• facebook
  • whatsapp
  • telegram

ఉద్యోగ‌మ‌స్తు.. ఆకాశ‌మే హ‌ద్దు!

ఏయిర్‌ఫోర్స్‌లో 334 పోస్టులు

ఫ్ల‌యింగ్‌, గ్రౌండ్ డ్యూటీ ఖాళీల భ‌ర్తీకి ప్ర‌క‌ట‌న‌

పైల‌ట్ కావాల‌నే క‌ల‌ను సాకారం చేసుకోవాలంటే ఏయిర్‌ఫోర్స్‌లో చేర‌డం అత్యుత్త‌మం. అత్యున్న‌త హోదా.. గౌర‌వంతోపాటు మంచి వేత‌న‌మూ ల‌భిస్తుంది. ఇందుకు ఎయిర్‌ ఫోర్స్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్టు (ఏఎఫ్‌ క్యాట్‌) పేరుతో ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ప్రత్యేకంగా ఏడాదికి రెండు సార్లు పరీక్ష నిర్వహిస్తోంది. ఈ విధానంలో ఎంపికైనవారు 14 ఏళ్లపాటు విధుల్లో కొనసాగుతారు. మహిళలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. నేషనల్‌ కాడెట్‌ కార్ప్‌ (ఎన్‌సీసీ)-సీ సర్టిఫికెట్‌ ఉన్నవారు ఎన్‌సీసీ స్పెషల్‌ ఎంట్రీ ద్వారా పైలట్‌ కావచ్చు. ఈ నియామకాలు కూడా ఏఎఫ్‌క్యాట్‌ తోనే చేపడతారు.

తాజాగా ఇందుకు సంబంధించిన ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. దీని ద్వారా భార‌త వాయుసేన‌లో మొత్తం 334 ఖాళీల‌ను భ‌ర్తీ చేస్తారు. ఇందులో ఏఎఫ్ క్యాట్ ఎంట్రీ విభాగంలో ఫ్ల‌యింగ్‌-96, గ్రౌండ్ డ్యూటీ(టెక్నిక‌ల్‌)-137, గ్రౌండ్ డ్యూటీ(నాన్ టెక్నిక‌ల్‌)-73 పోస్టులుండ‌గా.. ఎన్‌సీసీ స్పెష‌ల్ ఎంట్రీ విభాగంలో ఫ్ల‌యింగ్‌, మెటియోరాల‌జీ విభాగంలో 28 ఖాళీలున్నాయి. షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ విధానంలో ఈ పోస్టులు భర్తీ చేస్తారు. 

ఇదీ అర్హ‌త

ఫ్లయింగ్‌ బ్రాంచ్‌ పోస్టులకు 60 శాతం మార్కులతో ఏదైనా సాధారణ డిగ్రీ లేదా బీఈ/ బీటెక్‌ పూర్తిచేసుకున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఇంటర్లో మ్యాథ్స్‌, ఫిజిక్స్‌ తప్పనిసరి. ఆఖరు సంవత్సరం కోర్సులు చదువుతున్న విద్యార్థులు కూడా అర్హులే. క‌నీస ఎత్తు 162.5 సె.మీ ఉండాలి. 

గ్రౌండ్ డ్యూటీ టెక్నిక‌ల్ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేయాల‌నుకునేవారు ఏరోనాటిక‌ల్ ఇంజినీరింగ్‌(ఎల‌క్ట్రానిక్స్‌/మెకానిక‌ల్) విభాగాల్లో లేదా అనుంబంధ బ్రాంచీల్లో 60 శాతం మార్కుల‌తో బీటెక్‌/బీఈ పూర్తి చేసి ఉండాలి. ఇంట‌ర్‌లో ఫిజిక్స్‌, మ్యాథ్స్‌లో 60శాతం మార్కుల‌తో ఉత్తీర్ణత త‌ప్ప‌నిస‌రి. పురుషులు 157.5 సెం.మీ, మ‌హిళ‌లు 152 సెం.మీ ఎత్తు ఉండాలి. 

