• facebook
  • whatsapp
  • telegram

నింగిలోనా.. నేలపైనా..!

ప్రతిభ చూపితే పక్కా కొలువు 
వాయుసేనతో అద్భుత కెరియర్‌

విలువైన ఉద్యోగాలు ఒడిసిపట్టడమే లక్ష్యంగా యువతరం ముందుకు కదులుతోంది. సంఘంలో గుర్తింపు, చక్కని వేతనం, సౌకర్యాలు, మంచి పనివాతావరణం ఉన్న కొలువులు కుర్రాళ్లను ఆకట్టుకుంటున్నాయి. వీరి ఆశయాలకు వాయుసేన ఉత్తమ వేదికగా నిలుస్తోంది. పదో తరగతి నుంచి పీజీ వరకు వివిధ అర్హతలతో ఎన్నో రకాల ఉద్యోగాలు ఏర్‌ఫోర్స్‌లో ఉన్నాయి. వాటిలో ప్రవేశానికి ప్రతి ఆరు నెలలకు ఒకసారి  ప్రకటనలూ వెలువడుతున్నాయి! 

ప్రతిభ మీ సొంతమైతే చాలు... పైసా చెల్లించకుండా పైలట్‌ శిక్షణ అందించడానికి ఏర్‌ఫోర్స్‌ సిద్ధంగా ఉంది. శిక్షణ పూర్తయిన వెంటనే అందులోనే పైలట్‌ ఉద్యోగంలో చేరిపోవచ్చు. అత్యుత్తమ నైపుణ్యాలు ప్రదర్శిస్తే యుద్ధ విమానాలు నడిపే అర్హతనూ పొందవచ్చు. వాయుసేనలో విమానాలు, హెలికాప్టర్లు నడపడానికి పైలట్లు, వాటి నిర్వహణ, మరమ్మతుల కోసం టెక్నికల్, గ్రౌండ్‌ డ్యూటీ సిబ్బంది, దేశ రక్షణకు ఏర్‌మెన్లు...ఇలా వివిధ ఉద్యోగాలు ఉన్నాయి. 

ఏర్‌మెన్‌

ఇందులో గ్రూప్‌ ఎక్స్, గ్రూప్‌ వై అనే రెండు ట్రేడులు ఉంటాయి. వీటిలో గ్రూప్‌ వైలో మ్యుజీషియన్, మెడికల్‌ అసిస్టెంట్, ఇతర ట్రేడులు ఉంటాయి. గ్రూప్‌ ఎక్స్‌లో ఎడ్యుకేషన్‌ ఇన్‌స్ట్రక్టర్, ఇతర ట్రేడులు లభిస్తాయి. ఈ పోస్టులకు పరీక్షలో చూపిన ప్రతిభ, ఫిజికల్, మెడికల్‌ టెస్టుల ద్వారా నియామకాలు చేపడతారు.

గ్రూప్‌ వై  

మ్యుజీషియన్‌: ఈ ట్రేడు ఉద్యోగాలకు పదో తరగతి విద్యార్హతతో పోటీ పడవచ్చు. అయితే ఏదైనా సంగీత/వాద్య పరికరంలో ప్రావీణ్యం ఉండాలి. 17-25 ఏళ్లలోపువారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎత్తు కనీసం 162 సెం.మీ. అవసరం. 

మెడికల్‌ అసిస్టెంట్‌: 10+2 / ఇంటర్‌లో బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లిష్‌ సబ్జెక్టులతో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులు ఈ పోస్టులకు అర్హులు. ఇంగ్లిష్‌లో విడిగా 50 శాతం మార్కులు ఉండాలి. వయసు 17-21 ఏళ్లలోపు వారు అర్హులు. 

ఇతర ట్రేడులు: 50 శాతం మార్కులతో ఇంటర్‌ ఉత్తీర్ణులు వీటికి అర్హులు. ఆంగ్లంలో 50 శాతం మార్కులు తప్పనిసరి. వయసు 17-21 ఏళ్ల లోపు ఉండాలి. 

