• facebook
  • whatsapp
  • telegram

ఖాకీ కొలువులు కొట్టాలంటే..!

 

పోలీసుశాఖలో ఉద్యోగాలంటే యువతలో ఎంతో ఆకర్షణ ఉంటుంది. ఎస్‌ఐ, కానిస్టేబుళ్ళ కొలువులకు గురిపెట్టి.. శారీరక సామర్థ్య పరీక్షలకూ, రాతపరీక్షలకూ తగిన విధంగా సిద్ధమవ్వాల్సిన తరుణమిది!

 

పోస్టులనుబట్టి కనీస వయసు నిర్ణ‌యిస్తారు. బీసీ, ఎస్‌సీ, ఎస్‌టీ కేటగిరీవారికి వయఃపరిమితిలో అయిదేళ్ల సడలింపు ఉంటుంది. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో మొదటిది ప్రిలిమినరీ రాతపరీక్ష. దీనిలో 200 ప్రశ్నలు 200 మార్కులకు ఉంటాయి. 3 గంటల వ్యవధి. కానిస్టేబుల్‌, సబ్‌ఇన్‌స్పెక్టర్‌ పోస్టులకు విడివిడిగా పరీక్ష నిర్వహిస్తారు.

 

ఎస్‌ఐ ప్రిలిమినరీ పరీక్షలో 100 ప్రశ్నలు జనరల్‌స్టడీస్‌ నుంచీ, 100 ప్రశ్నలు అరిథ్‌మెటిక్‌, రీజనింగ్‌ల నుంచీ ఉంటాయి. కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ పరీక్షలో ఇంగ్లిష్‌, అరిథ్‌మెటిక్‌, రీజనింగ్‌, జనరల్‌ స్టడీస్‌ అన్నింటి నుంచీ కలిపి 200 ప్రశ్నలు వస్తాయి. ప్రిలిమినరీ పరీక్ష క్వాలిఫయింగ్‌ మాత్రమే. క్వాలిఫై అయినవారికి దేహదార్ఢ్య పరీక్షలు నిర్వహిస్తారు. దీనిలో అర్హులైన అభ్యర్థులకు మార్కులు కేటాయించి, తుది రాతపరీక్ష నిర్వహిస్తారు. వీటిలో వచ్చే మార్కుల ఆధారంగా పోస్టులు కేటాయిస్తారు.

 

కానిస్టేబుల్‌ తుది రాతపరీక్షలో 200 ప్రశ్నలుంటాయి. 200 మార్కులు. సమయం 3 గంటలు. ప్రిలిమినరీలో వచ్చిన అంశాల నుంచే ఫైనల్‌ రాతపరీక్షలోనూ వస్తాయి.

 

సబ్‌ఇన్‌స్పెక్టర్‌ తుది రాతపరీక్షలో నాలుగు పేపర్లుంటాయి. మొదటి రెండు పేపర్లు ఇంగ్లిష్‌, తెలుగు/ఉర్దూ ఉంటాయి. ఇవి కేవలం క్వాలిఫయింగ్‌ పరీక్షలే. తెలుగు పరీక్షను ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొదటిసారి నిర్వహిస్తున్నారు. ఉద్యోగ నిర్వహణలో తెలుగు రాయడంలో ఉన్న ఇబ్బందుల దృష్ట్యా ఇప్పుడు ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు. మిగిలిన రెండు పేపర్లు అరిథ్‌మెటిక్‌ అండ్‌ రీజనింగ్‌, జనరల్‌స్టడీస్‌, చివరి రెండు పేపర్లు, దేహదార్ఢ్య పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా పోస్టులు కేటాయిస్తారు. రాతపరీక్షలో రుణాత్మక మార్కులున్నాయి. తెలిసిన ప్రశ్నలనే ఎంచుకోవాలి.

 

సబ్జెక్టులు.... 

ప్రిలిమినరీ, మెయిన్స్‌ రాతపరీక్షల్లో ఇంగ్లిష్‌, అరిథ్‌మెటిక్‌, రీజనింగ్‌, జనరల్‌ సైన్స్‌, జనరల్‌ స్టడీస్‌ నుంచి ప్రశ్నలు వస్తాయి.