గ్రౌండ్ డ్యూటీ (నాన్ టెక్నిక‌ల్‌) పోస్టులకు ద‌ర‌ఖాస్తు చేసేవారు డిగ్రీలో మ్యాథ్స్‌, ఫిజిక్స్ స‌బ్జెక్టుల్లో విడిగా 55 శాతం మార్కుల‌తో ఉత్తీర్ణ‌త సాధించి ఉండాలి. దీంతోపాటు క‌నీసం 50 శాతం మార్కుల‌తో సైన్స్ కోర్సుల్లో పీజీ ఉత్తీర్ణ‌త ఉండాలి. పురుషులు 157.5 సెం.మీ, మ‌హిళ‌లు 152 సెం.మీ ఎత్తు ఉండాలి. 

వ‌య‌సు నిబంధ‌న‌

ఫ్ల‌యింగ్‌ బ్రాంచి పోస్టులకు జులై 1, 2022 నాటికి 20 నుంచి 24 ఏళ్లలోపు ఉండాలి. ఎత్తు కనీసం 162.5 సెం.మీ. ఉండాలి. గ్రౌండ్ డ్యూటీ టెక్నిక‌ల్‌/నాన్ టెక్నిక‌ల్, మెటియోరాల‌జీ బ్రాంచీల‌కు ద‌ర‌ఖాస్తు చేయాలంటే 20 నుంచి 26 ఏళ్లలోపు ఉండాలి. అవివాహితుల‌కే అవ‌కాశం.

దరఖాస్తు విధానం

ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. ఈ ప్ర‌క్రియ జూన్ 1, 2021 నుంచి ప్రారంభ‌మై జూన్  30, 2021న ముగుస్తుంది. ద‌ర‌ఖాస్తు ఫీజు ఏఎఫ్‌క్యాట్ ఎంట్రీ అభ్య‌ర్థులు రూ.250 చెల్లించాలి. మిగ‌తా ఎంట్రీల‌కు ఫీజు చెల్లించాల్సిన అవ‌స‌రం లేదు.

ఎంపిక ఇలా..

ఉమ్మడి ప్రవేశ పరీక్ష, ఇంజినీరింగ్ నాలెడ్జ్ టెస్ట్ (ఈకేటీ), పైలట్ ఆప్టిట్యూడ్ బ్యాటరీ టెస్ట్ (పీఏబీటీ), మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ నిర్వ‌హిస్తారు. 

ప‌రీక్ష విధానం

ఏఎఫ్‌క్యాట్‌-2021ను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం 300 మార్కులకు ఉంటుంది. వంద ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు మూడు మార్కులు. ఇందులో రుణాత్మ‌క మార్కులు ఉంటాయి. ప్ర‌తి త‌ప్పు స‌మాధానానికి ఒక మార్కు చొప్పున తగ్గిస్తారు. పరీక్ష వ్యవధి రెండు గంటలు. జనరల్‌ అవేర్‌నెస్, వెర్బల్‌ ఎబిలిటీ, రీజనింగ్, న్యూమరికల్‌ ఎబిలిటీ, మిలటరీ ఆప్టిట్యూడ్‌ విభాగాల నుంచి ప్రశ్నలుంటాయి. న్యూమరికల్‌ ఎబిలిటీ ప్రశ్నలు పదో తరగతి స్థాయిలో ఉంటాయి. మిగిలిన విభాగాల్లోని డిగ్రీ స్థాయిలో వస్తాయి. అభ్యర్థులకు అవగాహన నిమిత్తం వెబ్‌సైట్‌లో మాదిరి ప్రశ్నపత్రాలు ఉంచారు. వీటిద్వారా ప్రశ్నల సరళిపై ఒక అవగాహనకు రావచ్చు. పరీక్షకు ముందు ఆన్‌లైన్‌ ప్రాక్టీస్‌ టెస్టు అందుబాటులోకి వస్తుంది. టెక్నికల్‌ బ్రాంచ్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నవారికి అదనంగా ఇంజినీరింగ్‌ నాలెడ్జ్‌ టెస్ట్‌ (ఈకేటీ) నిర్వహిస్తారు. వ్యవధి 45 నిమిషాలు. 50 ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు 3 చొప్పున 150 మార్కులు కేటాయించారు.

శిక్షణ ఇలా..