గ్రూప్‌ ఎక్స్‌

టెక్నికల్‌: ఈ విభాగంలో పోస్టులకు మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంగ్లిష్‌ సబ్జెక్టులతో ఇంటర్‌లో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత తప్పనిసరి. విడిగా ఆంగ్లంలో 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. లేదా 50 శాతం మార్కులతో నిర్దేశిత ట్రేడుల్లో మూడేళ్ల డిప్లొమా ఉత్తీర్ణులూ దరఖాస్తు చేసుకోవచ్చు. వీరు ఇంగ్లిష్‌ సబ్జెక్టులో 50 శాతం మార్కులతో డిప్లొమా/ఇంటర్‌/పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించాలి. వయసు 17-21 సంవత్సరాల్లోపు ఉండాలి. 

ఎడ్యుకేషన్‌ ఇన్‌స్ట్రక్టర్‌: బీఎడ్‌తోపాటు యూజీ/పీజీ అర్హతలతో ఈ పోస్టులకు పోటీ పడవచ్చు. ఇంగ్లిష్‌ ఒక సబ్జెక్టుగా బీఏ లేదా ఫిజిక్స్‌ /సైకాలజీ/ కెమిస్ట్రీ /మ్యాథ్స్‌/ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ/ కంప్యూటర్‌ సైన్స్‌/ స్టాటిస్టిక్స్‌ వీటిలో ఏదైనా ఒక సబ్జెక్టుతో బీఎస్సీ లేదా బీసీఏ చదివినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత కోర్సులో 50 శాతం మార్కులుండాలి. వీటితోపాటు 50 శాతం మార్కులతో బీఎడ్‌ ఉత్తీర్ణత సాధించాలి. వయసు 20-25 ఏళ్లలోపు ఉండాలి. ఎంఏ- ఇంగ్లిష్‌ /సైకాలజీ లేదా ఎమ్మెస్సీ-మ్యాథ్స్‌ /ఫిజిక్స్‌/ స్టాటిస్టిక్స్‌/ కంప్యూటర్‌ సైన్స్‌/ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ లేదా ఎంసీఏ వీటిలో ఏదైనా కోర్సులో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. 50 శాతం మార్కులతో బీఎడ్‌ తప్పనిసరి. వయసు 20 - 28 ఏళ్లలోపు ఉండాలి. 

ఆఫీసర్‌ ఉద్యోగాలు

ఆఫీసర్‌ హోదాతో ఫ్లయింగ్, గ్రౌండ్‌ డ్యూటీ (టెక్నికల్, నాన్‌ టెక్నికల్‌) విభాగాల్లో విధులు ఉంటాయి. ఫ్లయింగ్‌ బ్రాంచీలో ఎంపికైనవారు పైలట్‌ సేవలు అందిస్తారు. ఏర్‌ఫోర్స్‌లో 3 రకాల పైలట్లు ఉంటారు. శిక్షణ సమయంలో వారు చూపిన ప్రతిభ ప్రకారం కేటాయింపులు ఉంటాయి. యుద్ధ విమానాలు నడిపేవాళ్లు ఫైటర్స్‌. సరకు, మనుషులను తీసుకెళ్లేవారు ట్రాన్స్‌పోర్టర్లు. హెలికాప్టర్లను నడిపేవాళ్లు హెలికాప్టర్‌ పైలట్లు. గ్రౌండ్‌ డ్యూటీ టెక్నికల్‌ విభాగంలో అవకాశాలు సొంతం చేసుకున్నవారికి మెకానికల్, ఎలక్ట్రికల్‌ విభాగాల్లో ఉద్యోగాలు లభిస్తాయి. గ్రౌండ్‌ డ్యూటీ నాన్‌ టెక్నికల్‌లో అడ్మినిస్ట్రేషన్, అకౌంట్స్, లాజిస్టిక్స్, ఎడ్యుకేషన్, మెటీరియాలజీ శాఖల్లో అవకాశాలు లభిస్తాయి. ఆయా విభాగాల్లోకి ప్రవేశ మార్గాలు ఇలా లభిస్తాయి. 

ఫ్లయింగ్‌ బ్రాంచ్‌ 

ఫ్లయింగ్‌ బ్రాంచ్‌ (పైలట్‌) ఉద్యోగాలను యూపీఎస్‌సీ నిర్వహించే ఎన్‌డీఏ, సీడీఎస్‌ఈలతోపాటు ఏఎఫ్‌ క్యాట్‌- ఎస్‌ఎస్‌సీ స్పెషల్‌ ఎంట్రీ (మెన్‌ అండ్‌ విమెన్‌), ఎన్‌సీసీ స్పెషల్‌ ఎంట్రీ (మెన్‌) ద్వారా దక్కించుకోవచ్చు. 

