్రస్తుతం ఆఖరు సంవత్సరం కోర్సుల్లో ఉన్నవారూ తమ గరిష్ఠ వయసుకు లోబడి కనీసం 6 నుంచి 8 సార్లు ఏఎఫ్‌క్యాట్ రాసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఆరు నెలలకు ఒకసారి ప్రకటన వెలువడుతుంది. అందువల్ల దీన్ని లక్ష్యం చేసుకుని సన్నద్ధమైతే విజయం వరిస్తుంది. అందరు అభ్యర్థులకూ పరీక్షను ఉమ్మడిగా నిర్వహిస్తారు. టెక్నికల్ బ్రాంచ్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నవారు అదనంగా ఇంజినీరింగ్ నాలెడ్జ్ టెస్ట్ (ఈకేటీ) రాయాల్సి ఉంటుంది.
ఆన్‌లైన్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు స్టేజ్-1, స్టేజ్-2 పరీక్షలు నిర్వహిస్తారు. ఫ్లయింగ్ బ్రాంచ్‌కు దరఖాస్తు చేసుకున్నవారికి ఇంటర్వ్యూ అనంతరం కంప్యూటరైజ్డ్ పైలట్ సెలక్షన్ సిస్టం (సీపీఎస్‌ఎస్) పరీక్ష ఉంటుంది. వీటన్నింటిలో అర్హత సాధిస్తే వైద్యపరీక్షలు నిర్వహించి శిక్షణకు ఎంపికచేస్తారు. ఎంపికైన విభాగాన్ని బట్టి ఇది ఏడాది నుంచి 18 నెలలు కొనసాగుతుంది. దీన్ని పూర్తిచేసుకున్నవారిని శాశ్వత, 14 ఏళ్లపాటు కొనసాగే ప్రాతిపదికన విధుల్లోకి తీసుకుంటారు.
జనరల్ అవేర్‌నెస్
General Awareness: చరిత్ర, క్రీడలు, భూగోళశాస్త్రం, పర్యావరణం, కళలు, సంస్కృతి, వర్తమానాంశాలు, రాజకీయాలు, పౌరశాస్త్రం, రక్షణ రంగం, సామాన్యశాస్త్రంలోని ప్రాథమికాంశాల నుంచి ప్రశ్నలుంటాయి. సాధారణ అవగాహనతో వీటికి జవాబులు గుర్తించవచ్చు. హైస్కూల్ సోషల్, సైన్స్ పుస్తకాల్లోని ప్రాథమికాంశాలు చదువుకోవాలి. వర్తమానాంశాల కోసం పత్రికా పఠనం ఉపయోగపడుతుంది. ముఖ్యాంశాలను నోట్సుగా రాసుకుని పరీక్షకు ముందు ఒకసారి చదువుకుంటే ఎక్కువ మార్కులు పొందవచ్చు.
ఏ అంశాల్లో?
వెర్బల్ ఎబిలిటీ
Verbal Ability: కాంప్రహెన్షన్, ఎర్రర్ డిటెక్షన్, సెంటెన్స్ కంప్ల్లీషన్, సిననిమ్స్, యాంటనిమ్స్, ఒకాబులరీల నుంచి ప్రశ్నలడుగుతారు. అభ్యర్థి ఆంగ్లం ఎలా అర్థం చేసుకుంటున్నాడో తెలుసుకునేలా ఈ ప్రశ్నలుంటాయి. ఎనిమిది నుంచి ఇంటర్ వరకు ఆంగ్ల పాఠ్యపుస్తకాల్లోని వ్యాకరణాంశాలు బాగా చదువుకుంటే సరిపోతుంది.
న్యూమరికల్ ఎబిలిటీ
Numerical Ability: సగటు, లాభనష్టాలు, శాతాలు, సూక్ష్మీకరణ, భిన్నాలు, నిష్పత్తి-అనుపాతం, బారువడ్డీ అంశాల్లో ప్రశ్నలుంటాయి. హైస్కూల్ గణిత పాఠ్యపుస్తకాల్లోని ఈ అధ్యాయాలు బాగా చదువుకుని, వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధనచేస్తే ఎక్కువ మార్కులు సులువుగానే సాధించవచ్చు.
రీజనింగ్, మిలటరీ ఆప్టిట్యూడ్
Reasoning, Military aptitude: వెర్బల్ స్కిల్స్, స్పేషియల్ ఎబిలిటీ (మెంటల్ ఎబిలిటీ) అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ఈ ప్రశ్నలు తర్కంతో ముడిపడి ఉంటాయి. బాగా ఆలోచించడం ద్వారా సమాధానం గుర్తించవచ్చు.
ఇంజినీరింగ్ నాలెడ్జ్ టెస్టులో సంబంధిత ఇంజినీరింగ్ విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. వీటిని ఎదుర్కోవడానికి బీటెక్ పాఠ్యపుస్తకాలు బాగా చదవడం తప్పనిసరి.