 

ఇంగ్లిష్‌: పోలీసుశాఖ ఉద్యోగులు వృత్తిరీత్యా పై అధికారులకు సమాచారం చేరవేసే క్రమంలో మెయిల్‌, లెటర్లు/ వివిధ అప్లికేషన్లు పూర్తిచేయాల్సి ఉంటుంది. సమాచారాన్ని క్లుప్తంగా వీలైనంత తక్కువ పదాల్లో, సూటిగా వివరించాల్సి ఉంటుంది. అదేవిధంగా ప్రభుత్వ ఉత్తర్వులు, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు, పై అధికారుల ఆదేశాలు ఇంగ్లిష్‌లోనే వస్తాయి. కాబట్టి ఇంగ్లిష్‌ భాషపై అభ్యర్థికి ఉన్న పరిజ్ఞానాన్ని పరీక్షించేలానే ప్రశ్నలుంటాయి.

 

తెలుగు: పోలీసుశాఖ ఉద్యోగులకు తెలుగుపై కనీసావగాహన ఉండాలి. కాబట్టి ఈ పరీక్ష నిర్వహిస్తారు. అయితే ఇది కేవలం క్వాలిఫయింగ్‌ పరీక్షే.

 

జనరల్‌ సైన్స్‌, స్టడీస్‌: భారతదేశ చరిత్ర, భౌగోళికాంశాలు, ఆర్థికాంశాలు, రాజకీయాంశాలపై ప్రశ్నలుంటాయి. తెలంగాణ చరిత్ర, భౌగోళికాంశాలు, రాష్ట్ర అవతరణ, తెలంగాణ అమరుల చరిత్ర, సాయుధ కమిటీలు, నిజాం నవాబుల చరిత్ర, ఆర్థికాంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. శాస్త్రీయ, సాంకేతిక అంశాలు, కరెంట్‌ అఫైర్స్‌ చూసుకోవాలి. తెలుగు అకాడమీ 8, 9, 10 తరగతుల పాఠ్యపుస్తకాలు చదివి నోట్స్‌ తయారు చేసుకుంటే మంచిది.

కరెంట్‌ అఫైర్స్‌ నుంచి వైరస్‌, టీకాలు, వ్యాక్సిన్లు, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, ముఖ్యమైన వ్యక్తులు, క్రీడలు, అవార్డులు, రాష్ట్రంలో నూతనంగా ప్రారంభించిన సంస్థలు, రాష్ట్రాలు-ముఖ్యమంత్రులు, దేశాలు-ప్రధానమంత్రులు, రాష్ట్ర జంతువులు, ముఖ్యమైన కట్టడాలు చూసుకోవాలి.

 

పోలీసుశాఖ స్వరూపం మారింది

ఒంటిపై ఖాకీ దుస్తులు, తలపై ఠీవీగా నిలిచిన టోపీ, చేతిలో లాఠీ.. ప్రభుత్వ వాహనం దిగీదిగగానే వినమ్రంగా ముందుకొచ్చి నిల్చునే జనం.. ఈ దృశ్యం పోలీసు శాఖలోకి ప్రవేశించాలనుకునే యువతీయువకులకు స్ఫూర్తి కలిగిస్తుంది. మంచి ప్రతిభ చూపి కష్టపడి డిపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశిస్తే చాలు, ఆపై ఆ దర్జానే వేరు అనుకునే యువత.. మారిన పోలీసుశాఖ స్వరూపాన్ని అర్థం చేసుకోవాలి. పరివర్తన చెందిన పోలీసు వ్యవస్థలో తాము నిర్వర్తించాల్సిన పాత్రను అంచనా వేసుకోవాలి. అందుకు తగ్గట్టుగా తమ వైఖరినీ, నైపుణ్యాలనూ పెంచుకోవాలి.

 

ఫ్రెండ్లీ పోలీసింగ్‌, సోషల్‌ పోలీసింగ్‌ వంటి ఉదాత్త ధోరణులు విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి. పోలీసు శాఖ, సమాజం మధ్య దూరాన్ని తగ్గించడమే వీటి లక్ష్యం. జనంతో మమేకం కావడం నేటి పోలీసు వ్యవస్థ ధ్యేయాల్లో ఒకటి.

