• facebook
  • whatsapp
  • telegram

పునశ్చరణకు అధిక ప్రాధాన్యం

ఉపాధ్యాయ నియామక పరీక్షలో విద్యాదృక్పథాలు (పర్‌స్పెక్టివ్స్‌) అనే పేపర్‌ను కొత్తగా జోడించారు. మెథడాలజీ సబ్జెక్టును విస్తృతం చేశారు. ‘తరగతి అన్వయం, విద్యా మనస్తత్వశాస్త్రం’గా పేర్కొన్న సైకాలజీలో అన్వయం (అప్లికేషన్‌)తో కూడిన ప్రశ్నలు ఇస్తారు. ప్రశ్నల నిడివి కూడా ఎక్కువ ఉండే ఈ పేపర్‌.. పరీక్ష విజయంలో కీలక పాత్ర వహిస్తుంది. అందుకే అభ్యర్థులు పరిమితమైన కంటెంట్‌ సిలబస్‌తో పాటు అన్వయంతో కూడిన ప్రశ్నలతో ఉండే సైకాలజీని అధికంగా సాధన చేయాలి.

సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్జీటీ)లకు టెట్‌ కమ్‌ టీఆర్‌టీ; స్కూల్‌ అసిస్టెంట్‌, లాంగ్వేజ్‌ పండిట్స్‌, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌, మ్యూజిక్‌, ఆర్ట్‌, క్రాఫ్ట్‌, డ్రాయింగ్‌ టీచర్లకు టీఆర్‌టీ జ‌రిగింది. దీంతోపాటు మోడల్‌ స్కూల్‌ ప్రిన్సిపల్స్‌, పీజీటీ, టీజీటీ ఉద్యోగాలకు నియామక పరీక్షలో ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌ నిర్వహించారు. అభ్యర్థులు దీనిలో తప్పనిసరిగా క్వాలిఫై కావాల‌ని నిర్ణ‌యించారు.

సిలబస్‌ ఏమిటి?

అన్ని కేటగిరీల ఉపాధ్యాయ నియామక పరీక్షలో జనరల్‌ నాలెడ్జ్‌, కరెంట్‌ అఫైర్స్‌, విద్యా దృక్పథాలు, మనోవిజ్ఞాన శాస్త్రం, సంబంధిత కంటెంట్‌, సంబంధిత మెథడాలజీ ఉంటుంది. ఈ అంశాల సన్నద్ధతకు సంబంధించి ఒక్కో అంశాన్నీ వివరంగా పరిశీలిద్దాం!

జనరల్‌ నాలెడ్జ్‌, కరెంట్‌ అఫైర్స్‌

స్టాండర్డ్‌ జీకేతోపాటూ ప్రస్తుతం జరుగుతున్న వర్తమాన అంశాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. ఇందులో అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర స్థాయి అంశాలను చదవాల్సిన అవసరం ఉంది. క్రీడలు, అవార్డులు, అంతర్జాతీయ జాతీయ సంస్థలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, శాస్త్ర, సాంకేతిక అంశాలు, వర్తమాన వార్తల్లోని ప్రశ్నలు, కమిటీలు, రాష్ట్ర, జాతీయ చిహ్నాలు, అంతరిక్ష, అణు సాంకేతిక అంశాలు, జనాభా లెక్కలు, దేశాలు - ప్రాముఖ్య పరంగా రాజధానులు, కరెన్సీ లాంటి అంశాలు తప్పనిసరి.

కంటెంట్‌ - మెథడ్స్‌

ఈ విభాగంలో నిర్దేశిత సిలబస్‌ నుంచి మాత్రమే ప్రశ్నలు వస్తాయి. అధిక భాగం తెలుగు అకాడమీ పుస్తకాలకు ప్రాధాన్యం ఇవ్వాలి.

1. ఉన్న తక్కువ సమయాన్ని దృష్టిలో ఉంచుకుని సబ్జెక్టు మార్కుల భారత్వాన్ని (వెయిటేజీ) బట్టి సమయాన్ని కేటాయిస్తూ చదవాలి.

