• facebook
  • whatsapp
  • telegram

కానిస్టేబుల్స్ - శారీరక సామర్థ్య పరీక్ష

‣ శారీరక పరీక్షల (పీఈటీ) సన్నద్ధత మార్గాలు

రాష్ట్రంలో పోలీస్ విభాగంలోని పోలీస్ కానిస్టేబుల్స్‌తోపాటు ఎస్ఐ, ఫైర్ డిపార్ట్‌మెంట్, డిప్యూటీ జైలర్స్, జైల్ వార్డర్స్, కమ్యూనికేషన్ ఎస్ఐ, కమ్యూనికేషన్స్ కానిస్టేబుల్ మొదలైన విభాగాలకు శారీరక సామర్థ్య పరీక్షలు ఒకేవిధంగా ఉంటాయి. రాతపరీక్షలో కొద్దిపాటి తేడాలుంటాయి. శారీరక సామర్థ్య పరీక్షల తర్వాత రాత పరీక్షకు సమయం తక్కువగా ఉంటుంది. అందువల్ల రాత పరీక్షకు కూడా మొదటి నుంచే ప్రాధాన్యం ఇవ్వాలి.
పోలీస్ కానిస్టేబుల్ నియామక ప్రక్రియలో భాగంగా పరుగు పోటీలలో ఉత్తీర్ణత సాధించిన వారికి శారీరక సామర్థ్య పరీక్షలు (పీఈటీ) జరుగుతాయి. క్లిష్టమైన ఈ దశలో విజయం సాధించాలంటే ఇప్పటి నుంచే సరైన ప్రణాళికతో సిద్ధం కావాలి. శారీరక సామర్థ్య పరీక్షలకు ఉదయం, సాయంత్రం తప్పనిసరిగా సాధన చేయాలి. ఈ సాధన ఎలా ఉండాలో తెలుసుకుందాం.

రన్నింగ్‌లో ఉత్తీర్ణులైన 
అభ్యర్థులు 5 రకాల ఈవెంట్స్‌ను పూర్తిచేయాలి. ఈవెంట్స్‌లో ప్రతిభను సివిల్ కానిస్టేబుల్ పోస్టులకు ఎంపికలో పరిగణనలోకి తీసుకోరు. అర్హత మార్కులు సాధిస్తే సరిపోతుంది. కానీ ఏఆర్, ఏపీఎస్‌పీ, ఎస్‌పీఎఫ్, ఎస్ఏఆర్‌సీపీసీఎల్ కేటగిరీల పోస్టులకు ఈవెంట్స్ మార్కులను కూడా కలిపి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఫిజికల్ ఈవెంట్స్‌లో ఒక్కోదానికి 15 మార్కులు కేటాయించారు. అంటే 5 విభాగాలకు మొత్తం 75 మార్కులకు ఈ పరీక్షలు ఉంటాయి. 