ముందుగా ఆరు నెలల పాటు ప్రాథమిక శిక్షణ నిర్వహిస్తారు. ఇది ఎయిర్‌ ఫోర్స్‌ అకాడమీ - దుండిగల్‌లో ఉంటుంది. అనంతరం అభ్యర్థుల ప్రతిభ ఆధారంగా ఫైటర్‌ పైలట్‌, ట్రాన్స్‌ పోర్ట్‌ పైలట్‌, హెలికాప్టర్‌ పైలట్లుగా విడదీసి అందుకుతగ్గ శిక్షణను రెండు దశల్లో నిర్వహిస్తారు. ఈ సమయంలో నెలకు రూ.56,100 చొప్పున స్టైపెండ్‌ చెల్లిస్తారు. శిక్షణ పూర్తిచేసుకున్న అభ్యర్థులను ఫ్లయింగ్‌ ఆఫీసర్‌ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు.

సిల‌బ‌స్‌.. ప్రిప‌రేష‌న్‌

జ‌న‌ర‌ల్ అవేర్‌నెస్‌

అభ్య‌ర్థికి సామాజిక‌, వ‌ర్త‌మాన అంశాల‌పై ప‌ట్టును ఇందులో ప‌రీక్షిస్తారు. చరిత్ర‌, క్రీడ‌లు, భూగోళ‌శాస్త్రం, ప‌ర్యావ‌ర‌ణం, క‌ళ‌లు, సంస్కృతి, రాజ‌కీయాలు, పౌర‌శాస్త్రం, ర‌క్ష‌ణ రంగం త‌దిత‌ర అంశాల నుంచి ప్ర‌శ్న‌లు అడుగుతారు. నిత్యం వార్తా ప‌త్రిక‌లను అనుస‌రిస్తే ఈ ప‌రీక్ష‌లో ఎక్కువ మార్కులు సాధించ‌వ‌చ్చు. క‌రెంట్ అఫైర్స్‌పై ప‌ట్టు పెంచుకోవాలి. 

వెర్బ‌ల్ ఎబిలిటీ

ఇంగ్లిష్ గ్రామ‌ర్ నియ‌మాలు తెలిసి ఉండాలి. గ్రామర్, ఒకాబులరీ, పారా జంబుల్స్, రీడింగ్ కాంప్రహెన్షన్, సెంటెన్స్ కంప్లీష‌న్, సిన‌నిమ్స్‌, యాంట‌నిమ్స్‌, వర్డ్ మీనింగ్, ఎర్ర‌ర్ డిటెక్ష‌న్‌, ఎడిటింగ్ తదితర విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. కాంప్రహెన్షన్ ప్యాసేజీలో ముందుగా ప్రశ్నలను చదివి, గుర్తుంచుకుని తర్వాత ప్యాసేజీలో ఇచ్చిన సమాచారాన్ని చదివితే అవసరమైన సమాచారమేదో గుర్తించడం సులభంగా ఉంటుంది. వీటిపై దృష్టి పెట్టాలంటే నిత్యం తప్పకుండా ఆంగ్ల పత్రికలు చదవాలి. 

న్యూమ‌రిక‌ల్ ఎబిలిటీ

ఈ విభాగంలో స‌గ‌టు, లాభ‌న‌ష్టాలు, శాతాలు, సూక్ష్మీక‌ర‌ణ, భిన్నాలు, రేషియో అండ్ ప్ర‌పోష‌న్, సింపుల్ ఇంట్రెస్ట్ త‌దిత‌ర అంశాల నుంచి ప్ర‌శ్న‌లు వ‌స్తాయి. ఇవి అభ్య‌ర్థి ప‌రిజ్ఞానాన్ని ప‌రిశీలించేలా ఉంటాయి. 

రీజ‌నింగ్‌, మిల‌ట‌రీ ఆప్టిట్యూట్‌

ఇందులో వెర్బ‌ల్ స్కిల్స్‌, స్పేషియ‌ల్ ఎబిలిటీకి సంబంధించిన ప్ర‌శ్న‌లు అడుగుతారు. రీజ‌నింగ్‌లో పజిల్స్‌, సిట్టింగ్ అరేంజ్‌మెంట్స్‌, ర్యాంకింగ్‌, కోడింగ్-డీకోడింగ్‌, డైరెక్ష‌న్ అండ్ డిస్టెన్స్ త‌దిత‌రాల నుంచి వస్తాయి. ఈ ప‌రీక్ష‌లో త‌గిన విధంగా ఆలోచించి స‌మాధానాలు గుర్తించాలి. 

వెబ్‌సైట్‌: https://careerindianairforce.cdac.in

Posted Date : 28-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