2. ప్రతిరోజూ చదువుతున్న అంశాలకు కొలమానంగా చదివిన అంశాన్ని పరీక్షించుకోవాలి. రోజువారీ పరీక్షలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి.

3. సిలబస్‌లో పొందుపరచిన అంశాలకు కేవలం తెలుగు అకాడమీ పుస్తకాలపైనే ఆధారపడకుండా ఇతర ప్రామాణిక పుస్తకాలను కూడా చదవాలి.

4. పరీక్షరోజు వరకూ అధ్యయనం, మాదిరి ప్రశ్నపత్రాల సాధన, తప్పులను సవరించుకుంటూ ప్రిపరేషన్‌ కొనసాగించాలి.

5. సెకండరీగ్రేడ్‌ ఉపాధ్యాయ పోస్టులకు ఈసారి పోటీ తీవ్రంగా ఉంది. కాబట్టి పోటీతత్వంతో నెగ్గితీరాలనే వైఖరితో చదవాలి.

6. ప్రిపరేషన్‌ ముందు ఇచ్చిన నూతన సిలబస్‌ను క్షుణ్ణంగా పరిశీలించి ఏమి చదవాలి? ప్రాక్టికల్‌ (అకాడమీ పుస్తకాలు) సేకరణతో ఎలా చదవాలో ప్రణాళికను రూపొందించుకొని సన్నద్ధత మొదలుపెట్టాలి.

7. పాత ప్రశ్నపత్రాల పరిశీలన కీలకం. వీటిని క్షుణ్ణంగా పరిశీలించాలి. ఎక్కువ ప్రశ్నలు ఏ అంశాలపై ఇస్తున్నారో అనే అంశాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి.

8. పరీక్షలో అవగాహన, అన్వయస్థాయి ప్రశ్నలకు అధిక ఆస్కారం ఉంది. ఇందుకు తగిన విధంగా సిద్ధపడాలి.

9. ప్రతి అంశాన్నీ ఒకేసారి చదవటం కాకుండా పునశ్చరణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి.

10. ఆత్మవిశ్వాసం కోల్పోకుండా చదివితే కొద్దిరోజుల్లో మీరు ప్రభుత్వ ఉపాధ్యాయులవుతారని గుర్తుంచుకుని ప్రేరణతో చదవాలి.

ఇవి గుర్తుంచుకోండి

రాత పరీక్ష - కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష

ఎంపిక విధానం

1. ఎస్‌ఏ, ఎల్‌పీలకు రాతపరీక్ష 80%, టెట్‌ వెయిటేజీ 20%

2. పీఈటీలకు రాతపరీక్ష 50%, ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్‌ 30%, టెట్‌ 20%

3. మ్యూజిక్‌ టీచర్లు - రాత, స్కిల్‌ టెస్ట్‌

4. క్రాఫ్ట్‌, ఆర్ట్‌, డ్రాయింగ్‌ - రాత పరీక్ష ద్వారా

5. ఎస్జీటీ - ఇంతకుముందు టెట్‌ అర్హత సాధించిన అందరూ టెట్‌ కమ్‌ టీఆర్‌టీ రాయాలి. గతంలో టెట్‌ రాసినవారికి ఏ పరీక్షలో ఎక్కువ మార్కులు వస్తే వాటినే పరిగణనలోకి తీసుకుంటారు. (గతంలో టెట్‌ రాయనివారు ఓసీ - 60%, బీసీ - 50%, ఎస్సీ/ఎస్టీ/పీహెచ్‌ వారు 40% అర్హత ఈ పరీక్షలో సాధించాలి).

విద్యా దృక్పథాలు

ఈ సబ్జెక్టు అధికంగా జ్ఞానాత్మక అంశాలపై ఆధారపడి ఉంటుంది. దీనిలోని 5 యూనిట్లను పరిశీలిద్దాం.