800 మీటర్ల పరుగు 
ఈవెంట్స్‌లో ఎక్కువమంది అభ్యర్థులకు కష్టమనిపించే పరీక్ష 800 మీటర్ల పరుగు. అభ్యర్థులు దీన్ని 170 సెకన్లలో పూర్తిచేయాలి. ప్రణాళిక ప్రకారం సాధన చేస్తే దీన్ని సులువుగా అధిగమించవచ్చు. అన్ని జిల్లాల్లోనూ 400 మీటర్ల ట్రాక్‌పై ఈ పరుగు పందేన్ని నిర్వహిస్తారు. అంటే రెండు రౌండ్లలో పరుగును పూర్తిచేయాలి. దీనికోసం అభ్యర్థులు మంచి గ్రౌండ్‌ను ఎంచుకొని 200 మీటర్ల ట్రాక్‌పై సాధన చేయాలి. ఇదే ట్రాక్‌పై 170 సెకన్లలో 800 మీటర్ల పరుగు పూర్తయ్యే విధంగా సాధన చేస్తే సెలక్షన్స్‌లో 4 నుంచి 5 సెకన్ల సమయం మిగులుతుంది. 200 మీటర్ల ట్రాక్‌పై సాధన చేసిన అభ్యర్థి 400 మీటర్ల ట్రాక్‌పై సులువుగా లక్ష్యాన్ని ఛేదించగలడు. అభ్యర్థులు మొదటిరోజు నుంచే సమయాన్ని నిర్ణయించుకొని సాధన చేయకూడదు. 10-15 రోజుల తర్వాత వారానికి రెండు లేదా మూడు సార్లు సమయంతో సెల్ఫ్ టెస్ట్ చేసుకుంటే సరిపోతుంది.  పరుగులో ముఖ్యంగా అభ్యర్థి కాలి అంగల దూరం పెంచుకునేటట్లు సాధన చేయాలి. సాధారణంగా అభ్యర్థులు రన్నింగ్ మొదటినుంచి వేగం పెంచకుండా, చివరి పాయింట్‌కు వచ్చేముందు వేగాన్ని పెంచుతారు.ఇలా చేయడం వల్ల కొన్ని సెకన్ల సమయం వృధా అవుతుంది. అభ్యర్థులు ట్రాక్‌పై రన్నింగ్ ప్రారంభించినప్పటినుంచే వేగాన్ని పెంచుకోవాలి. దీనిద్వారా సమయం వృధాకాదు. 

100 మీటర్ల పరుగు 
ఈ పరుగు పందేన్ని పురుష అభ్యర్థులు 15 సెకన్లలో, మహిళా అభ్యర్థులు 18 సెకన్లలో పూర్తిచేయాలి. అభ్యర్థి పరిగెత్తాల్సింది 100 మీటర్లే కాబట్టి అభ్యర్థులు సమయం అసలు వృధా కాకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. దృష్టి అంతా ప్రారంభ పాయింట్, ముగింపు పాయింట్ మీదే ఉండాలి. పరుగు ప్రారంభించేటప్పుడే వేగం పెంచి చివరివరకు అదే వేగాన్ని కొనసాగించాలి. 

లాంగ్ జంప్ ఎలా?: 
లాంగ్ జంప్ అనేది అభ్యర్థి దూకే సామర్థ్యాన్ని తెలుసుకోవడానికి నిర్వహించే పరీక్ష. పురుష అభ్యర్థులు 3.80 మీటర్లు, మహిళా అభ్యర్థులు 2.75 మీటర్లు దూకాలి. దీని కోసం అభ్యర్థులు ముందుగా దూకే పద్ధతులు, టెక్నిక్‌లను తెలుసుకోవాలి. స్టాండింగ్ జంప్, రన్నింగ్ జంప్ విధానాల ద్వారా సాధన చేయాలి. టేకాఫ్ బోర్డుకు నిలబడి 10 నుంచి 15 సార్లు ఇసుకలోకి స్టాండింగ్ జంప్ సాధన చేయాలి. తర్వాత సెవెన్ స్టెప్స్, అంటే టేకాఫ్ బోర్డుకు 7 మీటర్ల దూరం తీసుకొని పరిగెత్తుతూ ఇసుకలోకి జంప్ చేయాలి. దీన్ని 10 సార్లు సాధన చేశాక టేకాఫ్ బోర్డుకు 20 మీటర్ల దూరం నుంచి పరిగెత్తుతూ జంప్ చేయాలి. ఈ మూడు అంచెలుగా లాంగ్‌జంప్ సాధనచేస్తే ప్రయోజనం ఉంటుంది. 
‣ లాంగ్ జంప్ దూకేముందు దగ్గరగా స్టెప్స్ వేసుకుంటూ వేగంగా పరిగెత్తుతూ జంప్ చేయాలి. దీనివల్ల జంప్ స్థాయి పెరుగుతుంది.
‣ టేకాఫ్ బోర్డు నుంచి ఇసుకలోకి జంప్ చేసే ముందు శరీరాన్ని ముందుకు లేదా వెనుకకు వంచి దూకడం అలవాటు చేసుకోవాలి. 
‣ సాధన అలవాటైన తర్వాత టేకాఫ్ బోర్డుకు, పరిగెత్తడానికి తీసుకునే దూరం 20 మీటర్లు ఉండేలా చూసుకోవాలి. 