ఎన్‌డీఏ

ఇంటర్మీడియట్‌ విద్యార్హతతోనే ఏర్‌ఫోర్స్‌లో పైలట్‌ అయ్యే అవకాశం యూపీఎస్‌సీ నిర్వహించే నేషనల్‌ డిఫెన్స్‌ అకాడెమీ (ఎన్‌డీఏ) పరీక్షతో సొంతం చేసుకోవచ్చు. మ్యాథ్స్, ఫిజిక్స్‌ సబ్జెక్టులతో ఇంటర్‌ పూర్తిచేసినవారు, ఆఖరు సంవత్సరం కోర్సు చదువుతున్నవాళ్లు వీటికి అర్హులు. వయసు 16 1/2 - 19 1/2 ఏళ్లలోపు ఉండాలి. ఎత్తు 162.5 సెం.మీ. అవసరం. ఏడాదికి రెండుసార్లు జనవరి, ఆగస్టుల్లో ప్రకటన వెలువడుతుంది. ఒక్కో విడతలో 90కి పైగా ఖాళీలను భర్తీ చేస్తారు. రాతపరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. వీరికి నేషనల్‌ డిఫెన్స్‌ అకాడెమీ (ఎన్‌డీఏ) పుణెలో శిక్షణ ఉంటుంది. వీరు శిక్షణతోపాటు బీటెక్‌ విద్య అభ్యసిస్తారు. విజయవంతంగా కోర్సు పూర్తిచేసుకున్నవారికి జేఎన్‌యూ, న్యూదిల్లీ ఇంజినీరింగ్‌ డిగ్రీలను ప్రధానం చేస్తుంది. అనంతరం ఏర్‌ఫోర్స్‌ కేంద్రాల్లో పైలట్‌ సమగ్ర శిక్షణ అందిస్తారు. దీన్ని విజయవంతంగా పూర్తిచేసుకున్నవారు ఫ్లయింగ్‌ ఆఫీసర్‌ హోదా పొందుతారు.

సీడీఎస్‌ఈ

కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ (సీడీఎస్‌ఈ) పేరుతో యూపీఎస్‌సీ ఈ పరీక్షను నిర్వహిస్తోంది. ప్రకటనలు ఏడాదికి రెండుసార్లు జూన్, అక్టోబరుల్లో వెలువడతాయి ఒక్కో విడతలో 30కిపైగా ఖాళీలు ఉంటాయి. ఏర్‌ఫోర్స్‌ ఫ్లయింగ్‌ బ్రాంచ్‌ ఉద్యోగాలను ఈ పరీక్షతో పొందవచ్చు. ఇంటర్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్‌ చదువుకున్న గ్రాడ్యుయేట్లు వీటికి అర్హులు. వయసు 20 - 24 ఏళ్లలోపు ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్‌ టెస్టుల ద్వారా నియామకాలు చేపడతారు. 

ఎస్‌ఎస్‌సీ ఎంట్రీ

ఈ విధానంలో ఎంపికైనవారు 14 ఏళ్లు విధుల్లో కొనసాగి వైదొలగాల్సి ఉంటుంది. అయితే అవసరాలు, అభ్యర్థుల సమర్థత ప్రకారం వీరిని శాశ్వత ఉద్యోగంలోకీ తీసుకుంటారు. పురుషులతోపాటు మహిళలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఏదైనా డిగ్రీలో కనీసం 60 శాతం మార్కులు ఉండాలి. దీంతోపాటు మ్యాథ్స్, ఫిజిక్స్‌ సబ్జెక్టుల్లో 60 శాతం మార్కులతో ఇంటర్‌ ఉత్తీర్ణత సాధించడం తప్పనిసరి.