 

లాఠీతో జనాన్ని నియంత్రణలో ఉంచాలన్న పాత విధానానికి ఇప్పుడు కాలం చెల్లింది. లాఠీ స్థానంలో విశ్వాసం, సాంకేతిక పరిజ్ఞానం (ఐటీ) అమల్లోకి వచ్చాయి. పోలీసు స్టేషన్ల నిర్మాణంలో బాహ్య స్వరూపం నుంచి పోలీసు సిబ్బంది వైఖరిలో ఈ మార్పు కనిపిస్తోంది. నూతన సిబ్బంది నియామకం, శిక్షణ ద్వారా నూతన వైఖరి, ధోరణులను వారిలో ప్రోది చేయడం, రోజువారీ వృత్తి బాధ్యతల్లో విరివిగా సాంకేతిక పరిజ్ఞాన వినియోగం వంటివాటిని తెలంగాణ రాష్ట్ర పోలీసు లక్ష్యాలుగా అవగాహన చేసుకోవచ్చు.

 

సాంకేతిక పరిజ్ఞానంలో..

తెలంగాణ పోలీసుశాఖ సాంకేతిక పరిజ్ఞాన వినియోగంలో దేశంలోనే అగ్రపథాన ఉంది. రహదారిలో నాలుగు కూడళ్ల వద్ద ట్రాఫిక్‌ పోలీసు నిలబడి, గీత దాటినవారిని పట్టుకోవడం వంటి సనాతన సాంప్రదాయిక పరిస్థితి ఒకప్పటిది. ఇప్పుడు వివిధ కూడళ్ల వద్ద ట్రాఫిక్‌ సమాచారాన్ని సీసీ కెమెరాల ద్వారా అందుకుంటున్న చిత్రాలను పెద్ద తెరలపై చూసే మార్పు వచ్చేసింది. గీత దాటినవారి వాహనాలను గుర్తించి అపరాధ రుసుము వివరాలను వారి చరవాణులకు పంపే సాంకేతిక పరిజ్ఞానాన్ని పోలీసుశాఖ అందిపుచ్చుకుంది.

 

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన ఉపకరణాల ద్వారా పోలీసుశాఖ సామాన్య ప్రజలకు చేరువ అవుతోంది. ఉదా: హాక్‌ ఐ (పౌరులు డౌన్‌లోడ్‌ చేసుకోగల యాప్‌) ద్వారా తమను ఎవరైనా మోసం చేయాలనుకుంటే వెంటనే ఫోన్‌ ద్వారానే ఫిర్యాదు చేయడం, కమ్యూనిటీ సీసీసీ టీవీలు, వాట్సాప్‌ గ్రూప్‌లు (ఇందులో స్థానిక ప్రజలు, స్థానిక పోలీస్‌ స్టేషన్‌ సీఐ, ఎస్‌ఐ ఉంటారు) టీఎస్‌ కాప్‌ (పోలీసులు ప్రజలకు మధ్య అనుసంధానం), ఈ-ఆఫీసు (డీజీపీ కార్యాలయం నుంచి పోలీస్‌స్టేషన్‌ వరకు వివిధ స్థాయిలో దైనందిన వృత్తి కార్యకలాపాలకు ఎలక్ట్రానిక్‌ వేదిక). ఈ-పెట్టీ కేస్‌ (చిల్లర మల్లర రహదారి, వీధి తగాదాల పరిష్కారం) యాప్‌. ఇప్పటికే విశేష ఆదరణ పొందిన షీ టీమ్స్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు!

 

మొత్తమ్మీద పోలీసుశాఖలో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌, కానిస్టేబుల్‌ పోస్టులను ఆశిస్తున్న యువతీయువకులు ఒకపక్క ఎంపిక దశల్లోని పరీక్షలకు సన్నద్ధం కావడం ఎంత ముఖ్యమో మరోపక్క మారిన పోలీసుశాఖ స్వరూపాన్ని అవగతం చేసుకోవడం ద్వారా అటు ఎంపిక దశల్లోనూ ఇటు వృత్తిలోనూ విజయాన్ని సొంతం చేసుకోవచ్చు.

Posted Date : 14-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