సులువుగా షాట్‌పుట్ 
అభ్యర్థులకు తేలికైన ఈవెంట్ షాట్‌పుట్. ఇందులో అబ్బాయిలు 7.26 కి.గ్రా. బరువు గల ఇనుప గుండును 5.60 మీటర్లు వేయాలి. అమ్మాయిలు 4 కి.గ్రా.ల ఇనుప గుండును 4.50 మీటర్లు విసరాలి. దీనికోసం అభ్యర్థులు రోజూ 10 సాధన చేస్తే సరిపోతుంది. వచ్చింది కదా అని మధ్యలో ఆపవద్దు. ఇందులో స్టాండింగ్ త్రో, స్టెప్స్ త్రో పద్ధతుల ద్వారా సాధన అవసరం. షాట్‌పుట్‌ను ముందుగా నిలబడి వేయడం, తర్వాత ఒక స్టెప్ ముందుకు దూకి వేయడం సాధన చేయాలి. 
‣ సెలక్షన్స్‌లో అభ్యర్థి చుంటూ గుండ్రంగా వృత్తాకారంలో సర్కిల్ ఉంటుంది. అభ్యర్థి ఆ సర్కిల్‌లో నిలబడి, దాని పరిధిలోనే ఒక స్టెప్ తీసుకొని నిర్ణయించిన దూరానికి షాట్‌పుట్‌ను విసరాలి. ఆ సర్కిల్ దాటినా, సర్కిల్ బయటకు వంగినా ఫౌల్ అవుతుంది. 
‣ షాట్‌పుట్‌ను కుడిచేతిలోకి తీసుకొని, చేతిని సగానికిపైగా లేపి, శరీరాన్ని వెనక్కు వంచి, నిండుగా గాలి పీల్చి, కుడికాలు ముందుకు వచ్చే విధంగా స్టెప్ తీసుకొని విసరడం అలవాటు చేసుకోవాలి. ఈ విధానం ద్వారా నిర్దేశించిన దూరాన్ని సులువుగా వేయవచ్చు. షాట్‌పుట్ వేయడానికి ప్రధాన ఆయుధన అభ్యర్థి బలమే!

హైజంప్ ఇలా..! 
హైజంప్ పోటీలో అభ్యర్థులు 1.20 మీటర్లు దూకాలి. ఒకేసారి 1.20 మీటర్లు లక్ష్యంగా సాధన చేయకుండా హైజంప్ కర్రను కొంచెం, కొంచెం పెంచుకుంటూ సాధన చేయాలి. మొదటి వారం 100 సెం.మీ, తర్వాత వారం 1.10 మీటర్లు, తర్వాత 1.20 మీటర్లు... ఇలా హైజంప్ పోల్స్‌పై ఉండే కర్ర ఎత్తును పెంచుకుంటూ సాధన చేయాలి. ఇందులో మూడు పద్ధతుల ఉంటాయి. అవి... బెల్లీ రోలింగ్, సీజరింగ్, స్ట్రెయిట్ జంప్. 
‣ బెల్లీ రోలింగ్ పద్ధతి సులువుగా ఉంటుంది. హైజంప్ పోల్‌కు కనీసం 3 అడుగుల దూరం నుంచి జంప్ చేయడం సాధన చేయాలి. సాధన చేసేటప్పుడు కర్ర తలిగితే వెంటనే అది కింద పడే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. లేకపోతే కాళ్లు, చేతులు విరిగే ప్రమాదం ఉంటుంది. 
‣ సాధన అలవాటైన తర్వాత 3 లేదా 4 అంగలతో రన్ అప్ చేసి టేకాఫ్ తీసుకోవచ్చు. కర్రపై నుంచి కిందకు దూకేటప్పుడు చేయిని మడవటం మర్చిపోవద్దు. 

Posted Date : 14-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