ఏఎఫ్‌ క్యాట్‌

ఏర్‌ఫోర్స్‌ కామన్‌ అడ్మిషన్‌ టెస్టు (ఏఎఫ్‌క్యాట్‌)తో ఫ్లయింగ్‌ బ్రాంచి అవకాశాలు సొంతం చేసుకోవచ్చు. ఇందులో రెండు విభాగాల్లో పైలట్‌ కావచ్చు. అవి ఎస్‌ఎస్‌సీ ఎంట్రీ, ఎన్‌సీసీ స్పెషల్‌ ఎంట్రీ. ఈ పరీక్షకు సంబంధించి ప్రకటనలు ఏడాదికి రెండుసార్లు జూన్, డిసెంబరుల్లో వెలువడతాయి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్‌ టెస్టుల ద్వారా నియామకాలు చేపడతారు.

ఎన్‌సీసీ స్పెషల్‌ ఎంట్రీ

ఎన్‌సీసీ సి సర్టిఫికెట్‌ ఉన్నవారికి ఈ విధానంలో ఫ్లయింగ్‌ బ్రాంచిలో అవకాశం కల్పిస్తున్నారు. పురుషులే ఈ పోస్టులకు అర్హులు. కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు ఇంటర్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్‌ చదివుండడం తప్పనిసరి.

శిక్షణ...హోదా..

ఏర్‌ మెన్‌ పోస్టులకు ఎంపికైనవారికి బెళ్గంలోని ఏర్‌ఫోర్స్‌ ప్రాథమిక శిక్షణ కేంద్రంలో తర్ఫీదునిస్తారు. విజయవంతంగా దీన్ని ముగించుకున్నవారికి సంబంధిత కేంద్రాల్లో ట్రేడ్‌ శిక్షణ ఉంటుంది. గ్రూప్‌ ఎక్స్‌ టెక్నికల్‌ ఉద్యోగులు వివిధ విభాగాల్లో ఫిట్టర్‌ హోదాతో సేవలందిస్తారు. ఎడ్యుకేషన్‌ ఇన్‌స్ట్రక్టర్‌ పోస్టులకు ఎంపికైనవారు ఏర్‌మెన్‌కు శిక్షణ కేంద్రాల్లో తర్ఫీదునిస్తారు. గ్రూప్‌ వై టెక్నికల్‌ విభాగంలో ఎంపికైనవారు కమ్యూనికేషన్‌/ ఆటోమొబైల్‌ టెక్నీషియన్‌ హోదాతో విధులు నిర్వర్తిస్తారు. నాన్‌ టెక్నికల్‌ విభాగంలో మ్యుజీషియన్‌ పోస్టుల్లో చేరినవారు మ్యుజీషియన్లుగా, మెడికల్‌ విభాగంలోనివారు మెడికల్‌ అసిస్టెంట్‌ హోదాతో చెలామణి అవుతారు. నాన్‌ టెక్నికల్‌ ట్రేడుల్లో మిగిలినవారు అడ్మిన్‌ / అకౌంట్స్‌/ లాజిస్టిక్స్‌ / ఆపరేషన్స్‌...మొదలైన విభాగాల్లో అసిస్టెంట్లుగా కొనసాగుతారు. ఏర్‌ ఫోర్స్‌ సెక్యూరిటీ/ పోలీస్‌ సేవలు అందిస్తారు. 

వీరందరికీ కెరియర్‌ ప్రారంభంలో ఏర్‌ క్రాఫ్ట్స్‌మెన్‌ హోదా కేటాయిస్తారు. వీరు భవిష్యత్తులో మాస్టర్‌ వారంట్‌ ఆఫీసర్‌ స్థాయి వరకు చేరుకుంటారు. గ్రూప్‌ ఎక్స్, వై విభాగాల వారికి శిక్షణ సమయంలో రూ.14,600 స్టైపెండ్‌ ప్రతినెలా అందుతుంది. అనంతరం గ్రూప్‌ వై విభాగంలో విధులు నిర్వర్తించేవారికి రూ.26,900, గ్రూప్‌ ఎక్స్‌ టెక్నికల్‌ పోస్టులకు రూ.33,100, ఎడ్యుకేషన్‌ ఇన్‌స్ట్రక్టర్లకు రూ.40,600 మూలవేతనం లభిస్తుంది. దీనికి అదనంగా డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ప్రోత్సాహకాలు దక్కుతాయి. 60 వార్షిక, 20 సాధారణ సెలవులు పొందవచ్చు.

వెబ్‌సైట్లు: http://www.careerairforce.nic.in/, https://afcat.cdac.in/AFCAT/, www.upsc.gov.in/

Posted Date : 10-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