స్టేజ్ 1, 2 ఇలా...
రాత పరీక్షలో ఉత్తీర్ణులను స్టేజ్ 1, 2 పరీక్షలకు పిలుస్తారు. వీటిని ఏర్‌ఫోర్స్ సెలక్షన్ బోర్డు (ఏఎఫ్‌ఎస్‌బీ - AFSB) నిర్వహిస్తుంది. అభ్యర్థులు 1.6 కి.మీ. దూరాన్ని 10 నిమిషాల్లో చేరుకోవాలి. అలాగే 10 పుష్ అప్స్, 3 చిన్ అప్స్ తీయగలగాలి. స్టేజ్-1 స్క్రీనింగ్ టెస్టు. ఇందులో ఆఫీసర్ ఇంటలిజెన్స్ రాటింగ్ టెస్టు, పిక్చర్ పర్సెప్షన్ అండ్ డిస్కషన్ టెస్టు ఉంటాయి. చిన్న అసైన్‌మెంట్లు, పజిల్స్ లాంటి వాటి ద్వారా అభ్యర్థి మేధను పరీక్షిస్తారు. ఏదైనా చిత్రాన్ని చూపించి దానిపై విశ్లేషణ చేయమంటారు. ఇందులో అర్హత సాధించినవారే స్టేజ్-2కి వెళ్తారు. స్టేజ్-2లో సైకాలజిస్టు ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహిస్తారు.
అనంతరం ఇండోర్, అవుట్ డోర్ ఇంటరాక్టివ్ గ్రూపు టెస్టులు ఉంటాయి. వీటిలో మానసిక, శారీరక పనులు మిళితమై ఉంటాయి. అనంతరం మౌఖిక పరీక్ష నిర్వహిస్తారు. ఈ దశలన్నీ దాటినవారికి వైద్యపరీక్షలు చేపడతారు. అందులోనూ విజయవంతమైతే మెరిట్ లిస్టు తయారుచేసి శిక్షణ కోసం ఆహ్వానిస్తారు.
శిక్షణ..
అభ్యర్థులకు సంబంధిత విభాగంలో జనవరి మొదటి వారం, 2023 నుంచి శిక్షణ ప్రారంభమవుతుంది. ఫ్లయింగ్, గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ బ్రాంచ్ అభ్యర్థులకు 74 వారాలు, గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్ విభాగాల వారికి 52 వారాలు వైమానిక దళ శిక్షణ కేంద్రాల్లో తర్ఫీదునిస్తారు. ఫ్లయింగ్ బ్రాంచ్‌కు ఎంపికైనవారికి ముందుగా ఆరు నెలల పాటు ప్రాథమిక శిక్షణ ఉంటుంది. అనంతరం అభ్యర్థుల ప్రతిభ ప్రకారం.. ఫైటర్ పైలట్, ట్రాన్స్‌పోర్ట్ పైలట్, హెలికాప్టర్ పైలట్లగా విడదీసి శిక్షణను రెండు దశల్లో నిర్వహిస్తారు. ఒక్కో దశలో 6 నెలలు చొప్పున దుండిగల్, హకీంపేట, బీదర్, ఎలహంకల్లో ఈ శిక్షణ కార్యక్రమాలు ఉంటాయి.
ప్రోత్సాహకాలు...
శిక్షణ సమయంలో నెలకు రూ.56,100 చొప్పున స్ట్టైపెండ్ చెల్లిస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్న అభ్యర్థులు విధుల్లో చేరతారు. ఉద్యోగంలో చేరినవారికి రూ.56,100 మూలవేతనం లభిస్తుంది. దీనికి డీఏ, హెచ్‌ఆర్‌ఎ ఇతర అలవెన్సులు ఉంటాయి. అలాగే మిలటరీ సర్వీస్ పే (ఎంఎస్‌పీ-MSP) లో భాగంగా ప్రతి నెలా రూ.15,500 చెల్లిస్తారు. పైలట్లకు ఫ్లయింగ్ అలవెన్సు, టెక్నికల్ బ్రాంచీలవారికి టెక్నికల్ అలవెన్సు అదనంగా అందుతాయి. అన్నీ కలుపుకుని రూ.లక్షకు పైగా వేతనం లభిస్తుంది. ఇతర సౌకర్యాలూ ఉంటాయి.
శిక్షణ సమయంలో ప్రతి నెలా రూ.56,100 స్టైపెండ్ పొందవచ్చు. విధుల్లో చేరిన మొదటి నెల నుంచే రూ.లక్షకు పైగా వేతనం అందుకోవచ్చు.
ప్రశ్నల సరళి..
రాతపరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం 300 మార్కులకు ఉంటుంది. వంద ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు మూడు మార్కులు. తప్పుగా గుర్తించిన ప్రతి జవాబుకూ ఒక మార్కు చొప్పున తగ్గిస్తారు. పరీక్ష వ్యవధి రెండు గంటలు.
జనరల్ అవేర్‌నెస్, వెర్బల్ ఎబిలిటీ, రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ, మిలటరీ ఆప్టిట్యూడ్ విభాగాల నుంచి ప్రశ్నలుంటాయి. న్యూమరికల్ ఎబిలిటీ ప్రశ్నలు పదో తరగతి స్థాయిలో ఉంటాయి. మిగిలిన విభాగాల్లోని డిగ్రీ స్థాయిలో వస్తాయి. అభ్యర్థులకు అవగాహన నిమిత్తం వెబ్‌సైట్‌లో మాదిరి ప్రశ్నపత్రాలు ఉంచారు. వీటిద్వారా ప్రశ్నల తీరుపై ఒక అంచనాకు రావచ్చు. పరీక్షకు ముందు ఆన్‌లైన్ ప్రాక్టీస్ టెస్టు అందుబాటులోకి వస్తుంది.
గ్రౌండ్ డ్యూటీలో టెక్నికల్ బ్రాంచ్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నవారికి అదనంగా ఇంజినీరింగ్ నాలెడ్జ్ టెస్ట్ (ఈకేటీ-EKT) నిర్వహిస్తారు. వ్యవధి 45 నిమిషాలు. 50 ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు 3 చొప్పున వీటికి 150 మార్కులు కేటాయించారు.
ఏ అర్హతలుండాలి?
‣ ఫ్లయింగ్ బ్రాంచి, ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ (Flying branch, NCC Special entry): ఈ పోస్టులకు 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ పూర్తిచేసుకున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్/ప్లస్ 2లో మ్యాథ్స్, ఫిజిక్స్ చదివుండడం తప్పనిసరి. ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ విభాగంలో దరఖాస్తు చేసుకున్నవారికి ఎన్‌సీసీ సీనియర్ డివిజన్ సీ సర్టిఫికెట్ ఉండాలి.
వయసు: జనవరి 1, 2023 నాటికి 20 నుంచి 24 ఏళ్లలోపు ఉండాలి. జనవరి 2, 1999 - జనవరి 1, 2003 మధ్య జన్మించినవారు అర్హులు. ఎత్తు కనీసం 162.5 సెం.మీ ఉండాలి.
‣ గ్రౌండ్ డ్యూటీ - టెక్నికల్ బ్రాంచి (Ground duty technical branch): ఇందులో ఏరోనాటికల్ ఇంజినీర్ (ఎల్రక్టానిక్స్/ మెకానికల్) పోస్టులు ఉన్నాయి. సంబంధిత లేదా అనుబంధ బ్రాంచీల్లో 60 శాతం మార్కులతో బీటెక్/ బీఈ పూర్తిచేసినవారు వీటికి అర్హులు. ఇంటర్/+2లో ఫిజిక్స్, మ్యాథ్స్‌ల్లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
‣ గ్రౌండ్ డ్యూటీ- నాన్ టెక్నికల్ బ్రాంచి (Ground duty non-technical branch): ఇందులో అడ్మినిస్ట్రేషన్, లాజిస్టిక్స్, అకౌంట్స్ విభాగాలు ఉన్నాయి. అడ్మినిస్ట్రేషన్, లాజిస్టిక్స్ పోస్టులకు కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ పూర్తిచేసినవారు అర్హులు. అకౌంట్స్ పోస్టులకు 60 శాతం మార్కులతో బీకాం పూర్తిచేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు: గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్, నాన్ టెక్నికల్ పోస్టులకు జనవరి 1, 2023 నాటికి 20 నుంచి 26 ఏళ్లలోపు ఉండాలి. జనవరి 2, 1997 - జనవరి 1, 2003 మధ్య జన్మించినవారు అర్హులు. ఈ రెండు పోస్టులకు పురుషులు 157.5, మహిళలు 152 సెం.మీ.ఎత్తు తప్పనిసరి.
ఖాళీలు: అన్ని విభాగాల్లోనూ కలుపుకుని 317 ఉన్నాయి.
ఆన్‌లైన్ దరఖాస్తులు: డిసెంబరు 30 సాయంత్రం 5 వరకు స్వీకరిస్తారు.
ఫీజు: రూ.250
రాత పరీక్షలు: ఫిబ్రవరి 12, 13, 14 తేదీల్లో నిర్వహిస్తారు
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, వరంగల్, తిరుపతి.
వెబ్‌సైట్: https://afcat.cdac.in/AFCAT/
*************************************
మరింత సమాచారం ... మీ కోసం!
‣ ఇంటర్ చాలు.. వేల ఉద్యోగాలు!
‣ ఉపాధికి, ఉన్నత విద్యకు చేరువ చేసే దూరవిద్య!