1) భారత విద్యారంగ చరిత్ర: భారతీయ విధాన వైవిధ్యంతో పాటూ ప్రాచీనకాల విద్య నుంచి ప్రస్తుతం మారుతున్న విద్యా విధానాలన్నీ పరిశీలించటం ముఖ్యం. రుగ్వేద కాల విద్య నుంచి మధ్యమ కాల, ఆధునిక విద్యారంగంలోని కమిటీలు, వారి సూచనల నుంచి ప్రశ్నలు వస్తాయి. ముఖ్యంగా వివిధ కమిటీలతోపాటు స్వాతంత్య్ర అనంతర సెకండరీ విద్యా కమిషన్‌, కొఠారి కమిషన్‌, ఈశ్వర్‌ భాయీ పటేల్‌ కమిటీ, జాతీయ విద్యావిధానం- 1986, సవరించిన కార్యాచరణ పథకాలను బాగా చదవాలి.

2) ఉపాధ్యాయ సాధికారత: ఉపాధ్యాయుల పనితనాన్ని ప్రోత్సహించే అంశాలు, ఉపాధ్యాయ ప్రేరణ, వారికి అవసరమైన వృత్తిపర ప్రవర్తనావళి, ఉపాధ్యాయ సాధికారతను పెంపొందించే జాతీయ, రాష్ట్రస్థాయి సంస్థలైన ఎన్‌సీఈఆర్‌టీ, ఎన్‌సీటీఈ, ఆర్‌ఐఈ, ఎస్‌సీఈఆర్‌టీ, డైట్‌ లతో పాటూ పాఠశాల రికార్డులు, రిజిస్టర్‌లపై అవగాహన పెంచుకుంటే ఈ యూనిట్‌ నుంచి మంచి మార్కులు పొందవచ్చు.

3) వర్తమాన భారతదేశంలో విద్యా సంబంధ అంశాలు: ఆధునిక సమాజంలో విద్యా ఆవశ్యకతను ఈ యూనిట్‌ ప్రతిబింబిస్తుంది. దీనిలో భారతీయ విద్యావిధానాలు, వ్యూహాత్మక కార్యక్రమాలతో పాటూ అర్థశాస్త్రం - విద్య, జనాభా విద్య ఆవశ్యకత, అక్షరాస్యతా కార్యక్రమాలు, విద్య ప్రపంచీకరణ, పట్టణీకరణ, సమానత్వం, విద్యార్థుల్లో కౌమార విద్య, విలువల విద్య, జీవన నైపుణ్య విద్య, ఆరోగ్య, వ్యాయామ విద్య ఆవశ్యకతపై అధిక ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది.

దీనితో పాటు ఏపీపీఈపీ, డీపీఈపీ, ఎన్‌పీఈజీఈఎల్‌, ఆర్‌ఎంఎస్‌ఏ, ఎస్‌ఎస్‌ఏ, ఆర్‌ఏఏ, కేజీబీవీ మోడల్‌ స్కూళ్లలో ఈ మధ్య ప్రాచుర్యం పొందుతున్న మధ్యాహ్న భోజన పథకం, ఉచిత పాఠ్య పుస్తకాలు, స్కాలర్‌షిప్‌లు, రవాణా భత్యం వంటి పథకాలతో పాటు విద్యారంగంలో ప్రాముఖ్యం కలిగిన బడి పిలుస్తోంది, బడికి వస్తా, మన

ఊరు - మన బడి, విద్యాంజలి, స్వచ్ఛ పాఠశాల, ఇన్‌స్పైర్‌, కళా ఉత్సవ్‌ వంటివి ప్రధానమైనవి.

4) బాలల చట్టాలు - హక్కులు: విద్యారంగాన్ని బాగా ప్రభావితం చేస్తున్న అంశమిది. దీనిలో ముఖ్యంగా విద్యాహక్కు చట్టం - 2009, సమాచార హక్కు చట్టం - 2005, బాలల హక్కులు, మానవ హక్కులు వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి.

5) జాతీయ ప్రణాళిక చట్టం - 2005 : యశ్‌పాల్‌ సూచనల దర్పణమే ఈ యూనిట్‌. దీనిలో ఎన్‌సీఎఫ్‌ దృక్పథం, అభ్యసనం, జ్ఞానం, విద్యా ప్రణాళికా క్షేత్రాలు, తరగతి గది వాతావరణం, సంస్థాగత సంస్కరణలు వంటి ప్రాథమిక భావనలుంటాయి.

Posted Date : 11-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